Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఏరికోరి అల్లిన చిరుపదాల మల్లెమాలలు – ‘కవితాచంద్రికలు’

[శ్రీమతి చంద్రకళ.దీకొండ గారి ‘కవితాచంద్రికలు’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి మంజీత కుమార్.]

పోటీ ఏదైనా.. అంశం ఎలాంటిదైనా.. చంద్రకళగారు ఒక్క నిమిషం కలం పట్టారంటే.. విజేతగా నిలవాల్సిందే. ఎంచుకునేవి చిరుపదాలే అయినా.. ఏరికోరి అల్లిన మల్లెల మాలలా అందంగా విరబూస్తాయి.. ముగ్ధమనోహరంగా అలరిస్తాయి.

తెలుగు సాహితీ వనంలో పరిచయమే అవసరం లేని మకుటం లేని కవితా మహారాణి- చంద్రకళ.దీకొండ గారు. ఇప్పటికి ఎన్ని వేల కవితలు రాశారో, ఎన్ని అసంఖ్యాక బహుమతులు, పురస్కారాలు, ప్రశంసా పత్రాలు సొంతం చేసుకున్నారో లెక్కేలేదు. అయినా కూడా చంద్రకళగారి కాంపౌండ్‌లో గర్వం, అహంకారం అన్నవి కానరావు. అందరితో ప్రేమగా మాట్లాడడం, చిరు రచయితల కథలు, కవితలకు కూడా ప్రశంసాపూర్వక అభినందనలు తెలియజేయడం నిజంగా ఆవిడ మహోన్నత మనసుకు నిదర్శనం.

చంద్రకళ.దీకొండ గారి కవితలు ఏ సాహితీ సమూహంలోనో లేదా ఏ సోషల్ మీడియాలోనో కనిపిస్తే చాలు, తప్పకుండా చదవడం నాకొక అలవాటుగా మారింది. కొత్తగా కలం పట్టిన నాలాంటి వారికి పి.హెచ్‌.డి.కి సరిపడా సరుకు అందులోనే ఉందన్నది సత్యం. సూటిగా మాటల తూటాలు విసురుతూ ఒకసారి, మనసులోని అలజడికి తెరదింపేలా మరోసారి.. అసలు చంద్రకళగారు స్పృశించని అంశమంటూ ఉందా అనిపించక మానదు.

ఇక చంద్రకళ.దీకొండ గారి కలం నుంచి జాలువారిన ఈ ‘కవితా చంద్రికలు’ పుస్తకం జీవితంలోని ప్రతి వెలుగు చీకట్లను మన కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. ఒక్కో కవిత, ఒక్కో భావావేశమై మన హృదయాలలో పదిలమవుతుంది. కొన్ని కవితలు మన ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తాయి. మరికొన్ని మనలో సమాధైన ఆశయాలపై ఆశలు మొలకెత్తిస్తాయి.

అటువంటి కవితా చంద్రికల్లోకి వివరంగా వెళితే..

‘నీ ధైర్యమే దైవం’ అను కవిత నేటి సమాజానికి అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. మూఢ నమ్మకాలను నమ్మే జనం, వాటిని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకునే బృందం.. ఇందుకు సంబంధించి రాసిన కవితలో మనం ఎలాంటి ఉచ్చులో చిక్కుకుంటున్నామో అద్భుతంగా వివరించారు.

‘నీలోని ధైర్యమే దైవం/నీలోని భయమే దెయ్యం’ అంటూ రాసిన పదాలు నభూతో నభవిష్యత్‌.

‘చాప క్రింద నీరు’ కవితలో మసిబారిన మాధ్యమాల్లో విస్తరిస్తోన్న విష సంస్కృతిపై కొరఢా ఝళిపిస్తూ రాసిన కవిత చాలా సందర్భోచితంగా ఉంది. యువత భవితను అవి ఎలా ప్రభావితం చేస్తాయో చక్కగా వివరించారు.

‘రాజహంసలు’ అనే కవితలో ‘కలకాలం బతికే కాకుల లోకంలో/ధన్య జీవనం గడిపే రాజహంసలు వారు/మంచుకొండలే మల్లెల దిండుగా/పవళించే మహారుషులు వారు’ అంటూ జవానులపై అక్షర వర్షం కురిపించి.. వారి సేవలను కొనియాడిన తీరు ఆహా అనిపించక మానదు.

