Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్మయోగి-14

[ఎన్నికలలో జగత్ గెలుస్తాడు. అవినీతికి పాల్పడకుండా నీతిగా ఉండమని రామారావు సలహా ఇస్తాడు. అదృష్టం కొద్దీ జగత్‌కి మంత్రి పదవీ దక్కుతుంది. జగత్‌కి మంత్రి పదవి దక్కినందుకు సుధారాణి, ఆమె తండ్రి విస్తుపోతారు. బావగారిని, ఆ కుటుంబాన్ని మంచి చేసుకోమని తండ్రి ఆమెకు సలహా ఇస్తాడు. తప్పదు కదా అంటుంది సుధ. వాకింగ్‍లో స్నేహితురాలైన సుజాత అనే మహిళ సుధ స్వభావాన్ని గ్రహించి ఆమెతో ఒక ప్రతిపాదన చేస్తుంది. ఆ మాయలో పడిన సుధ సత్యం ఒప్పుకోకపోయినా, తండ్రికి కూడా చెప్పకుండా పాతికలక్షలు సుజాతకి అప్పుగా ఇస్తుంది. జగత్‌కు పర్యాటక శాఖ లభిస్తుంది. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను బాగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం, పేరు తేవాలనుకుంటాడు. ఆ రోజు పిల్లలతో సత్తెనపల్లి వస్తుంది సుధ. అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. – ఇక చదవండి]

ప్పుడే శశాంక్, శైలజలు స్కూలు నుండి వచ్చారు.

వస్తూనే “హాయ్ రామ్, కృష్ణా! ఎప్పుడొచ్చారు? మీరు లేకపోతే ఏం బాగుండ లేదు. మళ్లీ మీరు సత్తెనపల్లి వచ్చేయగూడదూ? వచ్చేయెండి పిన్నీ” అన్నారు ఇద్దరూ ఒకేసారి.

సుధారాణి నవ్వి ఊరుకున్నది.

“ఇక్కడి స్కూల్ కంటే మా సిద్ధార్థ స్కూల్ చాలా పెద్దది. ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడం. అంతా ఇంగ్లీష్ లోనే. ఇంటి దగ్గర సాయంకాలం పూట ట్యూషన్ సార్ వచ్చి హోం వర్క్ చేయించి, కాసేపు చదివిస్తారు. మేం ఫోనుల్లో వీడియో గేమ్స్ చాలా డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. ఇంట్లో నుండే, నా ఫ్రెండ్‌తో గేమ్ ఆడుతున్నాను తెలుసా?” అన్నాడు రామ్ కించిత్ గర్వంగా.

“వాడు వాళ్లింట్లోనే వుంటాడు. మేం ఇంట్లోనే వుంటాం. మమ్మీ ఏమనదు. వాణ్ణీ ఇంట్లో ఏమీ అనరు. గేమ్ పూర్తి అయ్యేదాకా హాయిగా ఆడుకుంటున్నాం” అన్నాడు కృష్ణ.

“పిన్నీ! ఇంక మీరిక్కడుకు రారా? పోనీ కృష్ణను, రామ్‌ను అయినా ఇక్కడ వుంచగూడదా?” అన్నది శైలజ.

“ఇక్కడ ఎలా వుంటారు శైలజా! అసలు వాళ్లను పెద్ద స్కూల్లో చదివించాలనే విజయవాడ వెళ్లాం. మీరిప్పుడు మంత్రిగారి పిల్లలు. ఇలాంటి మామూలు స్కూల్లో చదవటం ఎందుకు? గుంటూరు వెళ్లి మంచి స్కూల్లో జాయిన్ అవ్వండి” అన్నది సుధారాణి.

“మా స్కూల్లో మేం కరాటే కూడా నేర్చుకుంటున్నాం. మాకు బాగా ఇంట్రెస్టింగ్‌గా వున్నది. మేం పియానో కూడా వాయిస్తున్నాం. మీ స్కూల్లో అవేం లేవుగా?”అన్నారు కృష్ణా వాళ్లు.

“మీరు ఫ్యామిలీ గుంటూరు మారుస్తారా అక్కా?” అన్నది సుధారాణి.

“ఇప్పుడు మీ బావగారిక్కానీ, నాక్కానీ అలాంటి ఉద్దేశాలు లేవు సుధా. తర్వాత సంగతి తర్వాత. శైలజా శశాంక్‌లు ఏదో బాగానే చదువుతున్నారు. నాకు ఖాళీ వున్నప్పుడు వాళ్ల చదువు సంగతి నేనే పట్టించుకుంటున్నాను.” అన్నది శశిరేఖ.

