[శ్రీ బి.టి. వెంకటేశ్వరరావు రచించిన ‘కనువిప్పు’ అనే కథని అందిస్తున్నాము.]
రాజు ఎల్.ఐ.సి. ఆఫీసులో ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు. తీరిక సమయాల్లో పుస్తకాలు చదవడం, కథలు రాయడం అలవాటు. అతని కథలు బాగానే ప్రింట్ అవుతుంటాయి. అయితే ఈసారి అతను రాసిన ‘కనువిప్పు’ అనే కథకు, ప్రముఖ రచయిత, సినిమా దర్శకుడు వడ్లమూడి జ్ఞానేశ్వర్ గారి స్మారక కథల పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. వారం రోజుల్లో బహుమతి ప్రదానం, సన్మానం ఉంటుందని మెయిల్‌కు మెసేజ్ వచ్చింది.
రాజు తను రాసిన కథ పూర్తవగానే దాన్ని కథలు ప్రచురించే మ్యాగజైన్లకు మరియు ఏదైనా కథల పోటీలకు పంపిస్తాడు. అక్కడ ఫలితాలు వచ్చాక ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తాడు. వాళ్ళ అభిప్రాయం తెలుపమని అడుగుతాడు. ముఖ్యంగా తన క్లోజ్ ఫ్రెండ్ వెంకట్‌కి తప్పకుండా పంపిస్తాడు. తద్వారా తన రచనలు ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. వెంకట్ మంచి సద్విమర్శకుడు. మంచి విశ్లేషణాత్మకమైన తెలివితేటలు ఉన్నవాడు.
వెంకట్ ప్రయత్నిస్తే మంచి కథలు రాయగలడు. కానీ అతను దాని మీద పెద్దగా ఆసక్తి ఏమి చూపాడు. రాజుకు వెంకట్ తెలివితేటల మీద కాస్తంత అసూయ కూడా లేకపోలేదు.
***
రాజు పంపించిన కథ చదవడానికి మొబైల్ తీసుకుని, కథ చదవడం ప్రారంభించాడు వెంకట్. కథలో మొదటి పేజీ చదివాడు. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతలోనే వంటింట్లో నుండి పెద్ద శబ్దం. కంగారుగా వంటింట్లోకి పరిగెత్తాడు వెంకట్. భార్య పద్మజ కింద పడి ఉంది. ఎడమవైపు ఛాతి మీద చేయి వేసుకొని గట్టిగా మూలుగుతూ ఉంది. గబాల్న కింద కూర్చుని పద్మజ తలను తన ఒళ్ళోకి తీసుకుని “ఏమైంది ఏమైంది” అని గాభరాగా అడిగాడు. “గుండెల్లో నొ..” మాట రాలేదు. వెంకట్‌కు ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. వెంకట్‌కు అర్థమైంది తన భార్యకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని. వెంటనే ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. 15 నిమిషాల్లో అంబులెన్స్ ఇంటి ముందు ఆగింది. అంబులెన్స్ రాగానే చుట్టుపక్కల వాళ్ళు, వీధిలో ఏదో అయింది అని అక్కడికి చేరుకున్నారు ఏమైంది ఏమైంది అని?. కాసేపట్లోనే అందరికీ అర్థమైంది పద్మజకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని. 108 వైద్య సిబ్బంది వెంటనే స్ట్రెచర్‍పై ఆమెను వాహనంలోకి ఎక్కించారు. ఓ 20 నిమిషాల్లో ప్రముఖ గుండె వైద్య నిపుణుల హాస్పిటల్‌కి చేర్చారు.
***
వైద్యులు ఆమెను ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్లారు. వైద్యం ప్రారంభించారు. బయట వెంకట్ ఆసుపత్రి వరండాలో చాలా ఆందోళనగా తిరుగుతున్నాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు సుడులుగా తిరుగుతున్నాయి, అయినా ఎలాగో కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. భార్య పద్మ గురించి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. గంగిగోవు లాంటి మనిషి. నిదానత్వానికి చిరునామా. ఏది చెప్పినా ముందు అడ్డంకి చెప్పదు. బాగా అర్థం చేసుకొని అనుసరిస్తుంది. అర్థం కాకపోతే శాంతంగా అడుగుతుంది. భర్తతో ఇలా ఉండాలని ఎవరు చెప్పారో గానీ, నిజంగా నేను భార్య విషయంలో చాలా అదృష్టవంతున్ని అని గుర్తు చేసుకుంటూ ఈ రోజు జరిగిన పరిస్థితికి కుమిలిపోతున్నాడు. ఓ గంట తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు. “ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము కానీ చాలా మాసివ్ స్ట్రోక్ వచ్చింది. మా ప్రయత్నం మేము చేస్తున్నాము.” అంటూ సినిమాలో డైలాగ్ లాగా చెప్పి యథాలాపంగా ఆపరేషన్ థియేటర్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ‘భగవంతుడా నాకు తెలిసి నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. దయచేసి నా భార్యను నాకు దూరం చేయకు’ అని మనసులోనే దేవుని వేడుకున్నాడు వెంకట్.
