Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కందుకూరి వీరేశలింగం సాంఘిక సంస్కరణలు – చారిత్రక నేపథ్యం

కందుకూరి వీరేశలింగం (1848 – 1919) వంటి సంఘసంస్కర్తల సేవలకు నోచుకోవడం ఆంధ్రదేశం అదృష్టంగా భావించాలి. 19వ శతాబ్ది మధ్యకల్లా తన నిర్విరామ కృషివల్ల ఆంధ్ర ప్రజలలో విశాలభావాలను నెలకొల్పగల్గాడు.  చివరిదశలో ఆంధ్రదేశంలోనే మూఢాచారాలకు, సనాతన చాందస భావాలకు తావు లేకుండా పోయింది. కాలానుగుణమైన మార్పుల్ని గమనించి కొత్త భావాల్ని స్వీకరించేందుకు ఆంధ్రదేశం సమాయత్తమైంది. ఇదేకాక వందేమాతరం, స్వదేశీ ఉద్యమాలు సామాన్య ప్రజలలో సైతం నవ చైతన్యం కలిగించాయి. ఇటువంటి సానుకూల పరిస్థితులను వినియోగించుకుని ఆంధ్రదేశంలో సంస్కరణ ఉద్యమాన్ని చేసేందుకు ఎంతో కృషి చేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అందుకేనేమో ఆంధ్రులు కందుకూరి వీరేశలింగం గారిని గొప్ప సాంఘిక సంస్కర్తగా గుర్తించారు.

కందుకూరి వీరేశలింగం గారు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు తండ్రి సుబ్బారాయుడు తల్లి పూర్ణమ్మ. తండ్రి చిన్న వయసులోనే చనిపోవడం వల్ల తల్లి కొడుకును విద్యావంతుణ్ణి చేయాలనే పట్టుదలతో అతనిని ప్రభుత్వ జిల్లా పాఠశాలకు పంపింది. 1869లో వీరేశలింగం మెట్రిక్యులేషన్ పరీక్ష పాస్ అయ్యాడు. కోరంగిలో ఉపాధ్యాయుడుగాను, రాజమండ్రిలో సీనియర్ తెలుగు పండితుడుగాను వీరేశలింగం పనిచేశాడు.

వీరేశలింగం రచన సాహిత్యంలో తనదైన పద్ధతి అంటే పూర్తిగా సమాజానికి ఉపయోగపడే విధంగా తన రచనలను ముందుకు తీసుకు వచ్చాడు. తెలుగులో మొట్టమొదటి నవలయైన “రాజశేఖర చరిత్ర”  గోల్డ్ స్మిత్ ఆంగ్లంలో రచించిన వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అనే నవల ఆధారంగా రచించబడినది. రాజశేఖర చరిత్ర – కన్నడ – ఆంగ్లభాషలోకి అనువదింపబడింది. లండన్ నుండి వెలువడే ది టైమ్స్ అనే పత్రికలో ఈ నవలను గూర్చి సమీక్షించడం జరిగింది. ఆంగ్లంలో వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ తెలుగులో రాజశేఖర్ చరిత్ర  ఇందులో కొన్ని కొన్ని పాత్రలు సంఘటనలు మొత్తం రెండు ఒకేలా ఉన్నా అందులోనే పేర్లు (పాత్రలు) మాత్రం కొన్ని కొన్ని సన్నివేశాలు మార్పు చేసి  వీరేశలింగం రచించడం జరిగింది. ఇది పూర్తిగా అనువాద రచన మాత్రమే కానీ తెలుగు వచ్చే సరికి కొంత మంది కవులు కొంతమంది సమర్థిస్తూ మరికొంతమంది విమర్శిస్తూ వచ్చారు.

మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగు పండితుడిగా పనిచేసిన పరవస్తు చిన్నయ సూరి ( 1806 – 1862 ) రచించిన “నీతి చంద్రిక” తెలుగు వచన సాహిత్యం లోని మొదటి ఉత్తమ రచన పేర్కొనవచ్చు. సంస్కృత పంచతంత్రంలోని మిత్రభేదం, మిత్రలాభం అను మొదటి రెండు భాగాలు అనువాదమే నీతి చంద్రిక రచన. రచనా శైలి కృత్రిమంగాను, ఆడంబరముగాను సాగింది. వీరేశలింగం సంస్కృత పంచతంత్రంలోని మూడవ భాగమైన విగ్రహ తంత్రాన్ని అనువదించేందుకు పై శైలిని అనుకరించాడు. అయితే విద్యార్థులు అర్థం చేసుకోవడం కష్టం అని భావించిన వీరేశలింగం ఈ కృత్రిమ శైలిని వదిలి పెట్టాడు. అందువల్లనే పంతులుగారు సంధి తంత్రాన్ని ( పంచతంత్రంలో నాలుగవ భాగం ) సులభ వచనంలో వ్రాశారు. రాజశేఖర చరిత్ర అనే నవలను రచించి తెలుగు సాహిత్యంలో మొదటిసారిగా నవలా రచనకు శ్రీకారం చుట్టాడు. జీవ శాస్త్రాలలోను, చరిత్రలోనూ మొదటి తెలుగు పుస్తకాలను ఆయనే రచించాడు. సత్యరాజా పూర్వ దేశయాత్రలు అనువాద రచన, సత్యవతీ చరిత్రము, ఈ రెండు నవలలు గాను; ,మార్కండేయ శతకం, శ్రీరాజమహేంద్ర పురవర గోపాల శతకం, మరియు రసికజన రంజనం మొదలగునవి పద్య కావ్యాలు. వ్యవహార ధర్మబోధిని , కాళిదాసు శాకుంతలం, రత్నావళి, దక్షిణ గోగ్రహణం, సత్య హరిశ్చంద్ర, మాళవికాగ్నిమిత్రము మొదలగునవి నాటకాలు. నీతి కథా మంజరి అనే 158 చిన్న కథల సంకలనాన్ని కూడా వెలువరించాడు. స్త్రీల కోసం ప్రత్యేకంగా వచన కవిత్వాలు రాసేవారు. సతీహితబోధిని , హాస్య వర్ధని వంటి మహిళా పత్రికల్ని స్థాపించడంలో కూడా వీరేశలింగం పంతులు మొదటి వారు అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్య విమర్శ గ్రంథాల్ని రాయడంలోనూ, కవుల చరిత్రను రాయడంలోనూ పంతులుగారు మొదటి వారని చెప్పవచ్చు. వీరేశలింగం రచనలు తెలుగు సాహిత్యంలోని అన్ని రకాల ప్రక్రియలకు అద్దం పట్టిందని చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి మొదటగా నిలిచిన వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు.

