ప్రణామ్య విఘ్నౌఘ హరమ్ గణేశామ్ త్రిధాత్వ రూపామ్ అపి భారతీమ్ తామ్।
విరచ్యతే యవనశాస్త్ర బద్ధ కథా మయా నిర్జర భాషయేయమ్॥
(కథా కౌతుకమ్ 1.2)
శ్రీవరుడు ‘కథా కౌతుకమ్’ అన్న అనువాద కావ్యం రచించాడు. శ్రీవరుడు జైన రాజతరంగిణి క్రీ.శ. 1486 దగ్గర ఆగిపోతుంది. తరువాత ఒక ఇరవై ఏళ్ళ వరకూ శ్రీవరుడు ఏం చేశాడో తెలియదు. దాదాపుగా అదృశ్యమై పోయినట్టు కశ్మీరు చరిత్రలో శ్రీవరుడి ప్రసక్తి రాదు. మళ్ళీ 1505లో శ్రీవరుడు తెర పైకి వస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నామంటే తన ఈ అనువాద రచన ‘కథా కౌతుకమ్’ ఆరంభంలోనే తన కావ్య రచనా కాలం క్రీ.శ. 1505 ఏప్రిల్ నెల అని శ్రీవరుడు స్పష్టంగా చెప్పాడు. ఎవరికీ ఎటువంటి సందేహాలు రాకుండా కశ్మీరు కాలమానం లౌకికాబ్దం అంటూ చెప్తాడు. మహ్మదీయుల కాలమానం ప్రకారం కూడా చెప్తాడు. ఈ రెంటినీ పోల్చుకుని ఈ రచన కాలం ఏప్రిల్ నెల 1505వ సంవత్సరంగా నిర్ధారించారు. అంటే క్రీ.శ. 1486 వరకు రాజతరంగిణి రచనను కొనసాగించిన శ్రీవరుడు 1505వ సంవత్సరంలోనే తన ఉనికిని ప్రకటించాడన్న మాట. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందన్నది పర్షియన్ చరిత్రకారుల రచనలు, శ్రీవరుడి తరువాత రాజతరంగిణిని కొనసాగించిన ప్రజ్ఞాభట్టు రచన ద్వారా గ్రహించవచ్చు. నిజానికి ప్రజ్ఞాభట్టు రచించిన రాజతరంగిణి ప్రతి ఇంతవరకూ లభించలేదు. కానీ, ప్రజ్ఞాభట్టు తరువాత రాజతరంగిణి రచనను కొనసాగించిన శుకుడు, తన రచన ఆరంభించేముందు అంతవరకూ జరిగిన చరిత్రను చెప్తూ, ప్రజ్ఞాభట్టు రాజతరంగిణి సారాంశాన్ని పొందుపరిచాడు. దాని ద్వారా మనకు ప్రజ్ఞాభట్టు రాజతరంగిణిని కొనసాగించాడని తెలుస్తోంది. అయితే, ఇది సారాంశమే కావటంతో ఈ కాలంలోని చరిత్ర కోసం అధికంగా పర్షియన్ రచయితల రచనలపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే ఈ కాలంలో జరిగిన సంఘటనలు – ఒక సుల్తాను మరణించిన తరువాత అధికారం కోసం అతని వారసుల నడుమ జరిగిన అనేక పోరాటాల్లాంటి పోరాటాలే. తేడా అల్లా, ఇతర ప్రాంతాలలో, పోరాడే వారసులందరికీ ఒకే భారతీయ గురువు ఉండటం దాదాపుగా అసంభవం. కానీ కశ్మీరులో అది సాధ్యం అయింది. ఎందుకంటే జైనులాబిదీన్ కుమారులందరికీ గురువు శ్రీవరుడే. ఎవరు రాజ్యాధికారం సాధించినా, శీవరుడికి లభించే గౌరవం విషయంలో ఢోకా లేదు. స్థాయిలో తేడా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో, అంటే, వారసత్వం కోసం పోరు సాగుతున్న కాలంలో శ్రీవరుడు ఎవరి పక్షం అవలంబించకుండా తటస్థంగా ఉండాల్సి