గత రెండేళ్లుగా కరోనా కష్టకాలంలో జనాలు కనపడకపోయినా గాని, ఉదయం నిద్ర లేవగానే అందరినీ గుర్తు చేసుకునే ఒక మంచి సదవకాశం వాట్స్అప్ ద్వారా కలిగింది. కాఫీ తాగుతూ బంధుమిత్రులు పంపే పూల గుత్తుల శుభోదయాలు చూడడం ఎంతో హాయిగా ఉంటోంది. ఆ పూలు చూడగానే మన ఊరు,మన తోటలు మదిలో మెదిలి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కొందరు అత్యుత్సాహవంతులు బయలుదేరి ఆ పూల, సీనరీల పక్కనే కొటేషన్లు పెడుతున్నారు. అవి చదివాకా, బాబోయ్ ఇవన్నీ మనం పాటించాలా అని భయంగా ఉంటోంది. పొద్దున్నే ఖాళీకడుపులో ఆ సూక్తులు అరగడం లేదు. వీటిలో తరచుగా పడుతున్న ఒక కొటేషన్ ఏమిటంటే “క్షమించండి. మీకు ఇబ్బంది కలిగించినవారినీ, బాధ కలిగించినవారినీ అందరినీ టోకున క్షమించెయ్యండి. ఆపై మీరు హాయిగా జీవించండి” అని. ఈ కార్యక్రమం ఏమిటో ఇప్పుడు ఓ చూపు చూద్దాం.
మనకి చిన్నప్పటినుంచీ అమ్మమ్మలో నానమ్మలో చేసిన బ్రెయిన్ వాష్ వల్ల అతి మంచితనం మన బుర్రలోకెక్కి ఇంకిపోయింది. అంచేత ఎల్లవేళలా దాన్నే ప్రదర్శిస్తాం. ‘పోన్లే పాపం. వాళ్లంతే! ఒకళ్ళ మీద చెప్పుకోకూడదు’ అనేసుకుంటూ అందరి మీదా జాలిపడి జాలిపడి ఈ నాటికి మనల్ని మనం క్షమించుకోలేని స్థితిలో పడ్డాం. ఇప్పుడు మనమీద మనకే కోపం వస్తోంది. బతకనేర్వని వాళ్లమని దిగులు కూడా పడుతున్నాం. ఇలాంటి ప్రమాదాల్లో పడకుండా ఉండాలంటే మనం కొన్ని సంగతులు చర్చించుకోవాలి. మన మైండ్‌సెట్ కొంచెం మార్చుకోవాలి. పదేళ్ళప్పటినుండీ సాహిత్యం చదవడం వల్ల అతిగా ఏర్పడిన సహనం, ఆశావహ దృక్పథం వల్ల, తగిలిన రాయితోనే మళ్ళీ మళ్ళీ దెబ్బలు చాలా సార్లు తిన్నాం మనం. ఇక చాలు మస్తయ్యింది. ఇకనైనా తెలివిగా ఉందాం.
ఇక మనల్ని జీవితంలో హింస పెట్టిన వాళ్ళు, కష్టాల్లో ఇరికించిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లందరి మీదా సినిమాలో హీరోలాగా ప్రయత్నించి టిట్ ఫర్ టాట్‌లా ఏమైనా చెయ్యడం మన వల్ల కాదు. వాళ్ళని క్షమించేసి సాగిపోక తప్పదు. జీవితం అనేది చాలా పెద్ద కాన్వాస్. ఇలాంటివాళ్ళని వదిలించుకుని ముందుకు వెళ్లిపోయే క్రమంలో వాళ్ల మీద ఫోకస్ చెయ్యడం కుదిరేపనికాదు.
