Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్మయోగి-8

[జగత్‌కి ఎం.ఎల్.ఎ. ఎన్నికలలో టికెట్ వస్తుంది. ఎన్నికలకయ్యే వ్యయాన్ని ఉమ్మడి ఆస్తి లోంచి ఖర్చు చేయద్దంటుంది చిన్న కోడలు సుధారాణి. ఆస్తులను పంచమంటుంది. తన మాటలకు వత్తాసుగా, తండ్రిని, బంధువులని ఇంటికి పిలిపించి అత్తమామలపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తుంది. – ఇక చదవండి]

“ఆస్తులు పంచుకోమంటున్నాం కాని విడివిడిగా బతకమని మేం చెప్పటం లేదు గదండీ? మీ ఇష్టం వచ్చినన్నాళ్లు అలాగే కలిసి వుందురుగాని!”

“కలిసి వుండేటప్పుడు ఆస్తులు మాత్రం పంచుకోవటం ఎందుకండీ?” అన్నాడు రామారావు.

“లోకంలో మీరొక్కరే పంచుతున్నారా ఏమిటండీ? టాటాలు, బిర్లాలే పంచుకున్నారు. ఇది లోక సహజం. మేమేదో వచ్చి కాని పని చేయమని మిమ్మల్ని అడిగినట్లుగా అనుకుంటారేమిటి? మీరే పంచుతారులే అని ఇన్నాళ్లూ మేము ఆగం. మీరేం మాట్లాడటం లేదని మేమే రావలసి వచ్చింది. ఇంకా ఏమీ తేల్చకుండా నాన్చటం మంచి పద్ధతి కాదు. లాయరుతో మాట్లాడండి. ఆస్తులన్నీ లెక్క కట్టించండి. ఎవరిది వాళ్లకు పంచండి. తగినంత మీరూ ఉంచుకోండి. ఎందుకంటే మీరూ మీ ఇద్దరమ్మాయిల మంచీ, చెడూ చూడాలి కదా?” అన్నారు ఉదారంగా, వరమిస్తున్నట్లుగా.

“మీకెంత చెప్పినా అర్థం కావటం లేదు. మమ్మల్ని ఇలా ప్రశాంతంగా వుండనివ్వండి. నా కొడుకులు విడిపోవాలనుకున్నప్పుడు విడిపోతారు. ప్రస్తుతం నాకు కానీ, వాళ్లకు కానీ, ఆ ఉద్దేశం లేదు. మా మనసులకు ఆస్తులు పంచుకోవాలనిపించినపుడు పంచుకుంటాం. మా మనసులకిష్టం లేని పనిని మీరు చెప్పినంత మాత్రాన ఎలా చేస్తాం?”

“మీకూ, మీ కొడుకులకూ ఆ ఉద్దేశం లేకపోవచ్చు. కాని వచ్చిన కోడళ్లకు ఆ ఉద్దేశం వుంటుంది. వాళ్ల కోరికనూ మన్నించాలి గదండీ. ఈ రోజుల్లో ఉమ్మడి కాపురంలో అత్తా, తోటికోడళ్లతో కలిసి ఎవరుంటున్నారండీ? మీకు దడిచి అలా గుంభనంగా గడిపేస్తున్నారు. ఎవరికి మాత్రం వుండదండీ? స్వేచ్ఛగా తన మొగుడూ, పిల్లలతో తన కాపురం తను చేసుకోవాలని ఈ కాలపు ప్రతి ఆడపిల్లా అనుకుంటుంది. మా సుధ అలాగే వుండాలనుకుంటుంది. ఏదో ఒకటి మీరు తేల్చిండి. ఎల్లకాలం మీ ఇష్టాలనే వాళ్ళ మీద రుద్దాలని చూడకండి” అన్నారు మొండిగా.

