Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కీర్తి

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన డా. షహనాజ్ బతుల్ గారి ‘కీర్తి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

శ్రావ్య అప్పుడే ఆఫీసు నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి టీ త్రాగి, కాసేపు టీవీ చూద్దాం అని టీవీ ఆన్ చేసింది.

వార్తలు పెట్టింది. ఏంటో ఈ వార్తలు. కొన్ని మనసుకి బాధ కలిగించేవి. కొన్ని రాజకీయం. ఒక్కోసారి రాజకీయ నాయకులు ఇతని మీద అతను, అతని మీద ఇతను, ఆరోపణలు వేసుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.

పాత పాటలు విందాం. మనసుకు ప్రశాంతంగా ఉంటుందనుకొని, ఇంటర్నెట్లో పాత పాటలు పెట్టింది.

కుర్చీలో వెనక్కి వాలి, కళ్ళు మూసుకొని, తన్మయత్వంలో వింటూ ఉంది. పాత పాటలు ఎంత బాగుంటాయి. ఈ కాలంలో ఇటువంటివి వస్తాయా? అనుకున్నది. భర్త ఇంకా ఆఫీస్ నుండి రాలేదు.

హాయిగా ఉంది కాసేపు ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నది.

సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ శబ్దం అయింది. నన్ను డిస్టర్బ్ చేయడానికి ఎవరు వచ్చారు? ఆయన ఇప్పుడు, అప్పుడే రారు. కూతురు, పింకీ స్కూల్ తర్వాత ట్యూషన్‌కి వెళ్తుంది కాబట్టి తను కూడా రాదు.

వచ్చిన వాళ్ళని మనసులో కొంచెం తిట్టుకున్నది. వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా కీర్తి నిల్చొని, ఉన్నది. ముఖం చూస్తుంటే ఏడ్చినట్టు కనిపిస్తుంది. ఏదో బాధలో ఉన్నట్లుంది. ఒక్కసారి ఆశ్చర్యం కలిగింది.

కీర్తి అమెరికాలో ఉండింది కదా. ఇండియా వచ్చినట్టు మెసేజ్ కూడా పెట్టలేదు ఫోను చెయ్యలేదు.

కీర్తి గుమ్మం లోపలికి అడుగుపెట్టి, శ్రావణిని కౌగలించుకుని, ఏడ్చింది. శ్రావ్య కీర్తిని గట్టిగా కౌగిలించుకుంది.

అసలు ఏం జరిగి ఉంటుంది? కాసేపు ఏడవనిస్తే, గుండెల్లో భారం కొంచెం తగ్గుతుంది. కాసేపు ఏడవనిచ్చి అప్పుడు కన్నీళ్లు తుడిచింది. చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టింది.

“కీర్తి అసలు ఏం జరిగింది? నువ్వు ఇండియా ఎప్పుడు వచ్చావు? నాకు ఫోన్ చేయలేదు మెసేజ్ పెట్టలేదు.”

తన మొబైల్లో ఫోటో వీడియో చూపించింది. అది చూసి, శ్రావ్య ఒక్కసారి షాక్.

“ఎవరీమె? చేతులు కాళ్లు కట్టేశారు ఏమిటి?”

“తను మా అమ్మ. నన్ను కన్న మా అమ్మ. ఆమెను చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు.”

“మీ అన్నయ్య వదిన ఏనా మీ అమ్మని ఇలా చూసుకుంటున్నది?”

“అవును.”

“చాలా ఘోరం. మీ వదిన పరాయి ఇంటికి వచ్చిన అమ్మాయి అనుకోవచ్చు.కానీ మీ అన్నయ్యని కూడా కన్నది మీ అమ్మే కదా.  అమ్మ ఋణం తీర్చుకోలేము. అమ్మ త్యాగానికి ప్రతీక. అటువంటి, అమ్మను, ఇలా హింసించడం, చాలా దారుణం.

నేను మీ అమ్మని చూశాను కదా చాలా మంచి ఆవిడ. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. చాలా కష్టజీవి. 60 సంవత్సరాలు దాటినా కష్టపడుతుంటే నేను చూశాను, మీ ఇంటికి వచ్చినప్పుడు. మీ అన్నయ్య వదిన మనుషులా? రాక్షసులా?”

“వాళ్ళు మనుషులు కాదు శ్రావ్యా, రాక్షసులు. నాకు ఒక సహాయం చేసి పెడతావా శ్రావ్యా.”

“చెప్పు నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను?”