మరికొందరికి మన వివరాలు అన్నీ తెలుసుకుని వాటికి రంగులు వేసి న్యూస్ బుల్లెట్స్ లాగా తయారు చేసే బంధువులందరికీ చేరవేసే అలవాటుంటుంది. అత్తమ్మ అని పిలవబడే ఒక నాన్నగారి తరఫు బంధువు మీ ఇంటికి తరచుగా వస్తూ ఉంటుంది. మీతో చాలా సన్నిహితంగా ఉంటూ చిన్న చిన్న సలహాలిస్తూ ఇంట్లో ఫంక్షన్ లప్పుడు సాయాలు చేస్తూ బోలెడన్ని కబుర్లు,బంధువుల విశేషాలు చెబుతూ ఉంటుంది. శుభకార్యాలకు ఆమె సాయం చేస్తున్నప్పుడు మీరు ఆనందంతో మైమరిచి మీ ఇంటిలోని విషయాలేవో నవ్వుతూ నవ్వుతూ చెప్పేస్తారు. అంతే అవి బయటికి వెళ్లిపోతాయి. అంతే సంగతులు. ఆ తర్వాత అవి అనేక రంగులు మారి వన్నెలు చిన్నెలు చేర్చుకుని అబద్దాలై మీ చుట్టూ ప్రసరించి మీ కాళ్లకిందికి వస్తాయి. అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళచేత మీరు కాజాలు తినవలసి వస్తుంది. అప్పుడు మీకు ఆవిడమీద పీకల్లోతు కోపం వచ్చినా మింగి, ఆవిడని క్షమించి చెంపలేసుకోవాలి తప్ప ఏమీ చెయ్యలేరు. ఇక మీదట ఆమెతో మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మైండ్ కూడా దగ్గర పెట్టుకుని ముఖాముఖీ ఇంటర్వ్యూలో సమాధానాలు చెప్పినట్టు ఆచి తూచి మాట్లాడుతూ ఉన్నారనుకోండి. ఆవిడకు మీమీద ఇంట్రెస్ట్ పోతుంది. మిమ్మల్ని వదిలేసి మరొకర్ని పట్టుకుంటుంది. ఆ విధంగా మీకు మీరు రక్ష కట్టుకోవాలి.
కొందరు మన ప్రశాంత జీవనం చూసి బాధతో మండుతుంటారు. మరికొందరు చేపల చెరువులతోనో, రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనో, జీతాన్ని మించి వచ్చిన గీతంవల్లో కోట్లు సంపాదిస్తారు. ఆపై ఆటోమేటిక్‌గా బై ప్రోడక్ట్‌గా వచ్చిన అహంతో, కాళ్ళు నేలమీద ఆనక వాళ్ళు యాతన పడుతుంటారు. అందువల్ల మన గురించి ఏవేవో మాట్లాడి మన మనసుకు కష్టం కలిగించి తీరతారు. ఇటువంటి వాళ్లతో మనం ఎదురుపడి వేగడం కష్టం కాబట్టి వాళ్ళని క్షమించేసి దూరం నుంచే చెయ్యూపి తగినంత దూరంగా ఉండడం క్షేమం.
మన నిత్య జీవితంలో అనేక మందితో కలిసి ఉంటాం. ఫ్యామిలీ గాని, ఇరుగుపొరుగు కానీ, ఆఫీస్ కానీ ఎంతో మందితో గడుపుతాము. వాళ్లంతా రకరకాలుగా ఉంటారు. మన మనసుకు నచ్చిన వాళ్ళు, మన భావాల్ని వ్యక్తపరిస్తే వాటిని గౌరవించే వాళ్ళు, మనల్ని ప్రేమగా చూసే వాళ్ళు కొందరుంటారు. వీళ్లతో పాటు మనం అంటే పడని వాళ్ళు, మన మీద అయిష్టంతో ఉండే వాళ్ళు కూడా మన చుట్టూనే ఉంటారు. వాళ్ళని మనం దూరంగా పెట్టడానికి వీలు కాదు. వాళ్లు వీలు చూసుకుని మనల్ని వెక్కిరిస్తూ వెటకారం చేస్తూ తప్పులు పడుతూ ఉంటారు. వాళ్ల మీద మనకి కాలుతూ ఉన్నా ఏమీ చెయ్యలేం. అదో శాపం.