సాంఘిక సంస్కరణలు – స్త్రీ విద్య : 1870వ దశకంలో ఆంధ్రదేశంలో వెలువడుతున్న ‘ ఆంధ్ర భాషా సంజీవని ‘, ‘ పురుషార్ధ ప్రదాయిని ‘ అను పత్రికల్లో స్త్రీ విద్యను గూర్చి వివాదం చెలరేగింది. ఆంధ్ర భాషా సంజీవని పత్రికకు మహా మహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నం పంతులు సంపాదకుడిగా ఉండేవారు. ఈయన సాంప్రదాయవాది. పురుషార్ధ ప్రదాయిని పత్రికను మచిలీపట్టణం వాసియైన ఉమారంగ నాయకులు నాయుడు గారు నడిపేవారు. 1871లో ప్రారంభించబడ్డ ఆంధ్ర భాషా సంజీవని పత్రిక గ్రాంధిక భాషను సమర్థిస్తూ వ్యవహారిక భాషావాదాన్ని విమర్శించేది. ఈ నేపథ్యంలోనే వీరేశలింగం పంతులు స్త్రీ విద్యను సమర్థిస్తూ పై వివాదంలో భాగ స్వామి అయ్యాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు వివేకవర్ధిని అనే పత్రికను 1874లో రాజమండ్రిలో ప్రారంభించాడు. స్త్రీ విద్యను వ్యతిరేకించేవారిని అపహాస్యం చేస్తూ కవిత్వాన్ని చెప్పడమే కాక నాటికలు కూడా రచించాడు. ఇతని రచనయైన ‘ బ్రహ్మ వివాహం ‘ బాల్య వివాహాల్ని కన్యాశుల్కాన్ని తీవ్రంగా నిరసించింది. తన ఆశయాన్ని ఆచరణలో పెట్టేందుకు కందుకూరి 1874 సెప్టెంబర్ నెలలో ధవళేశ్వరం వద్ద ఒక బాలికల పాఠశాలను స్థాపించాడు. ఆంధ్రదేశంలోనే మొదటి బాలికల పాఠశాల కూడా ఇదే కావడం విశేషం. మల్లాది అచ్చన్న శాస్త్రి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. 1881లో రాజమండ్రి లోని ఇన్నీస్ ( ఇంగ్లీష్ ) పేటలో మరో బాలికల పాఠశాలను వీరేశలింగం స్థాపించాడు. సంఘ సంస్కరణ కార్యకలాపాల్లో తనకు చేదోడువాదోడుగా ఉంటుందని తన భార్య రాజ్యలక్ష్మికి కూడా చదువు నేర్పించారు. బాలికల పాఠశాలలేకాక హరిజన పాఠశాలలు, శ్రామికులకై రాత్రి పాఠశాలల్ని స్థాపించింది కూడా వీరేశలింగంగారే. ఆంధ్రదేశంలో సహవిద్యను మొదట ప్రోత్సహించింది కూడా పంతులుగారే.

వితంతు పునర్వివాహాలు : 1874లో మద్రాసులో వితంతు పునర్వివాహాల సంఘాన్ని ప్రారంభించారు. దివాన్ బహదూర్ ఆర్ రంగనాథరావు, పి చంచల్రావు వంటి మద్రాసు నగర ప్రముఖులు సభ్యులుగ ఉండేవారు. కానీ ప్రారంభించిన రెండేళ్లకే ఈ సంఘం కనుమరుగైంది. 1875లో విశాఖపట్నం వాసియైన మహా మహోపాధ్యాయ పరవస్తు వెంకట రంగాచార్యులు వితంతు వివాహాన్ని సమర్థిస్తూ ‘ పునర్వివాహ సంగ్రహం ‘ అనే గ్రంథాన్ని రచించాడు. దీనిని చూసిన కొక్కొండ వెంకటరత్నం పంతులుకు కంపఠం పుట్టింది. రంగాచార్యులకు వ్యతిరేకంగా ప్రచారం సాగించాడు. వీరేశలింగంతో సంబంధాలు లేనప్పటికీ ఆయన సహాయాన్ని అర్థించాడు. కానీ వీరేశలింగం హృదయం వితంతువుల పైనే ఉంది. అయినప్పటికీ వితంతు వివాహం గూర్చి వాదోపవాదాలు తోనే సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఆశయాల్ని ఆచరణలోకి తేవాలని ఆయన ఆరాటం. అందుకే ఎవరు పక్షమూ వహించకుండా కొంతకాలం గడిపాడు. 1875 కల్లా వీరేశలింగం పంతులు బ్రిటీషు ఉన్నతాధికారులతోను, మద్రాసు నగర ప్రముఖులతోనూ మద్రాసు రాష్ట్ర ఇతర పట్టణాల్లోని ప్రముఖులతోనూ సంబంధ బాంధవ్యాలని పెంచుకున్నాడు. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రధాన అధికారి ఈ.పి మెట్కాఫ్ వీరేశలింగం చేపట్టే కార్యక్రమాలలో ఉత్సాహం చూపించడమే కాక పంతులుగారి వివేకవర్థిని పత్రికకు చందాదారుడయ్యాడు. పంతులుగారి కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహం ఇచ్చాడు 1878 సెప్టెంబర్ నెలలో రాజమండ్రిలో ‘ సంఘ సంస్కరణ సమాజం ‘ స్థాపించబడింది.

