Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కశ్మీర రాజతరంగిణి-16

కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా నీలమతపురాణం తరువాత అందిస్తున్న జోనరాజు, శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టులు కల్హణుడి అడుగుజాడల్లో నడుస్తూ సంస్కృతంలో రచించిన ‘కశ్మీర రాజతరంగిణి’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.

జోనరాజు, జైనులాబిదీన్ సుల్తాన్‍ను యవనుడనీ, మహమ్మద్ ఘోరీని మ్లేచ్ఛుడని వ్యాఖ్యానించటం వెనుక కారణం, కశ్మీరుకు ఇస్లామీయులు దాడి చేసే శక్తిలా రాకపోవటం ఒక్కటే కాదు, భారతదేశంపై దాడికి వచ్చిన ఇస్లామీయుల తొలి యుద్ధ తరంగం అరబ్బు సేనలు. అంటే కశ్మీరులో స్థిరపడిన తొలి ఇస్లామీయులు అరబ్బులు. భారతదేశంపై దాడికి వచ్చిన రెండవ తరంగం తుర్కీ(Turkey)యులు. మహమ్మద్ ఘోరీ తురుష్కుడు. అందుకని మహమ్మద్ ఘోరీని మ్లేచ్ఛుడని జోనరాజు వ్యాఖ్యానించాడు. అలా వ్యాఖ్యానించినా సుల్తాన్ జైనులాబిదీన్‍కు ఆగ్రహం రాలేదు.

జోనరాజు కొనసాగించిన రాజతరంగిణిలో కశ్మీరుపై మంగోలుల దాడిని వర్ణించాల్సిన సందర్భం వస్తుంది.

మిత్‌లోకా ఖిళక్షేత్రా నిర్భోజ్యా దర్భనిర్భరా
సర్గారంభా ఇవ ప్రాయాస్ కదా కశ్మీరాభూత్ అభూత్

కల్హణుడి రాజతరంగిణి లోహార వంశం పతనమవటంతో ఆగిపోతుంది. తరువాత కశ్మీరుపై మంగోలుల దాడి జరుగుతుంది. మంగోలులను ఎదుర్కునేందుకు కశ్మీరంలో సరైన రాజు లేకపోవటంతో మంగోలులు కశ్మీరును అల్లకల్లోలం చేశారు. వారికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని గుట్టలు, పుట్టల్లోకి పారిపోయారు. ఇల్లు వాకిళ్ళు వదిలి కట్టుబట్టలతో ప్రాణాలు కాపాడుకునేందుకు వారు నానా తంటాలు పడ్డారు. మంగోలు సేనలు దయాదాక్షిణ్యాలు లేనివి. కనబడ్డ వారిని కనబడ్డట్టు నరికారు. స్త్రీలను చెరిచారు. బందీలుగా తీసుకున్నారు. పంటలను కాల్చారు. ఇళ్ళను బూడిద చేశారు. ఆ కాలం నాటి కశ్మీరును వర్ణిస్తూ జోనరాజు – ప్రజలు భయభ్రాంతులయ్యారు. పంటలు బీడులయ్యాయి. ఆ సమయంలో కశ్మీరు సృష్ట్యారంభంలో భూమి ఎలాంటి స్థితిలో ఉండేదో అలాంటి స్థితిలో ఉంది – అని వర్ణిస్తాడు. తురుష్కులు భారతదేశ ప్రజలతో మంగోలులకన్నా ఘోరంగా వ్యవహరించారు. అందుకని, మంగోలులను, తురుష్కులను జోనరాజు మ్లేఛ్చులని అన్నాడు. ఈరకంగా మ్లేఛ్చులకు, యవనులకు తేడాను స్పష్టంగా చూపించాదు జోనరాజు.

కల్హణుడు కశ్మీరంలోకి ఇస్లామీయులు రావటం చూశాడు. వారి వల్ల సమాజంలో వస్తున్న మార్పులను చూశాడు. వారి ప్రభావంతో రాజులు తప్పుదారి పట్టి, దుష్కర్మలు చేయటం చూశాడు. బాధపడ్డాడు. విమర్శించాడు. అధికారం కోసం కాట్లకుక్కల్లా పోరాడుకుంటున్న వారిని చూసి కశ్మీరు భవిష్యత్తు గురించి భయపడ్దాడు. కల్హణుడి మరణం తరువాత కాలంలో కశ్మీరు అల్లకల్లోలం అయింది. భారతీయ రాజుల పాలన అంతరించింది. సుల్తానుల పాలన ఆరంభమయింది. ఈ మార్పులను జోనరాజు చూడటమే కాదు, అనుభవించాడు కూడా. అందుకని మంగోలుల దాడితో కశ్మీరంలో నూతన సృష్టి ఆరంభమయిందన్న భావనను కలిగిస్తూ రచనను కొనసాగించాడు. కశ్మీరంలో మంగోలులు జరిపిన అకృత్యాల కన్నా ఘోరమైన అకృత్యాలను భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో తురుష్క సేనలు జరిపాయి. అంటే, కశ్మీరులోనే కాదు, భారతదేశంలోను కొత్త ‘యుగం’ ప్రారంభమవుతోందన్న మాట. భారతదేశంలో తురుష్క యుగం ఆరంభమయినా  కశ్మీరంలో యవనుల కాలం నడుస్తోందన్న ఆలోచననిస్తూ జోనరాజు కశ్మీరు లోని ఇస్లామీయులకూ, దేశంలోని ఇతర ఇస్లామీయులకు నడుమ సున్నితమైన విభజన రేఖ గీస్తున్నాడు. నిజానికి జైనులాబిదీన్ తండ్రి ‘సికందర్ బుత్‌షికన్’ కశ్మీరులో జరిపిన రాక్షస క్రీడను కూడా జోనరాజు అత్యంత విపులంగా వర్ణించాడు. దానికి ‘సికందర్ బుత్‌షికన్’ను కాక, కొత్తగా ఇస్లాం మతం పుచ్చుకున్న మంత్రిని బాధ్యుడిని చేశాడు జోనరాజు. దాంతో కశ్మీరులో జైనులాబిదీన్ తండ్రి జరిపిన అకృత్యాల రక్తం జైనులాబిదీన్‍కు కానీ, అతడి తండ్రికి కాని అంటకుండా జాగ్రత్త పడ్డాడన్న మాట  జోనరాజు. జోనరాజు వర్ణించిన అకృత్యాలు, కశ్మీరులో భారతీయుల దైన్యం గురించి చదువుతుంటే రక్తం మరుగుతుంది. హృదయం ద్రవిస్తుంది. ఎన్నెన్ని కష్టాల కోర్చి మన పూర్వీకులు ధర్మాన్ని కాపాడి మనకు సజీవంగా అందించారోనన్న ఆలోచన కుదిపేస్తుంది. అయితే చరిత్రకారులు మాత్రం ఈ విషయాన్ని తప్పుదారి పట్టించి, ఆధునిక సమాజానికి అసత్యాన్ని, అపోహలను, దురూహలను, విచ్ఛిన్నకరమైన ఆలోచనలను చరిత్రగా అందించారని రాజతరంగిణి లాంటి రచనలను, వాటిపై ఆధునిక చరిత్ర పండితుల వ్యాఖ్యానాలను, విశ్లేషణలను పోలిస్తే స్పష్టమవుతుంది.

మహమ్మద్ ఇషాక్ ఖాన్ రాసిన ‘కశ్మీర్స్ ట్రాన్సిషన్ టు ఇస్లామ్’ అనే పుస్తకంలో కశ్మీరులో భారతీయులు ఇస్లాం మతం స్వీకరించటమంతా బ్రాహ్మణుల దోషం అన్నట్టు రాస్తాడు. అంతేకాదు, ‘సికందర్ బుత్‌షికన్’ పాలనా కాలంలో జోనరాజు వర్ణించిన అత్యాచారాలు, క్రూరకృత్యాలు బ్రాహ్మణులపై జరగటానికి బ్రాహ్మణులే కారణం అని రాస్తాడు. వారు గతంలో కులం ఆధారంగా సమాజంలో అణచివేతలు నెరపి, ఘోర కృత్యాలు జరిపారు కాబట్టి సుల్తాన్ వారిని ఘోరంగా హింసించటం, చంపటం, మతం మార్చటం సమంజసమే, ఒక రకంగా వారికి ఆ శిక్ష తగినదే అన్నట్టు వ్యాఖ్యానిస్తాడు (పేజి నెం. 80 – 85). పలువురు చరిత్రకారులు, వ్యాఖ్యాతలు ఈ విషయన్ని నొక్కి చెప్పటం, పదే పదే ప్రస్తావించటం కనిపిస్తుంది. కానీ ఆ కాలంలో అరబ్బులు, పర్షియన్లు, భారతీయులు రచించిన గ్రంథాలు చదివితే ఎక్కడా మతం మారటంలో ‘కులం’ ప్రాధాన్యం వహించినట్టు కనిపించదు. ఫెరిష్తా తన రచనలో సికందర్ బుత్‌షికన్ ప్రజలను బలవంతాన మతం మార్చినట్టు స్పష్టంగా రాశాడు. అబ్దుల్ హక్ దెహల్వి 16వ శతాబ్దంలో రాసిన అఖ్బర్ ఉల్ అఖియర్ లో నసీరుద్దిన్ చిరాగ్-ఇ-దెల్‌హి ఖలిఫా సయ్యద్ ముహమ్మద్ బిన్ నసీరుద్దిన్ జఫర్ మక్కి అల్-హుసైని ప్రకారం భారతీయులు ఇస్లాం స్వీకరించటానికి అయిదు కారణాలున్నాయి. అవి : మరణ భయం, కుటుంబ సభ్యులను బానిసలుగా చేస్తారన్న భయం, ఇస్లాం మత ప్రచారం,మవాజిబ్ ( ధనాశ, బహుమతుల ఆశ) ఘనిం( దోపిడీ ధనం ఆశ), తస్సుం( మూర్ఖత్వం, అంధవిశ్వాసం…ఈ అయిదు కారణాలలో ఎక్కడా సాంఘిక అసమానతలు, అగ్రవర్ణాల అత్యాచారాల ప్రసక్తి లేదు. ఆ కాలంలో ఇస్లాం విస్తరణ గురిచి రాసిన అల్బెరూని, అబుల్ ఫజల్, ఫెరిష్తా తో సహా ఇతర అరబ్బు, పెర్షియన్ రచయితలెవరూ భారత సమాజంలోని అసమానతలను ఇస్లాం విస్తరణకు కారణంగా ప్రస్తావించనుకూడా లేదు. కానీ, చరిత్రకారులు, సామాజిక తత్వవేత్తలు, సమాజోద్ధారకులు అగ్రవర్ణాల దౌష్ట్యంవల్లనే భారతీయ సమాజంలో అధికులు భారతీయ ధర్మాన్ని తిరస్కరించి అన్యమతాలు స్వీకరించారని చెవినిల్లుకట్టుకుని పోరతారు. సమస్త భారతీయ సమాజన్ని నేర భావనకు గురిచేసి నీచంగా చూపాలని తపనపడతారు. స్టడీస్ ఇన్ ఇస్లామిక్ కల్చర్ ఇన్ థె ఇండియన్ ఎన్విరాన్మెంట్ అన్న పుస్తకంలో అజీజ్ అహ్మద్,” for the lower Hindu castes acceptance of Islam meant an escape from the degraded status they had in the Hindu society” అని తీర్మానించాడు. ప్రీచింగ్ ఆఫ్ ఇస్లాం అనే పుస్తకంలో టీ డబ్ల్యూ ఆర్నాల్డ్, ఇస్లాం ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనే పుస్తకంలో మర్రే టైటస్ లు మధ్యయుగంలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఇస్లాం స్వీకరించటానికి ప్రధాన కారణం ” the democratic social system of Islam” అని నిర్ధారిస్తారు. అంటే పరాయివారుకూడా ప్రదర్సించని దౌష్ట్యాన్ని మనవారే ప్రదర్శిస్తున్నారు. అదే సత్యమని సమాజాన్ని నమ్మిస్తున్నారు.