మనుషుల స్వభావాలు చాలా వరకు వయసు పెరిగినా మారవు. మనకి బాగా తెలిసిన వాళ్లని పాతికేళ్ల తర్వాత కలిసినా వాళ్ల ఒరిజినల్ వ్యక్తిత్వ సుగంధం అలాగే ఉంటుంది. మన క్లాస్మేట్ రాము ముప్పయ్యేళ్ల క్రితం డిగ్రీ చేసేటప్పుడు ఎలా గొప్పలు చెబుతూ ఉండేవాడో ఇప్పుడు కనపడినా అలాగే చెబుతూ ఉంటాడు. తాము బాగా ఆస్తిపరులమనీ హై లెవెల్ అనీ, ఇంకెవరూ కాదనీ అటువంటి వాళ్ళు ఒక మానసికమైన తృప్తిలో అందరికీ కనబడుతూ ఉంటారు. లోపలి కారణాలు మనకి తెలీవు. “ఇన్నాళ్లూ ఉద్యోగం చేసి ఏం సంపాదించావ్? ఓ పది సైట్‌లు కొనిపడేసుకోవద్దా?” అంటూ మాటల్లో మాటగా ఓ వంకర ప్రశ్న వేస్తాడు. అలాంటి కబుర్లు వింటూ మనసు పాడు చేసుకోకుండా ఉండగలగాలి. జాగ్రత్తగా అటువంటివాళ్ళని తప్పించుకోవడం,తప్పదనుకుంటే రిపార్టీతో సిద్ధంగా ఉండడం అలవరచుకోవాలి. ప్రతి వారినుంచీ మెచ్యూరిటీ ఆశించకూడదు మనం. అలా ఎవరి వల్లో మన బీపీ షుగర్ లెవెల్స్ పెంచుకోవడం అవసరమా?
మాకు చిన్నాన్న వరసయ్యే ఒక పెద్దాయన ఇక్కడే కొడుకింట్లో ఉంటారు.అప్పుడప్పుడూ ఫోన్లో టచ్‌లో ఉంటాం. “ఓసారి వచ్చి చూసివెళ్ళమ్మా” అంటుండేవారు. ఇంట్లో ఎవరూ ఉత్సాహం చూపించకపోతే, ఒకరోజు వస్తానని ఫోన్‌లో చెప్పి పళ్ళూ, స్వీట్లూ తీసుకుని మూడు బస్సులు మారి ఆటోలో ఆయనుండే కాలనీకి వెళ్ళాను. కొంచెం అడ్రెస్స్ ఇబ్బంది అయ్యి మూడుసార్లు ఫోన్ చేసినా ఆయన ఎత్తలేదు. ఆటోలో తిరిగి వెనక్కి వెళుతూ మళ్ళీ చేస్తే ఎత్తారాయన. అప్పటివరకూ ఆయన నిద్రపోయారట. దేవుడా అనుకుంటూ ఆటో మళ్ళీ వెనక్కి తిప్పి ఆయనింటికి వెళ్లి ఓ గంట కూర్చుని వచ్చేశా. ఆయన్ని క్షమించాను కానీ అలాంటి దుస్సాహసం మరెప్పుడూ చెయ్యలేదు నేను.
కొన్ని కుటుంబ ఫంక్షన్‌లలో మనల్ని కొందరు పనిగట్టుకుని పలకరించి “మీరు ఉద్యోగం, ఇల్లూ ఎలా చూసుకుంటారో పాపం” అని పల్లకీ ఎక్కించి తర్వాత “ఇంట్లో ఉండేవాళ్ళ కష్టాలు మీకేం తెలుసు? బైటికి వెళ్ళిపోతారు మీరు” అన్నదగ్గర దింపుతారు. ఇలాగే ఏవో రక రకాల సన్నాయి నొక్కులు చెవిలో పడతాయి. మనం వాళ్లందరినీ చూసిన ఆనందంలో సరైనా జవాబివ్వాలన్న ఆలోచనే రాదు. ఇంటికొచ్చాక రీల్ రివైన్డ్‌లో కనబడతాయవి. అవన్నీ యధాలాపంగా కనబడే గిల్లుళ్లే. ‘ఉద్యోగం చేసినా మీరు చేసే పనులన్నీ చేసే మేం బైటికి వెళ్ళాలి. ఒక్కటి కూడా తప్పదు’ అన్న సత్యం వారికి చెప్పలేకపోతాం. అంచేత అలాంటి సందర్భాల్లో గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండి జవాబివ్వడం వల్ల వాళ్ళకీ నోరు మూతపడుతుంది. మనకీ గౌరవం దక్కుతుంది. ఎందుకంటే మనల్ని కూడా మనం గౌరవించుకోవాలి. శాంతం శాంతం అనుకుంటూ పిచ్చివాళ్లలా కూర్చోకుండా ఎవరివల్లనో మనం ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఎవరంటే వాళ్ళు మనమీద రాళ్లు విసరకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే కదా! మన తరఫున ఎవరూ మాట్లాడరు కదా !
