Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కటీలు దుర్గా పరమేశ్వరి ఆలయ సందర్శనం

[ఉత్తరకన్నడ జిల్లాలోని కటీలు దుర్గా పరమేశ్వరి ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]

కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లాలో, మంగళూరుకు 23 కిలోమీటర్ల దూరంలో, సప్త దుర్గ ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయం నందిని నది మధ్యలో ఉంటుంది. నందిని నది రెండు పాయలుగా విడిపోయి, మరల ఆ రెండు పాయలు కలిసిపోతాయి. ఆ పాయల మధ్య ఈ ఆలయముంటుంది. నీటి మధ్యలో ఉండడంతో జలదుర్గగా అమ్మవారిని పూజిస్తారు. తులు భాషలో కటి అంటే మధ్య, ఇల అంటే ప్రాంతం, అందుకే దీనిని కటీలని పిలుస్తారు.

పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించే నందిని నది, దాని చుట్టూ ఉన్న పచ్చని చెట్లతో కూడి ఉన్న ప్రకృతి సౌందర్యాల మధ్య అలరారుతున్నట్టు కనిపిస్తుందీ ఆలయం. కటీలు పట్టణంలో నుండి ఆలయ ప్రవేశం చేస్తున్నప్పుడు నది కనిపించదు. గాని, వెనక వైపుకు వెళ్ళినప్పుడు నందిని నది, అక్కడ స్నానం చేసుకునే ఏర్పాట్లు కనిపిస్తాయి.

పురాణ కథనం ప్రకారం, అనలాసురుడనే రాక్షసుడు, రెండుకాళ్ల ప్రాణులతో గాని, నాలుగు కాళ్ల ప్రాణులతో గాని మరణం సంభవించకుండా ఉండేటట్టుగా బ్రహ్మదేవునిచే వరాన్ని పొంది, వరగర్వంతో అందరిని హింసిస్తున్న వేళ, అతడిని సంహరించడానికి దుర్గాదేవి వచ్చి, యుద్ధం చేస్తూ మధ్యలో ఒక పెద్ద బండరాయిలోకి ప్రవేశించి అదృశ్యమైపోయిందట. అంత అనలాసురుడు ఆ బండరాయిని తన ఖడ్గంతో కొట్టగా, బండరాయి మధ్యలో చీలి, అందులో నుండి ఆరు కాళ్ళున్న కీటకాలు వచ్చి అనలాసురుని చంపాయని చెప్తారు.

దుర్గాదేవి అదృశ్యమైపోయిన బండరాయి

మనం ఆలయం లోనికి ప్రవేశించడానికి ముందు, మనకక్కడ మధ్యకు చీలినట్టున్న పెద్ద బండరాయి, దాని పక్కన ఒక పీఠం కనిపిస్తాయి. ఈ పీఠంపై కూర్చుని, దుర్గాదేవి యక్షగానాలను వీక్షిస్తుందని ప్రతీతి. ఎందుకంటే కటీలు యక్షగానానికి ప్రసిద్ధి చెందింది కనుక.

ఆలయం విశాలమైన ప్రాంగణంలో ఉంటుంది. ఈ పెద్ద రాతిని దాటాక, కాళ్లు కడుక్కునేందుకు కొళాయిలుంటాయి. కడవతో నీళ్లు పట్టుకున్న ఒక స్త్రీమూర్తి విగ్రహముంటుందక్కడ. క్యూలైన్లు దాటి ముందుకెళ్తే, ఆలయం ముందున్న విశాలమైన హాలు కనిపిస్తుంది. కుడివైపు తిరిగితే ఆలయంలోకి ప్రవేశిస్తాం.

ఆలయ ప్రధాన మంటపంపై ముగ్గురమ్మల శిలా విగ్రహాలు గోచరిస్తాయి. ఇది దాటి ముందుకెళ్తే ఆలయ ప్రవేశద్వారం, వెండితో చేయబడి అయిదు ద్వారాలు కలిపి పెడితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే, పగోడా శైలిలో ఆలయం ఉంటే, చుట్టూ విశాలమైన ప్రదక్షిణ మార్గం, దాని చుట్టూ వరండా, ఆ వెనుక గదులు, వాటిపై రెండంతస్తుల భవనం కనిపిస్తాయి.

గర్భగుడి ముందున్న ధ్వజస్తంభం బంగారంతో తాపడం చేయబడి ఉంది. ఆలయ గోడలు వెండితో తాపడం చేయబడి ఉన్నాయి. ఆలయగోడలపై, 5 వరుసలలో దీపాలు పెట్టడానికి వీలుగా ప్రమిదలు అమర్చబడి ఉన్నాయి.