***
మూడు రోజుల్లో తన సన్మానం ఉంటుందని తన బంధుమిత్రులు కూడా ఆ సన్మాన కార్యక్రమానికి హాజరు కావచ్చు అని రాజుకు మెసేజ్ వచ్చింది. ఈ విషయం తన బంధుమిత్రులకు అందరికీ మెసేజ్ పంపించాడు. అందరూ తప్పకుండా కార్యక్రమానికి అటెండ్ కావాలని కోరాడు. సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మంచి దుస్తులు వేసుకోవాలనే ఉద్దేశంతో రాజు మంచి బట్టలు తీసుకోవడం, వాటిని కుట్టించుకోవడం వాటిలో నిమగ్నం అయిపోయాడు. అక్కడ తన ప్రసంగం ఎలా ఉండాలో తను తయారు చేసుకుంటున్నాడు.
***
డాక్టర్లు శతవిధాల ప్రయత్నం చేశారు, కానీ ఫలితం లేకపోయింది. మూడు రోజులుగా పద్మజ మృత్యువుతో పోరాడింది. కరుణలేని మృత్యువు కబళించింది పద్మజను. వెంకట్ భరించలేని ఆవేదన, దుఃఖంతో క్రుంగిపోయాడు. అగ్ని పర్వతం బద్దలై లావా తనను మింగేయడానికి వస్తున్నట్లు ఉంది. భయంతో కంపించిపోయాడు. ‘పద్మ లేకుండా నేను ఒంటరిగా బ్రతకగలనా?’ మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. హైదరాబాద్, బెంగళూరులో పని చేస్తున్న పిల్లలు ఇద్దరు వచ్చారు. అన్ని కార్యక్రమాలు రెండు రోజుల్లో పూర్తి అయిపోయాయి. అందరూ తలో దిక్కు వెళ్లిపోయారు. తను ఒంటరిగా ఇంట్లో నిలబడిపోయాడు. పిల్లలు తమ దగ్గరికి రమ్మని బ్రతిమాలినా, తర్వాత వస్తానని చెప్పడంతో, వాళ్లకు ఎక్కువ రోజులు సెలవులు లేకపోవడంతో, వెళ్లిపోయారు.
***
రాజుకు సన్మాన కార్యక్రమం, చాలా ఘనంగా జరిగింది. బంధుమిత్రులు అందరూ హాజరై, అతనిని అభినందించారు. కానుకలు ఇచ్చారు. పొగడ్తలతో ముంచేత్తారు. ఆ సంతోషంలో రాజు ఆనంద పరవశుడై తడిసి ముద్దయ్యాడు. కానీ అతని మనసులో వెంకట్ రాలేదన్న బాధ ఉంది. తన రచనకు మంచి గుర్తింపు వచ్చినందుకు వెంకట్ ఎలాంటి స్పందన తెలపలేదు. వాట్సాప్‌లో తన కథ చదివినట్టు కనిపిస్తా ఉంది. అయినా ఎలాంటి అభిప్రాయం వెలిబుచ్చలేదు. బహుశా అతనికి ఈర్ష కలిగిందేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు.
కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్స్‌తో “ఏందిరా వెంకట్ రాలేదు. బహుశా వాడు మొదటి నుంచి నా రచనలను కాస్త విమర్శిస్తూనే వచ్చాడు. అయితే సద్విమర్శగానే తీసుకున్నాను. వాటిని సరి చేసుకొని ఈ స్థాయికి వచ్చాను. ఈరోజు నాకు ఇలాంటి గుర్తింపు వచ్చినందుకు వాడికి ఈర్ష కలిగిందేమో. మొబైల్ వాట్సాప్‌లో కథ చదివినట్టుగానే ఉంది. కానీ కార్యక్రమానికి రాలేదు” అని తన బాధను బయట పెట్టాడు. అప్పుడే బాత్రూం పోయి వచ్చిన రాఘవ “ఏమైంది?” అని వాకబు చేశాడు. మిగతా ఫ్రెండ్స్ విషయం చెప్పారు.
