Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కశ్మీర రాజతరంగిణి-14

కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.

జోనరాజు పృథ్వీరాజ విజయంలో మహమ్మద్ ఘోరీని ‘మ్లేచ్ఛుడి’గా, కశ్మీరు సుల్తానును ‘యవనుడి’గా భావించటం వెనుక మరో కారణం ఉంది. అది ఇస్లామీయులు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రవేశించిన విధానానికి, కశ్మీరంలో ప్రవేశించిన విధానానికి ఉన్న తేడా.

భారతదేశంపై మహమ్మదీయుల దాడులను మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశల్లో అరేబియా నుంచి దాడులు జరిగాయి. రెండవ దశలో గజని నుంచి దాడులు, మూడవ దశలో ఘోర్ నుంచి దాడులు జరిగాయి.

‘అరేబియా’లో జన్మించిన తరువాత ఇస్లామ్ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరించింది. అరేబియాకు ఉత్తర, పడమర దేశాలలోని ప్రాంతాలు పాలస్తీనా, సిరియాలు ఆరునెలలలోగా సంపూర్ణంగా ఇస్లాంమయం అయ్యాయి. క్రీ.శ.643వ సంవత్సరానికల్లా ఇరాన్, ఇరాక్, ఖురుసాన్ వంటి ప్రాంతాలు ఇస్లాం ఖాతాలో చేరిపోయాయి. ఖలీఫా సామ్రాజ్య సరిహద్దు భారత సరిహద్దు వరకూ విస్తరించింది. క్రీ.శ. 637 నుండి 709 సంవత్సరం నడుమ అరబ్బుల సైన్యం స్పెయిన్ వరకూ చేరుకుంది. గెలుచుకున్న ప్రతి ప్రాంతంలో ప్రజలు సంపూర్ణంగా మతం మారిపోయారు.

అరబ్బులకు భారతదేశం హింద్, సింధ్‍గా పరిచయం. వ్యాపార సంబంధాలు ఉండేవి. దాంతో అరబ్బులు ఇస్లాం స్వీకరించిన తరువాత మత విస్తరణ యుద్ధాల కోసం ఒకప్పటి వ్యాపార మార్గాలు ఇప్పుడు సైనికుల బాటలుగా పనికివచ్చాయి. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలలో సాధించినంత సులువుగా భారత్‍లో విజయం లభించలేదు.

ఆ కాలంలో భారతదేశంపై అరబ్బుల దండయాత్రలకు సంబంధించిన సమాచారం అప్పటి పర్షియన్ రచయితల గ్రంథాల ద్వారా లభిస్తోంది. ముఖ్యంగా ‘అల్-బాలాధురి’గా ప్రచారానికి వచ్చిన అహ్మద్ ఇబ్న్‌యాహ్యా ఇబ్న్ జబిర్ అల్ బాలాధురి రచన ‘కితాబ్ ఫతాహ్ అల్-బల్దాన్’ ఆ కాలంలో ఇతరదేశాలపై అరబ్బు సేనల విజయ గాథలను తెలిపే గ్రంథం. ఈ రచన ఆధారంగా ఆనాటి కాలంలో ఇస్లాం ప్రపంచంలో విస్తరించిన తీరు తెలుస్తోంది. ఇంకా ‘అల్-తబారి’, ‘ఖుల్సాత్-ఉల్-అక్బర్’, ‘చాచ్‌ నామా’, ‘తారీఖ్ సింధ్’ (మీర్ మహమ్మద్ మాసూమ్), తహ్ధమ్ – కిరామ్ (అలి షేర్ వానీ) వంటి రచనల ద్వారా సింధు ప్రాంతంపై అరబ్బులు విజయం సాధించిన విధానం తెలుస్తుంది.