మనసంతా చేదుగా అయిపోయింది రామారావుకు. తన ఇంటి వ్యవహారాన్ని ఇలా నలుగురిలో పెట్టి రచ్చ చెయ్యటం అస్సలు మింగుడు పడటం లేదు. తన కలల్ని, తన కోరికలను సుధ ఆమె తరుఫు వాళ్లు కలిసి ఇలా కాలరాస్తారని ఊహించలేదు. దీన్ని ఇంకా రచ్చ చేసుకోవాలన్పించటం లేదు. అందరూ కలసి మెలిసి ఉండే దాంట్లో ఆనందం వీళ్ల కెందుకు అర్థం కావటం లేదు? ఇంత తొందరగా ఈ సమస్యలో ఇరుక్కుంటానని తను కానీ, సత్యవతి కానీ భావించలేదు. కుటుంబమంతటితో హాయిగా, రోజు పండగలాగా వుండొచ్చని తనూ తన భార్యా చాలా కలలుగన్నారు. తన మాటకి తన కొడుకులూ అడ్డు చెప్పలేదు. సుధ మనసులో ఎన్నాళ్ల నుంచి ఈ కోరిక వున్నదో? జగత్ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలనుకోవటంతో ఆ అమ్మాయి తన కోరికను బయట పెట్టింది. కోరిక కలగకుండా వుండాలే కాని అది పుట్టినతర్వాత దాన్ని నెరవేర్చుకునే దాకా సుధ లాంటి వాళ్లు నిద్రపోరనుకున్నాడు.

“మేమసలు ఈ విషయాన్ని గురించి అనుకోలేదు. ఇప్పటికిప్పడంటే ఎలా? కొంచెం నిదానంగా ఆలోచిస్తాం లెండి” అన్నాడు రామారావు వాళ్లతో.

“అంతగా ఆలోచించాల్సింది ఏముంది లెండి? మనసుంటే మార్గముంటుంది. ఇదేమన్నా లోకంలో జరగనిదా? సర్వసాధారణంగా అన్ని ఇళ్లలోనూ జరిగేదే. మీరూ దానికి అతీతులు కాదు.”

“మీ మాటే మీది కాని మేం చెప్పేది విన్పించుకోరా? మా నాన్నగారు చెప్తున్నారు కదా! ఇదేమన్నా చిన్న విషయమా! ఉన్న పళంగా పంచివ్వండి, పంచివ్వండి అని ఒకటే పాట పాడుతున్నారు. మేమూ కాస్త ఆలోచించుకోవాలి. నాన్నగారిని ఇంకా ఒత్తిడి చేయకండి” అన్నాడు సత్యం విసుగ్గా.

“మేమే పాటపాడినా మీ క్షేమం కోరే. పంచటానికి టైం పడితే పట్టొచ్చు. కాని అలాగే పంచిస్తాను అని మాట చెప్పటానికి టైమెందుకు సత్యం? పంచకుండా ఇలా ఎన్నాళ్లు తప్పించుకుందామని? మేం ఇవ్వాళ అటో ఇటో తేల్చుకుని కాని వెళ్లం” అన్నారు మొండిగా.

‘వట్టి మూర్ఖుల్లాగా వున్నారు’ అనుకున్నాడు రామారావు. ఇప్పుడు తను కాదంటే సుధారాణి గందరగోళం సృష్టిస్తుంది. వియ్యంకుడు ఇంకా రెచ్చిపోతాడు. సుధారాణిని పుట్టింటికి తీసుకెళ్లినా, తీసుకుపోవచ్చు. సత్యం కాపురం ఒడిదుడుకులకు లోనవుతుంది. నలుగురితోనూ వేలెత్తుకుని చూపించుకోవాల్సి వస్తుంది. ఇదంతా లేకుండా సామరస్యంగానే పరిష్కరించుకోవాలి అనుకున్నాడు రామారాడు.

“అలాగే లెండి. లాయర్‌తో మాట్లాడతాను” అని హామీ ఇచ్చాడు.

“వీలైనంత వరకూ త్వరగా లాయర్‌తో మాట్లాడి రాత కోతలు పూర్తి చేయండి” అని చెప్పి వెళ్లారు.

శశిరేఖకి భయం వేసింది. ‘ఏంటిలా జరిగింది? సుధకిప్పుడు ఏం తక్కువయింది? తనూ, అత్తయ్యా కూడా జగత్‌ను రాజకీయంలోకి దిగేటప్పుడు ఒకసారికి, రెండు సార్లు బాగా ఆలోచించకోమని మరీ మరీ చెప్తున్నాము. ఇప్పుడు సుధ ఆ కారణంతోనే వేరు కాపురం పెట్టుకుంటానంటున్నది. మామయ్యగారే నిర్ణయం తీసుకుంటారో’ అనుకున్నది.

