Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కనుల విందు కార్వార్

[కర్నాటకలోని ఉడిపి, కార్వార్‌లో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు శ్రీ షేక్ అమీర్ బాష.]

ప్రకృతిని ప్రేమించే వారికి, తీర్థయాత్రలు చేయాలనుకునే వారికి ఉత్తర కర్ణాటక చాలా అనువైన ప్రదేశము. అత్యంత రమణీయమైన సహ్యాద్రి పర్వతాల నడుమ పశ్చిమ కనుమల్లో ఉన్న ఉడిపి, కార్వార్ ముఖ్యమైన పట్టణాలు. ఈసారి మా ప్రయాణం అటువైపు సాగింది. మేము బెంగళూరు నుండి ఉడిపి వరకు కార్వార్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళాము. ఈ రైలులో 2 విస్టా డోమ్ భోగీలు ఉన్నాయి. ఖరీదు ఎక్కువైనా ఇందులో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

రైలు పెట్టె కింది భాగము నుండి పైన సీలింగ్ వరకు అద్దాలు అమర్చి ఉంటాయి. లోపల రొటేటింగ్ చైర్‌లో కూర్చుని బయట ప్రకృతి అందాలు చూడవచ్చు.  దట్టమైన అడవులు, జాలువారే జలపాతాలను దాటుకుంటూ 53 సొరంగాల గుండా ప్రయాణించి మా రైలు సాయంత్రానికి ఉడిపి చేరింది.

ఉడిపిలో సర్వీస్ అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకున్నాము. స్నానాదుల అనంతరము ఉడిపి శ్రీకృష్ణ దేవస్థానానికి వెళ్ళాము. దైవ దర్శనానంతరము ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్పే బీచుకు చేరుకున్నాము. ఈ బీచ్ చాలా శుభ్రంగా సముద్ర స్నానానికి అనువుగా ఉంటుంది. అరేబియా సముద్రపు సూర్యాస్తమయ అందాలను తిలకించి గదికి చేరుకున్నాము.

మరుసటి రోజు ఉదయం 10 గంటలకు సెయింట్ మేరీస్ ఐలాండ్ చూడటానికి బయలుదేరాము. ఇది మల్పే బీచ్ నుండి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న దీవి. దాదాపు 60 మందిని మోటార్ బోట్లో తీసుకువెళ్తారు. ఈ ప్రయాణం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. గంట సముద్ర ప్రయాణం తర్వాత ఈ దీవిని చేరుకున్నాము.

Karwar Rock Garden- Tribal dance

Karwar Rock Garden- Tribal dance

Karwar Rock Garden- Tribal dance

Karwar Rock Garden- Tribal dance

Karwar Rock Garden- fishing community

Karwar Rock Garden- tribal living

Karwar Rock Garden- Tribal deity

మాన్‌గ్రూవ్ చెట్లతో ఎప్పుడు పచ్చగా ఉండే ఈ దీవి అందాలను వర్ణించనలవి కాదు. సముద్రంలో నుంచి పొడుచుకు వచ్చినట్లు కనిపించే ప్రకృతి సిద్ధమైన శిలా తోరణాలకు ఈ దీవి ప్రసిద్ధి. సహజసిద్ధమైన ఈ రాతి నిర్మాణాలను చూడటానికి ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఎన్నో రకాల సముద్రపు గవ్వలు ఈ దీవిలో దొరుకుతాయి.

