స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమని సున్నితంగా, లలితంగా మనసుకు హత్తుకుపోయేటట్లు చెప్పిన రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. ఆమె కథల్లో మనుషులని విశ్వ ప్రేమికులుగా చిత్రీకరించింది. వారి మధ్య బీద గొప్ప తారతమ్యాలు, చదువుకున్న వారు, చదువుకోని వారు వంటి తేడాలు ఏమీ ఉండేవి కావు. మనసులు కలవటం ఒక్కటే ప్రాధాన్యం. కథానాయకుడు ఆరడుగుల ఎత్తుతో, అందంగా, హుందాగా పడవలాంటి పొడవైన కారులో వస్తాడు. కథానాయిక చీరకట్టుతో, పిరుదుల వరకు వేలాడే జడతో, తలలో పూలు, చేతికి గాజులు, కళ్ళకు కాటుక, నుదుటన బొట్టు, కాళ్ళకు పట్టీలు ఇలా.. మూర్తీభవించిన స్త్రీత్వంతో ఉంటుంది. అంతేకాక పురుషాధిక్యతను కూడా అంగీకరిస్తూ, భర్తను ప్రేమతో లొంగదీసుకోవాలనుకుంటుంది. రోషం, పౌరుషం, భార్య మీద కొంచెం ఆధిక్యం ఉండటం మగవాడికి అందం అన్నట్లు ఉండేవి ఆమె నవలలు. ఆ నవలలు సినిమాలుగా తీసినప్పుడు ఈ వర్ణనలే కవులకు కవితా వస్తువులుగా ఉండి మంచి పాటలను రాయటానికి దోహదపడేవి.
చందమామ, జాబిల్లి, వెన్నెల, మల్లెలు, బృందావనం, సూర్యోదయం ఇలాంటి పదాలతో చలన చిత్రాల్లో సినీకవులు అనేక పాటలు రాసారు. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వారి కలం కదను తొక్కేది. ముఖ్యంగా మల్లెలు అనే పదం మీద లెక్కకు మిక్కిలిగా రాసారు. “ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో, మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి..” (సత్తెకాలపు సత్తెయ్య – ఆరుద్ర). ఇదీ నాయిక పొడవాటి జడలో మల్లెదండను చూడగానే నాయకుడి మనసులో కలిగిన భావన! ఎంత చక్కటి, హృద్యమైన భావన? స్త్రీ పూలు పెట్టుకునేది తన కోసం కాదు, ప్రియుడి కోసం, అతడిని మైమరపించి తనవాడిని చేసుకోవటం కోసం. అతని వర్ణన మనసులో గిలిగింతలు కలిగించినా ‘నలుగురిలో ఏమిటీ అల్లరి?’ అన్నట్లుగా నాయిక చిరుకోపంగా చూసి తల తిప్పుకుంటుంది. “అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు. నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వున కద్దం చూపేను..” (సిరిసంపదలు – ఆత్రేయ) అని మళ్ళీ అన్నాడు. ఇక నవ్వు ఆపుకోలేక ఫక్కున నవ్వింది. “సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలముండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు” (జ్యోతి – ఆత్రేయ) అన్నాడు.
వాళ్ళిద్దరూ ఎవరో కాదు, వరస వావి కలిసిన బావామరదళ్ళే! “మల్లీయల్లో మల్లీయల్లో మల్లీయల్లో మళ్ళీ వస్తావో రావో మరదలు పిల్లో..” (బందిపోటు – సి.నా.రె.) అంటూ బావ కొంటెగా అడుగుతున్నాడు మల్లెపూలను అడ్డు పెట్టుకుని. ఎంత బావా మరదళ్ళు అయినా హద్దుపద్దులు ఉంటాయి. మెడలో ఆ మూడుముళ్ళు పడేదాకా కొంచెం ఎడం ఎడంగానే ఉంచేవారు పెద్దలు. ఓ సాయంత్రం బావా మరదళ్ళు ఇద్దరూ కలుసుకుని కాసేపు మాట్లాడుకున్నారు. తనివి తీరలేదు. మళ్ళీ రేపు కూడా ఇలాగే వస్తావా! అని అడుగుతున్నాడు. అందుకు మరదలు “వెన్నీయల్లో వెన్నీయల్లో వెన్నీయల్లో నిన్ను చూస్తేనే మనసు ఝల్లు ఝల్లు…” అంటూ సమాధానం ఇచ్చింది. ‘నిన్ను చూస్తేనే మనసు ఝల్లు మంటుంది’ అని అనటం ద్వారా నీ మీద నాకు కూడా మనసు ఉంది కానీ పరిస్థితులు అనుకూలించాలి కదా అని వెన్నెలని అడ్డుపెట్టుకుని నర్మగర్భంగా చెబుతూంది.