సింధు రాజ్య చరిత్ర అయిన ‘చాచ్‌నామా’ను పరిశీలిస్తే, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కళ్ళముందు నిలబడతాయి. పలువురు వ్యాఖ్యాతలు, చరిత్రకారులు భారతదేశం నుంచి బౌద్ధం అదృశ్యమవటానికి హిందూ ధర్మం జరిపిన అణిచివేతను ప్రధాన కారణంగా చూపి వంకర భాష్యం చెప్తారు. కానీ ‘చాచ్‌నామా’ ప్రకారం క్రీ. శ. ఏడు, ఎనిమిది శతాబ్దుల వరకూ అఖండ భారతంలో బౌద్ధులు రాజులుగా ఉన్నారు. ఉన్నతమైన పదవులలో ఉన్నారు. కీలకమైన స్థానాలలో ఉన్నారు. రాజ్య నిర్ణయాలను ప్రభావితం చేశారు. ‘చాచ్‌నామా’లో శ్రమణులు, బౌద్ధ ఆరామాలు, మందిరాల ప్రసక్తి వస్తుంది. అవి ఎంతగా ఆదరణ పొందుతున్నాయో, ఎంతటి ఉచ్చస్థితిలో ఉన్నాయో తెలుస్తుంది. అంతేకాదు బౌద్ధులు, బ్రాహ్మణులు అత్యంత మైత్రితో, స్నేహ సహకార భావనలతో జీవనం సాగించేవారని తెలుస్తుంది. బౌద్ధుల గ్రంథాల ప్రకారం కూడా ఆనాటి భారతీయ ధర్మానుయాయులకు, బౌద్ధులకు నడుమ ఘర్షణలు ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా బౌద్ధ రాజులు సంస్కృత సాహిత్యాన్ని ఆదరించారని, భారతీయ ధర్మాన్ని ప్రోత్సహించారని తెలుస్తుంది. బాణుడి హర్షచరిత్ర, ‘చాచ్‌నామా’ కూడా ఘర్షణ లేని సామరస్య భావనతో మెలిగే భారతీయ సమాజాన్ని చూపిస్తాయి. ‘చాచ్‌నామా’ను అనువదించిన మిర్జా కాలిచ్ బేగ్, ఫ్రెడెన్ బెర్గ్, తమ అనువాదానికి ముందుమాటలో “We have thus Brahman, Buddhist, Greek and Arab testimony as to the amicable relations subsisting between the followers of the two religions, up to the 7th century: as the testimony of the Arab, now given to the English – knowing world, for the first time, is, to my mind, of the greatest value” అని రాశాడు. కానీ ఈనాటికి కూడా మన చరిత్రకారులు, సామాజిక విశ్లేషకులు హిందూ ధర్మం, బౌద్ధం నడుమ ఘర్షణల గురించి వ్యాఖ్యానిస్తారు. ముఖ్యంగా బ్రాహ్మణులే అన్నిటికీ దోషులన్నట్టు వ్యాఖ్యానిస్తారు. భారతదేశం నుంచి బౌద్ధాన్ని హిందూ ధర్మం తరిమివేసిందని దూషిస్తూ, ప్రజల నడుమ విద్వేషాలు వెదజల్లుతారు. ‘చాచ్‌నామా’ చదివితే, ఆ కాలం సమాజంలో బౌద్ధం ఎంత ప్రాధాన్యం వహించిందో తెలియడమే కాదు, బౌద్ధ మత గురువులు ఎలాంటి కీలకమైన పాత్రను రాజ్య వ్యవహారాలలో నిర్వహించేవారో తెలుస్తుంది. రాజు ‘చాచ్‌’ బ్రాహ్మణాబాద్‍పై దాడి చేసినప్పుడు అక్కడి రాజుకు శ్రమణుడు ‘పోరాడమ’ని సలహా ఇస్తాడు. జ్యోతిషం ఆధారంగా రాజ్యం ‘చాచ్‌’ వశం అవుతుందని గ్రహించినా, పోరాటాన్ని కొనసాగిస్తాడు. చివరికి యుద్ధం గెలుచుకున్న ‘చాచ్‌’, ఆ శ్రమణుడితో మాట్లాడిన తరువాత అతడిని చంపేయాలని నిశ్చయించుకుంటాడు. ఆ శ్రమణుడి గురించి అడుగుతాడు.

