Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిండు విస్తరిలాంటి సంపుటి ‘కథ మళ్ళీ మొదలయింది’

[శ్రీ శ్రీకంఠస్ఫూర్తి రచించిన ‘కథ మళ్ళీ మొదలయింది’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీ అవధానుల మణిబాబు.]

సుమారు మూడువందల ముద్రిత కథలున్న శ్రీకంఠస్ఫూర్తిగారి మూడవ కథాసంపుటి ‘కథ మళ్ళీ మొదలయింది’. మొదటిది ‘అమృత వర్షం’, రెండవది ‘మనిషి చిత్రం’. 35 కథలు, మూడువందల పేజీలున్న ఈ కొత్త పుస్తకంలో ఎక్కువ మేర ఆక్రమించిన సంగతి – పేదరికం. ఎంతో ‘రిచ్’గా ముద్రించిన ఈ కథల పుస్తకంలో పేజీతిప్పిన ప్రతిసారీ వేళ్ళకు పేదరికం తగులుతుంది. ఆంగ్ల రచయితలలో ‘Charles Dickens’, భారతీయ రచయితలలో ‘ముల్క్ రాజ్ ఆనంద్’ – పేదరికాన్ని ఇతివృత్తంగా తీసుకుని అనేక రచనలు చేసినవారుగా చెబుతారు. ఆ జాబితాలో మనకు తెలిసున్న కథకులు స్ఫూర్తిగారికి తప్పక చోటుంటుoది. కొన్ని కథల్లో నేరుగా పేదరికాన్ని, మరికొన్ని కథల్లో దాని పరోక్ష ప్రభావాలను, పర్యవసానాలను సమర్థవంతంగా డీల్ చేస్తూ చాలా కథలు నడిపించారు. Suffering, Misery and Wretchedness of the poor – ఈ మూడు అంశాలు వేర్వేరు పాత్రలుగా, వేర్వేరు సన్నివేశాలలో మనకు కనిపిస్తాయ్. ఐతే ఏ రెండు కథలు, ఏ రెండు పాత్రలు, ఏ రెండు సన్నివేశాలు ఒకేలా ఉండవు.

పేదరికం ‘దిష్టి’ కథలో ఒకలా, ‘అవతారం మాస్టారి’ కథలో మరోలా, ‘చుక్కా! చుక్కా!’ కథలో ఇంకోలా కనిపిస్తుంది. రూపం మాత్రమే కాదు, తీవ్రత పరంగా కూడా ఈ పేదరికం వేర్వేరుగా ఉంటుంది. “ఆకలి తర్వాతే అక్షరం పుట్టింది. ఆకలి తీరిన తర్వాతే అక్షరం వరిస్తుంది. అందుకే సత్యాన్ని అక్షర సత్యంగా మలచాలి” అనే అక్షరసత్యం కథలో వాక్యాన్ని; “చుక్క అన్నం తినేటప్పుడు లోకంలోని ఆకలంతా దాని కడుపులోనే ఉన్నంత ఆబగా తింటుంది” అనే ‘చుక్కా! చుక్కా!’ కథలోని వాక్యాన్ని గమనిస్తే ఆ ఆకళ్ళ తీవ్రత వేరని స్పష్టమవుతుంది.

***

పుస్తకం నిండా ఎన్నో ప్రశ్నలున్నాయ్. ‘దిష్టి’ కథలో “బాపూ! పోలిగాడికి నాగే, దురాశ మాలావయితే మావందరికీ దిష్టి తగులుద్దా! మరి అలాగయితే, తవరిలాంటి పెద్దోల్లకి దిష్టి తగులుద్దా!” అని ఎర్రప్పడు అమాయకంగా అడిగిన ప్రశ్నఅప్పలశెట్టిని మాత్రమే కాదు – లాగేసుకుని, పోగేసుకుంటున్న పెద్దమనుషులెందరినో హెచ్చరించడం.