1879 ఆగస్టు 3న మహారాజా బాలికల పాఠశాలలో వితంతు వివాహం పై మొదటిసారిగా ఉపన్యాసం ఇచ్చాడు. ఈ ఉపన్యాసం ఆంధ్ర దేశమంతా సంచలనం సృష్టించింది.  ఇక్కడే అక్టోబర్ 12న మరో ఉపన్యాసం ఇచ్చాడు. దీంతో సాంప్రదాయవాదులలో కలవరం పుట్టింది. వీరేశలింగం వాదనల్ని ఎదుర్కోవడానికి రాజమండ్రి, కాకినాడ లో పోటీకి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ వితంతు వివాహం శాస్త్ర సమ్మతం కాదని నిరూపించలేకపోయారు. దీంతో వీరికి ఆవేశం ఎక్కువైంది. వీరేశలింగంను కొట్టించడానికి రౌడీలను ఉపయోగించారు. అయితే వీరేశలింగం శిష్య బృందం ఉక్కు కవచంలా ఆయన్ని కాపాడింది. 1880లో తన స్నేహితులైన చల్లపల్లి బాపయ్య, బసవరాజు, గవర్రాజుల సహకారంతో వితంతు పునర్వివాహం సంఘాన్ని పంతులుగారు స్థాపించారు. తనకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని, వీరేశలింగం తన ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఉపక్రమించాడు. వితంతువుల్ని వివాహం చేసుకునే వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. తన శిష్య బృందాన్ని మారుమూల ప్రాంతాలకు పంపి వీరికోసం వెతికించాడు. కానీ వితంతువుల తల్లిదండ్రుల్ని ఒప్పించడం చాలా కష్టసాధ్యమైంది. చివరకు ఒక వితంతువు తల్లి తన కుమార్తెకు వివాహం చేయడానికి ఉత్సాహం చూపింది. వెంటనే తన శిష్యుల్ని ఆ వితంతువు నివసించే పల్లెకు పంపి అతి కష్టం మీద ఆమెను రాజమండ్రికి తీసుకువచ్చారు. ఈ వితంతువు పేరు సీతమ్మ. 1881 డిసెంబరు 11న రాజమండ్రిలో గోగుల పాటి శ్రీరాములతో సీతమ్మ వివాహం జరిగింది. ఈ విధంగా ఆంధ్రదేశంలో మొదటి వితంతు వివాహం అగ్రకులంలోనే జరిపించడం విశేషం. ఈ పెళ్లి కూడా సవ్యమైన వాతావరణంలో జరగలేదు. రాజమండ్రిలోనే సాంప్రదాయవాదులు ఈ పెళ్లిని చెడగొట్టడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పంతులుతో పాటు ఆయన శిష్య బృందం కూడా ఏ పరిణామాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వివాహం జరిగే ప్రాంతం చుట్టుపక్కల పోలీసు బందోబస్తు చేయబడింది. తమ ప్రయత్నంలో విఫలులైన సాంప్రదాయవాదులు పెళ్లిలో పాల్గొన్న 31 కుటుంబాల్ని కులం నుండి వెలివేశారు.

