Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హృద్యమైన కథల సంపుటి ‘కథా తిలకం’

[శ్రీ కుంతి (కౌండిన్య తిలక్) గారి ‘కథా తిలకం’ కథల సంపుటి సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయులైన శ్రీ కౌండిన్య తిలక్ గారి తొలి కథాసంపుటి ‘కథా తిలకం’. ఇందులో 2004 – 2022 నడుమ రచించిన 27 కథలున్నాయి. ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురితమైనవే, కొన్ని బహుమతులు కూడా పొందాయి.

~

“కుంతి (కౌండిన్య తిలక్) గారి కథలు మధ్య తరగతి కుటుంబ జీవన విధానానికి ప్రతీకలు. మానవతా విలువలు, సామాజిక స్పృహ, జీవితంపై ఆశ, కష్టాలనెదుర్కునే మనస్తత్వం, సమాజంలో నేడు అతిగా కనిపిస్తున్న లైంగిక వేధింపులు, స్త్రీ సాధికారత వంటి అంశాలు ఎన్నీ వీరి కథల్లో ఉండడంతో, పాఠకులను ఈ కథలు చదివిస్తాయి” అన్నారు డా. ముక్తేవి భారతి తమ ముందుమాట ‘ఇంటింటి చిత్రాలు’లో.

~

“ఈ కథలు కొన్ని నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. అన్నిటికీ మించి ఆలోచింప చేస్తాయి. ఈ కథలు విషాదాంతం అయినా, సుఖాంతం అయినా మానవతా ఉదంతాలే కావడం విశేషం” అన్నారు శ్రీ తలపల గోపాలకృష్ణ తమ ముందుమాటలో.

***

జీవితం అనుకున్నది అనుకున్నట్టుగా సాగదు. ఆశించినవి జగరకపోగా, వద్దనుకున్నవి సంభవించి మనుషులను క్రుంగదీస్తాయి. బ్రతుకు పట్ల బెంగని కలిగిస్తాయి. అలాంటి సమయంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, జీవనాన్ని సరిదిద్దుకుని బ్రతుకును సన్మార్గంలో నడిపించేందుకు సానుకూల దృక్పథం, ఆశావహ వైఖరి ఎంతో అవసరమైనదని ‘గుఱ్ఱం ఎగిరినా ఎగరవచ్చు’ కథ సూచిస్తుంది.

ఆధునిక జీవన శైలులకి అనుగుణంగా పుట్టుకొస్తున్న భిన్నమైన ధోరణులకు ప్రతీక ‘ఈవెంట్ మానేజ్‍మెంట్’ కథ. కథాపీఠం పురస్కారం పొందిన ఈ కథలో అశువుల బాసిన నిరుపేద కుటుంబాలలోని అసహాయ వ్యక్తులకు సాయం చేసే సంస్థ – సకాలంలో స్పందించడం; ఆ సంస్థకు చిరుద్యోగులే సాయం అందించడం – పాఠకుల హృదయాన్ని తాకుతాయి.

నిజాయితీకి అన్నిసార్లూ ‘ప్రతిఫలం’ దక్కదు. ఒక్కోసారి చేయని తప్పుకి కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నిస్సహాయులు జీవన పోరాటంలో తమకెదురైన మంచికి సంతోషించినా, అన్యాయాన్ని భరిస్తూనే ముందుకుసాగుతారు.

కొన్ని వృత్తులలోని కొందరు చేసే పనుల వల్ల ఆ వృత్తిలోని అందరినీ ఒకే గాటన కట్టేయకూడదని, ఏ వృత్తి లోనైనా మంచివాళ్ళుంటారని చెబుతుంది ‘జామకాయల శివాలక్ష్మి!’. “పోలీసులను కాటకం మనుషులు అనుకుంటాం. కానీ హనుమాండ్లు సారును, అక్కడున్న మిగతా పోలీసులను చూస్తే అది తప్పనిపించింది.”, “నేను పాపిష్టి బతుకు బతుకుతున్నా, పాపిష్టిదాన్ని కాదు” వంటి వాక్యాలు ఇతివృత్తానికి తగినట్టుగా అమరాయి. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా కొన్నేళ్ళు రోజూ రైలు ప్రయాణం చేసిన రచయిత – ఓ ప్రయాణంలో జరిగిన కథగా దీన్ని అల్లారు. తాము కూడా ఆ రైల్లో ప్రయాణిస్తూ శివాలక్ష్మి కథను స్వయంగా వింటున్నట్టు పాఠకులు అనుభూతి చెందుతారు.