ఉంటుంది. ఏ ఒక్కని వైపు మొగ్గినా, వారు ఓడిపోతే, గెలిచిన శిష్యుడితో అవమానం భరించాల్సి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితి ఈకాలంలోనూ గమనించవచ్చు. ఒకరి చేతిలో అధికారం ఉంటుంది. కొన్నాళ్ళకి అధికారం చేతులు మారుతుంది. కొత్తగా అధికారానికి వచ్చిన వారు పాత అధికారికి విధేయులుగా ఉన్న వారందరినీ తొలగించటం, ప్రతీకారం తీర్చుకోవటం మనకు అనుభవమే. గతాన్ని అర్థం చేసుకోవాలంటే వర్తమానాన్ని పరిశీలించాలంటారు. ఎందుకంటే, గతం ప్రభావం వర్తమానంపై ఉంటుంది. వర్తమానం ద్వారా గతాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం కొత్తదయినా, దాని స్వరూపం పాతది అంటారందుకే.
సుల్తాన్ జైనులాబిదీన్ క్రీ.శ. 1470 సంవత్సరంలో మరణించాడు. అయితే, వారసత్వం కోసం పోరు సుల్తాన్ జీవితకాలంలోనే ఆరంభమయిపోయింది. సుల్తాన్ కొడుకులు ఆదమ్ ఖాన్, హాజీఖాన్‍ల నడుమ ఆరంభం నుంచీ పోరు ఉండేది. చిన్నవాడు బహ్రామ్ ఖాన్ ఇద్దరి పక్షం ఉన్నట్టుంటూ, ఇద్దరి నడుమ వైషమ్యాలను పెంచేవాడు. ఆదమ్ ఖాన్, హాజీఖాన్‍ల నడుమ వైషమ్యాలకు ప్రధాన కారణం వారు సుల్తాన్ వేరు వేరు భార్యల పిల్లలు కావటమే. దాంతో 1451లోనే వారిద్దరినీ దూరం ఉంచే ప్రయత్నాలు సుల్తాన్ ఆరంభించాడు. ఆదమ్ ఖాన్‌ను ‘బాల్తిస్తాన్’పై యుద్ధానికి పంపాడు. అతడు తిరిగి రాగానే, హాజీఖాన్‍ను ‘పూంఛ్’పై యుద్ధానికి పొమ్మన్నాడు. కానీ హాజీఖాన్ సుల్తాన్‌ను ధిక్కరించి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించాడు. సుల్తాన్, ఆదమ్ ఖాన్ ఒక వైపు, హాజీఖాన్ మరోవైపుగా పోరు జరిగింది. హాజీఖాన్ ఓడిపోయాడు. దాంతో కాబోయే సుల్తాన్ ఆదమ్ ఖాన్ అని అనుకున్నారందరూ.
ఆదమ్ ఖాన్ క్రూరుడు, నీచుడు, తాగుబోతు, తిరుగుబోతు అని సుల్తానుకు అతని ప్రవర్తన వల్ల తెలిసింది. ఆ కాలంలో ఆదమ్ ఖాన్‌ను ప్రజలు ‘ఆద్మీఖూన్’ (నరహంతకుడు) అని వెక్కిరించేవారు. అయితే ‘చాక్’లతో కలిసి ఆదమ్ ఖాన్ అందరూ తనకే దక్కుతుందనుకుంటున్న అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు తండ్రిపై దాడి చేశాడు. అంటే, వారసత్వంగా అధికారం తనకు అందేంతవరకూ ఎదురు చూడలేక పోయాడన్న మాట. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో సుల్తాన్ జైనులాబిదీన్ హాజీఖాన్‌ను దగ్గర తీశాడు. అతడి సహాయంతో ఆదమ్ ఖాన్‍ని ఓడించాడు. ఆదమ్ ఖాన్ కశ్మీరు వదిలి పారిపోయాడు. అంటే, ఎదురు చూసి ఉంటే రాజయ్యేవాడు. తొందర పడటంతో ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సి వచ్చిందన్న మాట.
