[బాలబాలికల కోసం ‘కంచే చేనును మేస్తే’ అనే సామెత కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]
ఒకానొక ఊరిలో శేషయ్య అనే రైతు ఉండేవాడు. అతడికి ఆ ఊరి పొలిమేరలో పెద్ద జొన్నచేను ఉండేది. చేనులో జొన్న కంకులు బాగా పెరిగి, కోతకు సిద్ధంగా పచ్చగా నిలబడి ఉండేవి.
రాత్రిపూట అడవి జంతువుల నుండి చేనును రక్షించడానికి, రామయ్య అనే యువకుడికి మంచి జీతం ఇచ్చి కాపలాదారుగా పెట్టాడు. చేను చుట్టూ జంతువులు లోపలికి రాకుండా ఒక గట్టి కంచెను కూడా ఏర్పాటు చేయించాడు శేషయ్య.
“ఈ కంచె.. రామయ్య కాపలా.. ఇక నా చేనుకు ఎలాంటి సమస్యా లేదు” అని శేషయ్య గట్టిగా నమ్మాడు.
కొంతకాలానికి రామయ్య మనసులో దురాశ మొలకెత్తింది. “ఇంత పెద్ద చేనులో ఒక్క కంకి తీసుకున్నా ఎవరికీ తెలియదు కదా? అంతే కాదు.. ప్రతిరోజూ కొంచెం కొంచెం తీసుకుంటే కూడా అనుమానం రాదేమో” అని రామయ్య అనుకున్నాడు.
రోజూ కొద్దికొద్దిగా జొన్న కంకులను కోసి ఇంటికి పట్టుకెళ్ళేవాడు. ఎవరు తనని గమనించలేదని అనుకునేవాడు.
కోత సమయం వచ్చింది. శేషయ్య స్వయంగా చేనంతా కలియతిరిగాడు. అంత పెద్ద చేనులో జొన్నకంకులు ఆశించినంతగా లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు.
చాలా చోట్ల కంకులు కోసిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపించాయి.
“కంచె గట్టిగానే ఉంది.. నువ్వు కాపలా ఉన్నావు.. జంతువులు లోపలికి రాలేదు.. మరి ఈ నష్టం ఎలా జరిగింది?” అని రామయ్యను నిలదీశాడు శేషయ్య.
రామయ్య తనకేమీ తెలియదన్నాడు.
సూక్ష్మంగా పరిశీలిస్తే కొన్ని చోట్ల కంచె దగ్గర మనిషి అడుగుల గుర్తులు కనిపించాయి.
గ్రామంలో ఉన్న కొందరిని వాకబు చేశాడు. “పశువుల నుంచి రక్షణకోసం పంట చుట్టూ కంచె వేస్తాం. కానీ ఆ కంచే చేనును మేస్తే, ఆ పంటని రక్షించేది ఎవరు బాబూ?” అన్నారు వారు.
శేషయ్యకు విషయం స్పష్టమైంది. తన చేనును కాపాడాలనే నమ్మకంతో నియమించిన రామయ్యే.. చేనును దోచుకున్నాడని అర్థమైంది.
రామయ్యను పని నుంచి తొలగించాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న నిజాన్ని గ్రహించాడు. అప్పటినుండి ఎవరినీ గుడ్డిగా నమ్మడం మానేశాడు.
అలా ఆనాటి నుంచి ఈ సామెత వాడుకలోకి వచ్చింది. ఈ సామెత తెలుగు సంస్కృతిలో, ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన ప్రాంతాలలో, చాలా కాలం నుండి ప్రాచుర్యంలో ఉంది.
నమ్మకద్రోహం జరిగినప్పుడు. అధికారం లేక బాధ్యత గల వ్యక్తులు దుర్వినియోగానికి పాల్పడినప్పుడు ఈ సామెతను వాడతారు.
కాశీవిశ్వనాధం పట్రాయుడు వృత్తిరీత్యా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నివాసి. ఎక్కువగా బాలసాహిత్యము మీద దృష్టి, అప్పుడప్పుడు సాంఘిక కధలు రాస్తూ ఉంటారు. విద్యార్థులను బాల రచయితలుగా తీర్చిదిద్దడం, వారిచే వివిధ సేవాకార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ‘జనజీవన రాగాలు’ వచన కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాగేయసంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీ మావయ్య కథలు, తాతయ్య కల మొదలగు బాలల కథా పుస్తకాలను వెలువరించారు. సహస్రకవిమిత్ర, లేఖా సాహిత్య మిత్ర, కవితా విశారద, జాతీయ ఉత్తమ బాలసేవక్, ఉత్తమ ఉపాధ్యాయ ఇలా మరెన్నో.. బిరుదులు పొందారు. అంతేకాక పిల్లలకోసం “కాశీ మావయ్య కథలు” యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
