Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథగా, కల్పనగా..

[టి.ఎస్.ఎస్. మూర్తి గారు రచించిన ‘కథగా, కల్పనగా..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“మీ అమ్మ, నాన్న ఎలా ఉన్నారు?” అని ఎన్నిసార్లు ఎంత మంది అడిగినా, “ఏదో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు,” అని సమాధానం ఇచ్చేదాన్ని. ఎక్కడో ఖండాంతరాల్లో ఉండే మాకు, ఎనభైలు దాటిన వారితో మాట సాయమే గానీ మనిషి సాయం చేయాలంటే, సెలవ పెట్టుకు వస్తేనే కుదురుతుంది. మేము ఫోన్ చేస్తే పరవా లేదు. కానీ, వాళ్ళ దగ్గర నుండి వస్తే మాత్రం ఏదో చెప్పలేని ఆందోళన.

అలానే, రెండు వారాల క్రితం ఫోన్ కాల్ వచ్చింది. వినలేని విషయమే. వెంటనే బట్టలు సద్దుకుని దొరికిన ఫ్లైట్ కి బుక్ చేసుకుని నేను, మా ఆయన బయలుదేరి ఇండియా వచ్చాము. దారి పొడుగునా నాన్న జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, కంట తడి పెట్టుకుంటూనే ఉన్నాను. ద్విభాషా కోవిదులైన నాన్న, చదివిన, వ్రాసిన పుస్తకాలెన్నో. ఎనభైమూడేళ్ళ వయసులో, ‘భాగవతంలో భక్తుల’ గురించి పుస్తకం వ్రాసి ప్రచురించారు. ఆయన పఠనా సామర్థ్యం, రచనా సామర్థ్యం అనిర్వచనీయం. వ్రాయగలిగినన్నాళ్ళు ఆయనే వ్రాశారు. వయసు మీద పడి, చేతులలో ఓపిక సన్నగిల్లిన తరువాత, అమ్మ మరియు మా మేనత్త కొడుకు ఆయనకి ఠావులు నింప నారంభించారు. అమ్మ తెలుగు కీబోర్డ్ మీద టైప్ చయ్యడం కూడ నేర్చుకుంది. ఎంతైనా సహ ధర్మచారిణి కదా!

ఎప్పుడు వచ్చినా, ఇద్దరూ మమ్మల్ని ఆహ్వానిస్తారు. కానీ, ఇప్పుడు, అమ్మ ఒక్కతే. రాగానే, ఎదురుకుండా అమ్మని చూసి దుఃఖం ముంచుకొచ్చేసింది. గట్టిగా కౌగిలించుకుని బోరున ఏడ్చేశాను. అమ్మ కూడ వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఈ బాధ ఆర్చేదీ కాదు, తీర్చేది కాదు. ఎంత వీలైతే అంత ఓదార్పు మాత్రమే. “రాత్రి బాత్రూమ్‌కి వెళ్ళొచ్చి అలా కుర్చీలో కూర్చున్నారు. అంతే, ఒక్క పెద్ద త్రేణుపు వచ్చింది.. నాతో ఒక్క మాటైనా చెప్పలేదు,” అంటూ అమ్మ మళ్ళీ కన్నీటి పర్యంతమయింది.

తమ్ముడికి వెంటనే ఇండియాకి టికెట్ దొరకలేదు. మర్నాటి సాయంత్రమే రాగలిగాడు. ఈ మధ్యలో, చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు పరామర్శకు వస్తునే ఉన్నారు. వారందరితో మాట్లాడేటప్పుడు, నాన్నతో సుమారు ఆరు దశాబ్దాల సహజీవనం చేసిన అమ్మ, ఏదో ఒక జ్ఞాపకంతో కళ్ళు చమర్చడం. వచ్చిన వాళ్ళు వాళ్ళకి అమ్మానాన్నలతో ఉన్న అనుభూతులను జ్ఞప్తికి తెచ్చుకుని కన్నీళ్ళు పెట్టుకోవడం. అందరితోటి, అమ్మ, “రాత్రి బాత్రూమ్‌కి వెళ్ళొచ్చి అలా కుర్చీలో కూర్చున్నారు. అంతే, ఒక్క పెద్ద త్రేణుపు వచ్చింది.. నాతో ఒక్క మాటైనా చెప్పలేదు,” అనడం. ఈ ఆలోచన అమ్మని చాల బాధ పెడుతోంది. ఈ విషయం గమనించి కూడ ఏం చేయాలో నాకు పాలుపోలేదు.