ఆ మర్నాడు సాయంత్రం అనుకోకుండా కలుసుకున్నారు. “కనులు చేపలై గంతులు వేసే, మనసు తోటలో మల్లెలు విరిసే, దోసిట వలపుల పువ్వులు నింపి నీకై వేచితి రావోయి..” (అమరశిల్పి జక్కన – దాశరథి) అంటూ చెంతకు పిలిచింది. సూర్యాస్తమయం అయినా తెలియలేదు, చంద్రోదయం అయింది. అలాగే చిత్తరువుల్లా కూర్చుండిపోయారు. “మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో..” (మల్లీశ్వరి – దేవులపల్లి కృష్ణశాస్త్రి) అంటూ పరవశించిపోయారు. కొన్నాళ్ళ తర్వాత ఇద్దరికీ పెళ్లయింది. ఇప్పటిదాకా ఉన్న అడ్డుగోడలు తొలగిపోయాయి. తొలిరాత్రి తెల్లటి పాల నురుగు లాంటి చీర కట్టుకుని, పొడవాటి జడలో మల్లెపూలు తురుముకుని పాలగ్లాసు చేత్తో పట్టుకుని గదిలోకి అడుగుపెట్టింది నాయిక. ఆమె రూపం చూసి ముగ్దుడయిపోయాడు నాయకుడు. “తెల్లచీర కట్టుకున్నదెవరికోసము? మల్లెపూలు పెట్టుకున్న దెవరికోసము?..” (అంతస్తులు – ఆత్రేయ) అని అడిగాడు కొంటెగా, అతనికి తెలియక కాదు, ఆమె నోటి వెంట వినాలని. “తెల్లచీర కట్టినా, మల్లెపూలు పెట్టినా కల్లకపటమెరుగని మనసు కోసము..” అని సమాధానం ఇచ్చింది. ఈ పాటలో స్త్రీ పురుష మనస్తత్వంలోని తేడాలను చెప్పాడు కవి. పురుషుడు ప్రేయసిలో అందాన్ని చూసి ఆకర్షింపబడతాడు, స్త్రీ అతని మనసుని చూస్తుంది.
చుట్టూ వెన్నెల, చల్లని ప్రకృతి, సువాసనలు వెదజల్లుతున్న పూల పరిమళాలు, ఎదురుగ మనసైన నెచ్చెలి, ఆ పైన ఏకాంతం. అతనిలోని కోరికలు పురివిప్పిన నెమళ్ళు అయి నర్తించాయి. “మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా వలపులు వేయిగా పెనవేయి నన్ను తీయగా..” (ఇంటింటి రామాయణం – వేటూరి) అంటూ ఆనంద వారాబ్దిలో మునిగిపోయాడు. ఆమె కూడా “కమ్మని రాతిరి రమ్మని పిలిచె, మల్లెల పానుపు మనకై నిలిచె, ప్రాయము నీవై, పరువము నేనై పరిమళించగా రావోయి..” (బొబ్బిలియుద్ధం – సి.నా.రె.) అంటూ వలపు పిలుపుకు సై అన్నది. “మల్లెతీగె వంటిది మగువ జీవితం చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను..” (మీనా – ఆరుద్ర) అని ఆనంద పడిపోయింది, అయినా సంతృప్తి కలగలేదు. “మనసే కోవెలగా మమతలు మల్లెలుగా నిన్నే కొలిచెదరా, నన్నెన్నడు మరువకు రా..” (మాతృదేవత – దాశరథి) అని చేతిలో చెయ్యి వేయించుకున్నది.