ఒకోసారి మనకి పరిచయం ఉన్న లబ్ద ప్రతిష్ఠులైన కవులో, కళాకారులో కలిసినపుడు మనం సంతోషపడుతూ నమస్కారం చేసి పలకరిస్తాం. వాళ్ళు అసహనంతోనో, వార్ధక్య విసుగుతోనో ఒకోసారి పెళుసుగా మాడ్లాడతారు. మనం చిన్నబోతాం. అటువంటి వారిని గబుక్కున మన మైండ్ లోంచి గుర్తు పెట్టుకుని తీసెయ్యాలి. మళ్ళీ ఎప్పుడైనా, కనబడినా పలకరించరాదు. మన కాల్‌ని మిస్ చేసి, ఆనక గమనించి కనీసం మెసేజ్ అయినా పెట్టనివాళ్ళని కూడా మన గ్రూప్ లోంచి హాయిగా తొలగించొచ్చు.
కొందరికి ఎదుటివారిని చూడగానే, వేళాకోళంగా తక్కువ చేసి మాట్లాడడం అలవాటు. పోనీలే మన వాళ్లే సరదాగా అన్నారులే అని సరిపెట్టుకున్నా, మళ్లీ కలిసినప్పుడు వాళ్లలాగే ఛాన్స్ తీసుకొని మాట్లాడేస్తుంటారు. మనకి అప్పట్లో ఉండే సహనం, ఓపిక, శక్తి ఎందుకో ఇప్పుడు ఉండడం లేదు. అటువంటి వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే మనకీ మన ఆరోగ్యానికీ అంత మంచిది. ఇంకో సంగతి. అప్పుడప్పుడూ గెట్ టుగెదర్ లలో పర్సుల్లో డబ్బులు పోతుంటాయి. నోరెత్తకుండా, ఎవరినీ అనుమానించకుండా అప్పటికి ఊరుకుని ఆనక ఈ సంగతి కూడా గుర్తుపెట్టుకుని మసలుకోవాలి.
మనకి అత్యంత సన్నిహితులు కొందరు, జీవితంలో అతి ముఖ్యమైన విషయంలో ఇచ్చిన మాట తప్పుతారు. అది వారి అశక్తతా బలం. పరిస్థితులు తామనుకున్నట్టు అనుకూలిస్తే, తప్పకుండా మాట నిలబెట్టుకునే వారమని సమర్థనీయ కారణాలు వివరిస్తారు. ఆపత్సమయం గడిచిపోయాక వారిని క్షమించక చేసేదేం ఉంటుంది? వారి మాటకి వారు కట్టుకున్న, నిలబెట్టుకున్న విలువని మనం శాశ్వతంగా గుర్తించడం మనకే మంచిది, మరోసారి వారిని నమ్మకుండా.
మన అన్నదమ్ములమీద అక్కచెల్లెల్ల మీద మనకి గుడ్డి ప్రేమ ఉంటుంది. దాంతో, వాళ్ళు మనకి సహాయం చేసే సత్తా ఉన్న రకం కాదు అని తెలిసినా మళ్ళీ మళ్ళీ వాళ్ల మీద ఆధారపడి బోర్లా పడుతూ ఉంటాం. అటువంటి పిచ్చి ప్రేమలు వదుల్చుకోవాలి. మనకు ఒక పని వచ్చినప్పుడు, ఓ కంపెనీ సీఈఓలా ఆలోచించి ఆ పని ఎవరి వల్ల అవుతుందో వాళ్లని అభ్యర్థించి చేసుకోవాలి. అలాగే మరొకరికి మన సహాయం అవసరమైతే ఆ పని చేసి పెట్టి మనల్ని మనం నిరూపించుకోవాలి. మనం రిటైర్ అయినా గ్రాండ్ పేరెంట్ అయినా నిత్య చైతన్యంతో ఉండాలి లేకపోతే అజాగ్రత్త వల్ల ఎవరి బారినో పడి ఆనక చింతించవలసి వస్తుంది.
