Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కనుమరుగైన క్యాలెండరు బొమ్మలు

[డా. నూకరాజు బెందుకుర్తి రచించిన ‘కనుమరుగైన క్యాలెండరు బొమ్మలు’ అనే కవితని అందిస్తున్నాము.]

గత శతాబ్దపు గోడలపై వేళ్ళాడిన దేవుళ్ళారా
మిమ్మల్ని మోసిన ఆ కాగితాల చరిత్ర ఇక లేదు

శివకాశి ముద్రణాలయాల నలుపు తెలుపు నుండి
రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన క్షణంలో
కొండయ్య రాజు గారి కుంచె కదలికలో
తెలుగునేల ఆధ్యాత్మిక స్వరూపం దర్శనమిచ్చింది

ఆ క్యాలెండర్ బొమ్మలు కేవలం అచ్చు ప్రతులు కావు
అవి పూజగదుల్లోని గంధం వాసనకు అలవాటుపడ్డ
నిత్య సాక్షులు, కాలాన్ని కొలిచే దైవిక కొలమానాలు
ప్రతి పేజీ వెనుక ఒక తరం ఊపిరి దాగి ఉంది

కృష్ణయ్య మురళీగానంలో తేలియాడే రాధమ్మ వయ్యారం
సీతమ్మవారి కనుచూపులో నిలిచిపోయిన లక్ష్మణ రేఖ
దుర్గమ్మ శక్తి రూపంలో ప్రతిఫలించే ఆదిశక్తి తేజం
ఇవన్నీ ఒకేసారి కలిసిన తెలుగింటి పునీత వాకిలి

ఎప్పుడో ఒక మధ్యాహ్నం, తెరిచి ఉంచిన కిటికీలోంచి
వచ్చి చేరింది ఒక క్రొత్త గాలి, ఒక క్రొత్త వెలుగు
ఆ వెలుగులో మెల్లగా కరిగిపోయాయి ఆ బొమ్మల రంగులు
మసకబారింది కృష్ణయ్య నామం, రాధ చెంపకెంపు

ఇప్పుడు ఆ గోడలన్నీ ఖాళీగా ధూళితో ఉన్నాయి
కాకపోతే వాటికి తెలియదు తాము ఖాళీ అని
గుర్తుంది కేవలం నాకు మాత్రమే
నేనే ఇప్పుడు ఆ క్యాలెండర్ల చివరి భండారం

బహుశా దేవుడు ఇప్పటికీ ఆ కాగితాల్లోనే ఉండి ఉండవచ్చు
మన చూపు మాత్రమే పవిత్రతను కోల్పోయి ఉండవచ్చు
చివరికి మిగిలింది ఒక్క ప్రశ్న మాత్రమే
మిగిలింది ఒక్క నిట్టూర్పు మాత్రమే

Exit mobile version