అనంతరం టాక్సీలో నాలుగు గంటలు ప్రయాణించి గోకర్ణ చేరుకున్నాము. దారిలో కొల్లూరు మూకాంబికా క్షేత్రాన్ని దర్శించాము. పశ్చిమ కనుమల్లో గోవాకు అతి సమీపాన ఉన్న పుణ్యక్షేత్రము గోకర్ణ. ప్రతిరోజు వేలాదిమంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు. గోకర్ణ గణేశుని దర్శనానంతరము శివుని ఆత్మ లింగంగా ప్రసిద్ధి పొందిన మహాబలేశ్వర ఆలయాన్ని దర్శించాము. అక్కడే ఉన్న తామ్ర గౌరీ ఆలయాన్ని, భద్రకాళి ఆలయాన్ని కూడా దర్శించాము. సాయంత్రం గోకర్ణ బీచ్, ఓం బీచ్ లలో సేద తీర్చుకున్నాము. గోకర్ణకు దక్షిణ దిశలో ఉన్న సముద్రపుటోడ్డు ఓం ఆకారంలో ఉంటుంది కావున దీనిని ఓం బీచ్ అంటారు. గోకర్ణ బీచ్ పక్కనే రామకుటీరము అని పిలువబడే  కొండ ఉంటుంది. సూర్యాస్తమాన్ని చూసేందుకు చాలామంది ఈ కొండకు వస్తూ ఉంటారు. గోకర్ణ లో సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల తేయాకు విరివిగా అమ్ముతుంటారు.

***

మరుసటి రోజు మా ప్రయాణం కార్వార్  వైపు సాగింది. మూడు దిక్కులా పచ్చటి అడవులు, పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఎల్లలుగా ఉన్న ఓ చిన్న పట్టణం కార్వార్. భారత నౌకాదళపు అతి పెద్ద స్థావరం ఇక్కడే ఉన్నది. నగర ప్రవేశ ద్వారంలా ఇండియన్ నేవీ మ్యూజియం ఉంది. ఇక్కడ ఓ పెద్ద యుద్ధనౌక, ఓ యుద్ధ విమానం ప్రదర్శనకు ఉంచారు.

అనంతరం దగ్గరలోనే ఉన్న ‘రాక్ గార్డెన్స్’ కు వెళ్ళాము. భారత నౌకాదళ  సిబ్బందిచే నిర్మించబడ్డ ఉద్యానవనం ఇది. పచ్చటి చెట్ల మధ్య సుందరమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. మనోహరంగా మలచబడ్డ ఈ శిల్పాలు, ఈ ప్రాంతపు ఆటవీక తెగల, బెస్త వాళ్ళ, ఆదివాసుల జీవిత శైలిని, వారి సాంస్కృతిక  సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ కళాకృతులను చూసి తీరవలసిందే. ఈ ప్రాంతపు ఆదివాసులలో కునుబి, గౌలి, కమ్రి, ఆశల, గొండా, డోంగ్రి, ముక్రి, హా లక్కీ తెగలు ముఖ్యమైనవి.

తదుపరి కార్వార్ బీచ్‍లో ఉన్న రిసార్ట్‌కు వెళ్ళాము. కర్ణాటక అటవీ శాఖ వారు నిర్వహించే ఈ రిసార్ట్‌లో అందమైన, అన్ని హంగులుగల కాటేజీలు ఉన్నాయి. కాటేజీలో ఓ అరగంటసేపు సేద తీరిన తర్వాత నిర్వాహకులు మమ్మల్ని ‘కాళీ’ దీవికి మర పడవలో తీసుకెళ్లారు. కర్ణాటకలో పుట్టి ప్రవహించే ‘కాళీ నది’ అరేబియా సముద్రంలో కలిసే చోట ఉన్న చిన్న దీవి ఇది. ఈ దీవిలో పురాతనమైన కాళీకాలయము, పూజారి ఇల్లు, రెండు మంచినీటి బావులు మాత్రమే ఉన్నాయి. కాళీ నది, సముద్రం ఎంత పోటు మీద ఉన్నా గాని, నీళ్లు దేవి ఆలయం మెట్లను తాకవు. దీవి అంతా తిరిగి కాటేజీకి చేరుకున్నాము. సముద్రపు ఒడ్డున ప్రత్యేకంగా చెక్కలతో కట్టిన భోజనశాలలో భోజనం వడ్డించారు. పలు రకాల శాఖాహార, మాంసాహార వంటలు చేశారు. పడి లేచే కెరటాలని చూస్తూ భోజనం చేయడం మాకు ఓ కొత్త అనుభూతి.

