Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవితా కర్పూర క్షేత్రంలో అమరం సినారె కలం

12-6-2022 న డా. సినారె వర్ధంతి సందర్భంగా డా.టి.రాధాకృష్ణమాచార్యులు అందిస్తున్న ప్రత్యేక కవిత.

~

అక్షరాల్లో బతుకుతారు
నేల పొరల్లో సృజనాత్మకంగా

కావ్యాల్లో జీవిస్తారు
ఆకాశ చుక్కలుగా వెలుగునిస్తూ

నక్కవాగు ఇసుక బడి ఓనమాలు
గాజు కన్నుల చేపలీదిన అలలు

తనువంతా
హన్మాజిపేట జీవాక్షరబీజ క్షేత్రం
మనసంతా
మూలవాగు ఒడ్డులోని అక్షరనేత్రం

సిరిసిల్ల సిగలో వాడని పువ్వు
వేములవాడ దైవభూమిలో నడిచిన కలం గళం చెదరని నవ్వు

మానేరు నేర్పిన అక్షరాల ఈతతో
నాగార్జున సాగర కావ్యం పుట్టింది

హలమే కలమై దున్నిన మట్టిలో
కలహంసలు నడిచిన కావ్యాలెన్నో
కవిత్వమే జీవితమైన మనిషిలో
సృజనాత్మే వ్యక్తిత్వమై మెరిసే

ఉస్మానియా యూనివర్సిటీలో
ఉత్తుంగ తరంగ బోధనా సంకీర్తనం
మనిషికీ మనిషికి నడుము
సమాజాన్ని అంతర్లీనంగా తడిమిన
గొప్ప మనీషి… మహా కవి అతడు

ఆ అంతరంగంలో ఒదిగిన పూలెన్నో
ఎదిగిన వృక్షాలెన్నో గురువుల బాటై
పరిమళించే విద్యార్ధి పుష్పాలెన్నో నేలపై

మంటల మానవున్ని పట్టి కుదిరినా
విశ్వకీర్తి నట్టింట వెలిగిన విశ్వంభర
కావ్యాలెన్నో భూమి పొరల్లో

జననమంత సుందర మరణంలో
అమూల్య అనిర్వచనీయ జీవితం
ఉత్తుంగ తరంగ ప్రవాహ జీవనదులే

కవితా కర్పూర క్షేత్రంలో
సినారె కలం గీత అమరం
మట్టీ మనిషీ ఆకాశం సాక్షిగా

Exit mobile version