పర్స్‌లో నుండి టాబ్లెట్స్ తీసింది శ్రావ్య,

“ఈ టాబ్లెట్స్ మా అన్నయ్య మా అమ్మకి ఇస్తున్నాడు. ఇవి దేనికి వాడతారు, మీ వారు డాక్టర్ కదా. కనుక్కొని, చెప్తావా?”

“అలాగే కీర్తీ, నువ్వు లోపలికి వెళ్లి కొంచెం మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి రా. చూడు ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయావో?”

కీర్తి వెళ్లి మొహం కడుక్కొని వచ్చింది.

“మీ అమ్మని ఓసారి మా వారి ఆసుపత్రికి తీసుకువస్తావా? చూస్తారు.”

“అలాగే రేపు తీసుకొస్తాను.”

శ్రావ్య టీ తయారుచేసి, తీసుకొచ్చింది ఇద్దరూ టీ తాగారు.

“నీకు ముందే తెలుసా మీ అమ్మ పరిస్థితి?”

“అమ్మని వీడియో దగ్గరికి తీసుకొని రమ్మంటే, వీడియో కాల్ చేసి నప్పుడు, నిద్రపోతుంది అని, వాకింగ్‌కి వెళ్ళింది, అని ఇలా కారణాలు చెప్పేవారు. అందుకే నేను చెప్పా పెట్టకుండా వచ్చేసాను. ఇక నేను వెళ్తాను” అన్నది.

“మీ అమ్మ గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకు. మా వారు చూస్తారు, చికిత్స చేస్తారు. అవసరమైతే ఆపరేషన్ కూడా చేయిద్దాం.”

కీర్తి ఇంటికి వచ్చేసింది.

***

శారదమ్మ, గోపాల్ దంపతులకు ఇద్దరు పిల్లలు. శరత్, కీర్తి. శరత్ పీజీ చదివాడు. బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరాడు. పెళ్లి అయ్యింది. సౌజన్య కాపురానికి వచ్చింది.

కీర్తి ఇంజినీరింగ్ చదివింది. కీర్తి ముందు హైదరాబాద్‌లో ఒక కొన్నాళ్ళు ఉద్యోగము చేసింది. ఆ తర్వాత వివాహము అయ్యింది. ఆ తర్వాత భర్తతో అమెరికా వెళ్ళింది.

***

కీర్తికి రాత్రి ఫోన్ వచ్చింది. పేరుపడ లేదు. ఎవరో అనుకొని, ఫోన్ తీసి “హల్లో” అన్నది.

“కీర్తి గారేనా?”

“అవునండి. నేను కీర్తినే. మీరు ఎవరు?”

“నేను సురేంద్రని. మీ ఫ్రెండ్ శ్రావ్య భర్తని.”

“ఓ నమస్కారం అండీ. నేను ఇచ్చిన టాబ్లెట్ గురించేనా?”

“అవునండి. మీరు గుండె దిటవు చేసుకొని, వినండి. ఆ టాబ్లెట్ చూడగానే నాకు మతి పోయినట్లైంది. మీ అన్నయ్య మనిషా పశువా? అనుకున్నాను. సారీ ఇలా అంటున్నందుకు.”

“చెప్పండి. ఏదైనా తట్టుకునే శక్తి వచ్చేసింది. అసలు ఆ టాబ్లెట్ ఏమిటి?”

“నెమ్మదిగా మనిషిని పిచ్చివాళ్లని చేస్తుంది. మీ అమ్మని పిచ్చివారుగా చేయడానికి ఆ టాబ్లెట్ వేస్తున్నారు.”

“ఎంతకు తెగించాడు. అమ్మ చేత ఇల్లు వ్రాయించుకున్నాడు. అమ్మ అవసరం లేదు. అందుకే అమ్మని పిచ్చిదాన్ని చేసి, పిచ్చాసుపత్రిలో చేర్చుదాము అనుకొని ఉంటాడు. అందుకే ఆ టాబ్లెట్స్ వేస్తున్నాడు. నేను ఇక ఇండియా రాననుకున్నాడు.”

“రేపు ఉదయం పది గంటలకు మీ అమ్మ గారిని తీసుకొని, మా ఆసుపత్రికి రండి. మీరు ఈ స్థితిలో ఉన్న మీ అమ్మని ఫోటో గానీ వీడియో గానీ తీశారా?”

“ఎందుకైనా మంచిదని, ఫోటో తీసాను. మా అన్నయ్య ఏమి టాబ్లెట్ వేస్తున్నాడో, తెలియక పోయినా, టాబ్లెట్ వేసేటప్పుడు, వీడియో తీశాను.”

