అభియేగే య ఏవాస్య నీతా విన్యస్యతో దృశమ్।
ముఖ రాగః స ఐలాభూత్ప్వలా వాప్తావ విప్లతః॥
(కల్హణ రాజతరంగిణి 8, 2665)
సంయుక్తంగా కశ్మీరుపై దాడిచేసిన విప్లవకారులను మట్టు పెట్టటానికి జయసింహుడు పెద్ద యుద్ధం చేశాడు. కొన్ని వందల శ్లోకాలల్లో ఈ యుద్ధాన్ని విపులంగా వర్ణించాడు కల్హణుడు. కోటలో ఉన్న శత్రువుల ఎత్తులు, కోటను ముట్టడించిన జయసింహుడి సేనల పై ఎత్తులు, సంధి ప్రయత్నాల ముసుగులో అవసరమైన వస్తువులను దొంగతనంగా కోటలోకి తెప్పించుకుని, తరువాత సంధిని కాదని యుద్ధం ఆరంభించటం, శత్రువుల మనస్తత్వాలు, దీర్ఘ కాలం ముట్టడిస్తున్న సైనికుల మనస్తత్వాలు, ఇళ్ళకు దూరంగా ఉన్నవారి ఆలోచనలు సర్వం కల్హణుడు విపులంగా వర్ణించాడు. ఈ వర్ణనల్లో ఆనాటి యుద్ధ విధానాలు తెలుస్తాయి. పోల్చి చూస్తే, అప్పటికీ ఇప్పటికీ ఆయుధాలలో తేడా వచ్చింది కానీ, మానవ మనస్తత్వంలో మార్పు రాలేదని అర్థమవుతుంది.
ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న పలు పోరాటాలు, ఆనాడు కల్హణుడు వర్ణించిన పోరాటాలలో కనిపిస్తాయి. తీవ్రవాదులు, ప్రభుత్వ పక్షాల నడుమ యుద్ధ విరామం సమయంలో, తీవ్రవాదులు తమ ఆయుధాలను సమకూర్చుకుని, శక్తి పుంజుకుని, సంధిని భంగం చేసి మళ్ళీ యుద్ధం ఆరంభించటం – అప్పుడు కల్హణుడు చూపించాడు, ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ యుద్ధాన్ని, కుతంత్రాలను కల్హణుడు కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. చివరికి, ఇక ఎట్టి పరిస్థితులలో కశ్మీరు సేనలను గెలవటం కుదరదని నిర్ధారణ అయిన తరువాత, కోటలో తిండి సామాగ్రి సంపూర్ణంగా అయిపోయిన తరువాత, మళ్ళీ ఏ రూపంలోని తిండి పదార్థాలు కోటలోకి వచ్చే అవకాశం లేదని నిర్ధారణ అయిన తరువాతనే, కశ్మీర రాజు పై రాజ్యాధికారం ఆశతో తిరుగుబాటు చేసిన వారంతా కశ్మీర సైన్యానికి లొంగిపోయారు.
లొంగిపోయిన తిరుగుబాటు నాయకులను కశ్మీరు పట్టుకువచ్చి జయసింహుడి ముందు నిలిపారు. వారందరూ జయసింహుడికి పరిచయం ఉన్నవారే. వారిలో కొందరితో జయసింహుడికి బంధుత్వం ఉంది. కానీ సింహాసనంపై ఆశతో, అధికారంపై దురాశతో వారు తిరుగుబాటు చేశారు. అయినా జయసింహుడు వారిని క్షమించి వదిలేశాడు. వారిని అగౌరవపరచలేదు. అవమానించలేదు. వారితో ప్రేమగా వ్యవహరించాడు. గౌరవించాడు. దాంతో, అంతవరకూ జయసింహుడితో శత్రుత్వం వహించిన వారంతా పశ్చాత్తాపం చెందారు. జయసింహుడి అభిమానులుగా మారారు. ఈ సందర్భంగా జయసింహుడి గుణగణాలను వర్ణిస్తూ చక్కని శ్లోకాలను రాశాడు కల్హణుడు.