ఖలీఫా ఉమర్ క్రీ.శ. 636-37 లోనే థానా కొల్లగొట్టేందుకు సైన్యాన్ని పంపాడు. అది రెండవ పులకేశి పాలన కాలం. తరువాత గుజరాత్‍లోని భారోచ్, సింధు లోని దేబల్ ‌ల పైకి సైన్యాన్ని పంపాడు. కానీ ఈ దాడులను అక్కడి రాజులు తిప్పి కొట్టారు. సేనానాయకుడు ముఘైరా యుద్ధంలో ఓడిపోవటమే కాదు, ప్రాణాలు కూడా కోల్పోయాడు. దాంతో సింధు రాజ్యంలోని మక్రాన్‍ పైకి సైన్యాన్ని పంపాలని ఖలీఫా ఉమర్ ఆలోచించాడు. కానీ అతడీ ఆలోచన నుంచి విరమించేట్టు ఇరాకీ అధికారి చేశాడు. తరువాత ఖలీఫా అయిన ఉస్మాన్ కూడా సింధు వైపు దాడి చేయాలనే ఆలోచన చేయలేదు. నాలుగవ ఖలీఫా అలీ క్రీ.శ. 660లో సింధుపైకి సైన్యాన్ని పంపాడు కానీ ‘కికానాన్’ పర్వతాలలో ఆ సైన్యం కలిసిపోయింది. కానీ ఈ సైన్యాల రాక, యుద్ధాలు, గెలుపు ఓటముల నడుమ ఇస్లాం భారతదేశంలో ప్రవేశించింది. ఫరిష్త రచన ‘తారిఖ్-ఇ-ఫరిష్త’ ప్రకారం క్రీ.శ. 664 నాటికే ‘కాబుల్’ ప్రాతంలో దాదాపుగా వెయ్యిమంది ఇస్లాం స్వీకరించిన వారున్నారు.

అప్పటి భారత సరిహద్దు రాజ్యాలు కాబుల్, జాబుల్, సింధులు ఇస్లాం సేనల తాకిడిని భరిచాయి. త్రిప్పి కొట్టాయి. ‘చాచ్‍ నామా’ ప్రకారం అప్పటి సింధు రాజ్యం తూర్పు సరిహద్దు కశ్మీరు. కశ్మీరు రాజులకు సింధు రాజ్యంతో ఘర్షణలు జరుగుతూండేవి.

ఒకవైపు భారతదేశంలో రాజ్యాల నడుమ ఘర్షణలు జరుగుతుండగా, మరోవైపు ఇస్లాం సేనలు దేశంపై దాడులు జరుపుతుండేవి. ఈ దాడులలో ఇస్లాం సేనలు గెలిచిన ప్రాంతంలో ఇస్లాం మతం విస్తరించేది. గుళ్ళు కూలగొట్టటం, మసీదులు నిర్మించటం పెద్ద ఎత్తున సాగేది. పురుషులను హతమార్చటం, మహిళలను పిల్లలను బానిసలుగా చేసుకుని, బానిసల బజారులో అమ్మేయటం వంటివి జరిగేవి. ఓడిపోతే ఇస్లామీయుల బారిన పడి అవమానాలు భరించటం, బానిసలవటం, మతం మారటం వటివి అనుభవించేకన్నా అగ్నిలో దూకి శత్రువునుంచి తప్పించుకునే సంప్రదాయం ఇప్పుడే ప్రారంభమయింది. కానీ అరబ్బు సేనలు ఓడిపోయినా, వెనక్కు మళ్ళినా, మళ్ళీ ప్రజలు ఇస్లాం వదిలి పాత మతం స్వీకరించేవారు. దాంతో ఇస్లాం ‘ముల్తాన్’ వంటి నగరాలకే పరిమితమైంది. ఈ పరిస్థితి క్రీ.శ. 1000 వరకూ కొనసాగింది. ‘ఉత్బి’ రాసిన ‘కితాబ్-ఇ-యామిని’లో గజనీ గెలుచుకున్న ప్రాంతంలో మతమార్పిళ్ళు, ఇస్లాం విస్తరించిన విధానం గురించిన వివరాలు విపులంగా వర్ణించాడు. గజనీ కశ్మీరుపై కూడా దాడి చేశాడు. కానీ కశ్మీరు వాతావరణాన్ని తట్టుకోలేక వెనుతిరిగాడు. అంతలోనే, అనేకులకు ఇస్లాం మతం ఇప్పించాడు. ఈ రకంగా భారత దేశంలోకి ఇస్లాం ఒక ‘యుద్ధ శక్తి’గా ‘invading force’గా ప్రవేశించింది. కానీ కశ్మీరులో ఇస్లాం ప్రవేశం ఇందుకు భిన్నంగా జరిగింది.