ఆమె కన్నెపిల్ల నుంచీ వివాహితగా మారింది. మారిన తర్వాత కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి కదా! తెల్లవారు జామునే లేచింది. స్నానం చేసి, తడిజుట్టుతో పాటు టవల్ కూడా కలిపి ముడివేసి, పట్టుచీర కట్టుకుని, శుచియై దేవుడి గదిలో కుర్చుని “మల్లెపువ్వులు విరిసెరా, మంచు తెరలు కరిగెరా! నల్లనయ్యా మేలుకో! చల్లనయ్యా మేలుకో!.. ” (ఇల్లాలు – ఆత్రేయ) అంటూ మేలుకొలుపు పాడింది.
తులసిమొక్కకు కూడా పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు చల్లి పూజించటం తెలుగువారి సాంప్రదాయం. పూల కోసం పెరట్లోకి వచ్చింది. తోట అంతా రంగురంగుల పూలతో శోభాయమానంగా ఉంది. రాత్రి కురిసిన మంచు బిందువులు మొక్కలపై నిలిచి, సూర్యకిరణాల వెలుగులో పంచరంగుల్లో కనబడుతూ ఉన్నాయి. అవి చూసి “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ.. తులసీ! దయాపూర్ణ కలసీ! మల్లెలివి నా తల్లి వరలక్ష్మికీ, మొల్లలివి నన్నేలు నా స్వామికీ..” (ఈ నాటి బంధం ఏనాటిదో – దేవులపల్లి కృష్ణశాస్త్రి) అంటూ నమస్కరించింది.
కొన్నిరోజులు గడిచిపోయాయి. భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న తగవులు వస్తూనే ఉంటాయి కదా! అందులోనూ వివాహం అయిన కొత్తల్లో చిన్న మనస్పర్ధ కూడా దుస్సహం గానే ఉంటుంది. అప్పుడు మనసులో మాట చెప్పుకోవటానికి తోడుగా ఉండేవి మల్లెలే! అందుకే “మల్లియలారా! మాలిక లారా! మౌనముగా ఉన్నారా! మా కథయే విన్నారా!..” (నిర్దోషి – సి.నా.రె.) అంటూ చెప్పుకున్నాడు.
ఇంతలో ఆమె గర్భవతి అని తెలిసింది. అభిప్రాయ భేదం దూదిపింజలా తేలిపోయింది. మనసు ఆనంద తరంగిణి అయింది. క్రమక్రమంగా ఆమె శరీరంలో మార్పులు చోటుచేసుకోసాగాయి. ముఖం నునుపు దేలింది. వక్షస్థలం బరువెక్కింది, చనుమొనలు నలుపుదేలాయి, జఘనం వెడల్పు అయింది, నడక మందగించింది. బంధువులు సీమంతం చేయాలనుకున్నారు. తొలిసారి తల్లి కాబోయేటప్పుడు వేడుకలు చేయటం ఆడవాళ్ళ ముచ్చట. “మల్లెమొల్లల సరులు సతి జడలో సవరించి ఎల్ల వేడుకలిపుడు చేయించరమ్మా..” (మిస్సమ్మ – పింగళి) అంటూ మేలమాడారు.
ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. చందమామ లాంటి వారసుడు ఉదయించాడు. ఉయ్యాలలో వేసి ఊపుతూ “చిన్నారి నవ్వులే, సిరిమల్లె పువ్వులు అల్లారు ముద్దులే కోటి వరాలు..” (పవిత్రబంధం – ఆరుద్ర) అంటూ మురిసిపోయింది తల్లి.
ఇలా చెప్పుకుంటూ పోతే మల్లెల మీద సినీ గీతాలు ఎన్నెన్నో! “సిరిమల్లె నీవే! విరిజల్లు కావే! వరదల్లె రావే! వలపంటే నీవే! వెన్నెల్లు తేవే! ఎదమీటి పోవే..” (పంతులమ్మ – వేటూరి), “మల్లె తీగ వాడిపోవ మరల పూలు పూయునా..” (పూజ – దాశరథి), “సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా! చిన్నారి చిలకమ్మా! నా వాడు ఎవరే? నా తోడు ఎవరే? ఎన్నాళ్ళకొస్తాడే?..” (పదహారేళ్ళ వయసు – వేటూరి), “మల్లెకన్న తెల్లన మా సీత సొగసు, వెన్నెలంత చల్లన మా సీత సొగసు, తేనెకన్న తియ్యన మా బావ మనసు..” (ఓ సీత కథ –సి.నా.రె.) “మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి, గున్నమావి పందిళ్ళలోన, కన్నెజాజి ముంగిళ్ళలోన కోకిలమ్మ పాట కచ్చేరీ..” (అమరజీవి – వేటూరి) ఇలా.. మల్లెపువ్వు అనేది ఎక్కువగా ప్రణయ గీతాలకే కవితా వస్తువు అవుతుంది.