“సాయంకాలమైపోయింది. ఇంక బయల్దేరుతాం” అన్నది సుధారాణి.

“ఇవ్వాల్టికి ఉండిపోగూడదా సుధా” అన్నారు.

“పిల్లలకు స్కూల్ పోతుంది. మరోసారి వస్తాం. ఆ… అన్నట్లు వచ్చే ఆదివారం పిల్లల్ని తీసుకుని విజయవాడ రా అక్కా. అత్తయ్యా మీరు రాలేదు. ఓసారి అందరూ తప్పకూండా రండి. మీరొస్తానంటే ఆ రోజుకు అమ్మనీ, నాన్ననూ కూడా రమ్మంటాను. ముఖ్యంగా మీరొస్తే మీ అబ్బాయి బాగా సంతోషిస్తాడు” అన్నది సుధ.

“ఇప్పుడు కాదులే సుధా. తర్వాతెప్పుడైనా వస్తాం. నువ్వే వీలున్నప్పుడల్లా పిల్లలను తీసుకుని వస్తూ వుండు” అన్నది సత్యవతి.

సుధారాణి వాళ్ల దగ్గర శెలవు తీసుకుని బయలుదేరింది.

ఇంటికొచ్చిన తర్వాత సత్యంతో అక్కడి సంగతులన్నీ చెప్పింది. “మధ్యాహ్నం ఇంటి కొచ్చి భోజనం చేశారా? తులసి టేబుల్ మీద అన్నీ సర్దిందా?” అనడిగింది.

“ఆ చేశానులే. మా ఇంటి దగ్గర బాగా సందడిగా వుండి వుంటుందే. చూశావా?” అన్నాడు సత్యం.

“ఆ… చూశానులే. సందడికేం తక్కువ లేదు. తిరునాళ్లలాగానే వుంది” అన్నది అసూయ నిండిన గొంతుతో.

“మా అన్నయ్య తప్పకుండా గెలుస్తాడన్న నమ్మకం నాకు మొదటి నుండీ వున్నది. కాకపోతే మంత్రి పదవి వస్తుందని మాత్రం నేను ఊహించలేదు. అన్నయ్య మంత్రిగా పని చేసి చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. అన్నయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. ఎదుటి వాడి బాగును కోరుకునే మనస్తత్వం.”

“ఎదుటి వాళ్ల బాగుతో పాటు మన బాగూ కోరుకోవాలిగా. ఈ ఎలక్షన్ కోసం బోలెడు ఖర్చుపెట్టి వుంటారు. ఆ డబ్బంతా రాబట్టుకోవాలి. అంతో ఇంతో మిగుల్చుకోవాలి. చూస్తూ వుండండి బావగారు బాగానే సొమ్ము కూడబెడతారు.”

“డబ్బు సంగతి ఏమో కాని పేరు మాత్రం బాగా సంపాదించుకుంటాడు. నాన్నగారు కూడా ఆయన యమ్.ఎల్.ఎ.గా చేసినంత కాలం ఆస్తి సంపాదించే దాని మీద దృష్టి పెట్టలేదు. తన నియోజికవర్గం అభివృద్ధి చెందితే చాలనుకున్నారు. ఈ రోజుల్లో అయితే ఆయన్నో పిచ్చివాడికిందే జమకడతారు. అన్నయ్య మంత్రి కావటం నాకు చాలా చాలా సంతోషంగా వున్నది. నేనే మంత్రి అయినంత ఆనందంగా వున్నది.”

“ఆ… మరే మీకూ, నాకు ఒరిగేది ఏమీ వుండదు. కాస్త సంతోషాన్ని దాచి పెట్టుకోండి.”

“సంతోషపడే సమయంలో కూడా నీకు సంతోషించటం చేతకాదు సుధా.”

“ఆ… మరే” అంటూ ఇంకేదో అనబోయింది. తిరిగి చూస్తే సత్యం అక్కడ లేడు.

***

“హలో హలో సుధా! నేను నాన్నను”

“చెప్పండి నాన్నా. విజయవాడ వచ్చారా?”

“ఇప్పుడు గుడివాడ నుండే మాట్లాడుతున్నాను. రెండు మూడు రోజుల్లో విజయవాడ వస్తాను. మనిద్దరం బ్యాంక్ కెళ్లి డబ్బు డ్రా చేసి తెద్దాం.”