అప్పుడు రాఘవ విషాద వదనంతో నోరు విప్పాడు. “లేదు రాజు, నువ్వు అనుకుంటున్నది నిజం కాదు. వెంకట్ అలాంటి వాడు కాదు. ఎప్పుడూ అతను ఎవరి మీద ఈర్ష పడేవాడు కాదు. ఇంకా మంచి సలహాలు ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తి. కానీ ఈ మధ్య ఏం జరిగిందో మీ అందరికీ ఎవరికీ తెలియదు. నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మా ఇద్దరిదీ ఒకే ఊరు కాబట్టి నాకు తెలిసింది” అని, మొత్తం విషయం చెప్పాడు. ఈ విషయం కార్యక్రమం అయిపోయేంత వరకు ఎవరికి చెప్పవద్దని కూడా వెంకట్ అన్నాడని చెప్పాడు.
“నీ సన్మానం కార్యక్రమం సజావుగా జరిగేటట్టుగా చూడమని కూడా చెప్పాడు.” రాఘవ చెప్పడం ముగించగానే రాజు మనసు పశ్చాతాపంతో కుమిలి పోయింది. ఒక్కసారిగా కుర్చీలో కూలబడి పోయాడు. దుఃఖం పొంగుకొచ్చింది. ‘ప్రాణ స్నేహితుని మనసు అర్థం చేసుకొలేని నీవేమి రచయితవ’ని తన అంతరంగం తననే నిలదీస్తున్నట్లు ఉన్నది. కళ్ళల్లో నీళ్లు ధారగా కారుతున్నాయి. ఏడుపుతో ముఖం కందగడ్డలా మారిపోయింది. ఎప్పడో తను రచనలు రాయడం మొదలుపెట్టినప్పుడు వెంకట్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ‘మనం బైక్ లో గాని, వెహికల్ లో గాని వెళుతున్నప్పుడు ముందు వెళుతున్న వెహికల్ నిలబడి, తిరిగి కదలడానికి సమయం తీసుకున్నప్పుడు, సహజంగా మనమందరం వీడెందుకు ఇంకా కదలడం లేదని విసుక్కుంటాము. కానీ ఆ వెహికల్‌కు ఏదో వేరే బైక్ సడెన్‌గా అడ్డు వచ్చిందని గాని, లేదా జంతువులు గాని చిన్న పిల్లలు గాని రోడ్డు మీదకు వచ్చి ఉంటారని గాని ఆలోచన రాదు. ఆ కోణంలో సామాన్య మనిషి అస్సలు ఆలోచన చేయలేడు. అలా ఆలోచించ గలిగిన మనిషి గొప్ప వ్యక్తి అవుతాడు. రచయిత కూడా తన కళ్ళకు కనిపించేదే కాదు, కనిపించని విషయాన్ని కూడా ఊహించ గలగాలి. ఆ కోణంలో ఆలోచించ గలగాలి. అప్పుడే గొప్ప రచయిత అవుతాడు. అందుకే కదా ‘రవి (సూర్యుడు) కాంచని చోటును కవి కాంచును’ అని అన్నారు.’
ఏదో చెప్పాలని చూస్తున్నాడు. కానీ దుఃఖంతో నోరు పెగలడం లేదు. కాసేపటి తర్వాత “నేను వెంకట్ ను వెంటనే చూడాలి” అని లేచాడు. మిగతా స్నేహితులు కూడా ఈ సమయంలో వెంకట్‌ను ఓదార్చి ధైర్యం చెప్పాలని, తాము కూడా వస్తామన్నారు. అందరూ కలిసి రెండు వెహికల్స్ తీసుకొని వెంకట్ ఊరికి బయలుదేరారు. మూడు గంటల ప్రయాణం తర్వాత అందరూ వెంకట్ ఇంటికి చేరుకున్నారు. వెంకట్ ఒక్కడే వరండాలో కూర్చొని శూన్యంలో చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఏదో శబ్దమైనట్లు వినిపిస్తే మెయిన్ గేటు వైపు చూశాడు. తన చిన్ననాటి స్నేహితులు అందరూ గుంపుగా వస్తున్నారు. దగ్గరికి రాగానే అందరూ వెంకట్ని ఒక్కసారిగా కౌగిలించుకున్నారు. కొందరు దుఃఖం ఆపుకోలేక ఏడ్చేశారు. ధైర్యంగా ఉండమని ఒకరు, భగవంతుడు ఇలా చేశాడు, బాధపడొద్దు అని ఒకరు, అందరూ తమకు తోచినట్టుగా ఓదార్చారు. రాజు ఎక్కడ అని వెంకట్ కలియ చూసాడు. రాజును అభినందించాలని “రాజు ఎక్కడరా, రాలేదా?” అన్నాడు.
అప్పుడు గమనించారు మిగతా ఫ్రెండ్స్అంతా రాజు గేటు దగ్గరే నిలబడి ఏడుస్తున్నాడు. వెంకట్ గబగబా రాజు దగ్గరకు వెళ్లి “ఏమైందిరా, ఇక్కడికి వచ్చి ఇంట్లోకి రాకుండా ఇక్కడ ఏడుస్తున్నావు?” అన్నాడు.
