Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కనికరం లేని కాలం కరిగిపోయింది!

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘కనికరం లేని కాలం కరిగిపోయింది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

డిరేయి నిశ్శబ్దం!
శీతాకాలమే అయినా,
ఒళ్ళంతా స్వేదంతో
తడిసి ముద్దలా మారి
ఊపిరి ఆగిపోయిన భావన!
ఉలికిపాటుతో లేచాను..
శ్వాసలో కదలిక
నిలకడగానే వుంది..
అందరూ హాయిగా
నిద్రాదేవి ఒడిలో
సేదదీరుతోన్న వేళ..
నా ఒక్కడి లోనే
ఎందుకీ ఆందోళనా తరంగాలు
ఎగిసెగిసి పడుతున్నాయి!?
అంతరంగం ఆలోచనలతో నిండిపోయి
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది!
యవ్వనకాలం కోరికలన్నీ
ఊహలకే పరిమితమై..
ఆచరగాత్మకం చేయలేక
నిస్సహాయుడనై..
నిర్లిప్తత ఆవహించగా
సోమరినై శూన్యంలో చరించాను!
నేలపై కాలిడిన తర్వాత
సంసార సాగరం
భయానకంగా స్వాగతం పలికి..
అనురాగ బంధాల కెరటాలను
కానుకలుగా సమర్పించింది!
కుటుంబ బంధాల బాధ్యతలు
జైలు జీవితాన్ని తలపింప జేయగా..
ప్రయోజకత్వం రహదారి వైపు
పయనం సాగించలేకపోయాను!
ఏళ్లు గడిచాయి..
ఊళ్ళు మారిపోయాయి..
రక్త సంబంధాల బుద్దులు
గతులు తప్పి పేగు బంధాలను
నిర్లక్ష్యం చేసి అపహాస్యం చేస్తున్నాయి!
కరిగిపోయిన కాలం
వృద్ధాప్యాన్ని బహుమతిగా ఇచ్చింది!
కలల అలలపై తేలియాడిన గతం
ఎదురుగా నిలబడి వెక్కిరిస్తోంది!
కాలం విలువను నిర్లక్ష్యం చేసి
ఓ జీవిత కాలాన్ని
నిరుపయోగం చేసుకొని
ఆశలను, ఆశయాలను
కాలగర్భంలో కలిపేసి
నిస్సహాయంగా..
నిద్రలేని రాత్రులతో
సహవాసం చేసూ..
బ్రతుకు బండిని భారంగా ఈడుస్తూ..
ఎంత కాలమిలా..!?

Exit mobile version