Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చే ‘కన్యా కుమారి’

(తెలుగు చలన చిత్రం – అమెజాన్ ప్రైంలోనూ – ఆహాలోనూ లభ్యం)

మిత్రుడు, దర్శకుడు సృజన్ అట్టాడ దర్శకత్వం వహించిన ‘కన్యాకుమారి’ చలన చిత్రం ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇస్తుంది.

థ్రిల్లర్, సస్పెన్స్, హారర్, అడ్వెంచర్, హాస్యం ఈ జోనర్‌లలో మాత్రమే ఎక్కువగ సినిమాలు ఇష్టపడే నేను, ఇటీవల సైయారా (హిందీ), 8 వసంతాలు (తెలుగు) వంటి ప్రేమ కథా చిత్రాలు చూడ్డం జరిగింది. ప్రేమ కథలంటేనే సిల్లీగా ఉంటాయి అనే దశకి వచ్చిన నాకు ఈ సైయారా మరియూ 8 వసంతాలు కూడా చక్కని అనుభూతిని ఇచ్చాయి.

ఇక ‘కన్యాకుమారి’ సినిమా విషయానికి వస్తే, ఇది ప్రేమకథా చిత్రమే అయినా ఒక బలమైన సామాజిక సమస్యని అతి సున్నితంగా స్పృశించి మనల్ని ఆలోచింపజేస్తాడు దర్శకుడు.

రైతు లేకుంటే మనం బ్రతకలేము.

లాయర్, ఇంజినీర్, పోలీస్, డాక్టర్ ఇలాంటి వారితో ఎప్పుడో ఒకసారి మాత్రమే పని పడుతుంది. కానీ రైతు లేకుంటే మన జీవితాలే ముందుకు సాగవు

ఇది ఈ సినిమా సందేశం. అలాగని చెప్పి ఆర్ నారాయణ మూర్తి సినిమా లాగానో, డాక్యుమెంటరీ లాగానో కాకుండా స్వచ్ఛమైన ప్రేమ కథ ఒకటి జోడించి, దానికి సంఘర్షణ జోడించి, ఇక మనల్ని కట్టి పడేస్తాడు.

జపాన్ దేశంలోనూ మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో టీచర్‌కి ఒక వీవీఐపీకి ఇచ్చే స్థాయి గౌరవ మర్యాదలు, ప్రాముఖ్యతలు ఇస్తారట. మన దేశంలో మాత్రం బ్రతకలేక బడిపంతులు అనే సామెత ఇప్పటికీ నిజం అని అనుకునేలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

ఒక టీచర్ ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక తరాన్ని, తద్వార ఒక దేశ దిశని, దశని, ప్రగతిని నిర్దేశించే సామర్థ్యం కలిగి ఉంటాడు.

బీఈడీనో, ఇంకోకటో చదివి, టీచర్ ఉద్యోగం తెచ్చుకోగానే సరికాదు. వారికి సమాజం పట్ల బాధ్యత ఉండాలి. మానసిక శాస్త్రం తెలిసి ఉండాలి, సున్నితమైన మనసు కలిగి ఉండలి, పిల్లల్ని ప్రేమగా మోటివేట్ చేయగలిగి ఉండాలి. ఇన్ని అంశాల్ని నేను ఉపన్యాసం లాగానే చెప్పగలను.

కానీ మన దర్శకుడు ఆ అంశాన్ని ఎంతో సున్నితంగా చెప్పుకొచ్చాడు.

****

కథేమిటంటే,

శ్రీకాకుళం వద్ద ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక రోజు ఒక ఉపాధ్యాయుడు డీఈఓ గారి విజిట్ సందర్భంగా పిల్లల్ని వారి వారి గోల్స్ ఏమిటి అని అడుగుతాడు.

తిరుపతి అనే ఒక కుర్రాడు (కథా నాయకుడు) ఉత్సాహంగా లేచి తాను రైతుని అవ్వాలనుకుంటున్నాని చెబుతాడు. ఆ కుర్రాడ్ని ప్రోత్సహించేది పోనిచ్చి, ఆ టీచర్ హేళనగా మాట్లాడతాడు. ఇంజినీర్, లాయర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతామని చెప్పిన పిల్లల్ని అభినందిస్తాడు.

ఈ పాయింట్ దగ్గర సినిమా అసలు కథకి నాంది వాచకం పడుతుంది.

ఆ తరువాత దర్శకుడు కథని చక్కటి మలుపులు తిప్పుతాడు. మనలో ఉత్కంఠ కలుగుతూ వెళ్తుంది.

చిన్న తిరుపతి ట్విస్ట్‌తో హాయిగా నవ్వుకుని తెర ముందు నుంచి కదుల్తాము ఇక.

హాస్యం ప్రాణాధారం ఈ సినిమాకి. అలాగని కృతకంగా కొట్టినట్టు కాకుండా సన్నివేశంలో సహజంగా పుడుతుంది.