ఒకసారి మా కొలీగ్ రిటైర్ అవుతుంటే కొందరు ఆత్మీయులు కలిసి ఒక రిసార్ట్ లో ఒకరోజు గడిపేలా ప్లాన్ చేశాం. మా కొలీగ్ పద్మజ ఆ కార్యక్రమం ఆరెంజ్ చేస్తా అంది. ఎవరికీ సరైన కమ్యూనికేషన్ ఇవ్వక అది ఫెయిల్ అయింది. చివరికి ఎలాగోలా లాస్ట్ మినిట్‌లో ఏదో అయిందనిపించాము. ఆ పద్మజని బాగా తిట్టుకున్నాం. తర్వాత ఆమె మా బ్రాంచ్ నుంచి సిటీలోని మరో బ్రాంచ్లోకి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయింది. ఉమెన్స్ డే సెలబ్రేషన్ కి మళ్లీ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆవిడ మళ్ళీ అలాగే, “నాకు అన్నీ తెలుసు, నేను ఆ రోజు మీతోనే ఉంటా” అని ముందుకు దూసుకుంటూ వచ్చేసింది. గతంలో జరిగిన అల్లరి మేం మర్చిపోయి ఆవిడ మీద పెట్టేసాం. “మంచి వక్తలని తీసుకొస్తా” అంది. “ఏ హోటల్ ఎన్ని గంటలకి లాంటి వివరాలన్నీ మీ అందరికీ మెసేజ్ పెట్టేస్తా” అంది. ఏమీ చెయ్యలేదు. మర్నాడే ఉమెన్స్ డే. లంచ్లో అంతా కలిసి ఫోన్ చేసి అడిగితే అప్పుడు నెట్ ఓపెన్ చేసి హోటల్స్ పేర్లు చెప్పడం మొదలుపెట్టింది,మీకేది ఇష్టం అంటూ. ఇప్పుడు చూడడం ఏంటి ?ఇప్పటికే నువ్వు అంతా డిసైడ్ చేయలేదా అంటే “ఎంతసేపు? ఇప్పుడే చిటికెలో చేస్తా” అంటుంది. వక్తలమాటేమిటి? అంటే “మనమే మాట్లాడేసుకుందాం ఎవరో ఎందుకు?”అంది. మాకు వళ్ళుమండిపోయి ఫోన్ పెట్టేసి అప్పటికప్పుడు పరుగులు తీసి చేసుకున్నాం. ఇలాంటి వాళ్ళు ఉంటారు జాగ్రత్త! మనం ఒకసారి మోసపోతే అది మోసం చేసిన వాడిది తప్పు. రెండోసారి అది మన తప్పే. చిన్న మెమరీ మనల్ని కొన్ని ఆపదల నుంచి కాపాడుతుంది.
కొందరు పొదుపుని ఒక గొప్ప తపస్సుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పాపం అన్ని విషయాలూ మర్చిపోయి, తమ సాధన మీదే దృష్టి పెట్టుకుంటారు. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. ఇటువంటి వాళ్లని తీసుకుని మన మిత్ర గ్రూప్‌తో టూర్లకు, యాత్రలకు వెళ్లకూడదు. వీళ్ళు జేబులోంచి ఒక్క పైసా తియ్యకుండా ఎవరో ఒకరు ఇస్తారులే అన్నట్టు నిమ్మళంగా ఉంటారు. ఏదో ఒకసారి రెండుసార్లు పోనీలే అనుకున్నా మిగిలిన వాళ్లతో మనకు మాటొస్తుంది. కాబట్టి ఫైనాన్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండకపోతే లేనిపోని విభేదాలు తప్పవు. ఆనక టూర్ ఆనందం పోయి ఇదో పెద్ద విషయంగా మాట్లాడుకోవలసి రావడం ఎవరికీ బావుండదు.
మన వాళ్లలో కొంతమంది ఏదైనా ఫంక్షన్‌లో మనం కనపడగానే దూరం నుంచే గమనించి, ఇక అప్పటి నుంచి మన వైపు చూడడం మానేసి అటు ఇటు చూస్తూ కొంతసేపు డ్రామా చేసి మనం పలకరించాక “అరే వచ్చావా? చూడలేదు” అని కబుర్లు చెప్పబోతారు. మన పట్ల అది వాళ్ళ పెర్సనాలిటీ డిజార్డర్ అని మనం గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మనకి హాయిగా ఉంటుంది. ఆ తర్వాత అలా ముందుకు సాగిపోవాలి మనం.
మన బ్రెయిన్‌లో స్పేస్ చాలా విలువైనది. వాళ్ళెందుకలా ప్రవర్తించారు? వీళ్ళెందుకిలా మాట్లాడారు? లాంటి వ్యర్ధపు విషయాలకి బుర్రలో ఒక ఫోల్డర్ ఇస్తే మన బుర్ర వేస్ట్, మన టైం వేస్ట్. కొద్దిపాటి జ్ఞాపకశక్తి ఉంచుకోవడం, ముందుగానే అలెర్ట్‌గా ఉండడం లాంటి చర్యలు ఈ బాధలన్నిటికీ చక్కటి నివారణ.
