Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఫట్ ఫటా చదివించే మర్కట కథలు

[శ్రీ ఆర్.సి. కృష్ణస్వామిరాజుగారు వ్రాసిన ‘కటకటా మర్కటా!’ అనే బాలల కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు.]

ఆర్.సి. కృష్ణస్వామిరాజుగారు పెద్దలకి పిల్లలకి కథలు రాస్తూ వాటిని పుస్తకాలుగా అచ్చువేస్తూ ఇప్పుడు తన 23వ రచనగా ‘కటకటా మర్కటా!’ అన్న బాలల బొమ్మల కథల పుస్తకాన్ని తెస్తున్నారు. పిల్లల కోసం మాత్రమే కాదు పెద్దలు కూడా తమ బాల్య జీవితాన్ని గుర్తు చేసుకునే కథలు ఇవి. కేవలం నీతి కథలుగా మాత్రమే కాదు వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సమస్యలను పరిష్కరించుకునే ఆత్మశక్తిని ప్రేరేపించే కథలు ఇవి.

మొక్కై వంగనిది మానై వంగునా అన్న డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, కేంద్ర బాల సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ముందుమాటగా.. అవ్వ తాతలు అలాగే పిల్లల పత్రికలు కథలు చెప్పే పెద్దవాళ్లు పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేవాళ్లు ఈ తరంలో నానాటికి తరిగిపోతున్నారు. ఆ సందర్భంలో ఈ బాలల కథా సాహిత్యం ఒకదాని వెంట ఒకటిగా ప్రచురిస్తూ చదివిస్తున్న కృష్ణస్వామిరాజుగారు కథలకు సంక్షిప్తత సరళత దాని రెండు కళ్ళు. ఈ కథల్లో గ్రామీణ వాతావరణం, జానపద ధోరణి బాగా కనిపిస్తాయి. వివిధ పత్రికల్లో ముఖ్యంగా బాలల కథలు ప్రచురించే పత్రికల్లో ఇవన్నీ ప్రచురింపబడినవే. ఈ పుస్తకాన్ని కృష్ణస్వామిరాజుగారు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత, స్వర్గీయ కలువకొలను సదానంద గారికి అంకితం ఇచ్చారు. ఇందులో మొత్తం 30 కథలు ఉన్నాయి. ప్రతి కథకు చక్కని చిత్రాలతో, కావాలంటే ఆసక్తి గల బాలలు వాటికి రంగులు దిద్దుతూ కూడా ఈ పుస్తకం రెండో ప్రయోజనాన్ని సాధించవచ్చు.

బాలసాహితీవేత్తగా గుర్తింపు పొందిన ముంజులూరి కృష్ణకుమారి, ఈ పుస్తకంలో ఆసక్తి గొల్పుతూ, పిల్లలకు ఉత్సుకతను రేకెత్తిస్తూ చిత్రమైన మెలికలతో కూడిన కథలు చదవడం, పంచతంత్ర కథల రీతిలో ఆధునిక అంశాలు జోడించడం రాజు గారి ప్రత్యేకత అంటారు.

ఇక కథల్లోకి ప్రవేశిస్తే, ‘రెండాకులు’ కథ, సృష్టిలో ఏ ఒక్కటి మరొక దానితో పోలి ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. ఏ చెట్టు రెండు ఆకులు కూడా ఒక్కరకంగా ఉండవు అంటూ ఈ కథ మనకు, తన తోటి వారితో ఎలా సర్దుకుపోవాలో చెబుతుంది. బాలలు కొన్ని సందర్భాల్లో స్కూలు మారాల్సి వచ్చిన పరిస్థితుల్లో అందుకు ఇష్టత చూపరు. చాలా ఇష్టంగా అసహనంగా ఉంటారు.

అలాంటప్పుడు ఈ కథ సారాంశం -మనుషులలో కూడా, రూపంలో గానీ గుణంలో గానీ తేడాలు కనిపిస్తాయి. నడవడికలో ఒకరు ఉన్నట్లు మరొకరు ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారని, వారు వారి లాగానే ఉంటారని తెలుసుకుంటే చాలు ఏ సమస్యలు రావు. ఓపికగా ఉండి చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ చిరునవ్వుతో ఉంటే వారితో కలిసి చదువుకోవడం ఆహ్లాదకరంగా మారుతుంది” అని ముగిస్తారు కృష్ణస్వామి రాజు.