‘మీది విగ్గు కద’ అని హీరోయిన్ అన్నా,

‘హెలో సేల్స్‌గర్ల్స్’ అని హీరో అన్నా,

‘ఎ ఎ ఎ ఎయిర్ ఫోర్స్’ అని హీరో మిత్రుడు అన్నా,

‘నీ జిమ్మడిపోనూ’ అని మొదలు పెట్టి పని మనిషి ఉత్తరం వ్రాయించుకున్న సీనైనా,

‘మేడం ఎలా ఉంటారో చెప్పండి సార్ మంచి చీర చూపిస్తాను’ అని సేల్స్ గర్ల్ అనగానే, ‘ఇప్పుడా దరిద్రాన్ని వర్ణించాలనా’ అని బట్టల కొట్లో కష్టమర్ తన భార్య గూర్చి వాపోయినా మనకి పక్కున నవ్వు వస్తుంది.

చిన్న చిన్న జోక్స్‌కి పక్కున నవ్వే అలవాటు ఉన్న నేను ఈ నిజమైన సున్నిత హాస్యానికి పట్టలేనంతగా నవ్వుతూ ఉంటే మా ఆవిడ నన్ను అదుపు చేయలేక అవస్థ పడింది.

ఒకప్పటి (కొన్ని) జంధ్యాల సినిమాలలోని సున్నిత హాస్యం, పసలపూడి వంశీ సినిమాల (కొన్ని) లోని సున్నిత భావాలతో కూడిన ప్రేమ భావాలు, చక్కగా పండించాడు సృజన్.

****

శ్రీకాకుళం తదితర పల్లె ప్రాంతాలు, వారి అలవాట్లు, సంప్రదాయాలు చక్కగా చూపించారు.

కథ, కథనం, సంగీతం, చాయాగ్రహణం అన్నీ బాగున్నాయి.

కొత్త కుర్రాడు రాచకొండ శ్రీ చరణ్ హీరోగా చక్కగా నటించాడు. అప్పుడప్పుడు డీజే టిల్లు గుర్తు వచ్చాడు. ఈ కుర్రాడికి ఇదే మొదటి చిత్రం అనుకుంటా. చక్కటి భవిష్యత్తు ఉంది ఇతనికి అనిపించింది.

హీరోయిన్ గీతా శైనీ పోటాపోటీగా నటించింది. అల్లరి, కోపం, ఆ వయసు పిల్లల్లో ఉండే అమాయకత్వంతో కూడిన పంతం, గీర (ఆ సినిమా భాషలో), ప్రేమ, అంతలోనే కోపం, పై చదువులు ఇంజినీరింగ్ కోర్స్ చదువుకోలేకపోయానే అనే ఉక్రోషం, కలల్ని నిజం చేసుకోవాలనే పట్టుదల ఇవన్నీ చక్కగా నటించి ఆ పాత్రకి ప్రాణం పోసింది.

ఈ అమ్మాయి ఇది వరకు పుష్పక విమానం అనే సినిమాలో నటించింది. ఈ అమ్మాయి నటించిన రెండు సినిమాల పేర్లతోనూ పాత సినిమాలు ఉండటం యాదృచ్ఛికం.

దర్శకుడు సృజన్ అట్టాడకి మంచి భవిష్యత్తు ఉంది అని తెలుస్తూ ఉంది.

తమిళ్ మళయాళం సినిమాలలో లాగా మన నేటివిటీకూడా ఇంత చక్కగా ఉంటుందా అని ఆనందం వేస్తుంది ఇలాంటి సినిమాలు చూసినప్పుడు.

****

ఏడవ తరగతితో ఆపేయకుండా తిరుపతి చక్కగా చదువుకుని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయి, అమెరికాని, ఉద్యోగాల్ని వదిలేసి వ్యవసాయమే బెస్ట్ అని చెప్పుకొచ్చింటే కథకి ఇంకా బలం చేకూరేది.

ఉత్తరాంధ్ర యాసపై సరిగ్గా దృష్టి పెట్టలేదు అని పలువురు మిత్రులు అన్నారు. నిజమే అనిపించింది. ఒక్కో సారి తెలంగాణం, సీమ యాస కలగలిపి పలుకుతాయి పాత్రలు. పనిమనిషి పాత్ర ఒక్కటే చక్కటి శ్రీకాకుళం యాస పలికింది.

పావు కిలో టమోటాలు ఎన్ని వేలు పలికినా రైతు జేబులోకి వచ్చేది పావలానే. మిగతా అంతా దళారులకే పోతుంది. హీరో కోటిశ్వరుడు అవటానికి కారణం బలంగా చెప్పలేకపోయారు.

కథలో ఇలాంటి కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా నూటికి నూరు మార్కులు ఇవ్వొచ్చు ఈ సినిమాకి.

Exit mobile version