సత్యవతికి మనసు మనసులో లేదు. తాను కూడా ఊహించని విషయం ఇది. మరొకరు వచ్చి తన భర్తతో ఆస్తి పంపకాల విషయం మాట్లాడటం ఆమె భరింపలేకపోతున్నది. ఆయన తప్పకుండా జరిగిన విషయానికి విపరీతంగా బాధపడతారు. తనిప్పుడు ఎలా ఓదార్చాలో అనుకున్నది. చాలా సార్లు, అనేక సందర్భాలలో సుధ తన అసంతృప్తిని తెలియజేస్తూ వుండేది. తన స్వభావం అంతేలే అని, సరిపెట్టకునే వాళ్లం. కాని ఈ రోజు తన తండ్రినీ, చుట్టాలనూ పిలిపించి నానా యాగీ చేయించింది. జగత్, సత్యంలు తమ ముఖాల్ని చిన్నబుచ్చుకున్నారు అనుకుంటూ చెంపకు చేయి జేర్చుకుని దీర్ఘాలోచనలో పడిపోయింది. ఆ పూట ఎవరూ సరిగా భోజనం చేయలేదు.

రైల్వే గోడవున్లు కట్టించి ఇచ్చే పని దాదాపు ఖరారు అయినట్లే. అయితే భూమి సుధారాణి వాళ్ల నాన్నది. ఆయన కూడా వాటా కలుస్తానన్న మనిషి ఇవ్వాళ సెపరేట్‌గా తనూ, తన అల్లుడూ కట్టుకుంటే పోలా? అన్న లెక్కలో కొచ్చాడు. జగత్‌ని వేరుగా చూస్తున్నాడు. పర్మిషన్ కోసం హైద్రాబాద్ చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరిగింది జగత్ అని, కాంట్రాక్టును చేజిక్కించుకున్నది జగత్ అని మర్చిపోతున్నాడు.

రామారావుకీ విషయం తెలిసి బాధ పడ్డాడు. “ఇక ఆ భూమిలో కట్టే విషయం మర్చిపో. వేరే రకంగా భూమిని సమకూర్చుకోవచ్చు పెదబాబూ!” అన్నాడు.

సత్యానికి కూడా ఈ విషయం బాధనిపించింది.

ఆనాటి రాత్రి భోజనాలయ్యి ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు. రాత్రి పదకొండు దాటిన తర్వాత రామారావుకు చెమట విపరీతంగా పోసింది. ఊపిరి ఆడనట్లుగా అనీజీగా ఫీలయ్యాడు. డాక్టరు దగ్గరకు వెళ్తే మంచిదనుకున్నాడు. దిండు మీద జారగిలబడి కూర్చున్నాడు. మంచి నీళ్లు తాగుదామని సత్యవతి కూడా అప్పుడే లేచింది. భర్త పరిస్థితి చూసి కొడుకులకు ఫోన్ చేసింది. వాళ్లు వచ్చి వెంటనే హస్పిటల్‌కు తీసుకువెళ్లారు. మైల్డ్‌గా హర్ట్ ఎటాక్ వచ్చిందన్నారు. ఎక్కువగా ఆలోచనలు, అధిక శ్రమ పడవద్దు. రెస్ట్‌గా ప్రశాంతంగా వుండమని చెప్పారు. నాలుగు రోజులు అబ్జర్వేషన్‌లో వుంచి ఆ తర్వాత ఇంటికి పంపించారు. మందులు రెగ్యులర్‌గా వాడాలని వ్రాసిచ్చారు.

సుధారాణి, ఆమె తరపు వాళ్లు “ఇవ్వాళ మైల్డ్‌గా స్ట్రోక్ వచ్చింది. ఇంకా కొన్నాళ్లు పోతే సివియర్‌గా వచ్చినా వస్తుంది. కీడెంచి మేలెంచాలని మేం చెప్పనే చెప్పాం. ఇప్పటికైనా చేయాల్సిన పనులు వెంటనే చెయ్యండి” అంటూ జరిగిన సంఘటనను వాళ్లకనుకూలంగా మార్చుకున్నారు.

