అనుకోని అదృష్టంలా నాకు ఈ మార్గశిరంలో అంటే డిసెంబరు 2021లో – జీవితంలో మొదటిసారిగా – కాశీ క్షేత్రం సందర్శించి, అక్కడ సుమారు 24 గంటలు గడిపే యోగం కలిగింది. ఇందుకు మూల కారకులు శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ గారు. వారికి నా ధన్యవాదాలు.
వారు 2019 కార్తీకంలో కాశీ యాత్ర చేసి ఆ యాత్రానుభవాలను, ఆధ్యాత్మిక అనుభూతులను ‘కాశీ క్షేత్రద్రర్శనము – అనుభవాలు‘ అనే కాలమ్ ద్వారా సంచిక పాఠకులతో పంచుకున్నారు.
ఆ యాత్రానుభవాలను పుస్తక రూపంలో తెచ్చి, సాధారణ పుస్తకావిష్కరణలకు భిన్నంగా, కాశీలో విశ్వనాథుని సన్నిధిలో పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని సంకల్పించారు రచయిత్రి.
కరోనా ప్రభావం కాస్త తగ్గి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేయవచ్చు, సభలు నిర్వహించుకోవచ్చు అని ప్రభుత్వం ప్రకటించాకా కాశీ వెళ్ళి అక్కడ పుస్తకాన్ని విశ్వనాథుని మందిరంలో ఆవిష్కరింపజేసుకుందాం అని సంధ్య గారు నాతో, మురళి గారితో అన్నారు. ‘మీరిద్దరూ కూడా నాతో కాశీకి రావాలి’ అంటూ మమ్మల్ని ఒప్పించారు.
తొలుత 2021 జూలై అనుకున్నప్పటికీ, అప్పటికి కరోనా ప్రభావం ఇంకా ఉండడం, పుస్తకం సిద్ధం కావడం కొంత ఆలస్యం కావడం వల్ల – సంధ్య గారు డిసెంబరులో గాని అమెరికా నుంచి ఇండియాకి రాలేకపోయారు. అయితే నవంబరు నెలలో అన్ని అనుమతులు లభించడంతో – వారణాసి ప్రయాణ ఏర్పాట్లు, బస ఏర్పాట్లు ప్రారంభించారు.
సంధ్యగారు ఏర్పాట్లు చేసేస్తున్నా నాకు మనసులో ఎక్కడో సంశయం… ఇంత సులువుగా కాశీలో అడుగిడే అవకాశం దొరుకుతుందా అని! కానీ ఆవిడ సంకల్పం దృఢమైనది… అన్నీ సజావుగా జరిగిపోయాయి.
***
మా ప్రయాణ తేదీలు నిర్ణయమైపోయాయి. టికెట్లు వచ్చేశాయి. ప్రయాణ నిబంధనలు, విశ్వనాథుని సన్నిధిలో పాటించవలసిన నియమాలు తెలిశాయి.
ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా టెస్ట్ చేయించుకున్నాం. నెగటివ్ వచ్చిన ఆ రిపోర్టుతో పాటు రెండు సార్లు వాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ సిద్ధంగా ఉంచుకున్నాం. ఫోటో ఐడి కార్డుగా ఆధార్ తీసుకున్నాం.
20 డిసెంబర్ 2021 సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు మురళిగారితో ఎయిర్‍పోర్ట్‌కి బయలుదేరాను. సంధ్యగారిని విమానాశ్రయంలో కలుస్తామని చెప్పాము. ముందు రోజే వెబ్ చెకిన్ పూర్తయింది.
మురళిగారి కారులో ఉదయాన్నే భక్తిగీతాలు వింటూ ఎయిర్‍పోర్ట్ చేరి, కారు పార్కింగ్ లాట్‌లో పెట్టి, సంధ్యగారిని కలిసే సరికి ఉదయం ఏడుగంటలయింది. సెక్యూరిటీ చెక్ ముగించుకుని, లాంజ్‍లో కూర్చుని కాఫీ తాగి – కార్యక్రమ వివరాలు తెలుసుకున్నాం. కాశీలో ఏం చేయబోతున్నామని ఉత్సుకతతో అడిగాను. స్వామివారి సన్నిధిలో పుస్తకాలని ఉంచి, ఆవిష్కరించుకున్నాకా – స్థానికంగా ఉన్న ఆలయాలను ఎన్ని వీలయితే అన్ని సందర్శిద్దామని, గంగలో పడవ ఎక్కి, వీలైనన్ని ఘాట్‍లను చూద్దామని, సాయంత్రం గంగాహారతికి హాజరవుదామని చెప్పారు సంధ్యగారు. గంగ ఒడ్డున ప్రశాంతంగా ఉండే సమయంలో (మర్నాడు ఉదయం తెల్లవారు ఝామున) ధ్యానం చేసుకుంటామని సంధ్యగారు చెప్పారు.