ఒక్కోసారి మనం కొన్ని గ్రూపులతో కలిసి టూర్లకు వెళతాం. అందులో కొందరు ఎక్కువ హోషియారీ చూపిస్తూ ఉంటారు. ఆ స్పెషల్ బస్సులో ఎక్కగానే మంచి సీట్ చూసుకుని ఈ సీటు నాది అంటారు. హోటల్లో బసకు దిగగానే, నాది ఈ రూమ్, నాది ఈ బెడ్ అని గబగబా ఆక్రమిస్తూ డామినేట్ చేస్తూ ఉంటారు. మనం మొహమాటం కొద్దీ ఓకే అన్నా తర్వాత మనకి విసుగొస్తుంది. ఇటువంటి వాళ్ళని అప్పటికి క్షమించి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరి సుఖం వాళ్ళు చూసుకోవడం తప్పు కాకున్నా, పక్కవాళ్ళని మీకు ఓకేనా అని అడగాలన్న సంస్కారం ఉన్న వాళ్లతోనే వెళ్లాలి. ఇలాంటి సంకటాలు మరోసారి ఎదురవకుండా నొప్పింపక పక్కకు తప్పుకోవడం మంచిది.
జీవితంలో కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట సందర్భాలు ఏర్పడి మనం ఒంటరిగా నిలబడి పోతాం. ఒక్క సానుభూతి వాక్యం కోసం మనం తల్లడిల్లుతున్నప్పుడు, అంతా తమ సహజమైన రంగును చూపెడతారు. మన తరఫున ఒక్కళ్ళంటే ఒక్కళ్లు కూడా మాట్లాడరు. అటువంటప్పుడు నిజంగా మనం ఆశ్చర్యపోతాం. బంధువులు, మిత్రులు, సహచరులు అనుకోవడమంతా ఒక భ్రమే అన్న ఎరుక కలుగుతుంది. ఆ సందర్భం గడిచాక అంతా మామూలుగా ఉంటారు. అటువంటప్పుడు మనం కూడా అందరితో మామూలుగానే ఉండాలి కానీ మనం నేర్చుకున్న పాఠం మర్చిపోకూడదు. ఆ సందర్భం మనకి విలువైన డిటాచ్మెంట్ అనగా మోహరాగాలను వదలాలన్న వైరాగ్యం నేర్పిస్తుంది. అంతా మనవాళ్లే కానీ ఎవరూ మనవారు కాదు అన్న జ్ఞానం బోధిస్తుంది.అంతా మన మంచికే అన్నమాట.
“జిందగీ ఆసాన్ నహి హోతీ, ఇసే ఆసాన్ బనానా పడతా హై. కుచ్ అందాజ్ సే, కుచ్ నజర్ అందాజ్ సే” అని ఒక కోట్ ఉంది.అంటే “జీవితం సులభతరమైనది కాదు. దాన్ని సులువు చేసుకోవాలి. ఎలాగంటే దాన్ని కొంత పట్టించుకుంటూ, కొంత చూసీ చూడనట్టు వదిలేస్తూ విచక్షణతో వ్యవహరించాలి” అని అర్థమట. కొందరు జనాల్ని చూసీ చూడనట్టు వదిలెయ్యకుండా మనసుకు పట్టించుకుంటే మనకే కష్టం. మరంచేత మనం చిన్నప్పటిలాగే ఉంటూ సణిగితే లాభం ఉండదు.ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని మనల్ని ఇబ్బంది పెట్టి, ఇరుకున పెట్టిన వాళ్ళ బారిన పడకుండా కాస్త పరాకు చెప్పుకుంటూ మనల్ని మనం కాపాడుకుందాం.
ఏ గెట్ టుగెదర్ లలోనో ప్రేమగా పలకరించుకుంటూ, సరదాగా కలిసి భోజనం చేస్తూ, నవ్వుకుంటూ కొన్ని తేలికైన మాటలు సరదాగా చెప్పుకుంటూ ఉండే వాళ్ల సమూహం లోనే ఉండడానికి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాలి. మనం అంటే ప్రేమగా ఉండే వాళ్లనే ఫాలో అవ్వాలి. ఇలాంటి విషయాల్లో నిత్య విద్యార్థులుగా ఉండడం మంచిది. ఎవరి మర్యాదనూ మనం తియ్యకూడదు. అలాగే మన మర్యాద నిలబెట్టే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళుతూ ఉండాలి. మర్చిపోకండి.
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.