‘సుధారాణి తరపు వాళ్లు వచ్చి గోల చేస్తేనే, ఆయన మనస్తాపం చెందారు. వాళ్లు పెట్టిన ఒత్తిడికి మనసు కలతపడి గుండె పోటు వచ్చింద’ని ఇంట్లో అందరూ అనుకున్నారు.

కాకినాడ నుండి దేవసేన, రాజేష్ లిద్దరూ వచ్చారు. రామారావు ఆరోగ్యం పట్ల అందరూ ఆందోళనగా వున్నారు. అటు వంటి పరిస్థితిలో ‘రాజేశ్వరి’ గురించి రాజేష్ అడగలేకపోయ్యాడు. దేవసేనకా ధ్యాసే లేదు.

***

కాకినాడ తిరిగి రాగానే రాజేష్ ఓ రోజు సాయంకాలం నాలుగింటికల్లా ఇంటి కొచ్చాడు. టీ అదీ తాగి ఫ్రెష్ అయ్యాడు. మహాత్మాగాంధీ సేవాసమితి వైపుకు వెళ్ళాడు. లోపలి కెళ్లి చూశాడు.

వృద్ధాశ్రమంలోని వారు కాబోలు, కొందరు వృద్ధులు కూర్చుని ధ్యానం చేస్తున్నారు. మరి కొందరు యోగా చేస్తున్నారు. మరి కొందరు ‘రఘుపతి రాఘవ రాజారాం, ఈశ్వర అల్లా తేరే నామ్’ అంటూ నెమ్మదిగా పాడుతున్నారు. హడావుడిగా ఏం లేకుండా అంతా ప్రశాంతంగా వుంది. చుట్టూ పచ్చని చెట్లు పూల మొక్కలు వుండి వాతావరణం ఆహ్లాదంగా వున్నది. అటూ ఇటూ తిరుగుతూ పనులు చేసుకునే అతన్ని పలకరించి “మాతాజీ వున్నారా?” అని అడిగాడు. లేరు అన్న సమాధానం వచ్చింది.

“రాజేశ్వరిగారు ఎక్కడున్నారు?” అని అడిగాడు. లేరు అన్న సమాధానం వచ్చింది.

“మాతాజీ, రాజేశ్వరిగారు కలిసే పొరుగూరు వెళ్లారు. ఎప్పుడొచ్చేదీ తెలియదు” అన్న సమాధానం వచ్చింది.

చేసేదేం లేక రాజేష్ ఇంటికి తిరిగొచ్చాడు. దేవసేన పిల్లలకు హోమ్ వర్క్ చేయిస్తున్నది. తాను రాజేశ్వరి కోసం వెళ్లి వచ్చిన సంగతి రాజేష్ చెప్పలేదు.

***

ఆమెరికా నుండి ప్రియంవద కూడా గాబరాగా వచ్చింది. తనకు తెలిసి తండ్రి ఎప్పుడూ అనారోగ్యం అంటూ హాస్పిటల్లో వుండలేదు. అందుకే పరుగెత్తుకు వచ్చింది.

అమెరికా నుండి వచ్చిన కూతుర్ని చూసి రామారావు దంపతులు చాలా సంతోషపడ్డారు. హాస్పిటల్, రిపోర్టులు అడిగి తీసుకుని చూసింది. తండ్రి కోసం ఏపిల్ ఫోన్ తెచ్చింది. దాన్ని ఎన్ని రకాల ఉపయోగించుకోవచ్చు నేర్పింది. తమ కోసం తెచ్చిన డ్రస్సులూ, బొమ్మలూ చూసుకుని పిల్లలు మహదానందపడిపోయారు. అన్ననూ, తమ్మణ్ణీ వాళ్ల వ్యాపార విషయాలు అడిగి తెలుసుకున్నది. సుధారాణికీ, శశిరేఖకీ జగత్‌కూ, సత్యానికీ ఎవరికి తగ్గ రిస్ట్ వాచీలు వాళ్ల కిచ్చింది. సత్యవతికి సన్నని ప్లాటినమ్ గొలుసిచ్చింది. స్నేహితురాలైన శశిరేఖతో కబుర్లే కబుర్లు. అది చూసి సుధారాణి కడుపు మండిపోయింది. ‘మనుషులకు ఏం మందు పెడుతుందో తెలియదు. అందర్నీ తన వైపుకు తిప్పుకుంటుంది’ అనుకున్నది కసిగా.