మాటల సందర్భంలో తాను గతంలో వెళ్ళినప్పుడు ఎంతో ఇరుకుగా ఉన్న మందిర ప్రాంతాలను, ఇప్పుడు ‘కాశీ కారిడార్‘ పేరుతో – విస్తరించి, పునరుద్ధరించారని సంధ్యగారు చెప్పారు. 2019 మార్చి 8న విశ్వనాథ్ ఆలయ కారిడార్‌కు శంకుస్థాపన జరిగిందనీ, రెండేళ్ల 8 నెలల అనంతరం దాదాపు అన్ని పనులు పూర్తయి, ఇటీవల అంటే 14 డిసెంబర్ 2021న ప్రధాని నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించబడిందని చెప్పారు.
మామూలుగానే కాశీ క్షేత్ర సందర్శనానికి కుతూహలపడిన నేను… ఇప్పుడు విస్తరించిన కొత్త ఆలయ ప్రాంగణాన్ని దర్శించుకునేందుకు మరింత తహతహలాడాను.
మా విమానానికి బోర్డింగ్ ఎనౌన్స్ చేశాకా వెళ్ళి మా సీట్లలో కూర్చున్నాము. ఇండిగో వారి A 320 విమానం నిర్ధారిత సమయానికే అంటే ఉదయం 9.10కే గాల్లోకి ఎగిరింది. సుమారు గంటా నలభై నిమిషాల ప్రయాణకాలం, అక్కడ దిగాకా, చెకింగ్‍లు అన్నీ పూర్తి చేసుకుని వారణాసి లాల్‌బహాదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయటికొచ్చేసరికి సుమారు 11.20 – 11.30 అయింది.
ముందే ఏర్పాటు చేసుకున్న క్యాబ్‍లో ముందుగా మా బస అయిన మీర్ ఘాట్ సమీపంలోని గణపతి గెస్ట్ హౌస్‍కి బయల్దేరాము. దారి బాగా రద్దీగా ఉండడంతో సుమారు గంటన్నర ప్రయాణం తర్వాత మా బసకి చేరాము.
లగేజ్ రూమ్ లోకి చేర్చి, కాస్త ఫ్రెష్ అయి – పుస్తకాలను తీసుకుని ఆలయానికి బయల్దేరాము.
స్థానిక పంచకోశ పరిక్రమ రోజు కావడం వల్ల, మార్గశిర బహుళ పాడ్యమి, సోమవారం కావడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందని పూజా సామాన్ల దుకాణాల వారు తెలిపారు. క్యూ లైను రెండు మూడు వీధుల వరకు విస్తరించి ఉంది. ఎట్టకేలకు నాలుగవ నెంబరు గేటు ద్వారా ఆలయంలోకి ప్రవేశించి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాం. అక్కడి ఓ అధికారి సాయంతో ‘కార్తీకంలో కాశీయాత్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించి, విశ్వనాథుని చెంత ఉంచగలిగారు సంధ్యగారు.
నేను విన్న కాశీ విశ్వనాథుని ఆలయానికి, తొలిసారిగా చూసిన ఆలయానికి అసలు పోలిక లేదు. ఆలయ ప్రాంగణాన్ని సువిశాలం చేసి, గొప్పగా అలంకరించారు. ఫోటోలు తీయడం నిషిద్ధం కాబట్టి ఆ ప్రాంగణం ఫోటోలు తీయలేకపోయాను. కానీ ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఫోటోని ఇక్కడ పంచుకుంటున్నాను.
ఆ తర్వాత ఆ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణ ఆలయం, ఇతర ఉపాలయాలను సందర్శించి, జ్ఞానవాపి చూసి, కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నాము. సంధ్యగారు ఆలయ గ్రంథాలయానికి ‘కార్తీకంలో కాశీయాత్ర’ పుస్తకం కాపీలు కొన్ని బహుకరించాకా, అక్కడ్నించి కదలడానికి మనసు మొరాయిస్తుండగా, వెలుపలికి వచ్చాము.
అనేక మలుపులు తిరుగుతూ బారులు తీరిన భక్తుల క్యూ లైన్‍లను మళ్ళీ దాటుకుంటూ మా బసకి చేరే సరికి మధ్యాహ్నం మూడున్నర దాటిపోయింది.