ఉత్తమ ప్రవర్తనపై దృష్టి పెట్టిన జయసింహుడు, తిరుగుబాటుదార్లను అణచివేసేందుకు బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాడో, విజయం సాధించిన తరువాత కూడా అలానే ఉన్నాడు. సముద్రంలో చెలరేగిన అగ్ని వల్ల సముద్రం నీరు వేడెక్కిపోదు. అలాగే హిమాలయాలలో కరిగిన మంచు నీరు వచ్చి కలిస్తే సముద్రం నీరు చల్లబడిపోదు. సత్ప్రవర్తన కలవారు దుఃఖంలో ఎలా ఉంటారో, సుఖం కలిగినప్పుడు కూడా అలాగే ఉంటారు. ప్రేమతో, ఉత్తమ ప్రవర్తనతో తనను వ్యతిరేకించిన వారందరి హృదయాలను గెలుచుకున్నాడు జయసింహుడు.
అయితే, జయసింహుడికి చిక్కకుండా తప్పించుకున్నాడు తిరుగుబాటు చేసిన వారిలో ఒకడయిన భోజుడు. కోట నుంచి తప్పించుకుని కొండపైన బండరాయిపై అయిదు రాత్రుళ్ళు, పగళ్ళు భోజుడు అనుభవించిన కష్టాలను విపులంగా వర్ణిస్తాడు కల్హణుడు. కల్హణుడి వర్ణన చదువుతుంటే, కొండపైన ఓ బండరాయి పై, పైకి వెళ్ళే వీలు లేకుండా, క్రింద శత్రువులుండగా, కదలలేక, తిండి లేక ప్రాణాలు అరచేత పట్టుకుని, తప్పించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న భోజుడి పరిస్థితికి ఆధునిక వీరోచిత గాథలు గుర్తుకువస్తాయి. మంచుకొండలలో చిక్కుకుపోయి, కొన్ని రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడ్డవారి కథలలా అనిపిస్తుంది భోజుడి పరిస్థితి వర్ణన. ప్రాణాలతో తప్పించుకున్న భోజుడికి కశ్మీరులో తల దాచుకునే స్థలం లేకుండా పోయింది. ఎవరి దగ్గర ఆశ్రయం పొందినా, వారు తనని రాజుకి అప్పచెప్తారన్న భయం ఉంది. దానితో కశ్మీరు వదిలి ఇతర రాజ్యాలు చేరి సైన్యం సమీకరించి, కశ్మీరుపై దాడి చేయాలన్న ఉద్దేశంతో కశ్మీరు సరిహద్దులు చేరాడు భోజుడు. అక్కడ మధుమతి నది ఒడ్దుకు చేరుకున్నాడు.
భోజుడు కశ్మీరు దాటటాన్ని అత్యద్భుతంగా వర్ణిస్తాడు కల్హణుడు. నదిలో తేలుతున్న మంచు ముక్కలు మృత్యువు కోరల్లా గుచ్చుకుంటున్నాయి. మేఘాలు సూర్యుడికి అడ్డుపడే నల్లటి యముడిలా అనిపిస్తున్నాయి. పై నుంచి విరిగి విరుచుకు పడే మంచు ముక్కలు, యుద్ధరంగంలో సిద్ధంగా ఉన్న ఏనుగుల ఘీంకారాల్లా ఉన్నాయి. నీటి ఝల్లు అతని శరీరాన్ని బాణాల్లా గుచ్చుతోంది. గాలి చురకత్తుల్లా అతని శరీరాన్ని కోస్తోంది. తెల్లటి అంచుపై నుండి ప్రసరిస్తున్న సూర్యకాంతి అతడిని గుడ్డివాడిని చేస్తోంది. దాంతో పల్లపు ప్రాంతం ఏది, చదునైన భాగం ఏది గుర్తించలేక అయోమయానికి గురయ్యాడు భోజుడు. అలా ఆరేడు రోజులు, మంచుతో, చలితో, నీటితో పోరాటాలు చేస్తూ భోజుడు దరదుల రాజ్యం ‘దుగ్ధ ఘట’ చేరాడు. అక్కడ భోజుడికి మద్దతు లభించింది. డామరులు, రాజవదనుడు, నాగులు అందరూ భోజుడి చుట్టూ చేరారు. మళ్ళీ కశ్మీర రాజు జయసింహుడి వ్యతిరేక పోరాటానికి సిద్ధమయ్యారు. దొంగలు, దోపిడీదారులు, నీచులు అంతా భోజుడిని వచ్చి చేరారు.