“పిల్లల్ని తీసుకురాకుండా ఒక్కదానివీ వచ్చావు. ఇక్కడ నుంచి హైద్రాబాద్ వెళ్లి మీక్కావలసిన నగలు కొనుక్కోండి. దేవసేనకూ కబురు చేసి తోడు తీసుకెళ్లు” అన్నాడు రామారావు.

“ఇప్పుడు నగలకేమీ తొందర లేదు. తర్వాత చూద్దాంలే” అంటూ దేవసేనను సత్తెనపల్లి రమ్మని ఫోన్ చేసంది.

“ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. శెలవు పెట్టటం కుదరదు నువ్వే కాకినాడ రా అక్కా” అన్నది దేవసేన. సుధారాణి తండ్రి వచ్చి గొడవ పెట్టుకోవటం, రామారావు మనసు కష్టపెట్టుకోవటం అన్నీ చెప్పింది సత్యవతి. “భారమంతా తనే మోయకండా నాన్న కొన్ని బాధ్యతలు తగ్గించుకుంటే మంచిదేమోనమ్మా” అన్నది ప్రియంవద. ప్రియంవద దగ్గర తన అసంతృప్తిని దాచుకోలేదు సుధారాణి. “మీదేముంది వదినగారూ! ఈ మారుమూల సత్తెనపల్లిలో పడి కొట్టుకు చస్తున్నాం. మా పిల్లలకు ఇక్కడన్న కాన్వెంట్లే గతి. మీరూ, దేవసేనా మీక్కావల్సిన ఉద్యోగాలు చేస్తూ, అన్నీ సమకూర్చుకుంటున్నారు. మేం మాత్రం బావిలో కప్పల్లాగే బతుకుతున్నాం” అన్నది నిస్పృహగా.

సుధారాణి లాంటి వాళ్ల దృష్టిలో దూరపు కొండలు మరీ నునుపుగా కనపడతాయి అనుకున్నది ప్రియంవద.

***

ప్రియంవద కాకినాడ వచ్చింది. అక్క చెల్లెళ్లిద్దరూ తమ పుట్టింటి విషయాలు మాట్లాడుకున్నారు. సుధారాణి పెడసరితనం మరీ ఇబ్బందిగా వున్నదనుకున్నారు.

రాజేశ్వరి విషయం రాజేష్ ప్రియంవదనూ అడిగాడు. తనకేమీ తెలియదన్నది. తనకు గుర్తు వున్నంత వరకు మరీ దూరపు చుట్టాలు అందులోనూ దేవసేన పోలికల్తో ఎవరూ లేరని చెప్పింది.

“ఆల్రెడీ నేను చెప్పానక్కా. నాకంటే పెద్దదానివి గదా నీకేమైనా తెలుస్తుందేమోనని నిన్నడిగారు. మీ మరిదికి మాటి మాటికీ ఆ రాజేశ్వరి అనే ఆవిడ విషయమే గుర్తొకొస్తున్నది” అన్నది దేవసేన.

“ఒక విషయంలో డౌట్ వస్తే దాన్ని తీర్చుకొనే వరకూ అలాగే అన్పిస్తుంది. అమ్మని గానీ, నాన్నను గానీ అడుగుదాం. తప్పేముంది. నాకెక్కువ టైం లేదు. లేకపోతే ఆవిడున్న చోటుకు వచ్చ నేనూ చూసేదాన్ని” అన్నది ప్రియంవద.