“మంచి పని చేశారు. నేను లొకేషన్ షేర్ చేస్తాను. మీరు వర్రీ అవ్వకండి. నేను చికిత్స చేస్తాను. ఆమె మామూలు మనిషి అవుతారు.”

“థాంక్స్ అండీ. ఇక ఉంటాను. గుడ్ నైట్.”

ఫోన్ పెట్టేసి, భర్త, అమరేంద్రకు అమెరికాకి వీడియో కాల్, చేసింది. అన్నీ విషయాలు చెప్పింది.

“మీ అన్నయ్య వదినలను అస్సలు వదిలి పెట్టవద్దు. వాళ్లకి శిక్ష పడాలి. నువ్వు అక్కడే ఉండు. నేను బాబు కూడా వస్తాము. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యి.” చెప్పాడు, అమరేంద్ర.

“అలాగేనండి. నేనింకా అమెరికా వెళ్ళ దలచుకోలేదు. ఇక్కడే ఉండి, అమ్మను చూసుకుంటాను.”

“అలాగే. ప్రతి రోజు ఫోన్ చేసి, పరిస్థితి వివరిస్తూ ఉండు.”

“అలాగేనండి.” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.

అప్పుడే శ్రావ్య దగ్గరినుండి ఫోన్ వచ్చింది.

“హాయిగా పడుకో మీ అమ్మకేమీ కాదు. మా వారు ఆసుపత్రి నుండి వచ్చాక, మీ అమ్మ గురించి మాట్లాడారు. పోలీసు కేసు కూడా పెట్టమన్నారు.”

“ముందు ఆసుపత్రికి తీసుకెళతాను.”

“మా ఇంటికి రండి. నేను కూడా వస్తాను.”

“అలాగే చాలా థాంక్స్.”

***

రాత్రి తల్లిని తన గదిలో పడుకోబెట్టుకుంది కీర్తి, శరత్, సౌజన్య, ఏమి చెప్పలేక పళ్లు కొరుక్కున్నారు.

మరుసటి రోజు తల్లిని, తనే స్వయంగా తయారు చేసింది. సురేంద్రకి ఫోన్ చేసింది కీర్తి.

“9 గంటలకు బయలు దేరండి.” అన్నాడు సురేంద్ర.

తొమ్మిది గంటలకు శ్రావ్య ఇంటికి వెళ్ళింది. వీళ్ళు వెళ్లేటప్పటికి, శ్రావ్య రెడీగా ఉంది. శ్రావ్య కారులో ముగ్గురూ బయలుదేరారు. సురేంద్ర వీళ్ళను తన కేబిన్‌లో కూర్చోబెట్టాడు. తనే స్వయంగా కీర్తిని శారదమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ డాక్టర్ చూసి, టెస్టులు వ్రాసారు. ల్యాబ్ వాళ్లతో తన మనుషులని చెప్పి, తన కేబిన్‌కి  వెళ్ళిపోయాడు. అన్నీ టెస్టులు అయ్యాక శ్రావ్య వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి, వెళ్ళిపోయింది.

కీర్తి తనే స్వయంగా తల్లికి భోజనం తినిపించింది. డాక్టర్ గారు కొన్ని టాబ్లెట్స్ వ్రాసిచ్చారు. అవి ఆసుపత్రిలోనే కొని, తీసుకొచ్చింది భోజనం చేశాక టాబ్లెట్ వేసింది. తల్లిని తన గదిలోనే పడుకోబెట్టింది.

***

“అమ్మను ఎక్కడికి తీసుకెళ్లావు?” సాయంత్రం ఇంటికి వచ్చాక శరత్ అడిగాడు.

“ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది కదా. బయటికి వెళ్లదు కదా. అందుకే చేంజ్ లాగా ఉంటుందని, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను.”

“ఇలా బయటికి తిప్పుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు.” అన్నాడు.

“బయటికి వెళ్తూ ఉంటేనే మంచిది. నీకు ఎవరు చెప్పారు అలాగా?”

“నేనిచ్చిన మందులు వేసావా?”

“వేశాను.”

శరత్ కొడుకు బంటి, రెండవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుండి వచ్చాడు. కీర్తి గదిలోకి వచ్చాడు.

“అత్తయ్యా నాయనమ్మ ఇక్కడ పడుకుంది ఏమిటి?”

“నా గదిలో పడుకోబెట్టాను. నేను చూసుకుంటాను.”

“నాయనమ్మకు తాళ్ళతో కట్టాలి కదా.”

