Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కరువైన కంటిచెమ్మ

[సూర్యదీప్తి గారు రచించిన ‘కరువైన కంటిచెమ్మ’ అనే కవితని అందిస్తున్నాము.]

యాంత్రిక జీవనంలో
కంటిచెమ్మకు కరువొచ్చింది..
మనసు లోతుల్లోకి తొంగిచూసి
లోటుపాట్లని తడుముకుని
పొడిబారిన కళ్ళకి కాసింత తడి పులుముకునే
తీరిక కోరిక ఎక్కడిది.. ఎవరికి ఉంది..
అందుకే కంటిచెమ్మకు కరువొచ్చింది..

ఏకాంతంలో కూడా
అంతః పరిశీలన చేసుకోడే ఏ అభాగ్యుడూ..??
రోజు గడవడమే జీవితమైతే
పక్షికీ, పశువుకీ కూడా గడుస్తుంది రోజు
అర్థవంతంగా, ఆనందమయంగా..
సంతోషమూ, సంతాపమూ లేనిది మనిషికే..
సంతృప్తి, సహానుభూతి లోపించిందీ మనిషిలోనే
అందుకే కంటిచెమ్మకు కరువొచ్చింది..

ఎదుటి వ్యక్తి ముఖంలో సంతోషాన్ని
చూడాలనుకున్నపుడు
మనిషి జీవితం వికసించిన కమలంలా
కాంతులీనుతుంది, కళకళలాడుతుంది
ఆక్షణమూ కళ్ళు చెమ్మగిల్లుతాయి..
అంతులేని ఆత్మసంతృప్తితో
అనిర్వచనీయమైన ఆనందానుభూతితో..

తనను తాను వేపుకుంటున్నాడు మనిషి
సోషల్ మీడియా అనే కడాయిలో..
పూర్తిగా వేగి, మాడి, మసైపోయేవరకూనూ
అందుకే
కంటిచెమ్మకు కరువొచ్చింది..

ఒక్కసారి పక్కకి చూడగలిగితే
మరోమనిషి మనోవీధిలోకి తొంగిచూసేందుకు ప్రయత్నిస్తే
బహుశా..
కంటిచెమ్మకు కరువు తీరుతుంది..
బతుకు బరువూ కరుగుతుంది..

Exit mobile version