మళ్ళీ బ్రాహ్మణులు సత్యాగ్రహం ప్రారంభించారు. డామరులను అణచమని, భోజుడిని అదుపులో పెట్టమని కోరుతూ నిరసన వ్రతం చేపట్టారు. డామరులపై యుద్ధానికి వెళ్ళేందుకు ఇది సరయిన సమయం కాదని జయసింహుడు నచ్చచెప్పినా వారు వినలేదు. దాంతో, బ్రాహ్మణులను సంతృప్తి పరచేందుకు యుద్ధానికి సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులు కోరినట్టు, వారిని వ్యతిరేకించేవారిని పదవుల నుంచి తీసేసాడు. తిరుగుబాటుదార్లను, అలజడి సృష్టించేవారినీ సర్వనాశనం చేస్తానని ప్రతిజ్ఞ పట్టితే కాని బ్రాహ్మణులు శాంతించలేదు. వారు శాంతించిన తరువాత యుద్ధానికి సైన్యాన్ని పంపాడు జయసింహుడు.
ఈ సందర్భంలో మళ్ళీ బ్రాహ్మణ సమూహం రాజ్యపాలనను నిర్దేశించటం కనిపిస్తుంది. ప్రజలపై అకృత్యాలు జరుపుతున్న డామరులను అణచివేసేందుకు రాజు ప్రయత్నించాలని వారు కోరి, రాజును తిరుగుబాటు వ్యతిరేక చర్యలకు ప్రేరేపించారు. అంటే ప్రజాస్వామ్యం కాకున్నా, ప్రజల అభిప్రాయాలకు రాజు గౌరవం ఇచ్చేవాడన్న మాట భారతీయ రాచరిక వ్యవస్థలో. అయితే రాజు ప్రజాభిప్రాయానికి తల వంచటం వాంఛనీయమయినా, మొండిపట్టు పట్టినవారికి తల వంచటం అన్నది అంత ఆమోదయోగ్యం కాదు. అది వారి విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అనుచితమైన కోరికలు తీర్చాలని మొండిపట్టు పట్టేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంలో త్రిల్లకుడనేవాడు కశ్మీరంలో తిరుగుబాటుకు ఊపునిచ్చిన విధానాన్ని గమనిస్తే, ఆధునిక ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న అనేక తిరుగుబాట్లు గుర్తుకువస్తాయి.
త్రిల్లకుడు యుద్ధంలో లొంగిపోతున్నట్టు నటించాడు. అదే సమయానికి దొంగలను, గూండాలను, కశ్మీరంలోని ప్రజలను హింసించేందుకు, దోచుకునేందుకు పంపాడు. ముళ్లపంది నలువైపులా ముళ్లను విసిరినట్లు విసిరాడట త్రిల్లకుడు. త్రిల్లకుడి సందేశాన్ని అందుకుని, అప్పటికే కశ్మీరంలో పలు ప్రాంతాలలో దాగి ఉన్న దొంగలు, ధూర్తులు , చేపలు తినే పిట్టల అరుపులు విని సరస్సులో ఉన్న చేపలన్నీ ఉపరితలానికి వచ్చినట్టు బయటకు వచ్చారు. రాజ్యంలో అల్లకల్లోలం సృష్టించారు.
ఇటీవల రష్యా, యుక్రెయిన్‍ల యుద్ధంలో, యుక్రెయిన్‌లో ఉన్న రష్యన్ సమర్థకులు, రష్యాకు సహాయం చేయటం చూశాం. పలు దేశాలలో, అగ్రరాజ్యాలు తమ సమర్థకులను ఆయాదేశాలలో రహస్యంగా చేర్చి , సూచన అందగానే వారు ఆయా దేశాల్లోనే అల్లకల్లోలం సృష్టించటం మనకు తెలుసు. భారత్‌లో కూడా మతకల్లోలాలు, ఇతర కల్లోలాల సమయాల్లో దేశ విద్రోహక శక్తులు తలఎత్తటం, మారణహోమానికి ప్రయత్నించటం మనం చూస్తూనే ఉన్నాం. ఈనాడు కూడా కశ్మీరంలో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు, భద్రతా దళాలకు చిక్కగానే వారిని తప్పించేందుకు శత్రు సమర్థక మూకలు ఏకమవటం, రాళ్లు రువ్వటం, తీవ్రవాదులను తప్పించాలని ప్రయత్నించటం మనం చూస్తూనే ఉన్నాం. సైనికులు మరణిస్తే స్పందించని వారు, తీవ్రవాదుల మరణాలకు స్పందించటం, నిరసనలు చేయటం గమనిస్తూనే ఉన్నాం. ప్రతి చిన్న విషయాన్నీ పెద్ద జీవన్మరణ సమస్యలా మార్చటం, హింసకు దిగటం, అల్లకల్లోలం సృష్టించి, భయానక వాతావరణాన్ని కలిగించటం అన్నది ఒక రకమైన పరోక్ష యుద్ధం. అలాంటి పరోక్ష యుద్ధం ఆనాడే జయసింహుడికి వ్యతిరేకంగా జరపటాన్ని కల్హణుడు చక్కగా వివరించాడు.