‘జాతి సంపదలు’ అను కవితలో ‘శ్రవణుడిలా కావడిలో మోయనక్కరలేదు/శ్రీరాముడిలా కానలకేగనక్కరలేదు/అన్న పదబంధంతో కట్టిపడేస్తూ../ప్రేమగా కన్నవారిని పలకరిస్తే చాలని’ సూచించిన వైనం కళ్లనీళ్లు తెప్పిస్తుంది.

‘విధి లేని విద్య’ కవితలో చిన్నారులపై చదువుల బరువుల గురించి అద్భుతంగా రాశారు. నీరసంగా నిస్తేజంగా నిస్సత్తువగా అంటూ భావిభారతపౌరుల బరువుని తన భుజాలపైన ఎత్తుకున్నారు. నైతిక విలువలు నేర్పే చదువు కావాలని, విధాన కర్తలు మార్పు తేవాలని సందేశమిస్తూ రాసిన కవితా పంక్తులు మన గుండెలను పిండేస్తాయి.

‘జర పైలం’ తెలంగాణ యాసలో అదరగొడుతూ రాసిన కవిత ఇది. సోషల్ మీడియాలో పరిచయాలు, ప్రేమలు, మోసాలు, దగాలపై రాసిన విమర్శనాత్మక పదముల అల్లిక జబర్దస్త్‌ ఉంది. సైబర్ ఉచ్చులో చిక్కుకోవద్దంటూ ఇచ్చిన సూచన.. యాప్స్‌ను ఎంత వరకూ వాడాలో అంతే వాడాలని ఇచ్చిన సందేశం పాటిస్తే అందరికీ మంచిదే మరి.

‘డబుల్ వర్కింగ్ డే’ కవితలో ఆడవారికి ఆదివారం వస్తే ఎంత ఎక్కువ పని ఉంటుందో వివరంగా తెలిపారు. సెలవు దినం కాదు డబుల్ వర్కింగ్ డే అంటూ మగువలు ఆ 24 గంటలు భర్తాపిల్లలకు అన్నీ సమకూర్చడంలో ఎంత తలమునకలైపోతారో, కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చునే తీరిక కూడా లేకుండా ఎలా అలసిపోతారో చక్కగా రాశారు.

‘మొదటి ప్రేమ’ కవిత మాతృమూర్తిగా అవతరించిన ప్రతీ మహిళ మనసులోని మాటల అక్షర రూపం. కడుపులోని శిశువు చేతుల్లోకి రాగానే ఆ తల్లి హృదయం ఎలా ఆనందంతో పొంగిపోతుందో..

‘నాలోనే దాగున్నది/నేడు విడివడి/ఎదురుగా/కనుల విందుగా’ అంటూ రాసిన అక్షరాలు.. ఒక మధురానుభూతిని కలిగించక మానవు. ప్రతీ అమ్మ మనసు పులకరించక మానదు.

‘ఏదెదురైనా ఎదురేగి సాగనా’ కవితలో ‘ఆశావాదం తోడుగా/హేతువాదం జోడుగా’ అంటూ సమస్యల సుడిగుండాలు ఎన్ని ఎదురైనా జడవక ముందుకు సాగాలని ఇచ్చే సందేశం చాలా బాగుంది. ఇలాంటి ఆశాపూరిత కవితలు ఈ సంకలనంలో ఎన్నో ఉన్నాయి. ‌ప్రతీ కవితా తనదైన శైలిలో మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

‘విజాతి ధృవాలు’ అను కవితలో భార్యాభర్తల అనుబంధాన్ని అద్భుతంగా రాశారు. ఇగోల తుంపరలో కొట్టుకుపోకుండా.. తప్పొప్పులు విచారించుకుని, మన్నింపులు కోరుకోవాలని, అలకలు తీర్చుకుని.. నవ్వుల పువ్వులు విరబూయాలని రాసిన తీరు ఎంతో ముచ్చటగా ఉంది. ప్రస్తుత తరానికి అవసరమైన అద్భుత కవిత.