ఈ మొదటి వితంతు వివాహం జరిగిన నాలుగు రోజులకే ( డిసెంబర్ 15న) రెండో వితంతు వివాహం జరిపించాడు వీరేశలింగం. రత్నమ్మ అనే వితంతువు రాచర్ల రామచంద్రయ్య వివాహం చేసుకున్నాడు. 1892 నాటికి 20 వితంతు వివాహాల్ని జరిపించాడు. వీరేశలింగం కార్యకలాపాలంన్నింటిలోనూ ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి కాకినాడ వ్యాపారవేత్త పైడి రామకృష్ణయ్య. వివిధ సందర్భాలలో లో మొత్తం 30 వేల రూపాయలు ఇచ్చి వీరేశలింగాన్ని ప్రోత్సహించాడు. పెళ్ళికాని వితంతువులకు, తల్లిదండ్రులచే విడవబడ్డ వితంతువులకు మద్రాసులోనూ ( 1897), రాజమండ్రిలోను (1905 ) వితంతు శరణాలయాల్ని కట్టించాడు. 1883లో స్త్రీలకు ప్రత్యేకంగా సతి హిత బోధిని అను మాసపత్రికను ప్రారంభించాడు.

బ్రిటన్ దేశస్తురాలు మానింగ్ అనే యువతి వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయానికి 50 పౌండ్లు చెందేటట్లు తన వీలునామాలో రాసి పెట్టింది. వీరేశలింగం సేవలకు మెచ్చి ప్రభుత్వం 1893లో రావు బహదూర్ బిరుదు ప్రధానం చేసింది. 1898లో మద్రాసులో జరిగిన భారత సంఘసంస్కరణ సభకు అధ్యక్షత వహించి దేశంలోనే అత్యున్నతమైన గౌరవాన్ని పొందాడు. ఈ సభలోనే మహాదేవ గోవింద రనడే వీరేశలింగాన్ని దక్షిణ దేశ ఈశ్వరచంద్ర  విద్యాసాగరుడు గా అభివర్ణించాడు. 1899లో మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో మొదట తెలుగు పండితుడిగా వీరేశలింగం నియమింపబడ్డాడు. 1904లో ఉద్యోగ విరమణ చేసి తిరిగి రాజమండ్రికి వెళ్ళాడు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా వితంతు శరణాలయాల్ని, అనాథశరణాలయాల్ని స్థాపిస్తూ తన కార్యక్రమాలను కొనసాగించారు. 1905 డిసెంబర్ 15న తాను స్థాపించిన వివిధ సంస్థల నిర్వహణకై ‘ హితకారిణి సమాజం ‘ అను కేంద్ర సంస్థను స్థాపించాడు. 1908 మే 2న హితకారిణీ సమాజాన్ని రిజిస్టర్ చేయించి దాదాపు 50 వేల రూపాయల విలువగల తన యావదాస్తిని సమాజానికి దత్తం చేశాడు.