తస్కరాక్రాన్త్య శరణం బలవన్నిహితా బలం।
అరాజకమివా శేషం రాష్ట్రం కష్టాం దశామగాత్॥
(కల్హణ రాజతరంగిణి 8, 2757)
ఖాసా వీరుల సహాయంతో రాజవదనుడు భూతేశ్వర మందిరాన్ని కొల్లగొట్టాడు. కశ్మీర శత్రువులు ప్రజా జీవితాన్ని ఎంతగా అల్లకల్లోలం చేశారంటే, దుష్టుల చేతిలో చిక్కిన ప్రజలు విలవిలలాడేవారు. బలవంతులు బలహీనులను దోచుకున్నారు. దేశానికి రాజు అన్నవాడు లేడనిపించే రీతిలో ప్రజలు అత్యాచారాలకు, దోపీడిలకు గురయ్యారు. దాంతో రాజు – రిల్హణుడు, ఉదయుడు వంటి వీరులను యుద్ధానికి పంపాడు. అయితే వీరి వీరత్వం కూడా రోగాన్ని అదుపులో పెట్టే ఔషధంలా పని చేసిందట కానీ రోగాన్ని సంపూర్ణంగా నాశనం చేయలేక పోయిందట.
జయసింహుడిని గెలిచేందుకు అతని వ్యతిరేకులు ఇతర దేశాల నుంచి వీరులను, దోపిడీదార్లను, దొంగలను కశ్మీరానికి ఆహ్వానించారు. ఆస్టర్, గిల్జిత్, పార్దో ప్రాంతాల వారినీ కశ్మీరం ఆహ్వానించారు. అప్పటికే, ఆయా ప్రాంతాలలోని వారంతా ఇస్లాం స్వీకరించారని కల్హణుడు ‘మ్లేచ్ఛులు’ అనటంతో అర్థమవుతుంది. ఆ కశ్మీరంలో అప్పటికే పలు యుద్ధాలలో మ్లేచ్ఛులు పాల్గొన్నారు. ఇప్పుడు జయసింహుడిని దెబ్బ తీసేందుకు అతని శత్రువులు మ్లేచ్ఛుల సహాయం కోరారు. తమ వేలితో తమ కన్ను పొడుచుకోవటం అంటే ఇదే. తాత్కాలిక లాభాల కోసం శాశ్వతంగా నష్టపోవటం ఇదే. భవిష్యత్తులో, భారతీయ రాజులు తమ కక్షలు తీర్చుకునేందుకు బ్రిటీష్ వారి సహాయం తీసుకోవటంలో కూడా ఇదే ఆలోచనా రాహిత్యం కనిపిస్తుంది. ఆ కాలంలో చరిత్ర అధ్యయనం సమగ్రంగా లేదు కాబట్టి, భవిష్యత్తు తరాల వారు, ఇతరుల సహాయం కోరటంలోని ప్రమాదాన్ని గ్రహించలేకపోయారనుకోవచ్చు. కానీ ఆధునిక కాలంలో, సమాచార విస్తరణ అత్యంత వేగంగా సాగుతూ, చరిత్ర అధ్యయనం ప్రధాన అంశంగా ఎదిగిన తరుణంలో కూడా బయట వారి సహాయం అనర్థదాయకం అన్న సత్యాన్ని భారతీయులు గ్రహించకపోవటం ఆలోచించాల్సిన విషయం.
భారత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారు పరాయి దేశాల సహాయంతో ప్రభుత్వానికి అపకీర్తిని అంటగట్టాలని ప్రయత్నించటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం చేతకానితనాన్ని స్పష్టం చేసేందుకు ప్రధాన వ్యవస్థలపై అనుమానాలు రేకెత్తించి, వాటిపై ప్రజల విశ్వాసం సడలించటం ద్వారా వ్యవస్థను దెబ్బతీయాలని ప్రయత్నించటం కూడా అనుభవిస్తున్నాం. తామున్న కొమ్మ మీదనే ఉన్న వ్యక్తిని క్రింద పాడేసేందుకు, ఆ కొమ్మనే నరికే మూర్ఖత్వం ఈనాడూ ప్రదర్శిస్తున్నారు. ఇంత విజ్ఞానవంతులమయి, అభివృద్ధి సాధించిన మనమూ అలాగే ప్రవర్తిస్తున్నాం. అందుకే ఓ మహాకవి ‘అయినా మనిషి మారలేదు’ అన్నాడు. అన్ని వైపుల నుంచి, దిక్కులను తమ అశ్వాల వల్ల చెలరేగిన ధూళితో కప్పివేస్తూ, అందరూ వచ్చి భోజుడి అండన చేరారు.
