Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కష్టమైన కల

[శ్రీ ఆవుల వెంకటరమణ రచించిన ‘కష్టమైన కల’ అనే కవితని అందిస్తున్నాము.]

నా గతించిన క్షణాల్ని నెమరేసుకుంటూ
వర్తమానాన్ని వెతుకులాడుతున్నాను చకోర పక్షిలా
జీవన పోరాటంలో అడుగడుగునా తారసపడే
ఆటుపోట్ల క్షతగాత్రాలు స్పురిస్తుంటే
ఆశ నిరాశల బ్రతుకు కాన్వాసు పై
విస్పష్ట కుడ్య చిత్రాల్ని సృష్టించేందుకు
ఉలి పట్టిన శిల్పిలా శ్రమిస్తున్నాను.
ఏ మౌన సంద్రాల నుంచో
అరువు తెచ్చుకున్న ఓర్పును ఫణంగా పెట్టి
సంకల్ప వ్రతాన్ని ఆచరిస్తున్నాను
అపర విక్రమార్కుడిలా.
చర్మచక్షువుల కందని
చీకటి లోయలోకి విసిరివేయబడ్డ గబ్బిలాన్నై
తలకిందులుగా తిరుగాడుతున్నాను
పట్టు వదలకుండా
నా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని తాకట్టుపెట్టి
ఏ గ్రహ శకలాల కోసమో
అనుహ్య గమ్యాల వైపు సాగిపోతున్నాను
ఘర్మ జలకాసారాల్లో మునిగి
కర్మయోగిలా అందనితీరాల వైపు
పయనిస్తున్నాను స్తబ్ద చలనంలా
హఠాత్తుగా కాలికేదో తగిలి కళ్ళు తెరిచాను
ఇంకేముంది..!!?
వికార వికృత కుట్ర కుతంత్రాల
నిత్య కృత్యాల జాతర!!
ప్రతినిత్యం కదలాడే వాస్తవ జగతి
మళ్లీ అదే రొచ్చు, అదే రోత
అందుకే అన్నారు ఆది శంకరులు
బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని

Exit mobile version