Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కత్తి పదునా?

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘కత్తి పదునా?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రేమలు పంచాల్సినవారు
ప్రేమను పంచుకునేవారు
ఒకరిపై ఒకరు ద్వేషపూరితులై
అంతం చూసుకుంటూ
నేను చంపుతున్నానంటూ
నాపై ఆరోపణలు చేస్తారు అందరూ
నా ప్రమేయ మేమున్నది
మనిషి తన ఆలోచనలకు తోచినట్లు
నన్ను వాడుకుంటున్నాడు
నాడు రాజులు నన్ను చేతబట్టి
శత్రుసంహారం చేసినప్పుడు
వీరత్వానికి చిహ్నమన్నారు
విజయాలకు నేనే కారణమన్నారు
స్వార్థపూరిత మనస్కుడైన మనిషి
ప్రేమలను అంతం చేయడానికి
నేడు నన్ను వాడుతున్నాడు
నన్ను నిందిస్తారు కానీ
నన్నే సాధనంగా చేసుకున్న
మనిషిని గౌరవంగా చూస్తారెందుకు
జననం నుంచి మరణం దాకా
అన్నివేళలా నా అవసరం
అందరికీ కొండంత
ప్రకృతిని విధ్వంసం
చేయడానికి ఉపయోగిస్తారు
తోరణం కట్టాలంటే నేనుండాలి
మంచిచెడులకు నేనేమూలం
అయినా నన్ను వాడి అయినదాన్నని
దయలేనిదాన్నని నిందిస్తారు
నాకంటే పదునైనది
మనిషి నాలుక
అతని మాటెంత కఠినం
మాటలతో కోటలు కడతాడు
కొంపలూ కూల్చగలసమర్థుడు
అయినా అతణ్ణి దేవుడిగా కొలుస్తారు
నన్ను నిందలపాలు చేస్తారు
నా ప్రమేయం లేకుండా జరిగే వాటికి
నన్ను దోషిని చేస్తారు
ఒక్కరూ నా గురించి ఆలోచించరు
ఇదెక్కడి న్యాయం.

Exit mobile version