Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవిత్వం ఒక పనితనం

[శ్రీ ఐలేని గిరి రచించిన ‘పనితనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

ఒక నాగలినో బండినో
ఒక కుర్చీనో బల్లనో తయారు చేయడానికి
వడ్రంగి తలలో ఆకృతి మెదిలి
చేతిలోకి ప్రవహించే పనితనంలా

ఒక ఇనుప వస్తువును చేయడానికి
పదే పదే ఇనుమును కాల్చి
రూపం వచ్చేవరకు కొట్టి కొట్టి మలిచే
ఓ కంసాలి ఘర్మజల ప్రవాహం పనితనంలా

ఓ బంగారపు ముక్కను కరిగించి
సున్నితంగా సుతారంగా సూక్ష్మంగా మలచి
రాళ్ళు పొదివి ఆభరణాన్ని అందించే
స్వర్ణకారుని ఏకాగ్రతా కార్యదక్షతలా
కవిత్వం కూడా ఒక పనితనం!!

చాపలల్లడం గంపలూ బుట్టలూ చేయడం లాగే
కొండల్ని తొలచడం బండల్ని మలచడం
ఇటుకపని ఇసుక కంకర పనిలాగానే
తోళ్ళు పేనడం తాటి చెట్టు నుంచి
కల్లు తీయడం లాగే

మొగ్గంపై వన్నె చిన్నెల వస్త్రాలు నేయడం లాగే
మృత పశువు చర్మాన్ని వలచి
తోలు తిత్తినీ వాయిద్యాన్ని చేయడం లాగానే
కళేబరాన్ని ఒక క్రమంలో కోసి
పొతం చేసి మాంసం తీయడం లాగానే
కవిత్వమూ ఒక పనితనమే!!

సాలు తప్పని నాగలి నడకలా
బురద పొలంలో పచ్చటి వరినాటులా
కవిత్వం ఓ పనితనం
సమస్త కళాకతుల నైపుణ్యం తాలూకు
మనిషి చెమట తడిని సృష్టించే
కవిత్వం తప్పకుండా ఓ పనితనమే!

కవిత్వానికీ మనిషి పనితనానికి తేడా లేదు
ఎందుకంటే మనిషి పనితనమంతా కవిత్వమే!

Exit mobile version