విభిన్న ప్రాంతాల నుంచి చిత్రవిచిత్రమైన వేషధారణతో ఉండి పలు అర్థం కాని భాషలలో మాట్లాడుతున్న వారిని చూసి భోజుడు సంతోషించాడు. దరదులు, డామరులను కలుపుకుని యుద్ధానికి ముందుకు దూకాడు. అతని సేనల్లో ఎక్కడ చూసినా మ్లేచ్ఛులే కనిపించారు. అలా వారు ప్రజలలో భయోత్పాతం సృష్టించి ‘సముద్ర ధార’ అనే ప్రాంతాన్ని ఆక్రమించారు.
ఇంతలో కశ్మీరంలో వర్షాలు పడ్డాయి. వర్షాల వల్ల కలిగిన వరదలతో కశ్మీరం జలమయం అయింది. నీట మునిగిన చెట్ల శీర్ష భాగాలు, నీటిలో తేలి ఆడుతూ తామరాకుల్లా అనిపించాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో శత్రువులను ముందుకు రాకుండా అడ్దుకోమని జయసింహుడు సైన్యాన్ని పంపాడు.
శత్రువులలో త్రిల్లకుడికి తానే కశ్మీర రాజు అవ్వాలన్న కోరిక ఉంది. బోలెడంత సైన్యాన్ని సమీకరించి, దాన్ని నలుమూలలా విస్తరింప చేసిన భోజుడి బలహీనత గమనించాడు త్రిల్లకుడు. వారితో కలిసినట్టు ఉంటూనే వారికి వ్యతిరేక చర్యలు ఆరంభించాడు.
ఇలా వారిలో వారు కుట్రలు పన్నుకుంటూ కశ్మీర వ్యతిరేక సేనలు ప్రజల జీవితాన్ని అల్లకల్లోలం చేశాయి. అలల్లా వచ్చి పడుతున్న శత్రు సేనలతో కశ్మీర సేనలు వీరోచితంగా పోరాడుతున్నాయి. ఒకరి తరువాత ఒకరు బలమైన అలల్లా దరదులు, లావణ్యులు కశ్మీరంపై వచ్చి పడ్డారు. ఇంతల్లో మ్లేచ్ఛులు ఒక భయంకరమైన అలలా కశ్మీరీ సేనలపై విరుచుకుపడ్దారు.
తురుష్క లోకే నాక్రాంతాం దేశాం స్తద్దశమీయూషః।
శంకమానైర్జనైర్జాతా కృత్స్నా మ్లేచ్ఛావృతేవ భ్రూః॥
(కల్హణ రాజతరంగిణి 8, 2843)
తురుష్కులు ఏయే ప్రాంతాలపై విరుచుకుపడ్డారో, ఆయా ప్రాంతాలన్నీ వారి ఆధీనంలోకి వచ్చాయి. మొత్తం భూమి అంతా తురుష్కుల ఆధీనంలోకి వచ్చినట్టు అనిపించింది. భోజుడి సైన్యంలో పలు విభిన్నమైన జాతుల వారున్నారు. కానీ కల్హణుడు తురుష్కులను ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం. అప్పటికే దేశం నలుమూలలా తురుష్కులు ఆక్రమించారు. ఇంకా విస్తరిస్తున్నారు. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో తురుష్క సేనలు కశ్మీరంలో ప్రవేశించటంతో కల్హణుడికి భవిష్యత్తులో జరగబోయేది అర్థమయి ఉంటుంది. అంత కాలం తురుష్క ప్రభావానికి దూరంగా ఉన్న కశ్మీరమ్ తురుష్క ప్రభావానికి లోనవటం ఎంతో దూరంలో లేదనిపించి ఉంటుంది.
(అతి త్వరలో తెలుగులో తొలిసారిగా జోనరాజు రాజతరంగిణి).
(ఇంకా ఉంది)