[శ్రీశ్రీ గారి కవితకి ప్యారడీగా ‘కవితా ఓ కవితా!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నారు సముద్రాల హరికృష్ణ.]
~
నీ కోసం నే తిరిగిన అడవుల్లో
కారడవుల్లో, చిట్టడవుల్లో
నడి యెండల్లో జడివానల్లో
ఏకాకిగ, చీకాకుల నవయలేదు
వేదాంతినై, ఏమేమో బోధించలేదు
నా దిక్సూచికి ముల్లసలే లేదు.
ఈ జటి దారింకా తప్పలేదు!
కవితా, ఓ కవితా
కవి మానస రాహస్యాక్షర సుమలతా!
నీ వపుడే వస్తావా నా కగుపిస్తావా
కరవశ మౌతావా, మరపిస్తావా
నేన్నమ్మను, నేన్నమ్మను!
***
నీ దర్శన భాషణాల కోసం
నే నుండిన ఉపవాసాల్తో
నా తాగిన కటు కషాయాల్తో
నా లేచిన ఉషోదయాల్లో
నే నేసిన శవాసనాల్తో
నే పూనిన తపో వ్రతాల్తో
నేనింకా కాలలేదు, రాలలేదు!
కవితా, ఓ కవితా
కవి మానస రాహస్యాక్షర సుమలతా!
నీవపుడే వస్తావా నా కగుపిస్తావా
కరవశ మౌతావా, మరపిస్తావా
నేన్నమ్మను, నేన్నమ్మను!
***
నీ కోసం నే నెక్కిన కొండలలో
దూరిన పలు లోయలలో
ఆ ఎత్తులలో, ఆ లోతులలో
ఆ భల్లూకపు వాదాలతో
ఆ వానర సంభాషణల్తో
ఆ అగమ్య అయోమయంలో
నేనింకా కృశీభూతునవలేదు
కవితా, ఓ కవితా
కవి మానస రాహస్యాక్షర సుమలతా!
నీవపుడే వస్తావా నా కగుపిస్తావా
కరవశ మౌతావా, మరపిస్తావా
నేన్నమ్మను, నేన్నమ్మను!
***
నీ వెన్నెల నవ్వుల కోసం
నీ చల్లని పల్కుల కోసం
నీ మల్లెల చూపుల కోసం
నే చేయని ఊహలు కలవా
నే పాడని రాగము కద్దా
నే వేయని తాళము కలదా
నేనిటు చేయని కసరత్తేమున్నది
కవితా, ఓ కవితా
కవి మానస రాహస్యాక్షర సుమలతా!
నీవపుడే వస్తావా నా కగుపిస్తావా
కరవశ మౌతావా, మరపిస్తావా
నేన్నమ్మను, నేన్నమ్మను!
****
ఆ ఆశనిరాశల వీథుల్లో
తెగ చిక్కిన వేషాల్లో
గాలిలో గీసే రాతల్లో
ఊహల గగనాల్లో
కల్పనల కాననాల్లో
వ్యాకరణాల రణాల్లో
ఛందస్సుల మీమాంసల్లో
పదాల శోభారణ్యాల్లో
అర్థాల ఆకాశగంగల్లో
అలంకార ఉద్యానాల్లో
వ్యాఖ్యానాల ఓషధివనాల్లో
ఇంకా నే తిరగందే
మాకంద రసాలను పట్టందే
భావాల సంపెగల నేరందే
పలుకు జాజుల నెంపిక సేయందే
వర్ణనల అశ్వత్థాన్ని తాకందే
కథన కదంబ పరిచయం కానిదే
నీవపుడే వస్తావని నా కగుపిస్తావని
కరవశ మౌతావని, మరపిస్తావని
నేన్నమ్మను, నేన్నమ్మను!
అయినా సరే, వెనుకడుగే లేదు
అందాకా నేనొక జడ భగీరథుణ్ణే
జడత, కార్యాన్య శూన్యతలో
భగీరథత్వం, కవితా బృహత్సాధనలో!
అటు చూస్తే, కవితారాధక విశ్వామిత్రుణ్ణి
పడతా లేస్తా పడి లేస్తా, ఆగను
ఉడుం పట్టు నాది, అది సడలదు
కానీ, ఏ మేనక ఇక నన్నేమార్చదు
ఇటు చూస్తే, ఏ వశిష్ఠమత్సరమూ లోబరచదు
కవి నామార్హతే నాకు బ్రహ్మర్షిత్వం
దాని కోసమే నా యీ తాపసవ్రతం
అదిగో ఊరిస్తోందదె నవ ఉషోదయం!
నేనొక మహాధృతి పుణ్యవారసుణ్ణి
నా పితరుల గంగోదక ప్రోక్షణకై కాదీ పోరాటం
నా కవితా పిపాసశాంతి కోసమే ఈ ఆరాటం
నే తెచ్చే కవితా ఝరి వియద్గంగ కాదు
నే రప్పించేది నవశ్రుతుల నవజతుల అక్షరగంగ
ఆ గంగను పట్టే శివుని కోసమే ముందీ అన్వేషణ
శివుడు దొరికాడో, కవిత రాక ఖచ్చితమే
ఆ శివాన్వేషణకై నే వెళుతున్నా నిపుడు!
సెలవిక సెలవిక సెలవిక
మళ్ళీ ఇక మీతో ముఖాముఖీ,
కవితాధనంతోనే, కవితా ఘనంతోనే!
***
ఈ జన్మకు సఫలం కానో,
ముందటి పుట్టువు లేదూ
నేనాశా జీవిని
మెచ్చి, ఔనని తలలూచేవరకూ
అచ్చున పడిన అక్షరంలా
చెదరను కదలను
అక్షరాలా నీ భక్తుడిలా
నే సాగిస్తా కొనసాగిస్తా
నా ఈ కవితావనితా పావనాన్వేషణం
నా జీవన సాఫల్య సదుద్యోగం
నను ధన్యుని చేసే సారస్వత యోగం!!
కవితా ఓ కవితా
మృదుతర రసభర మధురోహా శంపాలతా!!