“ఇప్పుడా డబ్బు ఏం చేస్తారు నాన్నా?”

“అనుకున్న దాని కంటే కట్టుబడికి ఖర్చు చాలా ఎక్కువ అవుతున్నది. ఇసుక రేటు కూడా సిమెంటు బస్తాతో సమానంగా అమ్ముతున్నది. కూలీల ఖర్చు కూడా చాలా పెరిగింది. మన దగ్గరున్న డబ్బు సరిపోదు. కొంత లోను కూడా తీసుకున్నాం. అయినా అన్నయ్య మరో పార్టనర్‌ని కలుపుకుందాం అంటున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే ఈ కాంట్రాక్టుకు బయటి వాళ్లెవర్నీ తీసుకోకుండా మన ఫ్యామిలీ మెంబర్సే వుండాలని. నిన్నో పార్టనర్‌గా కలుపుకోమని అన్నయ్యకూ అల్లుడికీ చెప్తాను. అవసరమైతే ఈ డబ్బే కాక నీ ఫిక్సెడ్ డిపాజిట్లు కూడా తీసేద్దాం. ఆ విషయం చెబ్దామనే ఫోన్ చేశాను” వుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు.

సమయానికి సుజాత దగ్గర డబ్బు తీసుకోకపోతే నాన్నకు చాలా కోపం వస్తుంది. సత్యమూ, విసుక్కుంటాడు. ఆ రోజు సాయంకాలమే సుజాతను అడగాలనుకున్నది.

ఆ రోజు సాయంకాలం సుజాత వాకింగ్‌కు రాలేదు. ఇంటి కొచ్చి ఫోన్ చేసింది.

“బెంగుళూరు వెళ్లాం. రావటానికి నాలుగు రోజులు పడుతుంది” అని చెప్పింది. చెప్పినట్లుగానే, నాలుగు రోజులున్నాక సుజాత వచ్చింది.

“సుజాత గారూ! మాకు డబ్బు అవసరమైంది. మీరు సర్దాలి” అన్నది.

“అప్పుడేనా? ఏడాది చివర్లో ఇద్దామనుకుంటున్నాం. ఇప్పుటికిప్పుడంటే కష్టం సుధగారూ”

“కాదండీ. ఏదో ఒకటి చేసి డబ్బు సర్దుబాటు చెయ్యండి. మాక్కూడా చాలా అవసరంగా వున్నది.”

“నాకు తెలిసీ ఇప్పుడు డబ్బు సర్దుబాటు చెయ్యటం చాలా కష్టం. అయినా మీరడుగుతున్నారని మా వారికి చెప్తాలెండి.”

నాలుగు రోజులు గడిచాయి. సత్యనారాయణ విజయవాడ రాలేదు. ఇటు సుజాత ఏం సమాధానం చెప్పటం లేదు. సుధారాణి ఫోన్ చేసినా సుజాత ఫోన్ ఎత్తటం లేదు. ఆ రోజు సాయం కాలం వాకింగ్ కొచ్చింది సుజాత.

“కొంచెం నెమ్మదిగా నడవండి సుజాతా. మీతో మాట్లాడాలి” అన్నది.

“ఏం మాట్లాడతారు సుధా?”

“ఇంకేముంది? డబ్బు విషయమే.”

“కొన్నాళ్లు ఆగాలని చెప్పానుగా. ఏడాదిలోపున అన్నాగాని మరీ ఇలా ఆరు నెలలకే ఇవ్వాలని మనం అనుకోలేదుగా. ఏదో మాట వరసకు డబ్బు అందితే త్వరగా ఇచ్చేస్తామన్నాను, కాని మాకు డబ్బు అందలేదు” అన్నది ఖచ్చితంగా.

“సుధా! ప్రస్తుతం నీ డబ్బు తియ్యనఖ్ఖర్లేదు. అన్నయ్య, అల్లుడు కలసి ఏదో సర్దుబాటు చేశారు. వచ్చే నెల్లో అవసరమైతే నీ డబ్బు తీద్దాం” అని ఫోన్ చేశాడు సత్యనారాయణ.