కిరణ్ తోనూ ప్రణవి తోనూ బాగా కబుర్లు చెప్పింది ప్రియంవద. వాళ్ల చదువుల్ని గురించి తెలుసుకుంటూ తన కూతుళ్లు సాహన, మోహనలు చదివే స్కూలు గురించి చెప్పంది. “అమెరికాలో హోమ్ వర్క్ ఎక్కువివ్వరు. ఎక్కువగా ప్రాజెక్ట్ వర్క్ వుంటుంది. సోహనకు డాన్స్, సంగీతం అంటే ప్రాణం. మన ఆంధ్రా నుంచి వచ్చిన టీచరుగారి దగ్గరే నేర్చుకుంటున్నది. మోహనకు మొక్కలన్నా, పక్షులన్నా బాగా ఇష్టం. ఇద్దరూ జనరల్ బుక్స్ చదివేటట్లు చూస్తాం” అని చెప్పింది ప్రియంవద.

“అక్కడ టీచర్లు పిల్లల్ని కొడతారా? ఇంకేమైనా పనిష్మెంట్ ఇస్తారా?” కిరణ్‌కు సందేహం వచ్చింది.

“లేదు. ఏ టీచరూ పిల్లల్ని కొట్టరు. అమ్మనాన్నలు కూడా పిల్లల్ని కొట్టరు. మీ అమ్మానాన్నలు మిమ్మల్ని ఏమైనా కోప్పడుతున్నారా?”

“ఎప్పుడన్నా కోప్పడుతారు. మా టీచర్లు, క్లాసులో అల్లరి చేసే వాళ్లకు చిన్న చిన్న పనిష్మెంట్లు, చిన్న చిన్న బెత్తం దెబ్బలు వేస్తారు. మరీ మీ పిల్లల్ని పిక్నిక్ లకు తీసుకెళ్తారా?”

“ఓ… తీసుకెళ్తారు. వాటర్ ఫాల్స్, జూ లాంటి చోట్లకు తీసికెళతారు. మీరెక్కడికైనా పిక్నిక్‌కు వెళ్లారా?”

“నవంబర్ నెలలో కొంచెం దూరంలో వున్న పాలకొల్లు టెంపుల్‌కీ, బీచ్‌కూ తీసుకెళ్లారు. అక్కడ చాలా మంది జనాలు వున్నారు” అంటూ కిరణ్, ప్రణవీ వాళ్ల పెద్దమ్మతో బోలెడు కబుర్లు చెప్పారు.

***

ప్రియంవద సత్తెనపల్లి వచ్చేసింది. అక్కతో కూడా సత్యం ఇదివరకటి లాగా ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. తల్లిదండ్రుల ఎదుట కూడా పడలేకపోతున్నాడు. తన మామగారు, సుధారాణి ప్రవర్తన వలనే తండ్రికి అనారోగ్యం వచ్చిందని గట్టిగా నమ్ముతున్నాడు. వాళ్ల మాటలు లెక్క చేయనట్లుగా వుందామనుకుంటాడు. ఇంట్లో సుధారాణి మాటలు, మామగారి ఫోన్లూ అతణ్ణి బాగా డిస్డ్రబ్ చేస్తున్నాయి. పొరపాటున తండ్రికింకా సీరియస్ అయితే అందరి దృష్టిలో తనూ, తన భార్యా దోషుల్లాగా వుండాల్సి వచ్చేది. సుధారాణికి విషయాలేం పట్టవు. ఇంట్లో వాళ్లు మాములుగా వుంటున్నా సత్యం మాత్రం తండ్రితోనూ, అన్నతోనూ ఫ్రీగా వ్యాపార విషయాలు కూడా మాట్లాడలేకపోతున్నాడు. అతడి ఇబ్బందిని రామారావు గ్రహించాడు. “చూడు సత్యం, నీ ఇబ్బంది నాకర్థమైంది. బిడ్డనిచ్చుకున్నాడు కనుక మీ మామగారి ఆదుర్దా ఆయనకుంటుంది. దాన్ని మనం తప్పు పట్టకూడదు. నిదానంగా ఆస్తి విషయాలు సెటిల్ చేసుకుందాం. అలా సెటిల్ చేసుకున్నంత మాత్రాన వేరు పడిపోం కదా? మనకిష్టం వున్నన్ని రోజులూ ఈ ఇంట్లోనే కలిసివుందాం. మీ మామగారి మాటల్ని అదే పనిగా గుర్తుచేసుకుని బాధపడకు” అంటూ ధైర్యం చెప్పాడు.

