[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
‘కస్తూరీ తిలకం, లలాట ఫలకే!’ అనే శ్రీకృష్ణుని వ్ణరన,
‘కస్తూరి రంగ రంగా! కావేటి రంగ రంగా!’
అని పాడి జోలపుచ్చే అమ్మలు, బామ్మలు, పసిపిల్లలకి జీర్ణశక్తిలో తేడా వస్తే చాలు, “రెండు కస్తూరి మాత్రలు వెయ్యండర్రా?” అనే అలనాటి పెద్దల మాటలు గుర్తొస్తేనే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది.
కస్తూరి వేసి చుట్టే తాంబూలాలు చాలా ఖరీదయినవి. కస్తూరి పరిమళం హాయిగొలుపుతుంది. ఇంతగా పురాణేతిహాస యుగం నుండి ప్రసిద్ధి పొందిన ఈ కస్తూరి మనకి ఎలా లభిస్తుంది?మనకి చాలా సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు మొక్కల నుండి, వృక్షాల నుండి లభిస్తాయి. కొన్ని మాత్రం జంతువుల నుండి లభిస్తాయి, ఇలా జంతువుల నుండి లభించే ఈ సుగంధ ద్రవ్యం ‘కస్తూరి మృగం’ నుండి లభిస్తుంది.
కస్తూరి మృగాలు సైబీరియా, హిమాలయాల వంటి శీతల ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి లేడి లానే ఉంటాయి. అయితే లేడి జాతిలో మగవాటికున్నట్లు కొమ్ములు ఉండవు. మూతికి రెండు వైపుల రెండు పెద్ద దంతాలు కోరల్లా ముందు చొచ్చుకుని ఉంటాయి. దీని ముందు కాళ్ళ కంటె వెనుక కాళ్ళు ఎత్తుగా ఉంటాయి.
కొండలెక్కడానికి అనువుగా ఉంటాయి. వెనుక కాళ్ళు 80 నుండి 100 సెం.మీ పొడవు, భుజం దగ్గర 50 నుండి 70 సెం.మీ. ఎత్తుగా ఉంటాయి. 7 కిలోల నుండి 17 కిలోల వరకు బరువుంటాయి.
మామూలుగా మానవ నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటాయి. అయితే మానవులు వీటి కోసం వెతుకుతూ వెళతారు.
ఆకులు, పూలు, గడ్డి, మాస్‌లు, లిచెన్స్ మొదలయినవాటిని తింటాయి. ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. ఆడ జింకలు గర్భం ధరించిన తర్వాత 5 నుండి 6 నెలలలో ఒక జింకకు మాత్రమే జన్మనిస్తాయి. ఈ పిల్లలు నెల రోజుల వరకు కదలవు.
మగ కస్తూరి జింకలలో కస్తూరి గ్రంధులు ఉంటాయి. జనేంద్రియాలకి, నాభికి మధ్య ఒక సంచి ఉంటుంది. ఈ సంచిలోకి విడుదలయిన స్రావాలే మనము కస్తూరి అని చెప్పుకునేది.
అయితే ఈ ద్రవం నుండి వచ్చే పరిమళం తన నుంచే వస్తుందని దానికి తెలియదు. ఈ వాసన ఎక్కడ నుంచి వస్తుందో అని వెతుకుతూ ఉంటుంది. ఇదో సృష్టి విచిత్రం.
మన మనుషులు వీటి నుంచి కస్తూరిని సేకరిస్తారు. దీని కోసం వేటడడం వల్లనే వీటి జనాభా తగ్గిపోతూ వస్తుంది.
సరే! దీని ఉపయోగాలేమిటో చూద్ధాం. కస్తూరి సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది. వివిధ రోగములను నివారించడానికి ఉపయోగపడుతుంది. కస్తూరి ధూపం సూక్ష్మజీవులను తరిమికొడుతుంది. వివిధ రకాల సెంట్లు, పరిమళద్రవ్యాల తయారీలో ఉపయోగపడుతుంది. పూర్వం బాలింతలకు కస్తూరిని తినిపించేవారు. వాతములను ఈ విధంగా తగ్గించేవారు. బాలింతలకు దీని వలన కలిగే వ్యాధి నివారణ వారి నవజాతశిశులకే మేలు చేసేది. ఇది చాలా ఖరీదయినది, కాబట్టి ధనవంతులకి మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రస్తుతం ఆధునిక రసాయనాలతో కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేసుకోవాలి.
మన జీవితాలలో ఈ విధంగా కస్తూరి మృగం ప్రాధాన్యతను సంతరించుకుంది.