పెద్ద పెద్ద ఆదర్శాలు వల్లించడం కన్నా, చిన్న చిన్న మంచి పనులు వ్యక్తిత్వాన్ని కాంతిమంతం చేస్తాయని సూచించే కథ ‘థ్రిల్’. పెళ్ళి భోజనాలలో – రెండువైపుల వారికి సంబంధం లేని వారు, తేరగా తిని పోతే, అతిథులకు, మగపెళ్ళివారి తరఫు బంధువులకు భోజనాలు సరిపోక, వెళ్ళిపోతే – ఆడపెళ్ళి వారికి ఎంత నగుబాటో ఈ కథ చెబుతుంది. ఆడంబరంగా జరిగే పెళ్ళిళ్లలో ఎంత ఆహారం వృథా అవుతుందో, అలగే – ఖచ్చితమైన లెక్కలు వేసుకుని భోజనాల ఏర్పాట్లు చేసే మధ్యతరగతి వారి పెళ్ళిళ్ళలో భోజనాలు సరిపోకపోతే ఎంత రభస అవుతుందో ఈ కథ కళ్ళకు కడుతుంది.

పరిసరాలను మరచి, తానున్న స్థితిని విస్మరిస్తూ, నలుగురికి ఇబ్బంది కలిగిస్తూ – సెల్‍‌ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతూ నా ఫోన్ నా ఇష్టం అనే వారు ఎక్కువైపోయారు ఇటీవలి కాలంలో. ప్రయాణంలో Social Etiquette పాటించాలన్న కనీసపు ఇంగితం లేని వారిని ఏమనగలం? థాంక్స్ చెప్పడం తప్ప! అదే చేస్తాడు విద్యాచరణ్ ‘చదువుకున్న అనాగరికం’ కథలో.

జీవితం ఒక్కోసారి ఎన్నో ప్రశ్నలను వేస్తుంది.. సమాధానాలు దొరకవు.. ఒక్కోసారి ఆలస్యంగా దొరకవచ్చు.. కొన్నిసార్లు జవాబులు దొరకకుండానే జీవితం ముగిసిపోతుంది. ‘భిక్షు వర్షీయసీ!’ కథలో ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు కథకుడి బుర్రలో మెదలుతాయి. అతని ప్రవర్తనని నిర్దేశిస్తాయి. ఆసక్తిగా చదివిస్తుందీ కథ.

దొడ్డమ్మ ట్రంక్ పెట్టె’ మానవీయ విలువలను ప్రతిబింబించే కథ. భౌతిక సంపదలు, పరువు ప్రతిష్ఠల కన్నా మానవత్వమే మిన్న అని చాటుతుందీ కథ. కథాపీఠం పురస్కారం పొందిన ఈ కథలో “వెంకటాద్రినాయుడి గుండెలో పేరుకున్న బాధలా చీకటి ఊరంతటినీ ఆవరించింది”, “దాదాపు అర్ధ శతాబ్దం పాటు ఆ ఇంటి వారందరికీ ఆ పెట్టె అర్థం కాని ప్రహేళికలా మిగిలిపోయింది.” – వంటి చక్కని వాక్యాల వల్ల కథనం హాయిగా సాగిపోతుంది. ఇంతకీ ఆ ట్రంకు పెట్టె ఓ వ్యక్తి జీవితపు రహస్యాలను దాచినట్టా, వెల్లడించినట్టా అని పాఠకులు ఓ క్షణం తమని తాము ప్రశ్నించుకుంటారు. దాచి ఉంచాల్సిన అవసరం ఉన్నన్నాళ్ళూ దాచి ఉంచిందనీ, రహస్యం తెలియాల్సిన వాళ్ళకి తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే వెల్లడించిందని అర్థమవుతుంది.