ఒకప్పుడు యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెడుతున్న కన్నెపిల్లలు పొడవాటి జడ వేసుకుని అందులో మల్లెపూలు తురుముకుని మాటిమాటికీ చూసుకుంటూ సంబరపడిపోతూ గంతులు వేసేవారు. చెంగుచెంగున ఇల్లంతా తిరుగుతున్న అమ్మాయిని చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయేవారు. ఇప్పటి అమ్మాయిలు జడలో పూలు పెట్టుకోవటమే మర్చిపోయారు. అవేకాదు, బొట్టు, కాటుక, గాజులు, తాళి, కాళ్ళకు పసుపు వంటి ఒకప్పుడు స్త్రీత్వపు లక్షణాలుగా పరిగణించినవాటన్నిటినీ మర్చిపోతున్నారు ఈ తరం అమ్మాయిలు.
ఈరోజుల్లో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బండ్లు, కార్లు నడుపుతున్నారు. మీతో మేము ఎందులోనూ తీసిపోము అంటున్నారు. ఎన్ని సాధించినా స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సిన సన్నటి విభజన రేఖ మాత్రం చెరిగిపోకూడదు. భర్త ఉద్యోగం నుంచీ కష్టపడి రాగానే భార్య చిరునవ్వుతో ఎదురువచ్చి, కమ్మటి కాఫీ ఇచ్చి అలసట పోగొట్టి, సాయంత్రం స్కూటర్ మీద వెనక కుర్చుని అతని నడుము చుట్టూ చెయ్యి వేసి ఏ సినిమాకో, షికారుకో వెళుతూ చెంపకు అతని భుజం తగులుతూ ఉంటే కలిగే అనుభూతి ఒంటరిగా బండి నడుపుకుంటూ వెళుతుంటే వస్తుందా? “మల్లెపూలు నువ్వు కొనిచ్చేదేమిటి? నేను సంపాదించటం లేదా! నేను కొనుక్కోలేనా!” అని అంటే చేసేదేమీ లేదు. ఆ మాటల్లో అహం, డబ్బు కనబడుతుంది గానీ ప్రేమ కనబడదు. ఆగర్భ శ్రీమంతురాలు, రాణివాసపు భోగాలు వద్దనుకుని భర్త చెయ్యి పట్టుకుని అడవులకి నడిచి వెళ్ళింది సీత. దేని కోసం?.. సున్నితమైన భావాలను నిలబెట్టుకున్నప్పుడే జీవన సౌరభం ఆస్వాదించగలుగుతారు.
గోనుగుంట మురళీకృష్ణ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. జన్మస్థలం గుంటూరు జిల్లా లోని తెనాలి. M.Sc., M.A. (eng)., B.Ed., చదివారు. చదువుకున్నది సైన్స్ అయినా తెలుగు సాహిత్యం పట్ల మక్కువతో విస్తృత గ్రంధ పఠనం చేసారు. ఇరవై ఏళ్ల నుంచీ కధలు, వ్యాసాలు రాస్తున్నారు. ఎక్కువగా మానవ సంబంధాలను గురించి రాశారు. వాటితో పాటు బాలసాహిత్యం, ఆధ్యాత్మిక రచనలు కూడా చేసారు. సుమారు 500 వరకు కధలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురిత మైనాయి. గురుదక్షిణ, విద్యాన్ సర్వత్ర పూజ్యతే, కధాంజలి వంటి కధా సంపుటులు, నవ్యాంధ్ర పద్యకవి డా.జి.వి.బి.శర్మ (కూర్పు) మొదలైనవి వెలువరించారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, స్ఫూర్తి పురస్కారం, సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డ్, నాళం కృష్ణారావు సాహితీ పురస్కారం వంటి పలు అవార్డ్ లతో పాటు సాహితీ రత్న బిరుదు వచ్చింది.