అన్ని కార్యక్రమాలు ముగిశాయి. కానీ, అమ్మ నోట ఆ మాట వింటూనే ఉన్నాను. ఆవిడ, నాన్న ఏం మాట్లాడాలని ఆశిస్తోంది? విషయం ఎందుకో చాలా సున్నితం  అనిపించింది. అమ్మనే అడుగుదామన్నా, ధైర్యం చాల లేదు. అమ్మని సమాధానపరచడం, నా ఆలోచనలను ఆపుకోవడం, రెండూ కష్టసాధ్యంగానే మారాయి.

రాత్రి పదైంది. అమ్మని కాస్సేపైనా పడుకోమని, ఏసి వేసి, అమ్మకి దుప్పటి కప్పి, అమ్మ పక్కనే నేనూ నడుము వాల్చి, నా ఫోన్ తీసి సోషల్ మీడియా మెసేజస్ చూడడం మొదలు పెట్టాను. ఆ సమయంలోనే టర్కీలో భూకంపం వచ్చింది. చాల మెసేజస్ వాటికి సంబంధించినవే. అలా స్క్రోల్ చేస్తూ ఉంటే, ఒక పోస్ట్ నాకు చదవాలనిపించింది.

అందులో కూడా ఆ భూకంపానికి సంబంధించిన సమాచారమే. కానీ, చదవకుండా ఉండలేకపోయాను. “అక్కడ శిధిలాలలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నమది. అక్కడి సైన్యం ఒక ప్రదేశమంతా వెతికి, ఇంక ఎవరూ ప్రాణాలతో లేరని వెళ్ళిపోతున్న సమయంలో ఒక చోట పడిపోయే గోడను వీపుతో ఆపుతూ ఒక స్త్రీ తన రెండు చేతులను పడగలా ముందుకు పెట్టి కనిపించింది. అందులో ఒక సైనికుడు దగ్గరకి వెళ్ళి క్రిందకి వంగి కనిపించే కొద్ది స్థలంలోంచి చూశాడు. ఎంత ప్రయత్నించినా ఆ మనిషిలో ఉలుకు పలుకు లేదు. ఇంక వెనుదిరిగారు.”

“కానీ, కొన్ని అడుగులు వేశాకా, ఆ సైనికుడికి ఒక అనుమానం కలిగింది. ఆవిడలో ప్రాణం లేదు సరే, ఆ చేతులు అలా ఎందుకు పెట్టింది అని. ఉన్నట్టుండి అతనిలో ఏదో ఆశ, ఆందోళన మొదలయ్యాయి. వెంటనే మళ్ళీ అందరినీ తీసుకుని వెనక్కి వెళ్ళి, మెల్లిగా పైనున్న గోడను కొంచం జరిపి చూస్తే, అక్కడ ఆ తల్లి చేతుల క్రింద ఒక నెలల పసికందు ఉంది. వాళ్ళు జాగ్రత్తగా ఆ పసివాడిని బయటకు తీసి రక్షించారు. ఆ తల్లి తన ప్రాణం పణంగా పెట్టి తన పసివాడికి మరోసారి ప్రాణం పోసింది,” అని వ్రాసి ఉంది.