‘మా వీధిలో దుకాణం’ కథలోనూ ఇలాంటి ప్రశ్నే. “మా బతుకుల్ని ఇలగ బుగ్గిపాలు సేసినాది ఆ దుకానవే కదయ్యా! నన్నిలగ మంచంలో పడేసినాదీ ఆ దుకానవే. బావూ! నాకు తెలకడగతన్నాను. దుకానం అంటే ఏటి బావూ? మడిసి బతకడానికి ఏటి గావాల్నో ఆ దినుసుల్ని, తిండి గింజల్ని సరుకుల్ని అమ్మే సోటు కదయ్యా? ఈ దుకానమేటి బావూ, మడిసిని మత్తులో ముంచీసి, ఆడిలోని పసువునీ, రాచ్చసున్నీ బయటకి రప్పిచ్చి గోరాలు సేయింసేది దుకానవేటి బావూ? ఈది ఈదికో దుకానం. సందు సందుకో దుకానం, ఎన్నెన్ని దుకానాలు బావూ? ఈయన్నీ మా కర్మలకేనా?” – ఈ ప్రశ్న ఇందాక అప్పలశెట్టిని ఎర్రప్పడు అడిగిన ప్రశ్నలాంటిదే. చనిపోయిన భర్త గురించి బాధ పడుతూ మంగమ్మ అడిగిన ప్రశ్న ఇది. ఐతే, మంగమ్మ భర్తను చంపింది ఎవరు? అనేది కథలోని అసలు సంగతి.

వ్యవస్థపై మరో ప్రశ్న‘కంచె’ కథ. ఈ మాటలు వినండి, ఎవరు ఎవరితో అంటున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు – “బాబూ! రాత్రి పన్నెండుగంటలకి మేవంతా స్టేషనుకెళ్లాం.. ఇంట్లో ఎవరూ లేరని.. మాలో సుశీల, బలవంతంగా ఎస్ఐ బాబు జీపెక్కి రాత్రంతా ఆ బాబుతో సొంతపెళ్ళాంలా ఎబిచారం చేసింది. అది నేరవేగదా! స్టేషను ఎనకాల చీకటిగదిలోకి విసురుగా లాక్కెళ్ళి.. నన్ను నా శరీరాన్ని నుగ్గునుగ్గుచేసి.. “మాణిక్యం నువ్వు నిజంగా మాణిక్యానివేనే’ అంటూ, ఏనుగులాటి హెడ్డుబాబు నన్ను తెగ మెచ్చుకుంటే.. నేనూ ఎబిచారం చేశాను బాబు.. తనకు ఆకలిగావుందనీ.. ఒంట్లో నలతగా వుందనీ.. మొరబెట్టుకున్నా వినక.. మొరటుగా రెక్కబట్టుకుని ఈడ్చుకెళ్లిన ఓ సెంట్రీబాబుతో జైలుగదిలోనే, మా పార్వతక్క ఎబిచారం చేసింది బాబు.. మాతోబాటు ఆ మగాళ్లూ నేరాలు చేశారుకదా బాబు.. ఆ నేరాలకి శిక్షలేటో ధర్మప్రభువులు శెలవిస్తారని..” ఈ సంభాషణకు కొనసాగింపుగా స్ఫూర్తిగారు “మెల్లకన్ను పిల్ల అక్కడనుంచి తప్పుకుని ఆడవాళ్ళ మధ్యకు వెళ్ళి నిలబడింది.. అంతా నిశ్శబ్దం.. ఎవరూ మాట్లాడటంలేదు” అని పేరాగ్రాఫ్ ముగిస్తారు. నిజానికి, ఇలాంటివి చదివి వెంటనే మనమూ ఏం మాట్లాడలేం. వెంటనే మరో కథా చదవలేం. అలా పాఠకుడిని గబగబా చదవనివ్వకపోవడంలోనూ రచయిత విజయం ఉంటుంది.

***

గొప్ప సంవిధానం ప్రతి కథలో మనలని కట్టి పడేస్తుంది. కథా సంవిధానం గురించి వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు ఓ మంచిమాట చెప్తారు – “ఒకదాని పక్కన మరొకటి వరసగా ఉంచిన పూసలకు, దండగా గుచ్చిన పూసలకు మధ్య ఉన్న తేడాలాంటిదే కథకూ, కథా సంవిధానానికీ మధ్య ఉంటుంది” అంటారు. చాలా కథలలో ప్రతినాయకుడు ఉంటాడు. వాడికి తగిన శాస్తో, గుణపాఠమో జరుగుతుందని మనకూ తెలుసు కానీ ఎవరిచేతిలో అది జరుగుతుందో ఓ మలుపు ద్వారా చెప్పడం స్ఫూర్తిగారి స్టైల్. ఇలా రెండు సంఘటనల మధ్య కార్య కారణ సంబంధమే సంవిధానం. ‘ఒక నీలి కథ’లో పరిష్కారం ఎలాగ? అని మనం ఆలోచిస్తుంటే -ఊహించని మలుపు ద్వారా బుద్ధి చెప్పిస్తారు.