ఆ నెల గడిచింది. తండ్రి మరలా ఎప్పుడు బ్యాంక్ కెళ్లాలంటాడో తెలియదు. సుజాత అసలు ఆ ప్రస్తావనే తీసుకురావటం లేదు. తులసిని తోడు తీసుకుని సుజాత వాళ్ల ఇల్లు వెతుక్కుంటూ వెళ్లింది సుధారాణి. వెళ్లి కాలింగ్ బెల్ కొట్టారు. సమాధానమేం లేదు. ఐదు నిముషాలు గడిచాయి. తులసి మరో రెండు సార్లు బెల్ కొట్టింది. చివరికి తప్పదన్నట్లుగా సుజాతే వచ్చి తలుపు తీసింది. నైటీలో వున్నది.

“బాగా నిద్రపోతున్నాను. బెల్ ఇప్పుడే వినపడింది. చాలా సేపు వెయిట్ చేయించానా! రండి లోపలికెళదాం” అంటూ లోపలికి పిలిచింది. “తులసీయే కదా నీ పేరు. వంటింట్లో అన్నీ అక్కడే వుంటాయి. మన ముగ్గురికీ టీ పెట్టి తీసుకురా” అంటూ తులసిని వంటిట్లోకి పంపింది. తలుపు దగ్గరగా వేసి మాట్లాడటం మొదలు పెట్టింది. “చూడండి సుధాగారూ! మేమొక స్థలం బేరం పెట్టాం. అదింకా అమ్ముడు పోలేదు. త్వరలో అమ్ముడుపోతుంది. ఆ డబ్బు చేతికి రాగానే మీ డబ్బు ఇచ్చేద్దామనుకున్నాం. కాని మీరు ఇప్పుడే డబ్బు కావాలంటున్నారు. వేరే మా దగ్గర వెసులుబాటు లేదు. స్థలం ఎప్పుడమ్ముడుపోతే అప్పుడు మీ డబ్బు వడ్డీతో సహా ఇచ్చేస్తాం.”

ఈలోగా తులసి టీ పెట్టి తీసుకొచ్చి పిలిచింది. “రండి హాల్లోకి వెడదాం. టీ తాగండి” అంటూ తనోకప్పు చేతిలోకి తీసుకున్నది.

ఆ టీ తగాలనిపించలేదు సుధారాణికి, తలంతా మొద్దుబారినట్లు అయిపోయింది. ఆమెతో ఇంకెలా మాట్లాడాలో అర్థం కాలేదు. తనకు ఎప్పుడూ ఇలాంటి వ్యవహారాలు చేసిన అనుభవం లేదు. తండ్రి అడిగితే ఏం చెప్పాలా? అనుకుంటూ తులసితో కలసి వచ్చేసింది.

సుజాత దగ్గర్నుండి అప్పు తేలిగ్గా వసూలు కాదని అర్థమైంది. భర్తకు చెప్పినా ఏం పట్టించుకోడు. నీ చావు నువ్వు చావు అంటాడు. ఒక అరగంట ఆలోచించి తండ్రికే ఫోన్ చేసింది.

“సుధా! డబ్బుతో పని నీకేం తెలుసని ఒక కాగితం ముక్క మీద సంతకం పెట్టించుకుని పాతిక లక్షలు తీసి ఇచ్చావు. ఇంత బుద్ధి లేని పని ఎలా చేశావా అని నాకాశ్చర్యంగా వున్నది. బయట ఎవరితోనైనా అన్నా మన పరువే పోతుంది. ఉన్న డబ్బును జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో, దాన్ని ఎక్కడ పెడితే మీరు బాగు పడతారా అని నెత్తీ, నోరు కొట్టుకుని తంటాలు పడుతుంటే నువ్వు చేసే నిర్వాకం ఇదా?  నేను వస్తున్నాను” అంటూ ఫోన్ పెట్టేశాడు.

సత్యనారాయణ బయలుదేరి వెంటనే విజయవాడ వచ్చాడు. సుజాత వ్రాసి ఇచ్చిన కాగితాన్ని తీసుకుని చూశాడు. ప్రామిసరీ నోటు లాగా వ్రాసి ఇచ్చారు. కాగితం చివర్లో అంటించిన స్టాంపుల పై పెట్టిన సంతకం అర్థమయ్యే రీతిలో లేదు. అంది సుజాతే పెట్టిందో వాళ్లాయన చేత పెట్టించిందో తెలియటంలేదు.  “సుజాతా వాళ్లు బేరం పెట్టిన స్థలం ఎక్కడో ఏంటో కనుక్కున్నావా సుధా?”