భార్యా అనుకూలవతీ శత్రువు!’ కథ చక్కని కథ. తన కన్న భార్య వ్యక్తిత్వమే గొప్పదని తెలుసుకున్న సగటు భర్త – తన ఆలోచనలని, అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకుంటూ తన భావాలని ఉత్తరంలో వెల్లడిస్తాడు. భార్యని క్షమించమంటాడు. అయితే ముగింపు అనూహ్యం! పాఠకుల అంచనాలకు అందదు. చక్కగా సాగుతున్న కథని విషాదాంతం చేయవలసిన అవసరం ఏముందన్న ప్రశ్న పాఠకుల మదిలో మెదలుతుంది.

కర్కోటకుడిగా పేరుగాంచిన తమ బాస్ బలహీనతని ఆసరగా చేసుకుని అతని వల్ల తమకు కలిగే ఇబ్బందులను దూరం చేసుకుంటారు సిబ్బంది ‘ఆపరేషన్ – బాస్ ఖేల్ ఖతమ్’ అనే వ్యంగ్య కథలో. కథలోని చివరి వాక్యం మాత్రం గొప్ప వాస్తవం!

డ్రైవింగ్ ఫోబియా ఉన్న వ్యక్తి కథ ‘మోహనరావు మోటర్ బైకు!’. భార్య కోరిక మేరకు బైక్ నడిపేందుకు మోహనరావు ఎన్ని అవస్థలు పడ్డాడో, దాన్ని వదిలించుకునేందుకు ఎన్ని ప్లాన్లు వేసి విఫలమయ్యాడో ఈ హాస్యకథలో చదవవచ్చు. “నడిచి వెళ్తున్న వాళ్ళనీ, బస్సులో, ఆటోల్లో వెళ్తున్న వాళ్ళని చూసి ఈర్ష్య పడేవాడు, తనకు ఆ అదృష్టం లేకుండా పోయిందే అని బాధపడేవాడు” వంటి వాక్యాలు మోహనరావులోని భయాన్ని పట్టిస్తాయి.

తెలుగు సినిమాలపై సెటైర్ ‘అవార్డు కథ’. సినిమాలపై రాసిన ఈ కథని స్క్రీన్ ప్లే తరహాలో రాయడం బాగా నప్పింది. వినోద కథలో పోటీలో మొదటి బహుమతి పొందిన కథ ఇది.

కుడి ఎడమయితే!’ చక్కని కథ. పెళ్ళి సంబంధాలలో ఒకరిని చూడడానికి వెళ్ళి మరొకరిని చూసి, సంబంధం కలుపుకున్న ఉదంతాలు నిజజీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఈ ఇతివృత్తంతో అల్లిన కథ ఇది. ఈ కథ చదువుతుంటే ఏదో తెలియని హాయి మనసుని తాకుతుంది.

నిత్యం దేవుళ్ళని సేవిస్తూ, కోవెలలను అంటిపెట్టుకుని ఉండే అర్చకుల జీవితాలలోని వెలితిని చాటిన కథ ‘ఈశ్వరేచ్ఛ!’. కర్మ పక్వానికి రానిదే భగవంతుడయినా సాయం చేయలేడని, సమయం ఆసన్నమైనప్పుడు – మానుష రూపంలో తన సాయాన్ని అందిస్తాడని ఈ కథ చెబుతుంది. కథలో విష్ణువు, లక్ష్మీదేవిలను పాత్రలుగా చూపిస్తూ, ఒక్కోసారి ఒక్కో నామంతో వారిని ప్రస్తావిస్తూ – కథ చదివే పాఠకులు అప్రయత్నంగానే భగవన్నామం స్మరించేట్టు చేశారు రచయిత. వాకాటి పాండురంగారావు స్మారక పురస్కారం పొందిందీ కథ.

రెడ్ ఫైల్!’ చక్కని కథ. క్షణికావేశంలోనో, థ్రిల్ కోసమో అల్లరి చేసే విద్యార్థులకు బుద్ధి చెప్పి సన్మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుల కథ. ఉపాధ్యాయ కథల పోటీలో రెండవ బహుమతి పొందిందీ కథ.

జీవితంలో దేనికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పిన కథ ‘ముందస్తు జాగ్రత్త!’. మనిషి బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలో, తన జీవన ప్రయాణంలో ఏయే జాగ్రత్తలు తోసుకోవాలో గొప్పగా చెబుతుందీ కథ. ఆర్ద్రమైన కథ.

