కవిత్వం అర్థం లేని
మౌన గోస కాకూడదు
కవిత్వం సాగరఘోషై నినదించాలి
నిద్రాణమైన జనులందరికి..
కవిత్వం కామాంధుల పాలిట
కరాళ మృత్యువై కదలాడాలి..
కవిత్వం పీడిత, తాడిత ప్రజల్లో
విప్లవాలను రగిలించాలి..
కవిత్వం అసహాయుల చేతుల్లో
ఆయుధమై మిగలాలి..
కవిత్వం చెడును సంహరించే
చండికలా చెలరేగాలి..
కవిత్వం దానవ సమాజాన్ని
మానవ సమాజంగా మార్చగలిగేదై నిలవాలి..
కవిత్వం మంచికి మారుపేరై
మమతల కోవెలలా మనగలగాలి..
కవిత్వం ఝంఝమారుతంలా
ఉరికే జలపాతంలా
నిరంతర చైతన్య స్పూర్తితో
జైత్రయాత్ర సాగించాలి..
శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణవాసి.
సాహిత్యం అంటే ఇష్టం. నవలలు చదవటం మరీ ఇష్టం. పదవి విరమణ తరువాత సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మంలో ‘పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట – చావా రామారావు మినీ రీడింగ్ హాల్’ పేరిట ఒక చిన్న లైబ్రరీని తమ ఇంటి క్రింది భాగంలో నిర్వహిస్తున్నారు. సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు.. రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు.
ఉచిత లైబ్రరీ.. మంచినీరు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్, వైఫై, కరెంటు అంతా ఉచితమే. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఉంటారు.