Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాలదోషం పట్టని కథలు – ‘కేమోమిల్లా’

ప్రముఖ కవి, విమర్శకులు, ఆధ్యాత్మికవేత్త ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు యువకుడిగా ఉన్నప్పుడు, దాదాపు 50 ఏళ్ళ క్రితం రాసిన ఆరు కథలతో వెలువరించిన కథా సంపుటి ‘కేమోమిల్లా’. ఈ కథలు 1968-70 మధ్యలో రాసినవి. మార్చి 2023లో వీటిని పుస్తక రూపంలో తెచ్చారు. నేటికీ ఈ కథలు అవుట్‌డేటెడ్‍గా అనిపించకపోవడం విశేషం.

“మానవీయ సూత్రం అంతర్లీనంగా ఉన్న ఈ ఆరు కథలు ఆనాటి సమాజంలోని వివిధ సంఘటనకు ప్రతిరూపాలుగా ఉన్నా, ఈనాటికీ వాటిలోని విలువలు ప్రబోధాత్మకంగా కనిపించటం విశేషం” అని వ్యాఖ్యానించారు ఆచార్య కె. యాదగిరి తమ ముందుమాట ‘మానవీయ ప్రబోధాత్మక కథలు’లో.

“మానవీయ సంబంధాలు పెరగాలంటే పరస్పర అవగాహన ఎంతో ముఖ్యం. సమస్యను ఒకే కోణంలో నుండి మాత్రమే చూడకుండా, భిన్న పార్శ్వాలలో నుండి దర్శించగలగాలి. ఆ మార్గాల్ని సూచించే కథలు కూడా దీనిలో ఉన్నాయి” అన్నారు  డా. దార్ల వెంకటేశ్వరరావు తమ ముందుమాట ‘కథలుగా మురిపిస్తున్న జీవిత సత్యాలు’లో.

***

సొంతూరులో నాగభూషణానికి సినీనటుల కన్నా ఎక్కువ కీర్తిప్రతిష్ఠలుంటాయి. ఆయన ఏ సభలో పాల్గొంటే ఆ సభ విజయవంతమైనట్టు లెక్క. ఏడు వ్యాపారాలు సంస్థలున్న ఆయన సంపన్నుడని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఆ ఊరికి ఓ సర్కస్ కంపెనీ వస్తుంది. సర్కస్ నిర్వాహకులు నిర్వాహకులు ఇద్దరు వచ్చి  రాబోయే ఆదివారం సర్కస్ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాలని నాగభూషణాన్ని కోరుకుంటారు. ఇటువంటి కార్యక్రమాలకు రానని అనని నాగభూషణం ఒప్పుకుంటాడు. ఆదివారం సర్కస్‍కి వెళ్ళగా అక్కడి సిబ్బందిని ఒక్కక్కరిని పరిచయం చేస్తారు నిర్వాహకులు. అందరిలోకీ చలాకీగా ఉన్న శాంతిపై నాగభూషణం దృష్టి పడుతుంది. మెల్లిగా ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. సర్కస్‍ని కాపాడుకోవడానికి శాంతి నాగభూషణంతో సన్నిహితంగా ఉంటుంది. కానీ తెలివిగా ప్రవర్తించి అతనికి లొంగకుండా అతని దగ్గర వడ్డీ లేని అప్పుగా లక్ష రూపాయలు తీసుకుంటుంది. సర్కస్ కంపెనీని నిలబెడుతుంది. ధనమదంతో నిస్సహాయులైన మహిళలను తేలికగా లొంగదీసుకోవచ్చు అనుకునే నాగభూషణం లాంటి వాళ్ళకి చెంపపెట్టు ‘ఏనిమల్ సైకాలజీ’ కథ.

అమెరికాలో ఉన్న భర్త అక్కడి స్వేచ్ఛా జీవితాన్ని పొగుడుతూ ఉత్తరం రాస్తే, అతను కూడా అందరిలాగే మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానం కలుగుతుంది మెడిసిన్ చదువుతున్న హరిప్రియకి. ఒక రోజు డిసెక్షన్‍కి వచ్చిన ఓ శవాన్ని చూసి నిర్ఘాంతపోతుంది. ఆ శవం ఒకప్పుడు తానూ, తన మిత్రుడు కల్సి చికిత్స చేసిన చంద్రయ్యది. ఆ చంద్రయ్య శవం హాస్పటల్ నుంచి కాక సెంట్రల్ జైలు నుంచి వచ్చిందని ఎనాటమీ లెక్చరర్ చెప్తాడు. చంద్రయ్య ఎందుకు జైలు కెళ్ళాల్సి వచ్చిందో హరిప్రియకు తెలుసు. భార్య మనసుని గెల్చుకోలేక పోయానని బాధపడతాడు చంద్రయ్య. మిత్రుడు, సహ విద్యార్థి అయిన వరప్రసాద్ ఓ సందర్భంలో హరిప్రియని బలవంతం చేయబోతే, అతన్ని తోసేసి వచ్చేస్తుంది. వైవాహిక జీవితంలో దంపతుల మధ్య నిబద్ధత ముఖ్యమని భావిస్తుంది. ఒకరిని ఒకరు మోసం చేసుకూడని తలచిన హరిప్రియ, మెడిసిన్ చదవడం మానేస్తుంది ‘తరంగాలూ అంతరంగాలు’ కథలో.

కేమోమిల్లా’ ఒక విశిష్టమైన కథ. భార్యతో వాదోవాదాలయ్యాకా జరిగిన తోపులాటలో నాలాయనీదేవి భర్త వాటర్ ఫౌంటెన్‍లో పడి మరణిస్తాడు. అప్పట్నించి ఆమెకి మానసిక సంతులనం దెబ్బతింటుంది. అందరూ ఆమెకి దెయ్యం పట్టిందంటారు. ఓ రోజు ఆమె బంగళా నుంచి ఇద్దరు నౌకర్లు వచ్చి డాక్టర్ శశిభూషణ్‍ని నిద్ర లేపి ఆమెని చూడడానికి రమ్మంటారు. క్రమంగా ఆమెతో పరిచయం పెంచుకుని ఆమెకి నయం చేస్తాడు డా. శశి. మానవుడు దుర్గుణాల్ని ఆయుధంగా, సద్గుణాలని ఔషధంగా వాడాలని ఈ కథ చెబుతుంది. మంచి చెడుల కలయికని – వెలుగు నీడల కలయికలా జీవితంలోకి తెచ్చుకోవాలని చెప్తుందీ కథ. జబ్బులకి చికిత్స చేసే వైద్యులకి మానసిక శాస్త్రంపై అవగాహన ఉండడం ఎంత అవసరమో ‘కేమోమిల్లా’ కథ చెబుతుంది. కేమోమిల్లా అంటే ఒక హోమియోపతి మందు. కేమోమిల్లా అంటే సీమ చామంతి పువ్వు. అందుకే ఈ పుస్తకం కవర్ పేజీలో సీమ చామంతి పూల బొమ్మని ఉంచారు.

తమకి ఎదురుగా ఉన్న పాడుబడిన ఇంటిని శుభ్రం చేయించి రంగులు వేసి కొత్త మేడగా తయారు చేస్తే ఆశ్చర్యపోతారు డాక్టర్ శ్రీపతి, పూజారి తిరువేంగళాచార్యులు, దర్జీ రంగయ్య, స్టూడెంట్ రాజశేఖరం. కొన్ని రోజుల తర్వాత వారికి ఆ ఇంట్లో ఓ స్త్రీ కనబడుతుంది. ఆమెని భర్త లేనిదిగా భావించి ఎవరికి వారు ఆమెను ఆకర్షించాలని ప్రయత్నిస్తారు. ఓ రోజూ ఆమె ఈ నలుగురినీ చూస్తుంది, వారూ ఆమెను చూస్తూంటారు. ఆమెతో మాట్లాడాలని ఒకరొకరుగా చేసిన ప్రయత్నం మిగతా ముగ్గురికి అనుమానం కలిగిస్తుంది. రాజశేఖరం వెళ్ళి ఆమెతో మాట్లాడి అందరి అనుమానాలు తీరుస్తాడు. చివర్లో కథ మలుపు తిరుగుతుంది ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’లో.

అవయవ మార్పిడి నేపథ్యంలో సాగిన కథ ‘మళ్ళీ చిగిర్చిన వసంతం’. కారు యాక్సిడెంట్‍లో గాయపడిన ఒకరి గుండెను తీసి, తన పేషంట్‍కు అమర్చి అతన్ని బతికించాడని సంజీవరావు అనే ఓ డాక్టరుపై కేసు పెడతారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. ప్రాసిక్యూటర్ గెలిచినంత పనవుతుంది, ఇంతలో కథ మరో మలుపు తిరుగుతుంది. 1969 నాటి ఈ కథలో గుండె ఆగిపోతేనే మరణమా లేక మరణానికి ఇతర నిర్వచనాలున్నాయా అని చర్చ జరుగుతుంది. గుండె మార్పిడి చేసిన డాక్టర్ చర్య నైతికమా అనైతికమా అని పాఠకులకు సందేహం వస్తుంది. ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. నేటి కాలపు బ్రెయిడ్ డెడ్ కేసులలో చనిపోయిన వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చుతున్న నేపథ్యంలో అసలు మరణం అంటే ఏమిటి అన్న ప్రశ్న ముందుకొచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ కథలోని ముగింపు పాఠకుల ఊహకే వదిలేసినా, ఒక విషయం మాత్రం చర్చనీయాంశం అవుతుంది. అదేమిటో కథ చదివి తెలుసుకోవాల్సిందే.

మూడు చక్రాల సైకిల్’ గొప్ప సందేశాన్ని ఇస్తుంది – “జీవించడానికి కూడా కాస్త సాహసం కావాలి. మనం సాహసం చూపేవరకు మనల్ని ఆ జీవితం దగ్గరకు రానీయదు” అని. జీవితంలో లోతుల గురించి చిన్న చిన్న సంభాషణల రూపంలో తాత్త్వికంగా చెప్పిన కథ ఇది. భార్యని, పిల్లల్ని పోగొట్టుకున్న బావ సుధాకరాన్ని మళ్ళీ మామూలు మనిషిని చేస్తుంది సుజాత. కొన్నాళ్ళకి అతన్నే పెళ్ళి చేసుకుంటుంది. ఇద్దరూ ఒకరి దగ్గర మరొకరు దాచిన రహస్యాల వల్ల వాళ్ళ జీవితం ఎలా మారిందో ఈ కథలో తెలుస్తుంది.

***

“మనకే తెలియని మన జీవన సంఘర్షణలు మనకు తెలియాలంటే ఈ కథలు చదవాలి” అని డా. దార్ల వెంకటేశ్వరరావు వెల్లడించిన అభిప్రాయాన్ని పాఠకులు కాదనలేరు.

ఈ కథలు రాసి దాదాపు 50 ఏళ్ళు గడిచినా, సమాజపు కొన్ని లక్షణాలు, మనుషుల కొన్ని స్వభావాలు అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నాయి. ఈ 50 ఏళ్ళల్లో ధనవంతులు ఇంకా ధనవంతులయ్యారు, పేదలు నిరుపేదలయ్యారు.. మధ్యతరగతి వాళ్ళూ పైకెదగలేక, క్రిందకి దిగజారలేక మధ్యలోనే ఉండిపోయారు. మద్యపానం వ్యసనం నేటికీ వర్ధిల్లుతోంది. ఒకప్పుడు గుర్రాల మీద పందేలు కాస్తే, ఇప్పుడు ఆన్‍లైన్ బెట్టింగులు వచ్చాయి. అంటే, మనిషిని పతనం చేసేవి మౌలికంగా రూపు మార్చుకుంటున్నాయే తప్ప, పూర్తిగా నశించలేదు. కాబట్టి ఈ కథలు నాటి  – నేటి సమాజపు వ్యక్తుల జీవితాలకి దగ్గరగా ఉన్నవేనని చెప్పవచ్చు.

నేటి కాలపు సర్కస్‍లలో పులులు, సింహాలు లేకపోయినా, ప్రాణాంతక ఫీట్లు ఇప్పటికీ ఉన్నాయి. పేదరికం నిండిన కళాకారుల జీవితాలలోని నిస్సహాయత ఇప్పటికీ ఉంది.

ధనమదం, స్త్రీ వ్యామోహం, పరస్త్రీ మెప్పు పొండడానికి ప్రయత్నించడం, స్వార్థం, డబ్బు మీద ఆశ – లాంటి అవలక్షణాలు; సాటి మనుషుల పట్ల ప్రేమ, విలువలకి కట్టుబడి ఉండడం, నిస్వార్థంగా అవసరమైన వారికి సాయం చేయడం, మనిషిగా బ్రతకగలడం లాంటి మంచి లక్షణాలు – నాడూ నేడూ ఉన్నందువల్ల ఈ కథలకి కాలదోషం లేదు.

అలనాటి కథలైనా, ఆకట్టుకునే కథలివి. అయిదు దశాబ్దాల నాటి ఈ ఆరు కథలు ఆసక్తిగా చదివిస్తాయి.

***

కేమోమిల్లా (కథా సంపుటి)
రచన: ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య
పేజీలు: 128
వెల: 120/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్ 500027
ఫోన్: 9000413413
డిజిటల్ కాపీ (ఉచిత డౌన్‍లోడ్ కోసం):
https://archive.org/details/kemomilla

Exit mobile version