Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఖాళీ కుర్చీ

[డా. దారల విజయ కుమారి గారు రచించిన ‘ఖాళీ కుర్చీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రంగు రంగుల బల్బులు, రంగుల కాగితాలు, పూలదండల అలంకరణతో ఆడిటోరియం కలకలలాడుతోంది.

పట్టబద్రులు తమ పట్టా అందుకోవడానికి తలపైన క్యాపు, గౌను వేసుకుని తల్లిదండ్రులతో కలసి మాట్లాడుతూ, మధ్యమధ్యలో స్నేహితులను పలకరిస్తూ హడావిడి పడుతున్నారు. పిల్లల విజయాన్ని కళ్ళారా చూడాలని వచ్చిన తల్లిదండ్రులు ఒక రకమైన ఉద్వేగాన్ని నింపుకుని కూర్చొని అంతా గమనిస్తున్నారు. మొత్తానికి నవ్వులు, కబుర్లు కలగలిసి ఆడిటోరియం కోలాహళంగా ఉంది.

ఇవేవీ పట్టించుకోకుండా అందరికి దూరంగా నిలబడి ఉన్నాడు విష్ణు. అతని కళ్ళు ఆడిటోరియం తలుపు వైపే చూస్తున్నా మనసు మాత్రం  పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది. ఈ రోజు అతని జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. ఐదు సంవత్సరాల తన సుదీర్ఘ కాలపు చదువు ముగిసి, వైద్య వృత్తి పట్టా చేతికి అందించే రోజు. ‘కనీసం వీడైనా డాక్టరుగా చదివి నా ఆశ నెరవేరుస్తాడేమో చూడాలి’ అని తండ్రి అన్నమాటను వేదవాక్కుగా భావించి కష్టపడి చదివి మెడికల్ సీటు సంపాదించి పూర్తిచేసాడు. ఈ రోజు ఈ ‘పట్టా’ను తండ్రి చేతిలో పెట్టి, ఆయన కళ్ళల్లో కనిపించే తృప్తిని సంతోషాన్ని చూడాలని ఎంతగానో అనుకున్నాడు. ఇది తనకు ఒక గొప్ప అవకాశం, అరుదైన సందర్భం.

‘ఒక వేళ ఆయన సంతోషపడి తనను ఒక్కసారైనా ప్రేమగా కౌగలించుకుంటాడేమో’ అని కూడా ఆశపడ్డాడు. ఇవన్నీ జరగాలంటే తండ్రి రావాలి. ఆలోచనల్లోంచి బయటపడి చుట్టూ చూసాడు, తన క్లాస్‌మేట్స్ అందరూ తల్లిదండ్రితో పాటూ కూర్చోని మాట్లాడుకుంటున్నారు. అందరిలోనూ ఉత్సాహం సంతోషం. వెనుదిరిగి తల్లి కూర్చున్న వైపు చూసాడు, ఆమె కూడా విష్ణు వైపే చూస్తోంది, ఆ కళ్ళలో ఏదో బాధ, దైన్యం తొణికిసలాడుతున్నాయి.

దాదాపుగా ఒక వారంకు ముందే ఈ స్నాతకోత్సవం ఆహ్వానం తండ్రికి పెడుతూ ‘తప్పకుండా రావాలని, అతని సమక్షం తనకెంతో విలువైనదని, అతని ఆశీస్సులు తనకు చాలా అవసరం’ అని మెసేజ్ పెట్టాడు. అప్పటినుంచి మెసేజ్ పెడుతూ, రోజూ గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఫోన్ చేద్దామంటే.. తండ్రి ఆ కుటుంబంతో ఉన్నప్పుడు తాము ఫోన్ చేయకూడదు అనే నిబంధన ఉంది.

తాననే జీవిని సృష్టించాడు. తన ఆ.. ఊ.. ఉంగా.. ఊంగాల లలో నా ఉనికి ఊపిరి సంతకాలలోనూ ఉన్నది నాన్నే. అందుకే తన తండ్రీ కూడా మరో బ్రహ్మే అని ఒప్పుకుంటాడు అయితే.. ఊహ తెలిసినప్పటినుంచీ చుట్టూ కనిపించే అందరి పిల్లల్లా తానుకూడా తన తండ్రి చేయిపట్టుకుని నడవాలనీ, ఆ చేతుల ఆసరాగా తన బుజ్జి రెక్కలు ఎగిరాలని, తన చిట్టి పాదాలు మోపేందుకు అతని ఎద నేలలను పరిచాలని, తన చంటితనాలను అతని ఎత్తైన భుజ పీఠంపై నిలిపి అతని వేలితో తనకు దూరపు గమ్యాలను చూపాలని కోరుకున్నాడు. తన బుడిబుడి అడుగుల తడబాటులలో తన్ను పట్టుకుని నడిపించి ఈ ప్రపంచాన్ని తన తండ్రే తనకు పరిచయం చేయాలని ఎంతగానో కోరుకున్నాడు. తను తల్లడిల్లితే, తనకలాడితే.. తలనిమిరి.. తట్టున తగ్గించేలా.. తన గెలుపుల చిరునవ్వులలో ఓటమి ఓదార్పులలోనూ.. నాన్న అంతర్లీనంగా అగుపడాలని ఆశపడ్డాడు కానీ అవేవీ జరిగినట్టు తనకు కనీసం గుర్తులు లేవు.