ఇక ‘కటకటా మర్కటా’ కథలో- చెప్పిన మాట వినని అల్లరి పిల్లలకి కష్టాలు ఎలా ముంచుకొస్తాయో, ఒక అనుభవం తర్వాత గాని ఆ తెలివిడి తెచ్చుకోరో, ఇందులో ఒక పిల్ల మర్కటం అలా గుణపాఠం నేర్చుకుంటుంది. ‘చిట్టి చీమ ఆశ’ అన్న కథలో పిల్ల కోతి లాగానే, చిట్టి చీమ కోరి కష్టాలు తెచ్చుకొని ఆ తరువాత తెలివిడి తెచ్చుకుని అలాంటి వారిని గుర్తు చేస్తుంది. “అమ్మ మాట చక్కెర మూట. ఆశ ముద్దు అత్యాశ వద్దు”. అత్యాశకు మించిన దూరం, వడ్డీకి మించిన వేగం లేదనే పెద్దల మాటగా ఈ కథ బాలలకు వినోద భరితమై చదివిస్తుంది, ‘చిట్టి చీమ ఆశ’ కథ. ‘ఆటలో అరటిపండు’ కథలో ‘మచ్చిక చేసుకుంటే ఎవరైనా మన మిత్రులవుతారు’ అని చెబుతూ ముఖ్యంగా బాలలు తమ చుట్టూ ఉండే పశు పక్ష్యాదులను ప్రేమిస్తూ ఉంటే ఈ సమాజం ఎంతో సుందరంగా ఆనందకరంగా ఉంటుంది’ అని చెబుతుంది. ‘బొరుగుల్లో రాళ్ళు’ అన్న కథ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి వెళ్లేటప్పుడు ఎదురయ్యే ప్రశ్నల్లో లాజిక్ రీజనింగ్ అవసరాన్ని చిన్నప్పటి నుంచే ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరాన్ని సరళంగా చెప్తుంది. ‘జిల్లేడు చెట్టు’ కథలో పెంకి, మొండి మొగుడుకు ఎదురు చెప్పలేని భార్య తెలివిగలదైతే.. అతడికి కూడా స్వీయానుభవంతో, భార్య చెప్పే హితవులోని విలువ ఏమిటో తెలిసి వస్తుంది. ‘లోభి సొమ్ము లోకులపాల’నే పెద్దల మాట ఈ కథలో దాగి ఉంది.

‘నల్ల తుమ్మ’ కథలో అమ్మ చేసినంత సహాయం – తుమ్మ చేస్తుంది అని మరో లోకోక్తి. అలా తుమ్మ ముల్లు ముక్కుపుడకగా మారుతుంది. ఆ తర్వాత కథా క్రమంలో అవి దొంగలను పట్టిస్తాయి. తుమ్మకు తుమ్మే రక్షణ. దానికి కంచె అక్కర్లేదు’ అంటూ ముళ్లకు కూడా ఒక ప్రయోజనం ఉంది అని పరోక్షంగా సూచిస్తారు కృష్ణస్వామి రాజు. ‘గుహలో గొర్రెలు’ అన్న కథలో గొర్రె దాటు మనస్తత్వాన్ని కథలో తెలివిగా ఉపయోగించుకొని గుహలో దూరిన గొర్రెలను,యుక్తితో ఇంటికి మరలించిన కథ ఇది. ‘జయ జయహో’ అన్న కథలో ఏనుగు లాంటి పెద్ద ఆకారం గల మినీ రూపంలోని గున్న ఏనుగును, ఎలాంటి ప్రమాదం లేకుండా నదిని దాటించాలంటే, ఆ జంతు స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే సరి. సాధారణంగా పెద్ద జంతువులు ఏవీ చిన్న జంతువులకు అపకారం కలిగించవు. ఆ పడవలో కొన్ని కోడి పిల్లలను ఉంచితే వాటికి కష్టం నష్టం రాకుండా నది దాటే వరకు అది నిశ్చల స్థితిలో ఉండడం ద్వారా ఒక సమస్యకు పరిష్కారం చూపిస్తారు కృష్ణస్వామిరాజు. ‘మెత్తగా అడిగితే అన్నీ మంచి ఫలితాలే వస్తాయి’ అన్న సూక్తిని ‘తేనె మాటలు’ కథలో బాలలు గ్రహిస్తారు. ‘పెట్టెలో ఏముంది’? అన్న కథ.. ఒక్కొక్కసారి మనం మాటలకు అర్థం, అంతరార్థంలో స్వీకరిస్తే గాని బోధపడదు. తాత ప్రతిరోజు పడుకోబోయే ముందు పెట్టెలో పెట్టమంటుంటాడు మనవడికి ఏం పెట్టాలో తెలియదు. ఒకరోజు ఇక భరించలేక ఆ విషయాన్నే అడిగితే.. రాత్రి పడుకోబోయే ముందు ఆరోజు ఏ ఏ లెక్కలు నేర్చుకున్నాము, ఏం చదువుకున్నాము, ఏ ఏ విషయాలను గ్రహించామో వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఇక అవసరమైనప్పుడు గుర్తు తెచ్చుకోవడం సులభం అవుతుంది’ అన్న ఆ మాటలోని అంతరార్థం మనవడు గ్రహిస్తాడు.

