Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవ వైభవం

[మహాశివరాత్రి సందర్భంగా ‘కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవ వైభవం’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల-తిరుపతి. తిరుమల కొండపైన ఆనంద నిలయంలో భక్తుల కొంగుబంగారము కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక దిగువనగల తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామి, పద్మావతి అమ్మవారి ఆలయము, కోదండరామ స్వామి ఆలయములే కాక మరెన్నో ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.

అంతేకాక ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో అత్యంత ప్రసిద్ధమైన శైవ క్షేత్రం కూడా కొలువై ఉన్నది.

“శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే!
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః!!”

అని స్కాందపురాణం చెబుతుంది కదా! అంటే శివ కేశవులకు ఇరువురికి భేదం లేదు అని ఇరువురు ఒకటే అన్నది ఈ శ్లోకార్ధము. కొండపైన వేంకటేశ్వరుడు కొలువైఉంటే దిగువనగల తిరుపతిలోని శేషాద్రి కొండ దిగువన అలిపిరి మెట్ల మార్గమునకు సమీపమున ఒక కిలోమీటర్ దూరంలో కపిలేశ్వర క్షేత్రం అని పేరు పొందిన కపిలతీర్థము ఉన్నది. దీనిని పూర్వము వైష్ణవులు చక్ర తీర్థమని, ఆళ్వారు తీర్థమని పిలిచేవారు. శైవులు దీనిని కపిల తీర్థమని పిలుస్తారు.

కృతయుగంలో కపిల మహర్షి పాతాళంలో పూజించిన పరమేశ్వర లింగము భూమిని చీల్చుకొని ఇక్కడ వెలసినట్లుగా ఐతిహ్యం. కపిలమహర్షి పూజించిన లింగము కనుక దీనికి కపిలలింగమని, కపిలేశ్వర లింగమను పేర్లతో ప్రసిద్ధి పొందింది. దీనిని త్రేతాయుగంలో అగ్ని దేవుడు పూజించడం ద్వారా అగ్నిలింగమని, కలియుగంలో కపిలగోవు పూజించినందు వలన కపిలేశ్వర లింగముగా పూజలు అందుకుంటున్నదని ప్రతీతి. ఆలయం బయటనుండి చూడటానికి చిన్నదిగా కనిపించినా విశాలమైన ఆవరణంతో ఆహ్లాదకరంగా ఉండి భక్తిభావన కలిగిస్తుంది. తిరుపతికి ఉత్తరంగా కొండకు ఆనుకొని అలిపిరికి సమీపంలో ప్రకృతి సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తూ ఎత్తైన కొండలపై నుండి వేగంగా దూకుతూ కొండలనున్న ఓషధులను తనలో నింపుకున్న జలధారాతీర్థం ఒకటి మనకు కనిపిస్తుంది. అదే ఆరోగ్యాన్నిచ్చి, పాపాలను శమింపచేసే శక్తిగల కపిలతీర్థం.

ముక్కోటి పున్నమి నాడు మధ్యాహ్న సమయంలో నాలుగు గంటల కాలం అనగా 10 ఘటికల కాలము ముల్లోకాలలోని సర్వ తీర్థాలు ఈ కపిలతీర్థంలో నివసిస్తాయని ప్రతీతి. ఆ సమయంలో ఆ నీటిలో స్నానం చేసి ఇచ్చే దానం గొప్ప ఫలితాన్ని అందజేస్తుంది. ఇచ్చేది నువ్వుగింజంత అయినా కూడా అది మేరు పర్వతంతో సమానమని పండితవాక్కు. అంతేకాక ఓషధీయుక్తమైన ఆ నీటి స్నానం ఆరోగ్యాన్ని కలగజేయటమేకాక, చర్మవ్యాధులను కూడా నివారిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ప్రతివారు ఆ నీటిలో స్నానంచేసి, స్వామి అనుగ్రహం పొందాలని భావిస్తారు.

విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థం చుట్టూ రాతిమెట్లతో మంటపమును నిర్మించాడని చరిత్ర. మొదటి రాజేంద్రచోళుడి కాలంలో ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారం. శివభక్తులైన చోళులు దీనిని కపిలతీర్థం అని పేరుపెట్టి అభివృద్ధి చేస్తే, అచ్యుతదేవరాయలు మంటపాలు, మెట్లు కట్టించి ఆళ్వారతీర్థంగా మార్చారు. ఇక ఈ తీర్ధంలో కపిలేశ్వరుడు, వినాయకుడు, కాశీవిశ్వేశ్వరుడు, సహస్ర లింగేశ్వరుడు, దక్షిణామూర్తి, నటరాజస్వామి, లక్ష్మీనారాయణస్వామి, శ్రీకృష్ణుడు, కాలభైరవుడు, అగస్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివ సూర్య స్వామి మొదలుగా గల అనేక ఉపాలయాలు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామికి డోలోత్సవము, తెప్పోత్సవము, కల్యాణోత్సవం, అన్నాభిషేకం, బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుపబడతాయి.

ఈ సంవత్సరం మాఘమాసం బహుళసప్తమి అనగా ఫిబ్రవరి 7వ తేదీన కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయినాయి. పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షిఅమ్మవారు, వినాయకుడు, చండికేశ్వరస్వామి, వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తుల సమక్షంలో నందిచిత్రం లిఖించిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై అధిరోహింప చేశారు.

ఆ తరువాత బలినివేదన, హారతి ఇస్తారు. ధ్వజస్తంభానికి సంవత్సరమునకొకసారి పాలు, పెరుగు, చందనం, విభూతి, పలురకాల పండ్లతో అభిషేకంచేస్తారు. రథహారతి, నక్షత్రహారతి, దీపారాధన, కుంభ హారతులనిచ్చి, షోడశోపచార పూజలు, చతుర్వేద పారాయణలు జరుపుతారు. ఆ తరువాత అమ్మవారిని, అయ్యవారిని హంసవాహనంపై పురవీధులలో ఊరేగిస్తారు. భక్తులందరుస్వామి, అమ్మవార్ల ఊరేగే రథంముందు వారుపోసి, కర్పూరహారతులనిచ్చి స్వామి ఊరేగింపులో పాల్గొంటారు.

పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ప్రతి రోజు ఉదయం ఏడుగంటల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యప్రభ, భూతవాహన, మకర, తిరుచ్చి, వ్యాఘ్ర, కల్పవృక్ష, రథ, పురుషమృగ, సూర్యప్రభ వాహనములపై, సాయంత్రం ఏడుగంటల నుండి తొమ్మిది గంటలవరకు మూషిక, హంస, చంద్రప్రభ, సింహ, శేష, అధికారనంది, గజ, అశ్వ, శివరాత్రినాడు నందివాహన సేవలు జరుపబడతాయి. మహాశివరాత్రి రోజున అభిషేకాలు, బిల్వదళార్చన, అర్చనలు విశేషంగా జరుపబడతాయి. శివరాత్రి మరునాడు వైభవోపేతంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుపబడుతుంది. ఆ మరునాడు జరిగే త్రిశూలస్నానం, ధ్వజావరోహణంతో రావణాసుర వాహనసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఇదే సమయంలో శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరస్వామికి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇదే శివకేశవ అభేదత్వానికి నిదర్శనం. ఈ పదిరోజులు వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామి వారిని దర్శించి ధన్యులవుతారు.

గోవింద మాధవ ముకుంద హరే మురారే
శంభో శివేశ శశిశేఖర శూలపాణే!
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యాభటాయ ఇతి సంతతమామనంతి!!

Exit mobile version