“సరిగ్గా చెప్పలేదు నాన్నా. ఈ దగ్గర్లోనే అన్నది. ఏరియా కరెక్ట్‌గా తెలీదు.”

“ఏదీ తెలుసుకోకుండా పాతిక లక్షల రూపాయిలను గవ్వపెంకుల్లా, కళ్లు మూసుకుని ఏట్లో పారబోసినట్లుగా ఇచ్చేశావు. ఇప్పుడు ఈ మొత్తాన్ని వసూలు చేసుకోవటానికి ఎన్ని తంటాలు పడాలో తెలుసా? ఆమె దగ్గర కెళ్లి ఆ స్థలం ఏక్కడుందో? ఎంత విస్తీర్ణమో కనుక్కో. తరువాతి సంగతి ఆలోచిద్దాం” అన్నాడు.

సుధారాణి సరేనంటూ తలూపింది. వాళ్లింటికి వెళ్లింది.

“సుజాతగారూ! మేమే ఒక స్థలం తీసుకోవాలనుకుంటున్నాం. మేమూ ఇల్లు కట్టుకోవాలిగా. మీరెలాగూ బేరం పెట్టారు. అదెక్కడుందో దాని వివరాలు, ఆ స్థలం తాలూకు కాగితాలు ఇవ్వండి. ఇంట్లో చూపిస్తా” అన్నది.

“ఇప్పుడా స్థలం మీరు తీసుకున్నా అక్కడ ఇల్లు కట్టుకోవటానికి ప్రస్తుతం కుదరదు. ఐకాన్ బ్రిడ్జి శాంక్షన్ అయ్యిందిగా. అది పడగానే ఇప్పుడున్న రేటుకు రెండింతలు పలుకుతుంది. దాన్నసలు అమ్మాలని లేదు. మీరు తొందర పడుతున్నారని ఆ స్థలం అమ్మి ఇస్తామని చెప్పాను. అయినా కొద్దిరోజులు ఆగండి. ఏదో ఒక విధంగా డబ్బు సర్దుబాటు చేస్తాం.”

“కాదులే సుజాతగారూ! మాకు డబ్బు వెంటనే అవసరం. మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఇక్కడ మా నాన్నగారికి పరిచయాలు ఎక్కువ. ఆయన కూడా పూనుకుని స్థలం తొందరగా అమ్ముడుపోయేటట్లు చూస్తారు. లేదూ మా నాన్నగారు డబ్బు సర్దుబాటు చేస్తే  ఆ స్థలాన్ని మేమే కొనుక్కుంటాం.”

“సరే. మా వారితో చెప్తాను. ఆ స్థలం డాక్యుమెంట్లు ఇంట్లో వున్నాయో? లాకర్‌లో దాచారో నాకైతే తెలియదు. కనుక్కుని ఏ సంగతీ చెప్తాను” అన్నది.

రెండు రోజులాగి సుధారాణి మరలా ఫోన్ చేసింది.

“మా వారు బిజీగా వున్నారు. ఇంకా కనుక్కోలేదు” అన్నది.

ఆ మాటే తండ్రితో చెప్పింది సుధారాణి.

“కాగితాలు కూడా ఇవ్వటం లేదన్న మాట. నేనే రావటమో, మీ అన్నయ్యను పంపటమో చేస్తాను. వాళ్లింటికే వెళ్లి తేల్చుకుందాం” అన్నాడు.

అన్నట్లుగానే మర్నాడుదయం తొమ్మిదింటికే సత్యనారాయణ సుధారాణి వాళ్లింటికొచ్చాడు. పిల్లలు స్కూల్‌కు సత్యం పనుల మీద వెళ్లారు. తులసికి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి తనూ తండ్రితో పాటు సుజాత వాళ్లింటికి బయల్దేరింది. వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. ఐదు నిముషాల తర్వాత పని మనిషి వచ్చి తలుపు తీసింది.

సుధారాణిని చూస్తూనే “అమ్మగారు ఇంట్లో లేరండీ” అని చెప్పింది.

“పోనీ మీ అయ్యగారున్నారా?” అనడిగారు.

“ఉన్నారు కూర్చోండి. పోయి చెప్పి వస్తాను” అంటూ లోపలికెళ్లింది. లుంగీ, బనియన్ మీదున్న వ్యక్తి వీళ్లను చూసి లోపలికెళ్లి షర్టు వెసుకుని వీళ్ల దగ్గర కూర్చున్నాడు.