సంభాషణలు కొన్నిచోట్ల హత్తుకునేలా, మరికొన్ని చోట్ల గమ్మత్తుగా ఉంటాయ్. సునాయాసంగా చనిపోయాడు అని రాయడానికి – “రాత్రి ఎప్పుడో నిద్రలోనే ప్రాణం పోయింది. అతగాడు పడుకున్న మంచానికి మూడు అడుగుల దూరంలో నిద్రపోయిన అతని భార్య మహాలక్ష్మికి తెలియలేదు” అని మొదలుపెడతారు. “ఈ మహాపట్టణంలో పార్కుకొచ్చి ప్రశాంతత వెతుక్కోవడం అన్న ఊహ ఎంత పిచ్చిదో నాకప్పుడే అర్థమయింది” లాంటి మాటలు పైకి సాధారణంగా అనిపించినా చాలా సంగతులు చెప్తాయ్. చాలా కథలలో ఎత్తుగడ బావుంది. “సాయంత్రం నాలుగున్నర. చేతిలో స్మార్ట్ ఫోన్ రింగయింది. స్క్రీన్ మీద భర్త పోటో కనబడగానే దాని మీద చూపుడు వేలితో, చిన్న అడ్డ గీత గీసి.. “చెప్పండి.. ఏమిటి? విసుగ్గా అంది శ్రీవల్లి”. కథ ప్రారంభం ఎంత కొత్తగా ఉంది? ఆలోచిస్తే ఆ దంపతుల మధ్య అన్యోన్యత మొదటి వాక్యంలోనే అర్థం అవుతోంది. చక్కని సందేశాలనూ సూటిగా చెప్పేశారు. ‘సద్గతి’ కథలో “ఆధ్యాత్మికంగా జీవించడం ఒక్కటే జీవితం కాదు. నీ దైనందిన జీవితంలోని బాధ్యతలు, కర్మలు అంటే పనులు.. అన్నీ సద్గతిలో నిర్వర్తించినపుడే ధర్మ అర్థ కామ మోక్ష ఫలితాలు నీకు దక్కుతాయి” అనే మాట భజన గురువుతో చెప్పించారు.

***

ఒక్కోసారి మనుషుల్ని చాలా తక్కువగా, తప్పుగా అంచనా వేస్తాం. వాళ్ళ మాటలను అపార్థం చేసుకుంటాం. అలా ఓ సింహాచలాన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు రచయిత అనే కథ ‘తడిమనసు’. అందరూ మనుషులే. మానవాతీతులుండరు. నిజమైన గురువు అంటే ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గాన్ని సూచించేవారే గానీ, వారే లక్ష్యం కాదు. కానీ వారిని దైవంగా భావించే మూఢభక్తులుంటారు. ఆ సత్యాన్ని చెప్పిన కథ.. ‘నమ్మకానికి అటూ ఇటూ’. మానసిక వికలాంగుడు చేయి చేసుకుంటే భగవాన్ మౌన పరిపూర్ణ స్వామీజీ కుప్పకూలి పడిపోయిన సన్నివేశంతో అల్లిన కథ ఇది.

ఇతరుల విషయాల్లో మనం చాలా తొందరగా ముగింపుకి వస్తూoటాం. మనం చూస్తున్నవీ వింటూన్నవీ వీటినే భూమికలుగా చేసుకుని తీర్పులను ఇచ్చేస్తాం. ఈ మధ్యే ‘అవిహితం’ అని మలయాళం సినిమా డిస్నీహాట్ స్టార్‌లో వచ్చింది. సరదాపడి మనమే అన్నీ నిర్ణయించేస్తాం కానీ, మన అంచనా తారుమారైతే మనం అన్యాయంగా నిందమోపిన వారిని పలకరించగలమా! ఎంత సిగ్గు పడిపోతామో! అలాంటి కథే కృష్ణమూర్తి భార్యను వెదికే – ‘ఆ పెద్దాయన’.

***

తప్పనిసరి అయినపుడు అప్పటివరకూ బేలగా అనిపించే స్త్రీ ఎంత తెగింపు వస్తుంది? అనే విషయం అంతస్సూత్రంగా రెండు కథలు ఉన్నాయ్. తన బిడ్డ మీదకు పందిపిల్ల దాడి చేసినపుడు మహాలక్ష్మి ఎంత మొండిధైర్యంతో పోరాడింది అనే కథ ‘ధైర్యే.. సాహసే..!’ అలాగే, ‘సెనక్కాయలమ్మా’! ఆమె సింహాద్రిని ఏం చేసింది. అసలు సింహాద్రి ఎవరు? అనేది తెగింపుకి సంబంధించిన మరో కథ.