వీరేశలింగం దేవదాసి పద్ధతిపై అవినీతిపరులైన ఉద్యోగులపై ధ్వజమెత్తాడు. సంఘంలోనే ఉన్నత వర్గాల వారు వేశ్యలను ఉంచుకోవడం గౌరవంగా భావించేవారు. వీరి ఇళ్లల్లోనే అధికార అనధికార నిర్ణయాలు కూడా జరిగేవి. అధికారుల నిర్ణయాలు తమకు అనుకూలంగా ఉండేందుకు కొంతమంది ఈ దేవదాసిల్ని సాధనంగా వాడుకునేవారు. వివాహ సందర్భాల్లో దేవదాసీల చేత నాట్యం చేయించేవారు వీరేశలింగం ఈ దేవదాసీ పద్ధతిని నైతిక విలువల్ని దిగజార్చేదిగా ఉందని భావించి తీవ్రంగా వ్యతిరేకించాడు. రాజమండ్రిలోనే అవినీతి పరులైన అధికారుల గుట్టు బట్ట బయలు చేసి అధికార యంత్రాంగంలో భయోత్పాతాన్ని సృష్టించాడు వీరేశలింగం. ఈయన బయటపెట్టిన అవినీతికి భయపడి ఒక జిల్లా మున్సిఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆంధ్రదేశంలో ప్రజా చైతన్యం ప్రారంభమైన సమయంలో కందుకూరి వీరేశలింగం కొన్ని కొన్ని ప్రాంతాలను సందర్శించి తాను నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయని గ్రహించి సమాజంలో జరిగే సంఘటనలను ఎలా ఎదుర్కోవాలో కృష్ణాజిల్లా బందరులో గ్రహించారు. 19వ శతాబ్ది ఉత్తరార్థంలో లో ఆంధ్రులు ఆలోచనలలో కొత్త భావాలు మొలకెత్తాయి. 1857లో మద్రాసు విశ్వ విద్యాలయం స్థాపించడంతో ఆంధ్ర దేశంలో ఉన్నత విద్య అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. 1843లో పాశ్చాత్య విద్యా బోధనకు నోబెల్ నాయకత్వంలో లో చర్చి మిషనరీ సొసైటీ ( నోబుల్ కళాశాల ఇప్పటి సంస్థ ) మచిలీపట్నంలో ఒక పాఠశాలను స్థాపించింది. 1864లో ఈ పాఠశాల ఒక కళాశాల స్థాయికి ఎదిగింది. 1873లో మద్రాసు ప్రభుత్వం రాజమండ్రిలో ఒక సెకండరీ గ్రేడ్ కళాశాలను స్థాపించింది. 1877లో ఈ కళాశాలలోనే డిగ్రీ కళాశాలగా మార్చారు. 1878లో విశాఖపట్నంలో హిందూ కళాశాల  ( ఈనాటి ఏ. వి.ఎన్ కళాశాల ) స్థాపించబడింది. 1879లో బరంపురంలో కళ్ళికోట కళాశాలను స్థాపించారు. ఆంధ్రదేశంలో జరిగిన ఆంగ్ల విద్యావ్యాప్తి వల్ల ముఖ్యంగా సర్కారు జిల్లాల్లో పాశ్చాత్యుల స్వేచ్ఛ భావాల్ని అలవర్చుకున్న ఒక కొత్త విద్యావంతుల వర్గం ఏర్పడింది. వీరు సనాతన సాంప్రదాయలతో కూడిఉన్న ఆనాటి హిందూ సమాజంలో ఇమడలేకపోయారు. అందువల్ల ఆనాటి అధికార వర్గాన్ని అసంబద్ధమైన మతాచారాల్ని విమర్శించకుండా ఉండలేకపోయారు. దీంతో వీరు ఆనాడు తలెత్తిన రాజకీయ సాంఘిక ఉద్యమాలకు మూల పురుషులు అయ్యారు. కందుకూరి వీరేశలింగం గారు పైన తెలియజేసిన కళాశాల లన్నిటిలోనూ నెల రోజుల పాటు ఒక్కొక్క కళాశాలలో పునశ్చరణ తరగతులకు హాజరు అయ్యారు. సంఘంలో జరిగే అరాచకాలపై తిరుగుబాటు తత్వాన్ని బందరులోనే చవిచూశారు.

1910 ఆగస్టు 11వ తేదీన వీరేశలింగం తన జీవిత భాగస్వామియైన రాజ్యలక్ష్మిని కోల్పోయాడు. భార్య చనిపోవడం వల్ల వీరేశలింగం పంతులు మానసికంగా కృంగిపోయారు. అందుకు ముందే ( 1909లో ) తన ఆప్తమిత్రుడైన దేశిరాజు పెద బాపయ్య మరణించాడు. ఇటువంటి సమయంలో వీరేశలింగంపై ఆయన శత్రువులు లేనిపోని అపనిందలు వేశారు. దీంతోపాటు ఆయనపై పరువు నష్టం దావాలు కూడా వేశారు. అయితే వీటన్నింటి నుండి వీరేశలింగం విజయవంతంగా బయటపడ్డాడు. కానీ జీవితం పట్ల తనకు ఇది వరకు ఉన్న ఆసక్తిని కోల్పోయాడు 1919 మే 27న మద్రాసులో తన అంతిమ శ్వాస విడిచాడు.