అమ్మవారి మూర్తి బంగారంతో చేయబడి, బంగారంతో చేయబడిన సింహ వాహనంపై కూర్చున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అమ్మవారు చతుర్భుజాలతో, శంఖు చక్రాలను రెండు చేతుల్లో దాల్చి అభయ వరద ముద్రలతో మనల్ని అనుగ్రహిస్తారు. అమ్మవారి తలపై పడగ విప్పిన నాగభరణం కనిపిస్తుంది. గర్భగుడి ముందు ముఖమండపం ఉంది, దాని ముందు నుండి మాత్రమే మనకి దర్శనానికి అనుమతి ఇచ్చారు. గోపురం పగోడా శైలిలో ఉంది.

ఆలయం ముందు వ్యాసకర్త

ప్రదక్షిణ మార్గంలో ముందుకెళ్తే, వసంత మందిరమని చిన్న మందిరముంది. ఈ మంటపం దుర్గాదేవి అవతారంతో అలంకరించబడి ఉంటుంది. అందులో ఉత్సవమూర్తులకు పూజలు చేస్తారట. అమ్మవారి కుడివైపు, ఆలయ గోడకు అనుకొని గణేశుని మందిరముంది. గణేశునిపై పడగ విప్పినట్లు నాగాభరణం ఉంది. దక్షిణాభిముఖంగా ఉన్న ఈ విఘ్నేశ్వరునికి ఎదురుగా హోమగుండం కనిపిస్తుంది. దాని ఎదురుగా ఉన్న వరండాలో స్వర్ణరథం కనిపిస్తుంది.

ఆలయానికి ముందు నాగసన్నిధి ఉపాలయం ఉంది. వనశస్తార సన్నిధి, అయ్యప్ప స్వామి సన్నిధి కూడా కనిపిస్తాయి. వీటి దర్శనాలయ్యాక, బయటకు వస్తే, ఎదురుగా ఉన్న పెద్ద హాలులో కుడివైపు గోశాల, ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఇంకొక నాగసన్నిధి ఉంది. ఈ సన్నిధిలో చాలా నాగదేవతల ప్రతిమలున్నాయి. ఈ నాగ సన్నిధిని చిత్రకూటం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిరోజూ అభిషేకాలు చేస్తారు.

దాని ప్రక్కన ఉన్న బ్రిడ్జిని దాటి, ఎదురుగా ఉన్న మెట్లెక్కి వెళ్తే, అనలాసురునికి వరమిచ్చిన బ్రహ్మదేవుని ఆలయం, గోపాల కృష్ణ విహార్ కనిపిస్తాయి. ఆ వెనుక చుట్టూ చెట్లతో కూడి ఉన్న నందిని నది కనిపిస్తుంది.

నందిని నది మధ్యలో ఈ ఆలయం ఉందని అన్నా, చుట్టూ కాలువ లాగా, వాటికి అనుకొని సిమెంటు కట్టడాలు చాలా ఉన్నాయి. వర్షాకాలంలో నదీ ప్రవాహం బాగా కనిపిస్తుంది. గాని మేం ఏప్రిల్ నెలలో వెళ్లడంతో, మనం ప్రత్యేకంగా చూస్తే తప్పించి చుట్టూ నది ఉందనే విషయం గమనించలేం.

రెండవ అంతస్తులో అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ కూర్చునే భోజనం చెయ్యాలి. ఉడిపి, కుక్కే సుబ్రమణ్య స్వామి ఆలయంలో కూడా కూర్చునే భోజనం చెయ్యాలి. కోరిన కోర్కెలు నెరవేరిన భక్తులిక్కడ తులాభారం తూసుకుంటారు.

ఆలయాన్ని సందర్శించిన వ్యాసకర్త బృందం

చైత్రమాసంలో జరిగే ఉత్సవాలలో పల్లకి, రథం, ఇంకా ఇతర వాహనాలలోనూ, ఆలయానికి ప్రత్యేకంగా ఉన్న గజరాజు మీద అమ్మవారిని కన్నుల పండుగగా ఊరేగిస్తారు. ఉగాది, నాగపంచమి, శరన్నవరాత్రులలో పెద్ద ఎత్తున ఉత్సవాలను చేస్తారు. వాటిలో పాలు పంచుకోవడానికి లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారు.

మేం వెళ్లిన సమయంలో భక్తుల రద్దీ మరీ ఎక్కువగా లేనందువలన, అమ్మవారి దర్శనం బాగా అయింది. చక్కని అనుభూతులను మనసులో మూట కట్టుకొని తిరుగు ప్రయాణమయ్యాం.

Exit mobile version