ప్రతి మనిషిలోనూ
ఓ కోయిలుంటుంది
చిత్రం ఏంటంటే
ఆ రహస్యం
తానెప్పుడూ కనడు వినడు
ప్రశాంతంగా
ధ్యాన ముద్రలో ఉన్నప్పుడేగా
మనిషి తన లోలోపల కొలువున్న
కోయిలను గుర్తించేది
ఏకాంతపు స్వీయ సాహచర్యంలోనే కదా తనని తాను పలకరించి
అంతరంగ తీయదనాన్ని రుచి చూసేది!
నువ్వో చెట్టు కిందకు చేరు
నీలో వున్న కోయిల ప్రత్యక్ష మవుతుంది
చెట్టంటే నీడనిచ్చేదే కాదు
నీలోకి జ్ఞానాన్ని ఒంపే
భాండాగారం కూడా
ఈర్ష్య, ద్వేషాలను
పక్కన పెట్టినప్పుడే కదా
జ్ఞానం రూపంలో
కోయిల బయటకొస్తుంది
ఏ గూటిలో పెరిగితేనేం
నీలోని మార్దవ్యం
నీకు తెలియనిదా
సమూహాల్ని వీడి
ఏకాంత కుహరంలోకి
అడుగు పెడితేనే కదా
నీలోని కువకువలు వెలికి వచ్చేవి
అప్పుడు స్వేచ్ఛా జీవివే
నీ పలుకు
నువ్వు పలికినప్పుడు
నీ హృదయం చెట్టు పిట్టలకి నిలయమే
నీ శరీరమే నీ ఆవాసమై
నీకో కొత్త రూపునిస్తుంది
నీ ఉనికికొక
నిర్మలత్వాన్ని ప్రసాదిస్తుంది
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.