ఈ సంపుటిలో పేద అర్చకులపై రాసిన మరో కథ ‘వెలసిపోయిన పాతచీరలు’. ‘ఈశ్వరేచ్ఛ!’ కథలో దైవాన్ని నమ్మి వెతలను భరించిన శేషాచార్యుల లోని మానసిక స్థైర్యం ఈ కథలోని శ్రీనివాస శర్మలో ఎందుకు లోపించిందో అర్థం కాదు. ‘ఈశ్వరేచ్ఛ!’ కథలో అర్చకునికి ఆర్థిక కష్టాలున్నాయి, ఈ కథలోని అర్చకునికీ ఉన్నాయి. ఈ కథలో అదనంగా కరోనా అనంతర ఇబ్బందులూ ఉన్నాయి. ఆ కథని సానుకూల దృక్పథంతో ముగించి, ఈ కథని విషాదాంతం ఎందుకు చేశారో రచయిత అని పాఠకులకు అనిపిస్తుంది. ఆ కథలోని అర్చకునికి సహమనస్కుల సాయం దక్కింది, ఈ కథలోని అర్చకుని అదీ కూడా దక్కలేదు. దుర్భర జీవితాన్ని వ్యథాభరితంగా ముగించడం బాధ కలిగిస్తుంది.

బీదలనీ, నిస్సహాయులనీ మోసం చేసి పబ్బం గడుపుకునే ధూర్తుల నైచ్యాన్ని ‘రంగు కాగితం!’ కళ్ళకు కడుతుంది. కూతురి పుట్టినరోజుకి – పాప అడిగిన చిరు కోరిక తీర్చాలన్న ఆ తండ్రి ప్రేమ – దుర్మార్గుల బారినపడి రక్తమోడుతుంది.

మధ్య తరగతి ప్రజల జీవితాలకు ఆర్థిక భరోసా లభించాలంటే ఏం చేయాలో ‘త్రిసూత్ర పథకం!’ కథ చెబుతుంది. అదుపు, పొదుపు, మదుపు – ఆ మూడు సూత్రాలు! నిత్య జీవితంలో ఎంతగానో ఉపకరించే ఇతివృత్తంతో అల్లిన ఈ కథని కాస్తంగా హాస్యంగా నడిపారు రచయిత. ఒక పేరాలో కేంద్ర ఆర్థిక మంత్రుల పేర్లతో పదాలను కూర్చడం రచయిత చతురతని తెలియజేస్తుంది.

సంతానం పట్ల తండ్రి ఆప్యాయత ఎలా ఉంటుందో ‘నాన్న ప్రేమ!’ కథ చెబుతుంది. ఆర్ద్రమైన కథ. ఆఖరి వాక్యం కథకి హైలైట్. ఈ కథ చదువుతుంటే, నేను అనువదించిన ‘బొమ్మ’ కథ గుర్తొచ్చింది.

తానిష్టపడిన అమ్మాయి పెట్టిన షరతులు విని, తన ప్రేమ కన్నా – తన మీద తన తల్లి ప్రేమే గొప్పదని గ్రహించిన కొడుకు కథ ‘జ్ఞానోదయం!

వ్యక్తిత్వం, సత్సంగ్, కొత్త జీవితం!, నిమజ్జనం!, పరిహారం! – కథలు ఆసక్తిగా చదివిస్తాయి. ఆలోచింపజేస్తాయి.

~

కథలు మంచికథలుగా రూపుదిద్దుకోడానికి మూడు లక్షణాలు అవసరమంటూ తన ముందుమాటలో డా. ఆచార్య ఫణీంద్ర చెప్పిన లక్షణాలు ఈ కథలకు ఉన్నాయనడంలో సందేహం లేదు. నిరాశపరచని కథల సంపుటి ఇది!

***

కథా తిలకం (కథా సంపుటి)
రచన: కుంతి (కౌండిన్య తిలక్)
ప్రచురణ: ప్రియమైన రచయితలు, విశాఖపట్టణం
పేజీలు: 248
వెల: ₹ 250/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
రచయిత: 8790920745

 

 

 

 

 

~

శ్రీ కౌండిన్య తిలక్ (కుంతి) గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-kunthi/

Exit mobile version