ఒక్కసారిగా వెంకట్‌ను కౌగిలించుకుని బోరున ఏర్చాడు రాజు. “వెంకట్ నన్ను క్షమించు రా” అన్నాడు.
“రేయ్ నిన్ను క్షమించేది ఏందిరా?” ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్.
“నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు నా కథ చదివావని, నాకు కథకు బహుమతి వచ్చి, నాకు రచయితగా గుర్తింపు వస్తే నువ్వు ఈర్ష పడ్డావని, అందుకే నువ్వు నా కార్యక్రమానికి రాలేదని చాలా కోపాన్ని వ్యక్తపరిచాను.”
“అరె రాజు! విషయం పూర్తిగా తెలియనప్పుడు, అవి మామూలుగా వచ్చే ఆలోచనలే. వాటి గురించి అంతగా ఆలోచించాల్సిన పని ఏముంది?”
“లేదురా వెంకట్ ! మామూలు మనుషులైతే అలాగే ఆలోచించాలి. కానీ ఒక రచయితను అయి కూడా అందరిలాగే మామూలు మనిషి లాగా ఒకే కోణంలో ఆలోచించాను. కానీ నువ్వు ఇంతకు ముందు మొదట్లో చెప్పేవాడివి నాకు, రచయితకు అన్ని కోణాల నుంచి ఆలోచించగలిగే స్థాయి ఉండాలని, అప్పుడే మంచి రచనలు చేయగలుగుతానని. కానీ నేను ఒక సామాన్య మనిషిగా ఆలోచించాను. ఒక రచయిత స్థాయిలో ఆలోచించ లేకపోయాను. వచ్చిన అపార్థపు ఆలోచనను మనసులో ఉంచుకోలేకపోయాను. ఎంత మూర్ఖుడిని నేను. నేను చాలా తప్పుగా ఆలోచించాను. నీ వ్యక్తిత్వం ఎంత గొప్పది. నీవు ఇంత బాధలో ఉండి కూడా నా కార్యక్రమం సజావుగా జరిగేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకోమని రాఘవతో చెప్పావంట. నిజంగా స్నేహితుడు అంటే నువ్వే రా. నీలాంటి వాడు నాకు స్నేహితుడిగా ఉండడం నేను ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యఫలం రా. అందరికీ ఇలాంటి స్నేహితుడు దొరకడు.”
“రేయ్ చాల్లేరా ఊరికే ఏదేదో మాట్లాడేస్తున్నావు, కానీ అంత ఏమీ లేదు”, అంటూ కౌగిలించుకుని బోరున ఏడుస్తున్న రాజు వీపు మీద తడుతూ వెంకట్ ఓదార్చాడు.
“చాలా రోజుల తర్వాత అందరం కలిశాము. ఉండండి భోజనం తెప్పిస్తాను బయట నుండి” అని పక్కింటి అబ్బాయిని పిలిచి భోజనాలు తెమ్మని పురమాయించాడు వెంకట్.
అరగంటలో భోజనాలు వచ్చేసాయి. అందరూ రౌండ్‌గా కింద కూర్చుని చిన్నతనంలో, కాలేజీలో, జరిగిన విషయాలు మరియు ఇక్కడికి రాని స్నేహితులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా భోజనం చేశారు. ఓ గంట తర్వాత అందరూ బయలుదేరడానికి లేచారు. అందరూ వెంకట్‌కు వీడ్కోలు చెప్పారు. అందరూ బయటకు వచ్చారు. గేటు వరకు వెంకట్ కూడా వచ్చి వాళ్లకు చెయ్యి ఊపి వీడ్కోలు చెప్పాడు. రెండు వెహికల్స్ బయలుదేరినాయి. ఒక్క నిమిషం వెహికల్స్ ముందుకు పోగానే “అరే ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను” అని రాజు వెహికల్ దిగి వెంకట్ దగ్గరికి వచ్చి మరోసారి కౌగిలించుకొని “రచయితగా నేను రాసిన కనువిప్పు కథకు నాకు బహుమతి వచ్చి సన్మానం జరిగుండొచ్చు, కానీ ఈరోజు నాకు రచయితగా ‘కనువిప్పు’ కలిగించావు రా. నిజంగా రచయిత ఎలా ఉండాలో ఈరోజు తెలిసింది. ఇక అలా ఉండడానికి నా శతవిధాల ప్రయత్నం చేస్తాను. ఇంకా మంచి మంచి రచనలు, అందునా మానవత్వపు కోణాన్ని టచ్ చేస్తూ రాయడానికి ప్రయత్నిస్తాను. థాంక్యూ వెరీ మచ్” అని మరొకసారి కౌగిలించుకొని సెలవు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు.