ఈ పోరులు, కుట్రల నడుమ జైనులాబిదీన్ నలిగిపోయాడు. అతడికి అతి ప్రియమైన బేగమ్ ‘ముఖ్దుమా ఖాతున్’ 1465లో మరణించటంతో సుల్తాన్ జైనులాబిదీన్ పూర్తిగా దెబ్బతిన్నాడు. దీనికి తోడు హాజీ ఖాన్ తాగుబోతని తెలియటం సుల్తానును మరింతగా క్రుంగదీసింది. ఈ సమయంలో సుల్తాన్ తన వేదనను ‘షికాయత్’ (ఫిర్యాదు) అనే పుస్తకంగా పర్షియన్ భాషలో రాశాడు. అందుకే శ్రీవరుడి రాజతరంగిణి వైరాగ్య రస ప్రాధాన్యం అయింది.
సుల్తాన్ మరణం తరువాత హాజీ ఖాన్ ‘హైదర్ షాహా’ అన్న పేరుతో సుల్తాన్ అయ్యాడు. ఆదమ్ ఖాన్ తాకిడిని తట్టుకునేందుకు రాజధానిని ‘నౌషట్ట’కి (శ్రీవరుడు దీన్నే సికందర్‌పురి అన్నాడు. ప్రస్తుతం శ్రీనగర్ లోని జామా మసీదు దగ్గరి ప్రాంతం ఇది) మార్చాడు. తన సంతానం ‘హసన్ ఖాన్’ను తన తరువాత ‘సుల్తాన్’గా ప్రకటించాడు. రాజధానిని ‘హైదర్ షాహా’ రక్షణలో భాగంగా మార్చినా, ఇది రాబోయే కాలానికి ప్రతీకగా మారింది. జైనులాబిదీన్ రాజధాని ‘నౌషహర్’ శాంతికి, పరమత సహనానికి ప్రతీక అయితే, ‘హైదర్ షాహా’ రాజధాని, గతంలో ‘సికిందర్ బుత్‌షికన్’ రాజధాని, హింసకు, అసహనానికి ప్రతీక. ఈ సమయంలో జైనులాబిదీన్ ఆహ్వానంపై కశ్మీరు వచ్చి భద్రంగా జీవిస్తున్న భారతీయులు అనేకులు ఇస్లాం స్వీకరించారు బలవంతంగా. ఇస్లాం మతం స్వీకరించని వారు తమ సంప్రదాయ దుస్తులను వదిలి, ఇస్లాం వేషభాషలను స్వీకరించాల్సి వచ్చింది ప్రాణాలు కాపాడుకోవటం కోసం. రాజ్యంలో ఇస్లామేతరులపై జరుగుతున్న అత్యాచారాలను, హింసను కాబోయే సుల్తాన్ ‘హసన్ ఖాన్’ వ్యతిరేకించాడు. దాంతో సుల్తాన్ అతడిని ‘పూంఛ్’, ‘రాజౌరీ’లకు పంపేశాడు అక్కడి పరిస్థితులను చక్కబెట్టమని. ఇదే అదనుగా చూసుకుని బహ్రామ్ ఖాన్ అధికారం హస్తగతం చేసుకోవాలనుకున్నాడు. కానీ సమయానికి హసన్ ఖాన్ శ్రీనగరం చేరుకున్నాడు. బహ్రామ్ ఖాన్ పారిపోవాల్సి వచ్చింది. ఇంతలో ‘హైదర్ షాహా’ తాగిన మత్తులో భవంతిపై నుండి పడి ప్రాణాలు కోల్పోయాడు. ‘హసన్ ఖాన్’ ‘సుల్తాన్ హసన్ షాహా’ అయ్యాడు.