“ఎవరు చెప్పారు?”

“నాన్న. అలా కడితే తొందరగా జ్వరం తగ్గిపోతుందట.”

“ఇది కూడా మీ అమ్మానాన్నలు చెప్పారా?”

“అమ్మ చెప్పింది.”

శరత్ బంటిని పిలిచాడు. బంటి వెళ్ళిపోయాడు. ఇక్కడే ఉంటే ఏమేమి చెప్తాడో అని భయపడి, ఉంటాడు అన్నయ్య అనుకున్నది. సాయంత్రం అమరేంద్ర దగ్గర్నుండి, ఫోన్ వచ్చింది.

ఆసుపత్రికి, అమ్మను తీసుకెళ్లిన విషయం జరిగినవన్నీ చెప్పింది. ఎక్కువ మందులు తీసుకోలేదని, కొన్ని రోజుల నుండి వేస్తున్నారని, మామూలు మనిషి అవుతుందని చెప్పింది.

అమరేంద్ర సంతోషించాడు. తానూ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడని. వారం రోజులలో ఇండియా వచ్చేస్తున్నాడని చెప్పాడు.

***

మరుసటి రోజు, శరత్ బ్యాంక్‌కి, వెళ్ళాక, కీర్తి తల్లిని తీసుకొని శ్రావ్య దగ్గరికి వెళ్ళింది.

శ్రావ్య ఇద్దరినీ తీసుకొని, తన కారులో పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది.

అన్ని విషయాలు చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. తను తీసిన ఫోటోలు వీడియోలు చూపించింది.

మందులు కూడా చూపించింది. వాళ్లు కేస్ వ్రాయించుకున్నారు.

“మా అన్నయ్యను అరెస్టు చేస్తారా?” అడిగింది కీర్తి.

“ఇది నేరం కదమ్మా.  తప్పకుండా అరెస్టు చేస్తాము.” అన్నారు ఎస్. ఐ.

“వద్దండి. ఎటువంటి వాడైనా నాకు అన్నయ్య కదండీ. వాడిలో మార్పు వస్తే చాలు. అరెస్టు చేయవద్దు.” అన్నది కీర్తి.

“ఏమిటి కీర్తీ. ఇటువంటి వాళ్ళను వదిలేస్తే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తాడో? శిక్ష పడాలి.” అన్నది శ్రావ్య.

“భార్య ఉన్నది. చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు ఉసూరు నాకు తగులుతుంది.” అన్నది కీర్తి.

“సరే అమ్మ. బాగా బుద్ధి వచ్చేటట్లు చెప్పి వదిలేస్తాము. కోర్టు దాకా వెళ్ళనీయము.” చెప్పాడు ఎస్.ఐ. తర్వాత ఇంటికి వచ్చేసారు. పోలీసులు వచ్చి శరత్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు.

“అన్నయ్యని అరెస్ట్ చేయిస్తావా? మీ అన్నయ్య నీకేం ద్రోహం చేశాడు?” అని చెప్పి బాగా తిట్టి పోసింది, సౌజన్య.

కీర్తి మౌనంగా ఉండిపోయింది.

***

“ఇంకెప్పుడు ఇలా చేయను ఇన్‌స్పెక్టర్ గారు. నన్ను వదిలేయండి.” అని చెప్పాడు శరత్.

ఇంకెప్పుడు ఇటువంటి పని చేయనని, చేస్తే, అరెస్టు చేయనని డాక్యుమెంట్ మీద వ్రాసి ఇచ్చాడు. సంతకం చేసాడు. కీర్తికి సంతృప్తిగా ఉంది.

***

వారం రోజులకు అమరేంద్ర, కొడుకు సన్నీతో ఇండియా వచ్చాడు. అప్పటికి శారదమ్మ దాదాపుగా రికవర్ అయిపోయింది. అందరితో బాగా మాట్లాడుతుంది. ఒకరోజు అమరేంద్ర, కీర్తి, సన్నీ శారదమ్మ వేరే ఇల్లు అద్దెకు తీసుకొని, వెళ్ళిపోయారు.

“ఇల్లు అమ్మ నీకోసం రాసింది కదా. కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. మేము కూడా హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి, మీరు ఎప్పుడైనా రావచ్చు. మేము కూడా వస్తూ ఉంటాము. నీలో మార్పు వచ్చింది. అది చాలు నాకు. అన్నా చెల్లెల బంధం ఇలాగే ఉంటుంది” చెప్పింది, కీర్తి వెళ్లేటప్పుడు.

Exit mobile version