[ప్రముఖ బాలసాహితీవేత్త డా. బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన ‘కల్పిత బేతాళ కథలు’ చదవండి.]
పట్టువదలని విక్రమార్కుడు తను ఆవహించిన శవంతో చెట్టుకు వేళ్లాడుతున్న బేతాళుని బంధించి భుజంపైన చేర్చుకుని మౌనంగా స్మశానం నుండి బయలుదేరాడు.
“మహీపాలా, అనన్య ప్రతిభావంతుడవు అయిన నీ పట్టుదల మెచ్చదగినదే! సకల శాస్త్రాలు అభ్యసించిన నీవు, కణ్వ, కపిల, లోహిత, దేవల, కాత్యాయన, లోకాక్షి, బుధ, శతాతప, అత్రి, ప్రచేత, దక్ష, విష్ణు, వృధ్ధ, థౌమ్య, నారద, పౌలస్య, ఉత్తరాంగీస, విష్ణువృధ్ధ వంటి ఉప స్మృతులు అధ్యాయనం చేసిన నీవు పురాణాలపై మంచి అవగాహన ఉన్నవాడివి. మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా ‘అపార్థం’ అనే కథ చెపుతాను విను..” అని చెప్పసాగాడు బేతాళుడు.
***
కుంతల రాజ్యాన్ని పూర్వం చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.
ఒకసారి తన మంత్రి సుబుధ్ధితో కలసి మారువేషాలలో నగర పర్యటనకు బయలుదేరి చాలా ప్రాంతాలు తిరిగి వస్తుండగా కోటకు వచ్చేదారిలో బాగా కాపు మీద ఉన్న మామిడితోట కనిపించింది. దోరమగ్గిన మామిడి పండ్లను చూసిన రాజుగారికి నోరు ఊరింది. తోట సమీపంలోని యువకుని చూసిన రాజుగారు –
“నాయనా, ఈ తోటలోని మామిడిపండ్లు చూస్తుంటే తినాలి అనిపిస్తుంది. రెండు పండ్లు ఇవ్వగలవా” అన్నాడు.
“అయ్యా, తమరు బాటసారుల్లా ఉన్నారు. గుర్రాలు దిగి ఆ చెట్టు నీడన సేదతీరండి” అని తోటలోనికి వెళ్లి రెండు మామిడి పండ్లు కోసి దిగుడుబావి వద్ద నీటిలో కడిగి తెచ్చి రాజు, మంత్రికి చెరొక పండు అందించాడు.
మామిడిపండు ఆరగించిన రాజు సంతృప్తి చెంది “నాయనా, పండు రుచి చాలా బాగుంది. నాకు రెండు గంపలనిండుగా పండ్లు కావాలి. వెల ఎంతో తెలియజేయి, నే చెప్పిన చిరునామాలో పండ్లు అందజేసి వాటికి రావలసిన ధనం తీసుకువెళ్ళు” అన్నాడు.
“అయ్యా, ఇది నా మిత్రుని తోట. పక్కనే ఉన్నది నా తోట. మీరు కోరిన విధంగా రెండు గంపల పండ్లు ఎవరికి అందజేయాలో తెలుపండి. అందజేసి వాటి ధర ధనం తీసుకుంటాను” అన్నాడు ఆ యువకుడు.
క్షణకాలం ఆలోచించిన రాజు “నాయనా, ఉచితంగా ఇవ్వడానికి నీ మిత్రుని తోటలో పండ్లు, అమ్మకానికి అయితే నీ తోటలోని పండ్లు అంటున్నావు. ఇది మిత్రద్రోహం కదా” అన్నాడు రాజుగారు.
“కానేకాదు అయ్యా” అన్నాడు అతను.
***
కథ చెప్పడం ముగించిన బేతాళుడు, “విక్రమార్కా, ఇలా మామిడి పండ్లు అమ్మడం మిత్రద్రోహం కాదా? సమాధానం తెలిసి చెప్పకపోయావో తలపగిలి మరణిస్తావు” అన్నాడు.
“బేతాళా అతను స్నేహధర్మంలో మిత్రుని అనుమతి లేకుండా రెండు పళ్లు దానం చేయవచ్చు. కాని పండ్ల ధర తెలియకుండా అతని వస్తువుకు తాను వెల నిర్ణయించడం న్యాయం కాదు. అతని తోటలోని పండ్లకు ఇతను వెల నిర్ణయించడం న్యాయం, అందుకే అతని తోటలోని పండ్లు రాజుకు అమ్మచూపాడు” అన్నాడు విక్రమార్కుడు.
విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతో సహా బేతాళుడు మాయమై చెట్టు పైకి చేరాడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
రచనలతో పాటు సంఘసేవకుడిగా ప్రసిద్ధిచెందిన బెల్లంకొండ నాగేశ్వరరావు 12-05-1954 నాడు గుంటూరులో జన్మించారు. వీరి నాలుగు వందలకు పైగా రచనలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాష్ట్రేతర బాలసాహితీవేత్తగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన నాగేశ్వరరావుకి రావూరి భరధ్వాజ స్మారక తొలి పురస్కారం లభించింది. చెన్నైలో తెలుగులో చదివే బాలబాలికలకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నారు.