‘హసన్ షాహా’ జైనులాబిదీన్ పద్ధతులను కొంచమయినా పాటించిన వ్యక్తి. జైనులాబిదీన్ పద్ధతులను అనుసరించాలని ప్రయత్నించాడు. రాజధానిని ‘నౌషహర్’కు మార్చాడు. ఇస్లామేతరులకు భద్రతను, స్వేచ్ఛను ఇచ్చాడు. ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయిన బహ్రామ్ ఖాన్ సైన్యాన్ని కూడగట్టుకుని వచ్చాడు. దాంతో హసన్ షాహా సైన్యానికీ, బహ్రామ్ ఖాన్ సైన్యానికీ నడుమ ఘోరమైన పోరు జరిగింది. బహ్రామ్ ఖాన్ పరాజితుడయ్యాడు. పట్టుబడ్డాడు. హసన్ షాహా బాబాయి అయిన బహ్రామ్ ఖాన్ కళ్ళు పీకించి సజీవంగా వదిలాడు. మూడేళ్ళ తరువాత బహ్రామ్ ఖాన్ మరణించాడు. దాంతో ‘హసన్ షాహా’ సామ్రాజ్యం భద్రమయింది. కానీ కశ్మీరుకు ‘శాంతి’ మాత్రం చేకూరలేదు.
కశ్మీరు ముసల్మానులలో ‘సయ్యద్’లు ఒక విభాగం. వీరు బయటి నుంచి కశ్మీరుకు వచ్చి కశ్మీరులో స్థిరపడ్డారు. వీరికి మత ఛాందసం అధికం. వీరి రాకతో కశ్మీరంలో ముస్లింలు, ముస్లిమేతరుల నడుమ భేదాలు స్పష్టమయ్యాయి. కశ్మీరీ ముస్లిములు కూడా భారతీయుల వేషభాషలను అనుసరించటం చూసిన వీరు మండిపడ్డారు. వీరి రాకతో, దుస్తులు, వేషంతో సహా ప్రతీ విషయంలో ఇస్లామీయులు ఇతరులకు భిన్నంగా ప్రత్యేకంగా ఉండటం స్థిరపడింది. అంటే కలిసిపోతున్న రెండు భిన్న ప్రవాహాలను వేరు చేసి ప్రత్యేకంగా నిలిపిన వారీ సయ్యద్‍లన్న మాట. అంతే కాదు సమాంతరంగా అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న పర్షియన్, సంస్కృత భాషల నడుమ మతపరమైన విభేదాలు సృష్టించి పర్షియన్‍కు మాత్రమే పెద్ద పీట వేయాలని పట్టుబట్టి సుల్తానుల దగ్గర తమ మాట నెగ్గించుకున్నవారు సయ్యద్‍లు. ఆరంభంలో మత పరమైన అంశాలకే పరిమితమైన వీరు కశ్మీరులో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో రాజకీయంగా కూడా శక్తిమంతులయ్యారు. ‘సికందర్ బుత్‌షికన్’ కాలంలో మౌలానా అఫ్జల్‍ను విద్యాసంస్థలకు అధిపతిగా చేయటంతో (తారీఖ్-ఇ-కబీర్) వీరు బలపడటం ప్రారంభమైంది.