సత్యవతి కూడా కోడలికి నచ్చ చెప్పాలని చూసింది. “చూడు సుధా! మీ నాన్నగారి మాటలు పట్టుకుని నువ్వు అదే పనిగా అపోహలు పెంచుకోకు. జగత్ దుబారా మనిషి కాదు. కుటుంబాన్ని నష్టపెట్టాలనుకోడు. ఏం చేసినా మన కుటుంబం బాగు పడాలనే చూస్తాడు. మీ మామయ్యగారు మంచి చెడులన్నీ ఆలోచించే మనిషి. మీకు వీళ్లిద్దరూ కలిసి అన్యాయం చేస్తారనే ఆలోచన నీకెలా వచ్చింది? మీ నాన్నగారితో చెప్పు. వాళ్లనేమీ ఆందోళన పడవద్దని. అన్నీ సజావుగానే జరుగుతాయి. మనమంతా మీ ఇద్దరి పిల్లలతో కలిసి మెలిసి ఆనందంగా వుండాలనేదే మా కోరిక. అంతకు మంచి మరేం లేదు” అంటూ ఎన్నో మంచి మాటలు చెప్పాలని ప్రయత్నించింది.

“లోకంలో ఎక్కడా లేనట్లుగా ఊహించుకుని మాట్లాడుతారేంటత్తయా. పెళ్లిళ్లు అయ్యీ కాకముందే, ఎవరి కాపురాలు వారు చేసుకునే రోజులు ఇవి. ఎవరికి నచ్చినట్లు వారుండే పరిస్థితి ఇది. ఎన్నాళ్లున్నా ఇక్కడే పడి వుండి ఎదుగూ బొదుగూ లేని పరిస్థితి ఎందుకు చెప్పండి! విజయవాడ లాంటి టౌన్‌లో ఏ వ్యాపారమో చేసుకోవాలని మాకు మాత్రం వుండదా? మాదేంటో మాకు పంచి ఇస్తే మా దారి మేం చూసుకుంటాం. ఆ తర్వాత ఎలక్షన్లలో దిగుతారో, రాజ్యాలే ఏలతారో మీ ఇష్టం. మాకు మాత్రం పంచి ఇవ్వాల్సిందే” అంటూ ఖరాఖండీగా చెప్పేసింది. “అత్తయ్యా మరో మాట. మామయ్యగారి లాగే మా నాన్నగారు కూడా తన పిల్లల క్షేమం కోరే మనిషే. అందుకే అంతగా పాకులాడుతున్నారు. ఆయనా అనుకున్న పని అయ్యేదాకా నిద్రపోయే మనిషి మాత్రం కాదు” అంటూ అక్కణ్ణించి విసురుగా లేచి వెళ్లింది.

‘ఆస్తి పంచుకుని ఇక్కణ్ణుంచి వెళ్లిపోయే ఆలోచనలో వుందన్న మాట’ అనుకుని బాధపడింది సత్యవతి.

ఆ రాత్రి జగత్, సత్యంలు ఇంటి కొచ్చిన తర్వాత పొడి పొడి మాటలతోనే భోజనాలు పూర్తి చేశారు. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ‘ఇది వరకెంతో సందడిగా కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరికి వాళ్లు నాలుగు ముద్దలు నోట పెట్టుకుని లేచిపోతున్నారు. చూడటానికేం బాగుండటం లేద’నుకున్నది వరలక్ష్మి.

ఆ రాత్రి ముభావంగా పడుకున్న సత్యాన్ని చూసి చిరాకేసింది సుధారాణికి. “ఊరికే మొఖం వేలాడేసుకుని తిరక్కండి. జరగే అన్యాయాన్ని మీరెలాగూ ఎదుర్కోలేరు. మా నాన్ననయినా కలగజేసుకోనీయండి. తన కూతురికీ, అల్లుడికీ అన్యాయం జరుగుతుంటే ఆయన భరించలేడు. అలాగే, నా పిల్లల కన్యాయం జరుగుతుందని నేను భయపడుతున్నాను” అన్నది.

(ఇంకా ఉంది)

Exit mobile version