కశ్మీరులోకి ఇస్లాం ప్రవేశాన్ని గురించి మనకు రాజతరంగిణి ద్వారా తెలుస్తుంది. పలు పర్షియన్ రచనల్లోనూ కశ్మీరు ప్రస్తావన ఉంది. ఫిదా మహమ్మద్ ఖాన్ హుస్సేన్ రాసిన ‘షాహ్ హమ్‍దన్ ఆఫ్ కశ్మీర్’ ప్రకారం కశ్మీరు రాజు ‘వీణాదిత్య’కు ఇస్లాం ప్రవక్త గురించి తెలిసి ఆయనను కలిసేందుకు దూతలను పంపాడు. వీరు ‘బహ్రెయిన్’ ద్వారా ప్రయాణించి ప్రవక్తను కలిశారు. ఇది ‘అన్వర్-ఇ-కశ్మీర్’ అనే పర్షియన్ రచనలో ఉంది. ఇస్లాం కాలమానం ప్రకారం 8 AH సంవత్సరంలో ప్రవక్త ‘హజీఫు యమని’ అనే అతడి ద్వారా చైనా చక్రవర్తికి సందేశం పంపాడు. కానీ ఆయన దారిలో కశ్మీరులో చిక్కుబడిపోయాడు. అతడిని వీణాదిత్యుడు గౌరవించి, కశ్మీరులో ఆశ్రయం ఇచ్చాడు. ఈ రకంగా కశ్మీరులో ఇస్లాం ప్రవేశించిదంటాడు మహమ్మద్ ఖాన్ హుస్సేన్. కశ్మీరులో దుర్లభవర్ధనుడు రాజ్యం చేసే కాలంలో ఖలీఫా ఉస్మాన్ 21 AH సంవత్సరంలో అయిదుగురు మత ప్రచారకులను కశ్మీరు పంపాడనీ ఆయన రాశారు. అయితే రాజతరంగిణితో సహా ఏ గ్రంథంలోనూ ఈ వీణాదిత్యుని ప్రసక్తి లేదు. కశ్మీరును వీణాదిత్యుడనే రాజు పాలించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు.

అలాఫి బిన్ హమీద్ అల్ కుఫి రాసిన ‘చాచ్ నామా’ ప్రకారం సింధును పాలించిన చివరి భారతీయ రాజు దాహిర్ సేన్. మహమ్మద్ బిన్ సేనలను వీరోచితంగా ఎదుర్కొని వీరమరణం పొందాడు దాహిర్. ఆ కాలంలో రాజుల సైన్యంలో పలు అరబ్బు వీరులు ఉండేవారు. దాహిర్ మరణంతో వీరంతా చెల్లా చెదురయ్యారు. అలా దాహిర్ పరాజయం (క్రీ.శ.712) తరువాత ఒక అరబ్బు సైనికుడు ‘మహమ్మద్ అలాఫ్’ అనే అతడు కశ్మీరు వచ్చి చేరాడు. కశ్మీరు రాజు ‘చంద్రపీడుడి’ శరణు వేడాడు. చంద్రపీడుడు అతనికి ఆశ్రయం ఇచ్చాడు. ‘శకల్బార్’ అనే ప్రాంతాన్ని అతడికి ఇచ్చాడు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు. అతడికి మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. ‘అలాఫ్’ మరణం తరువాత ఆస్తి ‘జాహమ్’ అనే అతనికి సంక్రమించింది. అతడు ఇస్లాం మత ప్రచారం చేశాడు. పలు మసీదులను నిర్మించాడు.

ఎన్.ఎ. బలోచ్ రాసిన ‘హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ సెంట్రల్ ఆసియా (IV)’ లో ముల్తాన్ పై అల్-బరుని మహమ్మద్ బిన్ అల్-ఖాసిమ్ బిన్ మున్నాబి దాడి చేసినప్పుడు ‘జాహమ్ బిన్ సమా అల్ – షానీ’ ముల్తాన్ వదిలి కశ్మీరు పారిపోయాడు. ‘క్రీ.శ. 714 కల్లా అతడు కశ్మీరులో స్థిరపడ్డాడు. సుఖంగా ఉన్నాడు. అతడి వారసులు కూడా కశ్మీరులో సుఖ సంపదలతో జీవిస్తున్నార’ని రాశాడు. ఆ కాలంలో గిల్జిత్ ద్వారా వ్యాపారులు కశ్మీరు చేరేవారు. అలా అనేకులు కశ్మీరు చేరారు. అక్కడి రాజులు ఆదరించి, ఆహ్వానించటంతో కశ్మీరులో స్థిరపడ్డారని అంటాడు.