ఏ సమాజానికైనా విద్యావ్యవస్థ అత్యంత కీలకమయినది. నేటి బాలలే రేపటి పౌరులు. నేడు పాఠశాలల్లో నేర్పినది రేపు సమాజంలో అమలుపరుస్తారు. వారికి చిన్నప్పుడు నేర్చిన సభ్యత సంస్కారాలు, ఇచ్చిన అలోచనలు భవిష్యత్తు సమాజాన్ని రూపుదిద్దుతాయి. అందుకే ఒక సమాజపు స్వరూపం అర్థం కావాలంటే ఆ సమాజంలోని విద్యావ్యవస్థను విశ్లేషించాలంటారు. ‘సయ్యద్’లు విద్యావ్యవస్థపై పట్టు సాధించటంతో కశ్మీరు సాంఘిక వ్యవస్థ పూర్తిగా రూపాంతరం చెందింది. కశ్మీరులోకి ‘ఇరానీ’ సంస్కృతి సంప్రదాయాలు పెద్ద ఎత్తున స్థిరపడ్డాయి. ఇప్పటికే కశ్మీరులోని పలు ప్రాంతాలు మధ్య ఆసియా నుంచి వలస వచ్చి కశ్మీరులో స్థిరపడ్డవారి ప్రభావాన్ని చూపుతాయి. నవ్వాయి (బేకర్), కసబ్ (కసాయి), బావర్చి (వంటవాడు), ఖియత్ (కుట్టువాడు), వద్దాఫ్ (పత్తి బట్టలు వేసుకునే వాడు), నస్సజ్ (చేనేత కార్మికుడు), అల్లఫ్ (కొవ్వుత్తులు తయారుచేసేవాడు), చికిన్ (ఎంబ్రాయిడర్), శీషగర్ (అద్దాల తయారీ), జిల్ద్-సజ్ (పుస్తకాలను కుట్టేవాడు), కాగజ్-సాజ్ (కాగితం తయారీ), క్వాలిన్-బఫ్ (కార్పెట్ తయారీ) ఇలా పలు రకాల కాలనీలు, వృత్తులు కశ్మీరులో మధ్య ఆసియా వలసదార్ల ప్రభావానికి తిరుగులేని నిదర్శనాలు.
భారతీయులు అధికంగా కల కశ్మీరులో తమ సామ్రాజ్యాన్ని స్థిరపరుచుకునేందుకు సుల్తానులు మత ఛాందసులయిన సయ్యద్‍లను అధికంగా ప్రోత్సహించారు. వీరి వల్ల జీవిక కోసం ఇస్లామేతరులు ఇస్లాం స్వీకరించేవారు. ఇతర ప్రాంతాల నుంచి ఇస్లామీయులు కశ్మీరానికి అధిక సంఖ్యలో వలస వస్తుండంటంతో కశ్మీరులో ఇస్లామేతరుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. సుల్తానులకు ఇస్లామేతరుల నుంచి ఎలాంటి ప్రమాదం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ద్వేషించగల శత్రువు ప్రత్యక్షంగా లేకపోతే తమలో తాము ద్వేషించుకునేందుకు కారణాలు వెతుక్కోవడం మానవ సమాజ స్వభావం. హసన్ షాహా పరమత సహనం నచ్చని సయ్యద్‍లు ఇస్లామేతరులపై తామే హింస నెరపటం ప్రారంభించారు. దాంతో సుల్తాన్‌కు వీరితో తలపడక తప్పలేదు. సుల్తాన్ వారందరినీ కశ్మీరు నుంచి తరిమి వేసిన తరువాతనే ప్రశాంతంగా రాజ్యం చేయగలిగాడు.
రాజ్యంలో శాంతి నెలకొనటంతో సుల్తాన్ తన సంస్కృతి ప్రేమను ప్రదర్శించాడు. కళాకారులకు, కళల ప్రదర్శనకు పెద్ద పీట వేశాడు. పెద్ద పెద్ద సంగీత సభలు నిర్వహించాడు. సంస్కృతి కేంద్రాలు నిర్మించాడు. అతని ఆస్థానంలో 1200 మంది సంగీత విద్వాంసులు, అసంఖ్యామైన నాట్యగత్తెలు ఉండేవారని శ్రీవరుడు రాశాడు. అయితే కశ్మీరం వదిలి వెళ్ళిన సయ్యద్‍లు మళ్ళీ కశ్మీరం చేరుకున్నారు. సుల్తానును తమ చేతిలో తోలు బొమ్మలా చేసుకుని రాజ్యాధికారం నెరపారు. సయ్యద్‍ల పాలనా కాలంలో “లంచగొండితనం నీతి అయింది. అణచివేయటం అలంకారం అయింది. స్త్రీ పొందు సుఖసంతోషం అయింది” అంటాడు శ్రీవరుడు తన రాజతరంగిణిలో.