***

నలభై, నలభై అయిదు దాటాక నాన్నతనం వంటబడుతుంది. అపుడు దాదాపు తండ్రులంతా అనే మాట “అసలు మా కాలంలో” అని. అలాంటి నాన్నలు ‘కొంతమంది కుర్రాళ్ళు’ కథ చదవాలి. అందులో కొడుకు భాస్కరం చేసిన పని ఏమిటి? తన కొడుకు అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని, అదికూడా తాను పనిచేస్తున్న హాల్లోనే అని తెలిసి అతని తండ్రి సాంబమూర్తి ఎంత తల్లడిల్లిపోయాడు? నిజంగా నేటి యువతంతా అంత చెడిపోయిందా? వారి ఆలోచనలు ఏమిటి? వాటిని తల్లిదండ్రులు ఎంతవరకూ అంచనా వేయగలుగుతున్నారు? వీటన్నిటికీ సమాధానం ఈ కథ.

***

అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ భర్తకు బుద్ధి చెప్పిన భార్య కథ ‘జీవన చిత్రం’; హింసను నమ్ముకున్న వ్యక్తి ప్రతిహింసకు బలవుతాడు, కేవలం అతను మాత్రమేకాక అతడి కుటుంబమూ బలవుతుంది అని చెప్పే కథ ‘హింసధ్వని’.

ప్రపంచంలో అందరూ చెడ్డవారే కాదు, మంచివాళ్ళూ ఉన్నారు అని చెప్పే కథ ‘అవతారం మాస్టారు’. అలాగే ముందుగా చెప్పుకున్నట్టు మరో కోణంలో ఇది పేదరికం వలన కలిగిన అసహాయతను ప్రతిబింబించే కథ. ముగింపు మరింత బావుంది. మంచివాళ్ళ మధ్య చెడ్డవాళ్ళ గురించి చెప్పే కథ ‘జర భద్రం మనిషీ’. “మంచీ, చెడ్డా, మనుషులూ, స్నేహం, ప్రపంచంలో ఏదయినా డబ్బు తర్వాతే.. ఆ డబ్బు సంపాదించడంలో ఉన్న ఆనందం, తృప్తి , తృష్ణ ..” ఇవి మాత్రమే తెలిసిన గోవిందయ్య కథ ఇది.

***

ఇలా ప్రతి కథా ప్రత్యేకమైనది. సాధారణంగా రచయితల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మినహా మిగతావారి కథల్లో వృత్తిపరమైన నేపథ్యం ఉంటుంది. ఐతే, ఎందుకో స్ఫూర్తిగారి ఈ కథలలో టెలిఫోన్ డిపార్ట్మెంట్ రాలేదు. ఐతే చాలా చోట్ల మా కాకినాడ, పరిసరాలు, వీధులు, పార్కులు అన్నీ కనబడ్డాయ్. సంయమన రాహిత్యం, కళా రాహిత్యం ఏమాత్రం లేకుండా ఇన్ని కథలు వ్రాసిన స్ఫూర్తి గారు ఒక మంచి నవల వ్రాయాలని కోరుతూ.. ఇటీవల వీరు సోమసుందర్ కథా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వారి మాటతోనే ముగిస్తాను. సో.సు. కథ ఎలా ఉండాలో చెబుతూ – “మనుషుల్ని చదవాలి, ఆంతరిక సంబంధాల్ని ఆకళించుకోవాలి. సమాజాన్ని నడిపే చోదక శక్తుల్ని శాస్త్రీయంగా విశ్లేషించుకోవాలి. ఇవన్నీ ఉండి, వీటికి ప్రతిభ తోడైతే లోకవృత్తాన్ని ఆవిష్కరించగలిగే శక్తి లభిస్తుంది” అంటారు. అదిగో, ఆ లోకవృత్తాన్ని ఆవిష్కరించే శక్తిని నిరంతరం పెంపొందించుకుంటూ సాగిపోవడం వలననే దశాబ్దాలుగా శ్రీకంఠస్ఫూర్తిగారు సమర్థుడైన కథారచయితగ కొనసాగుతున్నారు. పరిశీలన, వివేచన, నివేదన – ఈ మూడూ అవినాభావంగా పరిణతి పొందిన వీరి కథా రచనాస్ఫూర్తి ఇలాగే ప్రకాశించాలని కోరుకుంటూ..

కథ మళ్ళీ మొదలైంది (కథాసంపుటి)
రచన: శ్రీకంఠస్ఫూర్తి
పేజీలు: 316
వెల: ₹ 300/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలు
~
లయన్ శ్రీమతి కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ
70-2-23/B, ఆర్.జె.ఆర్. నగర్,
మున్సిపల్ హైస్కూలు వీధి
రమణయ్యపేట,
కాకినాడ 533005
ఫోన్స్: 99494 87828, 98499 36968

Exit mobile version