Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాసిన్ని బతికిన క్షణాల కోసం

[శ్రీ చిట్టత్తూరు మునిగోపాల్ రచించిన ‘కాసిన్ని బతికిన క్షణాల కోసం’ అనే రచనని అందిస్తున్నాము.]

పండగంటే మన సంస్కృతీ సంప్రదాయాలు, పిడివంటలు, ఆడంబరాలే కాదు.. పల్లెపట్టులూ గుర్తుకొస్తాయి. సంక్రాంతి అంటే ఇక చెప్పాలా – గోధూళి వేళలూ.. ముంగిళ్ళలో తీర్చిదిద్దిన రంగవల్లులూ.. పూలతో అలంకరించిన పేడ గొబ్బెమ్మలూ.. అన్నీ జ్ఞప్తికి వచ్చి, పట్టణవాసుల మనసులు పల్లె వాకిళ్లలో వాలిపోతాయి. పుట్టిపెరిగిన ఊరుపట్ల మమకారం పొంగిపొరలి.. ఆత్మీయులను కలుసుకోడానికి తహతహలాడిపోతాయి.

మహాలక్ష్ముల్లాటి నాటు ఆవులు అంతరించి లీటర్లకు లీటర్లు పాలిచ్చే జెర్సీ ఆవులే ఉండచ్చు. ఆక్రమణల్లో కుదించుకుపోయిన ఊరి చెరువు, చిన్న బురదనీటి గుంతగా మిగలచ్చు. తీయటి ఊటనీటిని అందించిన గిలక బావి మాయమై, ఆ స్థానంలో ఆకాశమెత్తు మేడ లేచి ఉండచ్చు. వేసవి సెలవుల్లో సావాసగాళ్లతో కలిసి బొంగరాలాట ఆడుకున్న వేపచెట్టు నీడను సిమెంటు రోడ్డు మింగి ఉండచ్చు. ముగ్గుల వాకిళ్ల సంఖ్య తగ్గి, గొబ్బెమ్మల లోగిళ్ళు లేని వీధులు బోసిగా కనిపించచ్చు.

కానీ.. పల్లెలోనే జారిపోయిన మన బాల్యముంది. అక్కడ ఏ వేళలో వెళ్లినా, నులకమంచం వాల్చి చల్లటి మజ్జిగ చేతికిచ్చే మనసు ఉంది. ఒకప్పుడు తప్పుడు దారిలో నడుస్తున్న నిన్ను హెచ్చరిస్తూ ఖంగున మోగిన పెద్దల గొంతు పీలగా అయినా ఇంకా అక్కడ వినిపిస్తూనే ఉంది.

తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులతో కలిసి తిరిగిన నేల ఆ పల్లె. అనుభూతుల తేనెవాకల జీవధార. బతుకు వెదుక్కుంటూ నువ్వెక్కడెక్కడ తిరిగినా, ఇంకా నీ పేరు పలవరిస్తూ నీ కోసమే తపిస్తున్న ఒక్క గుండె అయినా అక్కడ మిగిలే ఉంటుంది. నీకు ఉగ్గుపాలను పట్టి ఒడిలో చేర్చి లాలించిన తల్లి కావచ్చు.. బతుకంతా నీ బాగు కోసమే ధారపోసిన తండ్రి అవ్వచ్చు. నీ సోదరుడు, సోదరి, నీ చిన్ననాటి స్నేహితుడు.. వీరిలో ఎవరైనా కావచ్చు. అటువంటి ఆత్మీయులను ఆలింగనం చేసుకుని, మళ్లీ ఒకసారి అలనాటి బతికిన క్షణాలను అనుభూతించడానికి పండుగ ఒక సందర్భం. అందులోనూ సంక్రాంతి పర్వం ఒక అద్భుతమైన సంరంభం.

కంగుండి గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా

గడిచిపోయిన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోడానికైనా.. బతుకు పరుగును కాస్త ఆపి, కాసింత పచ్చిగాలి పీల్చి గస తీర్చుకోడానికైనా.. పల్లెకు మించిన చోటు లేదు. ఆ పల్లెను పరుగున చేరుకోడానికి సంక్రాంతికి మించిన సందర్భమూ రాదు.

అందుకే.. సంక్రాంతి పండగంటే పట్టణాలింకా పల్లెలకు పరుగులు పెడుతున్నాయి. అచ్చమైన తెలుగు పండుగ వేళ.. పట్టణాలనుంచి తరలివచ్చే తమ బిడ్డలను పల్లెలెప్పుడూ చేతులు చాచి అక్కున చేర్చుకుంటున్నాయి.

Exit mobile version