ఇంతలో ‘హసన్ షాహా’ మరణించాడు. అతడి ఇద్దరు కొడుకులు ఇంకా చిన్నవాళ్ళు. దాంతో సుల్తాన్ సంతానాన్ని కాదని ఏడేళ్ళ ‘మహమ్మద్ షాహా’ను సుల్తాన్ చేసి సయ్యద్‍లు రాజ్యం ఏలారు. సయ్యద్‍ల పరోక్ష పాలన కశ్మీరీలకు నచ్చలేదు. దాంతో కశ్మీరులు సయ్యద్‍లకు వ్యతిరేకంగా గొప్ప పోరు జరిపారు. చివరకు మళ్ళీ వారిని కశ్మీరు నుంచి తరిమివేశారు. ఇక్కడ గమనించ వలసిందేమిటంటే కశ్మీరులోని ఇస్లామీయులు, ఇస్లామేతరులు ఏకమై సయ్యద్‍ల మత ఛాందసానికి వ్యతిరేకంగా పోరాడి వారిని తరిమి వేశారన్నది. అయితే సయ్యద్‍లను తరిమివేసిన తరువాత కశ్మీరులో మిగిలిన ఇస్లామీయుల నడుమ అధికారానికి అంతర్గత కలహాలు జరిగాయి. ఆదమ్ ఖాన్ కొడుకు ఫాత్ ఖాన్ సుల్తాన్ అయ్యాడు. సయ్యద్‍లు ఫాత్ ఖాన్‍ను ప్రశాంతంగా రాజ్యం చేయనివ్వలేదు. చివరికి ‘మహమ్మద్ షాహా’ మళ్ళీ కశ్మీరు సుల్తాన్ అయ్యాడు. ఇతనికి సయ్యద్‍ల మద్దతు ఉంటటంతో మళ్ళీ కశ్మీరుపై సయ్యద్‍ల అధికారం వచ్చింది. దాంతో ఫాత్ ఖాన్ పాలానా కాలంలో కశ్మీరులో ఇస్లామేతరులకున్న కొద్దిపాటి భద్రత కూడా అడుగంటింది. దాంతో కశ్మీరు అశాంతి పాలయింది. ఈ సమయంలో ఓ వైపు నుంచి ఫాత్ ఖాన్ అధికారాన్ని తిరిగి సాధించాలని పోరాటం చేయటంతో కశ్మీరం అశాంతి నిలయంగా మారుతూన్న సమయంలో; మరో వైపు సయ్యద్‍లు తమ ఇస్లాం మత ఛాందసంతో కశ్మీరులో ‘పర్షియన్’ తప్ప మరో భాష, ఇస్లాం తప్ప మరో మతం, ఇస్లామీయులు తప్ప మరో మతానుయాయులు ఉండకూడదని రాక్షసుల్లా ప్రవర్తిస్తున్న సమయంలో శ్రీవరుడు ‘కథా కౌతుకమ్’ అనువాద కావ్యాన్ని సంస్కృతంలో రాశాడు.