‘ఎప్పుడైనా ఊహించామా’ అన్న కవితలో ఊహించని విషయాలు ప్రస్తుతం జరుగుతుండడంపై విస్తుపోయేలా రాశారు. అసాధ్యాలన్నీ సుసాధ్యాలయ్యాయని.. శాస్త్రవేత్తలకు కితాబునిస్తూ నేటి సమాజంలో వచ్చిన పెను మార్పులపై చక్కగా కవితను అల్లారు.

‘నాక్కొంచెం స్వార్థమే’ అంటూనే అద్భుత విషయాలను ఆవిష్కరించారు. ‘నేను లేకున్నా నా మంచితనం మిగలాలని../నేను పోయినా నా అవయవాలు అవసరమైన వారికి అందితే చాలని..’ ఎంతో బాగా సందేశమిచ్చారు. ఇది కేవలం చంద్రకళ గారికే చెల్లు.

‘హక్కులేని కౌలుదారు’ అన్న కవిత మనసును కన్నీరు పెట్టిస్తుందనడంలో సందేహమే లేదు.

‘నీ (కడుపు) పంట ఇస్తే చాలంటారు/తాను కష్టపడి పండించిన పంటపై/హక్కులేని కౌలుదారు తాను!’ అంటూ సరోగసీ గురించి హృద్యంగా రాశారు. ఇదే కవితలో ‘తన దేహం ఖాళీ చేసిన అద్దె ఇల్లైపోతుంది!’

అంటూ ఆ స్త్రీ మానసిక శారీరక స్థితికి అద్దంపట్టారు.

‘అక్షరాస్త్రాలు’ కవితలో అక్షరాలను అస్త్రాలతో పోలుస్తూ తీర్చిదిద్దిన అక్షరాంజలి కవితకే పట్టాభిషేకం చేసినట్టుంది. ఇప్పటివరకూ ఎంతోమంది అక్షరం గురించి రాసినా ఇంత అచ్చెరువొందేలా రాయలేదన్నది అక్షర సత్యం.

‘మేకప్‌ పులులు’ కవితా శీర్షికతో రాసిన కవితలో జీవితపు రంగస్థలంపై ఎలా ఉంటే ఆకర్షింపబడతామో చెబుతూ, సమాజంలో పై పై మెరుగులపై పెరుగుతున్న మోజును విమర్శనాత్మకంగా తెలియజేశారు. సహజ సౌందర్యానికి విలువ లేదని, రసాయనాల హంగులకే ఆకర్షణ అని బాధను వెల్లిబుచ్చారు.

‘ఆత్మ విశ్వాసం’ కవితలో కష్టాలు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని, అప్పుడే విజయం సిద్దిస్తుందని ఉదాహరణలతో సహా వివరించిన విధానం మనసులోకి సూటిగా దూసుకెళుతుంది.

ప్రతీ కవితతో పాటుగా ఆ కవిత ప్రచురణ తేదీ, ఎక్కడ ఎప్పుడు ప్రచురణ జరిగింది, ఎవరు ప్రశంసించారు, ఏ సందర్భంలో రాశారో చాలా క్లుప్తంగా వివరించడం అభినందనీయం. మరో గమనించాల్సిన విషయమేమిటంటే..

ఇన్ని వందల కవితలు రాసినా ఎక్కడా ఒక్క అక్షర దోషం కానీ, భావవ్యక్తీకరణలో లోటుగానీ కనిపించదు. భూతద్దం పట్టి వెదికినా, ఒక్క తప్పు ఉన్నట్టు చూపిన వారికి కోటి నజరానా అని ప్రకటించినా కూడా తప్పు దొరకదన్నది వాస్తవం.

చివరగా.. ఇలాంటి మరెన్నో మంచి మంచి పుస్తకాలను చంద్రకళ గారు వ్రాయాలని కోరుకుంటున్నాను. అభినందనలు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యోస్మి!

***

కవితాచంద్రికలు (కవిత్వం)
రచన: చంద్రకళ. దీకొండ
ప్రచురణ: ఉషా ప్రచురణలు, సాహిత్య పబ్లికేషన్స్
పేజీలు: 257
వెల: ₹ 150
ప్రతులకు:
చంద్రకళ. దీకొండ,
ఇంటి నెంబర్:-24-88/12/13/1A,
లక్ష్మీనగర్, ఈస్ట్ ఆనందభాగ్,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.
పిన్ కోడ్:- 500 047
చరవాణి: 9381361384

Exit mobile version