చదువులో ప్రతి క్లాస్ లోనూ మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు, ఆటలలో, ఎన్నో పోటీలలో విజయాలు సాధించినపుడు ఎన్నో సార్లు బహుమతులు సర్టిఫికెట్లు అందుకుంటూ, స్టేజి పైనుండీ చూస్తే తన తల్లి మాత్రమే కనిపించేది అంతే, తన జతగాళ్ళు, టీచర్లు ఎన్నో సార్లు తండ్రి గూర్చి అడిగి అడిగి ఇక అడగలేక వదిలేసారు.

తండ్రి వలన ఈ బాధలు, ఆశాభంగాలు తనకు అలవాటుగా మారిపోయాయి.

ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రి తెచ్చే ఆటవస్తువులు, తినుబండారాలూ ఏవీ సంతోషాన్ని కలిగించేవి కావు. అతని సమక్షం, అతనితో గడిపే సమయమే చాలా విలువైనవిగా అనిపించేవి. “నాన్న మనతో ఎందుకు లేడు. మనకోసం ఎందుకు రాడు” అని తల్లిని అడిగి, విసిగించి, తల్లి కన్నీళ్లు చూసి ఇక విసిగించకూడదని నిర్ణయించుకున్నాడు.

“నాన్నా మాతో ఉండిపోండి” అని తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి బతిమాలిన ప్రతిసారీ తండ్రి మాత్రం చిరునవ్వు నవ్వుతూ వీపు నిమిరేవాడు, కానీ సమాధానం చెప్పేవాడు కాదు.

తర్వాత్తర్వాత “అలా అడగి నాన్నను బాధపెట్ట కూడదు” అని అమ్మ చిన్నగా మందలించేది. ఏదో తెలియని బాధ శత్రువులా తరుముతూ ఉంటే పుస్తకాలతో కాలం గడిపి గడిపి ఎన్నో మెడల్స్ సాధించాడు, అయినా ఏవీ ఎపుడూ సంతృప్తి కలిగించలేదు.

కానీ ఈ రోజు తన జీవితంలో గొప్ప మైలురాయి, పట్టభద్రుడైన వైద్యునిగా సమాజంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఇన్నేళ్ళ కలలు నిజం అయ్యేరోజు ఈ రోజు. ఈ చదువుల్లోనూ, కాలేజీలో ఇతర ఆటపాటల్లో తాను సాధించిన విజయాల గూర్చి, తన గూర్చి ఈ గొప్ప సమూహం ముందు స్జేజి పైన చెబుతారు, అది తన తండ్రి వినాలి. ఇది బహుశా చివరి అవకాశం కావచ్చు, ఇలాంటిది మరో అవకాశం రాకపోవచ్చు. ఎన్నో ఏళ్ళుగా తాను పొందలేక పోయిన, పరిచయం కాకనే పోగొట్టుకున్న అనుభూతులను ఈ ఒక్క అవకాశం ద్వారా బహుశా పొందగలను.

ఇంకాస్సేపట్లో తనను స్టేజి పైకి పిలుస్తారు. తల్లిదండ్రులు ఇద్దరూ చూస్తుండగా తాను స్జేజి పైకి వెళ్లి సర్టిఫికెట్స్ ఇంకా మెడల్స్ తీసుకుంటే.. ఆ దృశ్యం ఎంత బాగుంటుంది, ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది, భవిష్యత్తు పైన మరింత నమ్మకాన్ని, బ్రతికేందుకు ఇంకా బలాన్ని ఇస్తుంది. ‘ఈ విషయం తన కంటే తన తండ్రికే ఎక్కువ తెలిసింటుంది. అలాగైతే ఇంకా రాలేదెందుకు’ ఆలోచనలు వదలడం లేదు విష్ణును.

దూరంగా నిలబడి నాన్న కోసం చూస్తూ.. డోర్ వైపు పదే పదే తల తిప్పుతూ.. అప్పుడప్పుడు వాచ్ చూసుకుంటూ, స్నేహితులతో లేని నవ్వును బలవంతంగా ముఖం పైకి రప్పించుకుంటూ, సతమతమౌతున్న కొడుకు విష్ణునే చూస్తూ ఆలోచిస్తోంది రాజేశ్వరమ్మ.

“ఎందుకు తన భర్త ఇంకా రాలేదు.. తనతో వస్తాననే చెప్పాడు. వస్తాడా.. రాడా.. అక్క ఏమంటుందో.. పోవద్దు అంటుందా.. తాను ఏమనుకుంటాడు? పరువుకేమైన భంగం అనుకుంటాడా..