జైనులాబిదీన్ మరణం నుంచి మహమ్మద్ షాహా రెండవసారి సుల్తాన్ అయ్యేవరకు సంభవించిన సంఘటనలను గమనిస్తే కశ్మీరులో ప్రజల జీవనం ఎంత అల్లకల్లోలం అయిందో, అనిశ్చితమైనదో అర్థం అవుతుంది. అందులో ఇస్లామేతరుల పరిస్థితి మరో ఘోరం. అందుకే శ్రీవరుడు క్రీ.శ. 1505లోనూ జీవించి ఉండి ‘కథా కౌతుకమ్’ కావ్యాన్ని అనువదించినా, రాజతరంగిణి రచనను 1486 సంవత్సరానికే ఆపేశాడు. ఎవరు గెలుస్తారో, ఎవరికి మద్దతిస్తే ఏం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితులలో తటస్థంగా ఉండిపోయాడు. అధికారంలో ఉన్నవాడి వైపు మొగ్గు చూపేవాడి మనుగడ అధికారి మారినప్పుడు ప్రమాదంలో పడుతుంది. అలా కాక, అధికారితో సంబంధం లేకుండా తటస్థంగా ఉంటూ తన పని తాను చేసుకునేవాడికి మారే అధికారితో సంబంధం ఉండదు. శ్రీవరుడు ‘తటస్థంగా’ ఉండిపోయాడు. ముఖ్యంగా సయ్యద్‍లు పర్షియన్ తప్ప మరో భాష చలామణీలో ఉండటాన్ని వ్యతిరేకించటంతో శ్రీవరుడు నిశ్శబ్దంగా నీడలలో ఒదిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. గమనిస్తే జైనులాబిదీన్ కాలంలో వెల్లివిరిసిన సంస్కృత కావ్యాలు, పర్షియన్ కావ్యాలు, పర్షియన్ నుంచి సంస్కృతానికి, సంస్కృతం నుంచి పర్షియన్‍కు జరిగిన అనువాదాలు అతని మరణం తరువాత ఆగిపోయాయి. ఈ కాలానికి చెందినవి పర్షియన్ రచనలు మాత్రమే లభిస్తున్నాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిక కోసం అనుక్షణం సమరం చేయాల్సి వస్తున్నవారు కావ్యాలు రచించటం కుదరదు. అందుకే పరిస్థితి కుదుట పడిన తరువాత శ్రీవరుడు మళ్ళీ రచన చేశాడు. అయితే పరిస్థితి కుదుటబడింది కానీ చక్కబడలేదు. అందుకే శ్రీవరుడు సంస్కృతంలో కావ్యం రచించినా, అతడు రచించినది అనువాద కావ్యం. పర్షియన్ భాషలో అబ్దుల్ రహమాన్ జామి రచించిన కథాకావ్యం (మథ్నవీ) ‘యూసఫ్ ఎ జులైఖా’ను ‘కథా కౌతుకమ్’ అనే సంస్కృత కావ్యంగా మలచాడు శ్రీవరుడు. అలా పర్షియన్ కావ్యాన్ని సంస్కృతంలోకి అనువదిస్తూ స్వతంత్ర కావ్యంగా తీర్చిదిద్దటం వల్ల శ్రీవరుడు సుల్తానుకు సంతోషం కలిగించినవాడవుతాడు. పర్షియన్ భాషను ప్రోత్సహించేవారి ఆగ్రహం నుంచి తప్పించుకుంటాడు. కొనప్రాణంలో ఉన్న సంస్కృతాన్ని మరికొంత కాలం సజీవంగా ఉంచగలుగుతాడు. ఈ నేపథ్యంలో చూస్తే ‘కథా కౌతుకమ్’ లోని రెండవ శ్లోకం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. విఘ్నాలు తొలగించే వినాయకుడికి ప్రణామాలు ఆచరించి, సరస్వతి, వాగ్దేవికి నమస్కరించి, యవనశాస్త్ర బద్ధమైన కథను నిర్జర భాష (సంస్కృతం)లోకి అనువదిస్తున్నాని అంటున్నాడు. ఈ శ్లోకంలో వాడిన పదాలు మరో కథను తమలో పొదుగుకుని ప్రదర్శిస్తాయి.
(ఇంకా ఉంది)