“నా పేరు సత్యనారాయణ. మాది గుడివాడ. తను మా అమ్మాయి సుధారాణి. మీ భార్య సుజాతకు స్నేహితురాలు. ఆ మధ్య ఆరు నెలల కిందట మా సుధ పాతికలక్షల రాపాయల్ని మీకు అప్పుగా ఇచ్చింది. మా అల్లుడూ, మేమూ కలసి కొత్త బిడినెస్ పెట్టాం. చాలా డబ్బు అవసరంలో వున్నాం. మా సుధకు ఆ వివరాలు పూర్తిగా తెలియక పైగా త్వరగానే డబ్బు తిరిగి ఇచ్చేస్తామంటే నమ్మి డబ్బు అప్పుగా ఇచ్చింది. దాన్నిపుడు మీరు సర్దుబాటు చేస్తే ఇబ్బంది పడకుండా వుంటాం.”

“ప్రస్తుతానికి ఇవ్వలేమండీ. ఒక సంవత్సరానికి ఇవ్వొచ్చని సుజాత చెప్పింది. ఇంకా టైముందిగా, ఎడ్జస్ట్ చేద్దాంలే అనుకున్నాం.”

“ఖర్చులు పెరిగిపోయి అనుకున్న దానికంటే పెట్టుబడి చాలా ఎక్కువైంది. మేం డబ్బు టైట్లో పడిపోయ్యాం. మాకిప్పుడు చాలా అవసరం. ఎలాగైనా సర్దుబాటు చెయ్యండి.”

“లాభం లేదండీ. కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇప్పుడు మాకొచ్చే ఎమౌంట్స్ ఏమీ లేవు. మా బిజినెస్ కూడా డల్‌గా వుంది. మార్కెట్ బాగా మందంగా వున్నది.”

“స్థలం ఏదో బేరం పెట్టామన్నారట. అదేమన్నా అమ్ముడుపోతుందా?”

“స్థలమున్న మాట నిజమే. వేయి గజాలున్నది. అయితే అది కంచకచర్లలో వున్నది. ఇప్పుటి దాకా రేట్లు మందంగానే వున్నాయి. నిన్నా, మొన్నా ఐకాన్ బ్రిడ్జ్ శాంక్షనయింది అనగానే అక్కడి స్థలాలకు గిరాకీ వచ్చింది. ఎందుకంటే ఆ స్థలాల నుంచి డైరెక్ట్‌గా హైవేకు ఆ బ్రిడ్జి పోతుంది. ఏరియా బాగా దగ్గరవుతుంది. ఇప్పటిదాకా వెయిట్ చేసి ధరలు పెరిగే సమయానికి దాన్ని అమ్మటం ఎందుకా? అన్న ఆలోచనతో వున్నాను.”

“కంచికచర్ల అంటే విజయవాడకు చాలా దూరం. గవర్నమెంట్ ఐకాన్ బ్రిడ్జ్ వేస్తామన్నది. జనం ఆశపడతారు. గవర్నమెంట్ దగ్గర డబ్బుండి బ్రిడ్జి కట్టినప్పుడు బ్రిడ్జి పడిందనుకోవాలి. అవన్నీ పదేళ్లకయినా అయినట్లే సరే మీ ఆలోచనలు మీవి. మాకు మాత్రం వెంటనే డబ్బు కావాలి. మాటి మాటికీ మా పనులు మానుకుని రావటానికి మాకు కుదరదు. డబ్బివ్వండి. లేదా మీరమ్మదలుచుకున్న స్థలం తాలుకు జిరాక్సు కాగితాలు ఇవ్వండి. బేరం నేను కుదురుస్తాను. ఇవి రెండే మార్గాలు” అన్నాడు ఖరాఖండీగా సత్యనారాయణ.

అతడు ఏదో ఒకటి తేల్చుకోందే కదిలేటట్లుగా లేడని సుజాత భర్తకు అర్థమయింది.

“కాగితాలు ఇంట్లో లేవండీ. బ్యాంక్ లాకర్లో వున్నాయి. తర్వాత పంపిస్తాను లెండి.”

“తర్వాతెందుకండీ? నా దగ్గర కారుంది. లాకర్‌ కీ తెచ్చుకోండి. బ్యాంక్ కెళ్లి తీసుకుందాం. ఏదైనా అనుకోగానే జరిగిపోవాలి. నాన్పుడు వ్యవహారం మంచిది కాదు.”.

(ఇంకా ఉంది)

Exit mobile version