తప్పంతా తనదే. అతనికి ఒక కుటుంబం ఉందని తెలిసి కూడా అతనితో పెళ్లికి సమ్మతించింది, తన వాళ్ళు ఎలా ఒప్పుకున్నారో, అతనికి మొగపిల్లలు లేరని, ఇద్దరూ ఆడపిల్లలే అని తన అమ్మనాన్నను ఎలాగో ఒప్పించేసాడు.

ఇప్పుడు అతన్ని తప్పు పట్టేందుకేమీ లేదు, అన్నీ తెలిసీ కావాలనే చేసుకుంది. తనకన్నా ఎక్కువగా ఈ చేదు పర్యవసానాన్ని ఎదుర్కుంటున్నది తన బిడ్డ. తెరిపి లేకుండా కళ్ళు వర్షిస్తుంటే చాటుగా తల వంచుకుని తుడుచుకుంటూనే ఉంది.

కార్యక్రమం మొదలైంది. ఎవరి సీట్లలో వారిని కూర్చోవాలని మైక్‌లో ప్రకటించాక విష్ణు వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు.

ఇద్దరి మధ్యలో ఒక ఖాళీ సీటు అలాగే ఉంది.

ప్రిన్సిపాల్ మాట్లాడారు. అతిథిగా వచ్చిన వారు ఒక్కొక్కరుగా మాట్లాడటం అయిపోవచ్చింది. కాలేజ్ రిపోర్ట్ కూడా చదివేసారు.

మెడల్స్ వచ్చిన వాళ్ళ పేర్లు ప్రకటించి, ముందుకు వచ్చి కూర్చోమని మైక్‌లో చెబుతున్నారు.

రిపబ్లిక్ డే రోజున ఏ కారణం చేతనో ఇవ్వలేక పోయిన సబ్జెక్టు లలో గోల్డ్ మెడలిస్ట్ లకు కూడా ఈరోజే మెడల్స్ ఇస్తున్నారు.

బాధపడకు అన్నట్టుగా చూపులతోనే అనునయిస్తోంది తల్లి.

ఆలోచిస్తూ పదేపదే ఆడిటోరియం గుమ్మం వైపే చూస్తున్నాడు విష్ణు. నాన్న ఇంకా రాలేదు అని అనుకుంటుంటే విష్ణులో చెప్పలేనంత బాధ.

ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నారు. విష్ణు ఊపిరి బిగబట్టాడు, “డా. విష్ణు, టాపర్ ఇన్ మెనీ డిసిప్లీన్స్, ప్లీజ్ కమాన్ టు ద డయాస్” ప్రకటించారు.

విష్ణు లేచి స్టేజి సమీపించాడు. ఇంతలో మైక్‌లో స్వరం వినబడింది

“అందరికీ నమస్కారం, నేనెవరో చెప్పేముందు, మీ ముందు నేను కన్ఫెస్ చేసుకోవాలి. ఏ కొడుకుకైనా తన తండ్రి వేలు పట్టుకు నడిస్తే ధైర్యం వస్తుంది, భుజమెక్కితే లోకం కనిపిస్తుంది. విష్ణు విషయంలో అది జరగలేదు. బిడ్డ ఆశయాల నక్షత్రాలను దాచుకునే అంతులేని ఆలోచనల ఆకాశం నాన్న అంటారు కానీ ఆ విషయంలో డా. విష్ణుకు అదృష్టం లేదు.

విష్ణు గుండెకు కళ్ళున్నాయి, కనపడనీయని కన్నీటి వాగులున్నాయి. తనలోని ఖాళీలను విష్ణు ఎప్పుడూ ఎవరికీ చూపించలేదు, తండ్రి ప్రేమ ఎంతగా కొదవున్నదీ ఎవరిముందూ వెలిబుచ్చలేదు. సాధించిన విజయోత్సవాలలో తన తండ్రి తమతో లేనందువల్ల ఏ సంతోషమూ, ఏనాడూ అతని గుండె దాకా చేరలేదు. అయినా అతను ఎవరినీ నిందించలేదు. ముందుకు సాగడం వొదులుకోలేదు.

ఈ నా తప్పిదం దిద్దుకోలేనిది. ప్రాయశ్చిత్తానికి తగింది అసలే కాదు. ఇప్పుడు వినండి, నా పేరు రామారావు, నేను డాక్టర్ విష్ణు తండ్రిని” అని చెప్పి విష్ణు వైపు చూసాడు.

విష్ణు వేగంగా వచ్చి తండ్రిని కౌగలించుకున్నాడు. ఇద్దరి కళ్ళ చెరువులు గండి పడినట్టుగా కళ్ళ నుండీ ఉదృత ప్రవాహాలను చూసి అందరికి కళ్ళు చెమర్చాయి.

Exit mobile version