“He was informed that he was a monk and lived with other monks. ‘He is’, it was said ‘one of the philosophers of the Hind and is the keeper of Nawwihar temple'” అని తెలుసుకుంటాడు చాచ్. సైన్యంతో వెళ్ళి ఆ శ్రమణుడిని కలిసి తన ప్రతినిధితో రాజ్య నిర్వహణలో సహకరించమని అడుగుతాడు. అప్పుడా శ్రమణుడు “the service of Budh and the seeking of salvation in the next world are better than all worldly employments. As, however, you are the sovereign of the Kingdom, I will at your supreme command shift to the vicinity of the fort, although, I fear that people dwelling in the fort would cause injury and mischief to the sown fields of Budh” అంటాడు.

అతని ధైర్యం చూడండి. ఆత్మవిశ్వాసం చూడండి. అతడు ‘చాచ్‌’కు వ్యతిరేకంగా పోరాడే రాజుకు సహాయం చేశాడు. రాజ్యాన్ని గెలిచిన రాజుది తన ధర్మం కాదు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, రాజ్యాన్ని గెలిచిన రాజు తమకు వ్యతిరేకంగా పనిచేసిన శ్రమణుడిని శత్రువుగా పరిగణించలేదు. అతడితో స్నేహం వాంఛించాడు. రాజ్య నిర్వహణలో సహాయం చేయమని అభ్యర్థించాడు. ఇది చరిత్ర మనకు చెప్తున్న భారతదేశం. ఈ చరిత్ర రాసింది కుటిల బ్రాహ్మణులు కాదు. ‘చాచ్‌నామా’ రాసింది పర్షియన్ భాషలో ఎవరో సరిగ్గా తెలియదు. కానీ ‘అలి హమీద్ అబీ బకర్ కుఫీ’ అనే ఆయన ‘చాచ్‌నామా’ను రాశాడని అనుకుంటున్నారు. మహమ్మద్ ఖాసిమ్ సింధును గెలుచుకున్న తరువాత ‘ఆలోర్’లో షరియా కోర్టు జడ్జి (ఖాజి)గా నియమించిన ఇస్మాయిల్ ఉథ్మాన్ అల్ థాన్‌ఫి వస్తువులలో తనకీ పుస్తకం దొరికిందనీ, దాన్ని తాను అరబిక్ భాషలోకి అనువదిస్తున్నాని ‘అలి హమీద్ అబీ బకర్ కుఫీ’ రాసుకున్నాడు. కొందరు ఆంగ్ల చరిత్రకారులు, చాచ్‌నామాలో భారతీయుల గొప్పతనాన్ని చెప్పే గాథలన్నీ స్థానిక బ్రాహ్మణులు రాశారన్న అభిప్రాయాన్నీ వ్యక్తపరుస్తున్నారు (ఆధారాలు లేని అభిప్రాయమే అయినా, భారతదేశ చరిత్ర రాసేటప్పుడు ఏదయినా భారతదేశం గొప్ప చెప్పేది అయితే అది కుటిల బ్రాహ్మణులు చొప్పించినది అయివుండాలి. ఏదయినా చెడు జరిగితే దానికి కారణం బ్రాహ్మణుడే అయివుండాలి, బ్రాహ్మణుడినే దోషిని చేయాలి అన్నది అప్రకటిత నియమం).