సాయంత్రం నాలుగు గంటలకు డాల్ఫిన్ చేపలను చూడటానికి సముద్రంలోకి బయలుదేరాము. దాదాపు ఐదు కిలోమీటర్లు ప్రయాణించిన   తరువాత నీళ్ల పైకి ఎగురుతూ మునుగుతూ డాల్ఫిన్స్ కనిపించాయి. ఇది మరో అద్భుతమైన దృశ్యం. అరగంటసేపు వాటి ఆటలను చూసి తిరిగి తీరం చేరాము. సముద్ర తీరాన పెద్ద పెద్ద పడక కుర్చీలు వేసి అక్కడే మాకు వేడివేడి స్నాక్స్ వడ్డించారు. సముద్ర తీరం వెంట నడుస్తూ అస్తమిస్తున్న సూర్యుని అందాలను,  సముద్ర జలాల్లో మారుతున్న రంగులను చూస్తూ గడిపాము. రాత్రి 9 గంటల వరకు సముద్ర తీరంలోనే ఉండి పోయాము.

మరుసటి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ‘బర్డ్ వాచ్’. మాకందరికీ బైనాక్యులర్స్ ఇచ్చి కాలినడకన అడవిలోకి తీసుకెళ్లారు. మాతో పాటు వచ్చిన గైడు వివిధ రకాల పక్షులను చూపిస్తూ వాటి గురించి వివరణ ఇచ్చాడు. వీటితోపాటు జింకలు, నక్కలు, కుందేళ్లు, పెద్ద సైజు రంగుల ఉడతలు కనిపించాయి. బ్రేక్‌ఫాస్ట్ అనంతరము ‘మ్యాన్‌గ్రూవ్’ చెట్లు ఉన్న మరో తీరానికి నడిచి వెళ్ళాము. ఇక్కడ రకరకాల పీతలు, అక్కడక్కడ చిన్న చిన్న తాబేళ్లని చూసాము. మధ్యాహ్న భోజనానంతరము తిరుగు ప్రయాణమైనాము.

కార్వార్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ‘మిర్జాన్ కోట’ చూడదగ్గ పర్యాటక స్థలము. 16వ శతాబ్దంలో రాణి చెన్నభైరవి దేవి కట్టించిన కోట ఇది. అనంతరం బీజాపూర్ సుల్తానులు, మరాఠా రాజులు, బ్రిటిష్ వాళ్లు ఇక్కడ  పరిపాలించారని చరిత్ర చెబుతుంది. ప్రస్తుతం ఈ కోట భారత పురావస్తు శాఖ అధీనంలో ఉంది. మామూలుగా ఏ కోటైనా రాళ్ల రంగులో ఉంటుంది. కానీ ఈ కోట మాత్రం బలమైన కొండ రాళ్లతో కట్టినా కానీ, దూరం నుంచి ఆకుపచ్చగా కనిపిస్తుంది. చిన్న చిన్న చెట్లు కోట గోడలకు మొత్తం అలుముకొని ఉండటమే దీనికి కారణం.

కోట బురుజులు, లోపలి భాగం చాలా పటిష్టంగా కట్టారు. కోటంతా తిరిగి చూడటానికి దాదాపు నాలుగు గంటలు పట్టింది. ఈ కోటలోని గజశాలలు, అశ్వశాలలు కోశాగారము, ఆయుధశాల అత్యంత నైపుణ్యంగా  కట్టారు. ఎన్ని యుద్ధాలు జరిగినా కోటగోడలు చెక్కుచెదరలేదు.

కార్వార్ పర్యటన అనుభవాలను మా ఆనంద పేటికలో భద్రపరచుకొని ఇంటి ముఖం పట్టాము.

Exit mobile version