***
మేం బస చేసిన గెస్ట్ హౌస్ గంగ ఒడ్డున ఉన్న మీర్ ఘాట్‌లో ఉంది. రూఫ్ గార్డెన్ రెస్టారెంట్ నుంచి గంగా నది బాగా కనిపిస్తుందని చెబితే, పైకి వెళ్ళి, అన్నం తినే వేళ దాటిపోయిందని ఉపాహారం తింటూ, మంద్రంగా ప్రవహిస్తున్న గంగని చూస్తూ, నదిలో పడవలను చూస్తూ – పక్కన మేడల మీద నుంచి యువకులు ఎగురవేస్తున్న గాలిపటాలను చూస్తూ ఓ అరగంటకు పైన కాలక్షేపం చేశాం.
కాసేపు విశ్రాంతి అనంతరం, స్థానికంగా ఉన్న ఆదిత్య మందిరం, మీర్ ఘాట్ వద్ద ఉన్న వినాయకుడిని దర్శించుకున్నాం. అనంతరం కాసేపు కాశీ పురవీధుల్లో నడక!
ఆ తర్వాత మీర్ ఘాట్‍కి వచ్చి అక్కడ ఓ పడవ మాట్లాడుకున్నాం. ఆ పడవ అతను చూడడానికి గ్రామీణుడిలా ఉన్నప్పటికీ, చక్కని ఆంగ్లంలో సంభాషించాడు. గంగపై ప్రయాణిస్తూ – ప్రధానమైన అహల్యా బాయ్ ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, అస్సి ఘాట్, మణికర్ణిక ఘాట్, మాన్‌మందిర్ ఘాట్, జైన్ ఘాట్, సిందియా ఘాట్, తథాగథ్ ఘాట్, గంగామహల్ ఘాట్‌లు సందర్శించాము.
మణికర్ణిక ఘాట్ వద్ద కాలుతున్న శవాలను చూశాను.
తాను రచించి, ఇటీవలే ప్రచురితమయిన మరో రెండు పుస్తకాలను సంధ్యగారు అంతకు ముందు మాకు అందజేశారు. ‘కార్తీకంలో కాశీయాత్ర’ పుస్తకాలను చేతుల్లో ఉంచుకుని ఫోటోలు దిగాము.
సాయంత్రం ఆరు గంటలకి దశాశ్వమేథ్ ఘాట్ వద్దకు చేరి, గంగా హారతి కోసం ఎదురు చూశాము. 6.10కి మొదలైన హారతి ప్రార్థన సుమారు రాత్రి 7.00 గంటలకు ముగిసింది.
అనంతరం గంగ ఒడ్డున అమ్మవారి ఓ చిన్న ఆలయాన్ని దర్శించుకుని మా బసకి తిరిగి వచ్చాము. దారిలో, గంగ మీద చంద్రుడిని ఫోటో తీసాను.
ఈ రోజు జరిగినదంతా ఒకసారి స్మరించుకుని, దర్శన భాగ్యం కలిగించిన కాశీ విశ్వేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకుని విశ్రమించాము.
***
21 డిసెంబర్ 2021 మంగళవారం ఉదయం మూడున్నరకి నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి గంగ వద్దకు వెళ్ళి మా కుటుంబంలో గతించిన పెద్దలకి సద్గతులు కలగాలని జలతర్పణాలు వదిలాను.
సంధ్య గారు గంగ ఒడ్డున ధ్యానం చేసుకున్నారు. నేను ఆ సమయంలోని ప్రశాంతతని ఆస్వాదించాను. కాసేపయ్యాక దశాశ్వమేధ్ ఘాట్ వద్దకు వెళ్ళి మట్టి పిడతలలో టీ తాగాము.
తరువాత మా గెస్ట్ హస్‍కి వచ్చి కాసేపు బాల్కనీలో కూర్చుని సూర్యోదయం కోసం వేచిచూశాము. గంగ మీద సూర్యోదయం అద్భుతంగా ఉంది.
తర్వాత మురళిగారు విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళగా, నేనూ సంధ్యగారు విశాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళాము. మురళిగారు తిరిగి వచ్చాక మేమిద్దరం కలిసి, సంకట్ విమోచన హనుమాన్ ఆలయం దర్శించుకుని బసకి వచ్చాం.
అయితే ఈ పర్యటనలో మాకు కాల భైరవ ఆలయం దర్శనం మాత్రం సాధ్యపడలేదు. సోమవారం సాయంత్రం విపరీతమైన రద్దీ ఉందని, దర్శనం లభించదని గెస్ట్ హౌస్ వాళ్ళు చెప్పారు. అందుకే ఇతర ఆలయాలు సందర్శించాం. మంగళవారం పొద్దున వెడదామని అనుకున్నప్పటికే, మేం అనుకున్న సమయానికి ఆలయం తెరవరని చెప్పారు. కొంత నిరాశపడి, మరోసారి కాశీ యాత్ర చేయగలిగితే అప్పుడైనా దర్శనభాగ్యం కలగాలని కోరుకున్నాం.