వెంటనే లేచాను. అమ్మకి నిద్రాభంగం కాకుండా బయటికి వచ్చి, నాన్న టేబుల్, డ్రా అంతా వెతికాను. ఆయన పుస్తకాల గూళ్ళు, అందులోని ప్రతి పుస్తకం వెతికాను. ఆయన ప్రార్థనా ప్రదేశము, వస్తువులు, పుస్తకాలు.. ఏదీ వదలకుండా అన్నీ చూశాను. నా ఆత్రం పెరుగుతోంది, సహనం నశిస్తోంది. అయినా ఆగలేదు. ప్రతి గదీ వెతికాను. ఉపయోగం లేకపోయింది. వెళ్ళి నాన్న టేబుల్ దగ్గర కూర్చున్నాను. ఏదో తపన. ఏదో ఆశ. ఏదో ఆందోళన. నన్ను తరుముతోంది. కళ్ళు ఏదో పసిగట్టడానికి ఈ గదుల్లోనే విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.

నాన్న టేబుల్ పైన ఒక లామినేటెడ్ ఫొటో ఉంది. అందులో రాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుంటున్న దృశ్యం ఉంది. “అందులో ఆంజనేయుడి ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి” అని నాన్న చాలా సార్లు అన్నారు. అది ఒక పుస్తకం అట్ట మీద ఉంటే, నాన్న దాన్ని కాపీలు తీయించి, లామినేట్ చేయించి, మా అందరికి, తన ప్రియ శిష్యుడికి కూడ ఇచ్చారు.

ఇవన్నీ తలచుకుంటూ ఆ ఫోటొ చేతిలోకి తీసుకున్నాను. దాని వెనక్కాల ముట్టుకుంటే ఊడిపోయేంత టేప్ పెట్టి ఒక కాగితం నా చేతిలోకి వచ్చింది. ఆత్రంగా దాని మడత విప్పి చూశాను. అది నాన్న చేతి వ్రాత. అందులో ఇలా వ్రాసి ఉంది,

“ప్రియమైన భార్యమణికి.. ఇన్నేళ్ళ నీ సహచర్యంలో నాకు ఎన్నో అనుభూతులను ఇచ్చావు. ఏన్నో రకాలుగా ఆనందాన్ని ఇచ్చావు. ఎన్నో ఒడుదుడుకులను ఓర్చావు. నా ఆనందంలోనే కాదు, నా ప్రతి బాధలోనూ సగ భాగమయ్యావు. ఒక సహధర్మచారిణి అంటే నువ్వు, ఒక అమ్మ అంటే నువ్వు, ఒక ఇల్లాలు అంటే నువ్వు అని ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే అనాలోచితంగా చెప్పే స్థాయికి ఎదిగావు.. మనం తెలిసిన వాళ్ళకి తెలుసు మనమంటే ఏమిటో.. కానీ, మనమూ మనుషులమే కదా! వయసు మీరింది. జవసత్తువలు బాగా తగ్గాయి. మందులతో, నేడో రేపో అనుకుంటూ, రోజులు వెళ్ళబుచ్చుతున్నాం. ఒకవేళ నీకంటే నేను ముందర ఉంటే, నీతో ఒక్క మాటైనా చెప్పలేదు అనుకుంటావేమో. అలా నువ్వు అనుకో కూడదనే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మా అమ్మ నా బాల్యంలో నన్ను ఎంత లాలించిందో నాకు తెలీదు. కానీ, నా రెండో బాల్యంలో ప్రతి క్షణము నువ్వు మా అమ్మను గుర్తుచేశావు. నీవు ధన్యజీవివి. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీకు సహధర్మచారిణి కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

ఇట్లు

నీ ఋణానుబంధువు”

అది చదువుతున్నంత సేపు నాకు కన్నీళ్ళు ఆగలేదు. నాన్నకి అమ్మంటే ఎంత ప్రేమో అంత గౌరవం కూడ. తను ఉన్నా లేకపోయినా కూడ, అమ్మ ఉన్నన్నాళ్ళూ ఆనందంగా ఉండాలనే ఆయన తపన. ఈ ఉత్తరమే అమ్మ శేష జీవితానికి ఆయన ఇచ్చిన ‘ఆ టర్కీ తల్లి’ లాంటి అభయ హస్తం.. ఇప్పుడు అమ్మ మనసు కుదుట పడుతుంది.

Exit mobile version