క్రీ.శ. 1021లో గజనీ కశ్మీరులో రాజౌరీ వరకూ చేరుకున్నాడు. కానీ విపరీతంగా మంచు కురియటం, భరించలేని చలి వంటి ప్రతికూల వాతావరణాన్ని భరించలేక రాజౌరీ నుండి వెనుతిరిగాడు. కానీ అప్పటి నుంచీ కశ్మీరులో ఇస్లామీయుల ప్రాబల్యం ఎక్కవయింది. ముఖ్యంగా కశ్మీరుపై క్రీ.శ. 1089 నుండి 1111 వరకు రాజ్యం చేసిన ‘హర్షుడు’ తురుష్కుల ప్రాబల్యానికి ఎంతగా లోనయ్యాడంటే కల్హణుడు అతడిని ‘తురుష్క హర్షుడ’ని వ్యంగ్యంగా ఎత్తిపొడిచాడు.

మరో కథనం ప్రకారం క్రీ.శ. 711లో రాజా దాహిర్ ఓటమి తరువాత అతడి కొడుకు ‘జైసియా’, ముస్లిం సేనాపతి హమీమ్ ఇబ్న్ సమాతో కలిసి కశ్మీరులో ఆశ్రయం కోరాడు. ఆ కాలంలో కశ్మీరు సామ్రాజ్యం విశాలమయింది. కాబుల్, గాంధారాలపై కశ్మీరు రాజు ఆధిపత్యం ఉండేది, ఇస్లామీయులు ఈ ప్రాంతాలను గెలుచుకునేంతవరకూ. ఆ కారణంగా ఇస్లామీయుడైన హమీమ్ ఇబ్న్ సమాను రాజు ఆదరించి ఉంటాడు. ‘జైసియా’ ఏమయ్యాడో తెలియదు కానీ, కశ్మీరు రాజు ‘హమీమ్ ఇబ్న్ సమా’కు కశ్మీరులో స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో ఆయన కశ్మీరులో తొలి ‘మసీదు’ను నిర్మించాడు.

‘హమీమ్’ కశ్మీరులో స్థిరపడిన ఒక శతాబ్దం తరువాత కశ్మీరు రాజుకు ఇస్లాం గురించి తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. అతను మన్సూరుకి చెందిన అబ్ద్ అల్లాహ్ ఇబ్న్ ఉమర్ ఇబ్న్ అబ్ద్ అల్-అజీజ్‌ను, ఇస్లాం నీతి శాస్త్రాలు, చట్టాలపై సంపూర్ణ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కశ్మీరు పంపమని కోరాడు. 9వ శతాబ్దానికి చెందిన పర్షియన్ పర్యాటకుడు ‘బుజుర్గ్ ఇబ్న్ షహ్రయార్’ తన ‘ది వండర్స్ ఆఫ్ ఇండియా’ అనే పర్యాటక పుస్తకంలో కశ్మీరుకు చెందిన హిందూ రాజు పవిత్ర ఖురాన్‍ను కశ్మీరీ భాషలోకి అనువదింపజేసాడని రాశాడు.

క్రీ.శ. 1260లో మార్కోపోలో కశ్మీరులో పర్యటించాడు. ఆ కాలంలో కశ్మీర రాజు నిస్సహాయుడనీ, అతని రాజ్యంలో కీలక స్థానాలలో ఉన్న ‘టర్క్’ (తుర్క్)లు రాజుని ఏడిపిస్తూ, ఆటలాడుకుంటున్నారనీ రాశాడు. అయితే అప్పటికి కశ్మీరంలో ఇస్లామీయుల సంఖ్య ఎక్కువగా లేదు. కశ్మీరును మార్కోపోలో ‘very original source from which Idolatry has spread abroad’ అని వ్యాఖ్యానించాడు. అప్పటికి కశ్మీరులో ప్రజలు మాంసం తినాలంటే జంతువులను చంపేందుకు సారాసెన్ల (Saracens)ను పిలిచేవారని రాశాడు. సారాసెన్ అన్నది యూరోపియన్ క్రిస్టియన్లు ఇస్లామీయులను సూచించే పదం.

