[నర్సీపట్నంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలో పాణ్యం దత్తశర్మ ధార్మిక ప్రవచనాలు – నివేదికని అందిస్తున్నారు జెట్టి వంశీకృష్ణ.]
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం లోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయంలోని ప్రవచన మంటపంలో, జ్ఞాన సరస్వతీ సేవా ట్రస్టు వారి ఆహ్వనం మేరకు, పాణ్యం దత్తశర్మ, 25 నవంబరు 2024 కార్తీక సోమవారం నాడు, ‘కార్తీక వైభవం’ అన్న ప్రవచనం చేశారు. సభాధ్యక్షులుగా శ్రీ మంతెన శ్రీరామరాజు గారు వ్యవహరించారు. ముఖ్య అతిథిగా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వర్రి గజ్జాలమ్మగారు హజరైనారు. పురప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు, సర్వశ్రీ వడలి రామచంద్రరావు, ఉప్పల శ్రీరామ్మూర్తి మాస్టారు, అయ్యగారి భీమశంకరం మాస్టారు వేదిక నలంకరించారు. దత్తశర్మ గారి ఆత్మీయ మిత్రులు శ్రీ జెట్టి యల్లమంద గారు ప్రవచనకర్తను సభకు పరిచయం చేశారు. ప్రవచనకర్తకు కీబోర్డు మీద కనక రాజుగారు, మృదంగం మీద శ్రీ శ్రీనుగారు వాద్య సహాకారం అందించి, ప్రసంగాన్ని రక్తి కట్టించారు.
‘కార్తీక వైభవం’ ప్రవచనంలో దత్తశర్మ శివకేశవులకు అభేదమన్న సత్యాన్ని గ్రహించినవాడే జ్ఞాని అని చెప్పారు. స్కాందపురాణం లోని “న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్” అన్న శ్లోకాన్ని కళ్యాణి రాగంలో ఆలపించారు. శివునికి ‘ఆశుతోషుడు’ అన్న పేరు ఎలా వచ్చిందో వివరించారు. ‘ప్రదోషో రజనీ ముఖం’ అని ప్రదోషాన్ని నిర్వచించి, ఉత్థానైకాదశి ప్రాశస్త్యాన్ని చెప్పారు. తులసీ మహిమను గురించి చెప్పి, ‘తులసీ, జగజ్జనని, దురితాపహారిణి’ అన్న త్యాగరాజస్వామి వారి కీర్తనను సావేరి రాగంలో ఆలపించి శ్రోతలను అలరించారు. కార్తీక స్నానం, కార్తీక దానం, కార్తీక దీపం మొదలగు వాటి ప్రాముఖ్యతను వివరించారు. కార్తీక పౌర్ణమికి ‘కౌముది’ అన్న పేరున్నదనీ, మానవుని మనస్సుకు జ్యోతిశాస్త్రములో అధిపతి చంద్రుడని చెప్పారు. ఆకాశదీపం, భగినీ హస్త భోజనం గురించి విశదీకరించారు. “శివుడొక్కటే తలపు, శివుడొక్కటే పలుకు” అన్న అన్నమాచార్యుల వారి కీర్తనను, “శంభో మహాదేవ! శంకర! గిరిజారమణ” అన్న అరుదైన, త్యాగరాజకృత శివ కీర్తనను, కామవర్ధినీ రాగంలో ఆలపించి, శ్రోతల మన్ననలు పొందారు. ఆదిశంకరాచార్య విరచిత ‘శివమానసపూజ’ అన్న స్తోత్రం లోని శ్లోకాలను భూపాలరాగంలో పాడి, భౌతికంగా అశక్తులైనవారు కేవలం ఈ శ్లోకాలు చెప్పుకోంటే చాలు, శివానుగ్రహం లభిస్తుందన్నారు.
తర్వాత శ్రీనాథ మహాకవి ప్రణీతమైన ‘హరవిలాస’ కావ్య ప్రశస్తిని, అందులో చిరుతొండనంబి (భక్త శిరియాళ) కథను, అక్కడక్కడా శ్రీనాథుని పద్యాలను ఆలపిస్తూ వివరించారు. తదుపరి గిరిజా కల్యాణ కథను చెప్పారు అదీ హరవిలాసాంతర్గతమే. మహా లింగోద్భవ సమయంలో బ్రహ్మది దేవతలు స్వామిని ప్రార్థించిన ‘దండకము’ – ‘జయజయ మహలింగ జ్యోతిశ్శివలింగ’ను లయబద్ధంగా పాడగా, వాద్యవిద్వాంసులు దానిని సుసంపన్నం చేయగా, ప్రవచనాన్ని ముగించారు దత్తశర్మ. ఆహ్వానపత్రికలో తనను ‘వేదపండితులు’గా పేర్కొన్నారనీ, ఆ పదానికి తాను అర్హుడిని కాననీ సవినయంగా విన్నవించారు. జ్ఞాన సరస్వతీ ట్రస్టు అధ్యక్షులు శ్రీ బాబూరావు మాస్టారు, శ్రీ ఎ.ఎస్.ఎన్ మూర్తి, ఇతర ప్రముఖులు, దత్తశర్మను శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించి, పుష్పమాలాలంకృతులను చేశారు.
అదే రోజు సాయంత్రం, నర్సీపట్నంలోని ప్రముఖ కూడలి అబిద్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన, బహిరంగ వేదికపై, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్ర్మేంద్ర స్వామి దేవస్థానం ఎదుట, పాణ్యం దత్తశర్మ మరొక ప్రవచనం చేశారు. ‘శ్రీ బహ్మేంద్ర, దివ్య తత్త్వము’ పై ప్రసంగించారు. వాద్య సహకారం మరల కనకరాజుగారు, శ్రీను గారు అందించారు. వీరబ్రహ్మంద్ర యోగి కేవలం విశ్వబ్రాహ్మణలకు మాత్రమే ఆరాధ్యుడు కాడనీ, ఆయన మహాయోగి అనీ, కాలజ్ఞాని యనీ, ఆధ్యాత్మ జ్ఞానాన్ని పామర జనానికి సైతం అర్థమయ్యే భాషలో వివరించారనీ చెప్పారు.
‘కాళికాంబ! హంస! కాళికాంబ!’ అన్న మకుటంతో వీరబ్రహ్మేంద్రులు వ్రాసిన పద్యాలను మధురంగా ఆలపించారు. ‘చెప్పలేదంటనక బొయ్యేరు’, ‘ఎందుకురా నీకింత బాధ’, ‘చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే’ మొదలగు స్వామివారి తత్త్యాలను వారు స్వరపరచిన విధంగానే పాడి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. వీరబ్రహ్మేంద్ర దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు శ్రీ బాబూరావు మాస్టారు దత్తశర్మగారిని ఘనంగా సత్కరించారు. జెట్టి యల్లమంద గారు గురువు గొప్పదనాన్ని వివరించే ఒక చక్కని పద్యాన్ని పాడి శ్రోతలను అలరించారు. వారికీ, నిర్వాహకులు సన్మానం చేసి గౌరవించారు.
– వంశీకృష్ణ జెట్టి.
నర్సీపట్నం. 25-11-24