‘అంతా మనమంచికే’ కథలో ‘మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడ్డగా ఆలోచించకూడదు. మంచి జరుగుతుందని ఆశించాలి. వ్యతిరేక ఆలోచనలు మానేయమని మనం ఏది నమ్ముతామో అదే జరుగుతుంది’ అన్న ఇప్పటి పాజిటివ్ థింకింగ్ కీ వర్డ్ అవసరాన్ని తెలియజేసే కథ. ‘చేపా చేపా ఎందుకు ఏడ్చావు’? అన్న కథలో కాలుష్య కోరల బారి నుండి, వ్యర్థాల కోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన పిల్లల ద్వారా వ్యక్తం కావడం.. ఈ కథ పిల్లలకు పరోక్షంగా పర్యావరణ స్పృహను గుర్తుచేస్తుంది. ‘గుర్రాన్ని ఏటిదాకా తీసుకెళ్లగలం కానీ నీరు తాగించలేము’ అన్న మంత్రి చెప్పిన సామెత. అది ఎలాగో కళ్ళారా చూపించమన్ప రాజుగారికి.. సందర్భం వచ్చినప్పుడు స్యయంగా దానిని గ్రహిస్తాడు, ‘రాజుగారు గుర్ ర్ర్..గుర్రం’ కథలో. బతకడం చేతకాక వంద సమస్యలు చెప్పే వాళ్ళు, సోమరితనం వీడక కష్టపడటం నేర్చుకోని బుద్ధిహీనులకు బుద్ధి ఎలా చెప్పాలో, దొరికిన దాని పట్ల శ్రద్ధ ఆసక్తి అవసరానికి కష్టపడే తత్వం ఉంటే, ఎవరి చేతనైనా పని చేయించగలమని రాజు గారికి అనుభవం అయ్యేలాగా కథ ముగిస్తుంది. ‘అత్యాశ’ ఈ కథలో ‘సముద్రానికైనా హద్దులు ఉంటాయి కానీ అత్యాశకు ఉండదు’ అన్న సామెతను ఒక వ్యాపారి చెప్పిన కథ ద్వారా మనకు స్పష్ట పరుస్తారు రచయిత. అత్యాశాపరుడికి ఎంత ఇచ్చినా, పెట్టినా తృప్తి పొందక ఇంకా ఇంకా కావాలంటాడు. ఆ దాహం తీరనిది. మితిమీరిన ఆశ ప్రాణాలకే చేటు’ అన్న హెచ్చరిక కనబడుతుందీ కథలో. ‘మిడిసిపాటు’ కథలో మంచి చేస్తే, అది మన కన్నా ముందు నడుస్తుందని

‘మిడిసిపాటు వద్దు- మంచితనం ముద్దు’ అని ఒక బలశాలికి, ఒక తల్లి విసిరిన సవాలు ద్వారా అనుభవంలోకి వస్తుంది. ‘ఇచ్చుటలో ఉన్న హాయి’ అన్న కథలో ఇదిగో అమ్మా తియ్యకూరా, అంటే తీసుకోమ్మా  పుల్లగూర’ అంటుంది లోకం. మనం ఇవ్వడం ప్రారంభించాలి అప్పుడే బంధాలు బలపడతాయి. దాచిపెడితే ఎదుటివారు కూడా దాచుకోవడం చేస్తారు, దూరంగా ఉండిపోతారు. రెండు చేతులు చరిస్తేనే చప్పట్లు. అలా చేయడం వల్ల పిల్లలు కూడా బంధాలు బంధుత్వాలు సంస్కారం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు.

‘చీమ తెలివి’ కథలో లోకం అనేది మంచి చెడ్డల కలయిక. ఎక్కడైనా మంచి చెడు రెండు ఉంటాయి. వెలుగు ఉన్నట్లే చీకటి కూడా ఉంటుంది’ అన్న నీతి, తల్లి చీమ ద్వారా పిల్ల చీమ తెలుసుకుంటుంది. సృష్టిలో ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది అది అనుభవంతో గాని ఒక్కొక్కసారి తెలిసి రాదు. పొట్టి తోక పొడుగు తోక గల రెండు ఎలుకల మధ్య ఉన్న అసహనం.. ఒక జీవిత పాఠంతో తమను సరిదిద్దుకుంటాయి. ఒక్కొక్క సారి అందానికి అపాయం ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు  అందం లేని వారు సురక్షితంగా ఉండి తన అందమే తనకు శత్రువు అయినప్పుడు కానీ ఆ విషయం తెలుసు కోరు.. ‘పొడుగు తోక’ అన్న కథలో.

