Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాస్త కొనసాగించు..

[శ్రీ అవధానుల మణిబాబు రచించిన ‘కాస్త కొనసాగించు..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

దీపావళి నాటి రాత్రి
చివరి చిచ్చుబుడ్డిని
మిగిలిన మతాబాతో వెలిగించాక
ఇక చాలనుకుని, తలుపేసుకుంటే
సంవత్సరానికోసారొచ్చే సంబరం
పావుగంటకే పరిమితమౌతుంది.

తీరిక చేసుకుని,
తలపైకెత్తి చూడు
ఎన్నెన్ని మిణుకుమిణుకులు,
మిలమిలలు, మిరుమిట్లు..
కన్నుల పండువయేదప్పుడే.

***

గంటలపాటు వేచిన తర్వాత
దర్శనమైన మరుక్షణం
ప్రసాదమో, ప్రయాణమో కాదు
ప్రాంగణంలో కాసేపు
ధ్యానముద్రలో గడిపిచూడు
పరుగు నచ్చక దూరమైన ప్రశాంతత
తిరిగి కాస్త కాస్తగా
నీలో ఒదిగిపోతున్నట్టనిపిస్తుంది.

***

పరీక్ష ముగిసిన వెంటనే
పాఠ్యపుస్తకం పదిలపరచుకో
ఏళ్ళు గడిచాక తెరచిచూస్తే
పాఠాలు కాదు,
ప్రతి పుటలోనూ స్నేహానుభవాల
చిత్రపటాలుంటాయ్.

***

మూడు తరాలు
నీ ఇంటి ఉప్పూ పులుపూ
తిని ఊరిన జాడీ
పాత్ర ముగిశాక
గుమ్మం దగ్గర పూలకుండీయై
అతిథులను స్వాగతిస్తుంది.

***

మల్లైనా, లిల్లీ ఐనా
పరిపూర్ణ వికసనమే
పరమార్థమనుకుని ఆగిపోతే
సుగంధ ద్రవ్యాలు, సౌందర్య లేపనాలు లేక
ప్రపంచమెంత పరిమళ రహితమయ్యేదో!

***

చెప్పడం నాకు చేతకాదుగానీ
జీవించడమంటే మరేం కాదు
ఉత్సవం ముగిశాక కూడా
ఉత్సాహం కొనసాగడం.

Exit mobile version