Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కరిగిపోయాను.. కర్పూర వీణలా..

[కరణం హరికిషన్ గారి ‘కరిగిపోయాను.. కర్పూర వీణలా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

జ్ఞాపకాల పొరల్ని కాస్త పక్కకు తొలగించి చూడండి.. కరెంటు తీగ పల్లె గడప తొక్కని ఆ పాత రోజులు గుర్తొస్తాయేమో! వీధి దీపాలు లేవు, రంగుల బల్బుల హంగులు అసలే లేవు. పడమటి కొండల్లో సూర్యుడు కుంకిపోగానే, మీ ఇళ్ళల్లో అలుముకునే చీకటి రాక్షసికి నేను మాత్రమే ఏకైక శత్రువుని. ఒక చిన్న అగ్గిపుల్ల సాయంతో నా ప్రాణానికి ప్రాణం పోసేవారు. నా శిరస్సుపై మంట రాజుకోగానే, మీ ఇల్లంతా పసిడి కాంతులు పూసేవి.

నా వెలుతురులోనే పిల్లలు పలకాబలపంతో అక్షరాలు దిద్దుకునేవారు. ఆ మసక వెలుతురులోనే కుటుంబమంతా వలయాకారంగా కూర్చొని కమ్మగా భోజనం చేసేవారు. రాత్రంతా నా చుట్టూ చేరి ఎన్నెన్నో కబుర్లు, చందమామ కథలు చెప్పుకునేవారు. ఆ రోజుల్లో మీ ఆలోచనలు, అనుబంధాలు నా ప్రశాంతమైన వెలుగులాగే ఎంతో నిదానంగా, లోతుగా, వివేకంతో ఉండేవి. మీ కోసం నా శిరస్సు కాలిపోతున్నా, నా దేహం మెల్లమెల్లగా కరిగిపోతూ కన్నీరులా కారుతున్నా.. ఆ సెగలు నన్ను ఏనాడూ బాధపెట్టలేదు. కాలిపోతున్న నా వెలుగులో మీ జీవితాల్లోని చీకటి దూరమవుతోందన్న తృప్తే నన్ను మురిపించేది. మీ పెదవుల మీద విరిసే ఆ ప్రశాంతమైన, చెదరని చిరునవ్వులను చూస్తూ నా బాధనంతా మర్చిపోయేవాడిని.

ఇంతకూ నేనెవరినో గుర్తుపట్టారు కదూ.. అవును, చీకటితో నిత్యం యుద్ధం చేసి కరిగిపోతున్న మీ కొవ్వొత్తిని!

కానీ, కాలక్రమంలో అంతా మారిపోయింది. ఎలక్ట్రిసిటీ వచ్చింది. మీ ఇళ్ళల్లోకి కృత్రిమ కాంతులు చిమ్మే బల్బులొచ్చాయి. ఆ విద్యుత్ కాంతుల జిలుగుల్లో నన్ను మాత్రం మీరు పూర్తిగా అటకెక్కించారు. ఒకప్పుడు రాత్రంతా మీకు తోడుగా ఉంటూ, మీ ఇంటికి పెద్ద దిక్కులా ఉన్న నన్ను.. చీకటి మూలల్లోకి విసిరేశారు.

ఇప్పుడు నా అవసరం మీకు ఎప్పుడొస్తుందో తెలుసా? కేవలం మీ పుట్టినరోజుల నాడు మాత్రమే! అదీ ఒక అలంకారం కోసం. కత్తితో కేకును కోసే ముందు, నా తల మీద మంట పెట్టి.. మరుక్షణమే పగవాడిలా ఊది ఆర్పేస్తారు. ఆ తర్వాత మీరు తీపిని పంచుకున్న కేక్ ప్లేట్లతో పాటే నన్ను కూడా నిర్దాక్షిణ్యంగా చెత్తబుట్టలో పారేస్తారు. లాభనష్టాల బేరీజుతో సాగుతున్న మీ నేటి వేగవంతమైన, యాంత్రిక ఆలోచనా ధోరణికి ఈ పుట్టినరోజు హడావిడే ఒక సజీవ సాక్ష్యం. అవసరం ఉన్నప్పుడు వెలిగించి, అవసరం తీరగానే ఊది ఆర్పేసిన నా మంటలాగే.. ఈనాడు మనుషులు కూడా తమ అవసరాలు తీరిపోగానే ఎదుటివారికి ముఖం చాటేస్తున్నారు. పని పూర్తవగానే నన్ను చెత్తబుట్టలో పారేసినట్టు, అవసరం తీరిన బంధాలను కూడా అంతే నిర్దాక్షిణ్యంగా విసిరేస్తున్నారు.

నిజానికి నా బాధ చెత్తబుట్టలో పడిపోతున్నందుకు కాదు. అజ్ఞానం అనే చీకటి నుంచి విజ్ఞానం అనే వెలుగు వైపు పయనించిన మీ అభివృద్ధి యజ్ఞంలో.. నేను కూడా నిశ్శబ్దంగా కరిగిపోయిన ఒక ‘సమిధ’నే అన్న చిన్న నిజాన్ని మీరు విస్మరించడం! నా దేహం కరిగినా, నేను పంచిన వెలుగు మీ కళ్ళల్లో, మీ భవిష్యత్తులో సజీవంగానే ఉంటుంది కదా! మరి ఆ కృతజ్ఞత ఏది?

బంధాలను వాడుకుని వదిలేసే ఈ యాంత్రిక జీవనంలో పడి మీరు కేవలం నన్నే కాదు.. మీ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి మీకు జన్మనిచ్చిన మీ తల్లిదండ్రులను, విజ్ఞానపు వెలుగులు పంచిన గురువులను, మిమ్మల్ని తన ఒడిలో ఆడిపాడించి పెంచిన కన్నతల్లి లాంటి మాతృభూమిని సైతం.. కాస్త అభివృద్ధి చెందగానే ఎంత అవలీలగా మర్చిపోతున్నారో కదా! నేను కరిగిపోయి మీకు వెలుగునిచ్చినట్లే, వాళ్ళు తమ జీవితాలను త్యాగం చేస్తూ మీ భవిష్యత్తు అనే ఒత్తికి వెలుగును అందించారు. నాలాగే వాళ్లను కూడా వృద్ధాప్యంలోనో, దేశం దాటిన తర్వాతో, అవసరం తీరాకో అనాథలుగా వదిలేస్తున్నారు కదా.. అన్నదే నన్ను దహిస్తున్న అసలైన బాధ!

‘చీకటిని నిందించడం కన్నా ఒక చిన్న దీపాన్ని వెలిగించడం మిన్న’ అంటారు.. కానీ ప్రాణమిచ్చి వెలుగునిచ్చిన దీపాన్ని కృతజ్ఞతతో కాపాడుకోవడం అంతకన్నా మిన్న అని ఈ నాగరిక ప్రపంచం ఎప్పుడు గుర్తిస్తుందో! వెలుగునివ్వడం కోసం నేను కరిగిపోయాను.. మీరేమో మీ ఎదుగుదల తర్వాత నాతో పాటు, మిమ్మల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఆ కదిలే కొవ్వొత్తులను కూడా పూర్తిగా చీకటిలోకి నెట్టేశారు.

Exit mobile version