‘ఎలు(రు)క’ కథలో కూడా ‘విలువైన వస్తువుల్ని, ఆహారాన్ని పాడు చేయడం వల్లనే మనుషులు తమను బద్ధ శత్రువులుగా చూస్తారు. అందుకే వ్యామోహాన్ని తగ్గించుకుంటే అందరూ సుఖపడతారు’ అన్న పెద్ద ఎలు(రు)క చేసే హిత బోధ ఈ కథలో ఉంది. ‘మునగాకు తాళింపు’ కథలో ‘కత్తిని పక్కన పెట్టేస్తే తుప్పు పడుతుంది. ఏదో ఒక పని పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటే మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం. కాస్తో కూస్తో ఆదాయం కూడా వస్తుంది. ఖాళీ మెదడు దయ్యాల కొంప’ అన్న నిత్య సత్యాన్ని ఈ కథలో బాలలు గ్రహిస్తారు. ‘సజ్జ వడల డబ్బా’ కథలో ఆపద ఎదురైనప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి’ అన్న జీవన సత్యాన్ని ఇమిడ్చి చెప్పారు, వింతగా అనిపించే కథా శీర్షికతో.

‘గాడిద కష్టం’ ఎవరూ గుర్తించరు. మనుషులు చేసే కష్టానికైనా గుర్తింపు ఉంటుంది కానీ, జంతువులు పడే కష్టం మీద మనుషులు దృష్టి పెట్టరు. మనిషి కష్టం ఎంతో, గాడిద కష్టం కూడా అంతే అని తెలుసుకుంటే, ఆ జంతువును కూడా.. అది చేసే సహాయానికి కృతజ్ఞత చెప్పుకుంటాం. ‘కోట కట్టాలి’ అన్న చివరి కథలో కూడా రచయితగా కృష్ణస్వామి ఒక సందేశాన్ని ఇస్తున్నారు.. ‘వయసుకు తగ్గ తెలివితేటలు పెంచుకుంటూ పోతే విజయం తథ్యం. ఓటమి పాలు కావలసిన అవసరమే రాదు. ఇటుకలతో మీరేం చేస్తారు? అన్న ప్రశ్నకు ముగ్గురు పిల్లలు ఇచ్చిన సమాధానంలో చివరగా ఒక పిల్లవాడు గోడ కడతాను అనడం, మరొకడు కోట కడతాను అన్న మాటలో ఆశావాదం కనిపిస్తుంది. ఆశావాదం ఉంటేనే అభివృద్ధిలోకి ఎవరైనా రాగలుగుతారు’ అన్న పాఠాన్ని ఆసక్తికరంగా చదివించే కథగా మలిచారు రచయిత.

ఇలా.. ఈ బాలల బొమ్మల కథల సంపుటిలో అన్ని కథలు ఏదో ఒక సందేశాన్ని ఇస్తాయి. ఇష్టంగా చదివి, గుర్తుపెట్టుకుని అందులోని సారాన్ని, సారాంశాన్ని నిజ జీవితంలో ప్రయోగించి సత్ఫలితాలు పొందమనే హితవు ఈ కథా సంపుటిలోని ప్రతి కథలోనూ కనిపిస్తుంది. కేవలం కాలక్షేపం కోసమే కాకుండా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే ఈ కథలను చదవడం, చదివించడం పిల్లలతో పంచుకోవడం చేయడం ద్వారా రాబోయే తరాన్ని మరింత సమర్థులుగా పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకుంటూ సమాజాన్ని పురోగమన మార్గంలో నడిపించే యువతరంలోకి నేటి బాలలు సులభంగా, పెద్దగా కష్టపడకుండా, ఇబ్బందులు పడకుండా అడుగులు వేసే నైపుణ్యాలు కౌశల్యాలు చిన్నప్పటి నుంచే వారిలో ప్రోది చేసుకునే దానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులోనే కృష్ణ స్వామి రాజు కథన చాతుర్యం అన్ని కథల్లోనూ నీడలా వీడకుండా ఉంటుంది.

***

కటకటా మర్కటా! (బాలల బొమ్మల కథలు)
రచన: ఆర్. సి. కృష్ణ స్వామి రాజు
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 120
వెల: ₹ 140/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
అచ్చంగా తెలుగు: 8558899478 (వాట్సప్ మాత్రమే)
రచయిత: 9393662821

Exit mobile version