కందుకూరి వీరేశలింగం పంతులు గారిని గూర్చి చాలామంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

వీరేశలింగం పంతులు మధ్యయుగపు మత్తు నుండి ఆంధ్రుల్ని కదిలించాడు. వారి మూర్ఖత్వం పై కొరడా ఝళిపించారు. ఆంధ్ర విశ్వాసాల నుండి వారికి ముక్తిని ప్రసాదించాడు. వారి జీవితాలకు, ఆలోచనలకు ఆధునికమైన అభ్యుదయకరమైన మానవత్వపు విలువలు గల ఒక మలుపును చూపగల్గారు – “వి ఆర్ నార్”

వీరేశలింగం పంతులు వారిలో చైతన్యాన్ని కలిగించినట్లయితే ఆంధ్ర దేశము, ఆంధ్ర ప్రజలు, ఈనాడు ఉన్న స్థితిలో ఉండేవారు కారు. సూక్ష్మబుద్ధి, ఎనలేని ధైర్యం, బహుముఖ ప్రజ్ఞ కలిగిన ప్రముఖులైన భారతీయుల్లో వీరేశలింగం ఒకరు. అసత్యం పై యుద్ధాన్ని ప్రకటించి సమాజ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు – “రాజాజీ”

సమాజంలో తీవ్రమైన మార్పులు రావాలని కోరి అందుకోసమే నిర్విరామంగా కృషి చేసిన వీరేశలింగం పంతుల్ని దక్షిణ భారతంలోని మొదటి సంఘసంస్కర్తల్లో ఒకరుగా భావించవచ్చు. అయితే ఆనాడు అందరూ సంస్కర్తలు లాగానే పంతులు గారు కూడా అపార్ధాలకు వేధింపులకు గురయ్యారు. సాంఘిక పునరుజ్జీవనం కోసం ఎన్నో అవహేళనల్ని, అపాయాల్ని తట్టుకొని కృషిసల్పిన పంతులు గారి ఆదర్శానికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము.  – “సర్వేపల్లి రాధాకృష్ణన్”

ఆధునికాంధ్ర లోకంలో వీరేశలింగం పంతులు చాలా గొప్ప వ్యక్తి. వీరేశలింగం తన జీవిత చరిత్రలో యుగ వికాసాన్ని గూర్చి ఇలా వివరిస్తాడు. చాలామంది ప్రజలు తాము నివసిస్తున్న యుగపు వెలుగుల్ని ప్రసరింపజేయకనే తమ జీవితాన్ని కొనసాగిస్తారు. వారు వెలుగును ప్రసాదించనూ లేరు, గ్రహించనూలేరు. ఎవడైతే వెలుగును పట్టుకుని నవ చైతన్యాన్ని సృష్టించి సమాజంలో మార్పుకు అభివృద్ధికి కారకుడవుతాడో అతనే నిజమైన నాయకుడు. సమాజంలో మార్పు అభివృద్ధి జరగకపోతే మనిషి జీవితంలో జడత్వము, ఆందోళన చోటు చేసుకుంటాయి. నవ సమాజం నిర్మాతల్లో ఒకడు కావడంచేత వీరేశలింగం ఆధునిక యుగానికి అద్దం పట్టాడని చెప్పవచ్చు. పంతుల్ని సృష్టికర్త అన్నారంటే దీనికి కారణం ఆయన కూడా సృష్టిలో ఒక ప్రాణి కావడంవల్లే. ఎవరైతే తాము నివసించే కాలతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారో వారికే సృష్టి చేసే శక్తి కూడా ఉంటుంది. – “కట్టమంచి రామలింగారెడ్డి”

Exit mobile version