ముగ్గురం బ్రేక్ ఫాస్ట్ చేసి, టీ తాగి గంగానదిని చూస్తు కాసేపు, సాహిత్య కబుర్లతో కాసేపు సమయం గడిపాం.
ఉదయం 8.30 – 8.45 మధ్య బయలుదేరి కొంచెం దూరం నడిచి, అక్కడ మా కోసం వేచి చూస్తున్న క్యాబ్ ఎక్కి విమానాశ్రయం చేరాం. విమానాశ్రయం లోపలికి ప్రవేశిస్తుండగా, కాశీ సంస్కృతిని ప్రతిబింబించే గంగా హారతి శిల్పాలు దర్శనమిచ్చాయి. అద్భుతంగా ఉన్నాయవి.
సెక్యూరిటీ చెక్ ముగించుకుని, బోర్డింగ్ కోసం వేచి చూసాం. 10.55 గంటలకల్లా విమానంలో ఉన్నాం. ఇండిగో వారి A 320 విమానం నిర్ధారిత సమయం 11.10కి బయల్దేరింది. హైదరాబాద్ చేరే సమయానికి ల్యాండింగ్ పర్మిషన్ వెంటనే దొరికినట్టు లేదు, నాలుగైదు రౌండ్లు గాల్లోనే తిరిగింది. అనంతరం సుమారు 1.45కి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
సంధ్యగారిని వాళ్ళింటి వద్ద దించి, మేము దమ్మాయిగూడ చేరాము. అక్కడ నుంచి నేను మా ఇంటికి నా బైక్ మీద వచ్చేసరికి సాయంత్రం 4.30 అయింది.
***
20 డిసెంబర్ 2021 ఉదయం 11.10కి కాశీలో విమానం దిగినప్పటి నుంచి 21 డిసెంబర్ 2021 ఉదయం 11.10 కల్లా విమానం కాశీ విడిచిపెట్టే సమయం వరకు దాదాపు 24 గంటలు పుణ్యక్షేత్రం భవ్య కాశీలో గడిపే అవకాశం లభించింది. నాకు తనివి తీరలేదు. ఇంకొన్ని రోజులు ఉండగలిగితే బాగుంటుంది కదా అనిపించింది. సంధ్యగారికి, మురళిగారికి గతంలో కాశీలో ఎక్కువ రోజులు గడిపిన అనుభవాలు ఉన్నాయి. కానీ కాశీ వెళ్ళడం నాకిదే మొదటిసారి. అక్కడి ఆలయాల, దేవీదేవతల ప్రాభవాన్ని వినడమే తప్ప చూసే అవకాశం ఇప్పటివరకూ లభించలేదు. అలాంటి భవ్యక్షేత్రం వైభవాన్ని కళ్ళారా కాంచగలిగాను.
ఎంతమంది జనాలు ఉన్నా, చాలామంది మాస్క్‌లు ధరించే ఉన్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చినట్టున్నారు. తెలుగువాళ్ళకు కొదవే లేదు. కాశీ విశాలాక్షి గుడి వద్ద తమిళులు, సంకట మోచన్ హనుమాన్ ఆలయం వద్ద కన్నడిగులు కలిశారు. కాశీ మినీ భారతదేశంలా అనిపించింది.
ఈ క్షేత్ర దర్శనం వల్ల ఏదో తెలియని ప్రశాంతత నాకు లభించింది. 21 డిసెంబర్ 2021న తెల్లవారు ఝామున గంగ ఒడ్డున కూర్చున్నప్పుడు ఎంతో శాంతిగా అనిపించిది. ఉద్వేగాలు తగ్గి, మానసిక ఆరాటాలేవో ఉపశమిస్తున్న భావన.
కాశీకి ప్రయాణానికి ముందు కలిగిన భయాలు, సంశయాలు – అక్కడ అడుగుపెట్టాకా, విశ్వనాథుని సమక్షంలో దూదిపింజల్లా తేలిపోయాయి.
ఏదో కొత్త ఉత్సాహం నాలో! ఆ క్షేత్రంలోని పాజిటివ్ ఎనర్జీని నేను కొంత వెంట తెచ్చుకోగలినట్టున్నాను. వారాణసీ పురపతిం భజ విశ్వనాథం!
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.