ఇటీవలే క్రీ.శ. 1237కు చెందిన ఓ పత్రం దొరికింది. ఆ పత్రాన్ని రాసింది ఫతాహుల్లా కశ్మీరీ. షేక్ హమ్జా మఖ్దూమ్ అనే ఆయన ఖ్వాజా మిరామ్ బజాజ్‍కు బహుమతి ఇచ్చినట్టు రాసి ఉంది. దానిపై సాక్షులుగా 35 ఉలేమాల సంతకాలున్నాయి.

అయితే కశ్మీరులో ఇస్లామీయులు క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దంలో అడుగుపెట్టినట్టు ఆధారాలు లభిస్తున్నా, క్రీ.శ. 13వ శతాబ్దం వరకూ కశ్మీరులో ఇస్లామీయుల సంఖ్య గణనీయంగా పెరగలేదు. రాజులు ఇస్లామీయులను ఆదరించారు, ఆశ్రయమిచ్చారు. వారికి భూములు ఇచ్చారు. మత స్వేచ్ఛను ఇచ్చారు. తమ ఆస్థానాలలో ఉన్నత పదవులు ఇచ్చారు. ఇస్లామీయులు కశ్మీరులో మసీదులు నిర్మించారు. భూములు దానాలు ఇచ్చారు. అయినా సరే, కశ్మీరులో ఇస్లామీయుల సంఖ్య అంతగా పెరగలేదు. కశ్మీరులోనే కాదు భారతదేశంలోని ఇతర ప్రాంతాల చరిత్ర గమనిస్తే కూడా ఆరంభంలో బలవంతాన మతం మారిన వారు కూడా ఇస్లామీ సేనలు వెళ్ళిపోగానే పాత ధర్మానికి తిరిగి మారిపోయారు. గజనీ దండయాత్రల తరువాత, ఇస్లామీయులు రాజ్యాధికారాన్ని స్వీకరించి భారతదేశంలో స్థిరపడటం ప్రారంభించిన తరువాతనే ఇస్లామీయుల సంఖ్య గణనీయంగా పెరగటం సంభవించింది. బలవంతంగా మతమార్పిళ్ళు, బానిసలు కావటం, దౌర్జన్యాల నుండి తప్పించుకునేందు జౌహార్లు ఆరంభమయ్యాయి. ప్రజలు ప్రాణలు అరచేత పట్టుకుని దేశంలో ఇంకా ఇస్లాం నీడలు విస్తరించని సురక్షిత ప్రాంతాలకు పారిపోవటం జరిగింది. ‘తారిఖ్-ఇ-ఫకృద్దీన్ ముబారక్ షాహ్’ ప్రకారం మహమ్మద్ ఘోరీ, ఖుత్‍బుద్దీన్ ఇబన్‍లు హింద్‍పై దాడులు చేసిన తరువాత ‘తుర్క్’లలో అతి పేదవారి ఇళ్ళల్లో కూడా బానిసలు ఉండేవారని రాశాడు. ఈ దుర్దశను తప్పించుకునేందుకు మతం మారేవారి సంఖ్య పెరిగింది. అంటే దేశంలోని ఇతర ప్రాంతాల వారు ఇస్లాం సేనల కరకుకత్తుల అమానుషత్వాన్ని అనుభవిస్తే, ఇందుకు భిన్నంగా కశ్మీరు ఇస్లామీయుల దౌర్జన్యాన్ని అనుభవించలేదు. కశ్మీరులో ఇస్లాం ప్రవేశం గురించి రాజతరంగిణి ఏమంటుందో తెలుసుకునేముందు సమకాలీన సమాజంలో స్థిరపడి చలామణీలోవున్న ఒక అనృతం గురించి ప్రస్తావించుకోవాల్సివుంటుంది..

(ఇంకా ఉంది)

Exit mobile version