బౌద్ధ శ్రమణుడి సమాధానం విజేత అయిన ‘చాచ్’కు ఆగ్రహం కలిగించలేదు. ‘The worship of Budh is an excellent thing, and it is right to hold it in honour’ అని అతడికేమైనా సహాయం కావాలంటే అడగమంటాడు. ‘I wish to do a deed which should have spiritual advancement and salvation as its reward’ అంటాడు. ఇలాంటి రాజులు ప్రపంచంలో కంచుకాగడా పెట్టి వెతికినా దొరకరు. ఇది భారతీయ ధర్మం. ఇది భారతీయుల లక్షణం. ఇది భారతీయ రాజుల వ్యక్తిత్వం. ఇలాంటి గాథలు మన చరిత్ర పుస్తకాలలో దొరకవు.  ఇక్కడ బౌద్ధ శ్రమణుడు తమకు వ్యతిరేకంగా కుట్రలు జరిపాడన్న ద్వేషం లేదు. కోపం లేదు. ఆ శ్రమణుడు నవవిహారాన్ని కట్టించమంటాడు. రాజు ‘సరే’నంటాడు. ఈ సంఘటనలో ఎక్కడా ‘ఘర్షణ’ లేదు. భారతీయ చరిత్రకు వంకర భాష్యం ఇచ్చి లేని కుల ప్రస్తావనలు తెచ్చి విద్వేషాల విషాగ్నులు విస్తరింపజేసేవారు ఇది గమనించాలి. ఇక్కడ మరో విషయం గమనించాలి. మన భారతీయ జీవన విధానం లోని ఔన్నత్యం, భారతీయ ధర్మంలోని ఉత్తమ లక్షణాలు మనకు మనల్ని గెలుచుకున్న శత్రువుల గ్రంథాల ద్వారా తెలియడం, వాటి ఆధారంగా వ్యాఖ్యానించే స్వదేశీ చరిత్రకారులు, వాటిలోని అసలు అంశాలను కాకుండా విద్వేషాన్ని రెచ్చగొట్టి, సమాజంలో అడ్డుగోడలు నిర్మించి ముళ్ళకంపలు పెంచేరీతితో వ్యాఖ్యానించటం ఆలోచించాల్సిన విషయం. ఇదొక్కటే సంఘటన కాదు చరిత్ర గ్రంథాలలో కొన్ని అంశాలను మాత్రమే ఉదహరించి, ప్రచారం కల్పించిన విధానం, సమాజంలో ‘విజ్ఞానం’ పేరిట అజ్ఞానాన్ని పంచటం విద్యావంతులైన భారతీయులంతా ఆలోచించి, విశ్లేషించాల్సిన విషయం.

చరిత్రలో ‘absolute truth’ అన్నది లేదు. అంతా ఊహనే. అందిన ఆధారాలను అనుసరించి ‘ఇలా జరిగి ఉండవచ్చన్న’ ఊహనే మనం నిజమైన చరిత్ర అనుకుంటున్నాం. అందుకే Albert Camus ‘the purely historical absolute is not even conceivable’ అంటాడు. కానీ భారతదేశ చరిత్ర గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ‘అంతా తమకే తెలుసు’, ‘తాము చెప్పేదే అంతిమ సత్యం’ అన్న రీతిలో వ్యాఖ్యానిస్తారు. ఈ విషయం ప్రాచీన భారతంలోని సామాజిక అసమానతల విషయానికీ వర్తిస్తుంది. ‘చాచ్‌నామా’లోని ఓ సంఘటన ఆధునిక కుల పరిణామాన్ని విశ్లేషిస్తూ విద్వేషాలను పెంచేవారందరి వాదనల్లోని అసంబద్ధాన్ని చూపిస్తుంది.

(ఇంకా ఉంది)

Exit mobile version