Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కిం!!!

[శ్రీ జి.ఆర్.భాస్కర బాబు రచించిన ‘కిం!!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మధనోద్భూతిత మహీతలం మీద
ఎర్రని మనో ఆకాశం నుండి
వెచ్చని ద్రావకపు అక్షరాల
జడివాన కురుస్తూంది..
అభ్యుదయ ప్రహేళికాలోచనల
మహోన్నత ఘన వృక్షావారం
ఛిన్నాభిన్నం అయిపోతూంది..
లలిత భావనాలింగితమైన
కుసుమ తరూసమూహం
కృష్ణ కాటుకలు పూసుకుంటున్నాయి.
లలిత శృంగార పల్లవాలు
మాడిమసై పోతున్నాయి..
సున్నిత లాస్య వల్లరులు
మధుర దరహాస సుమ బంధూకాలు
రక్త వర్ణంలో కరిగి పోతున్నాయి.
ఎందుకు ఈ అభీలమైన భావనలు?
ఎందుకు ఈ భయానక మనోత్పాతం?
ఎందుకు ఈ మస్తిష్క ప్రళయ పర్జన్య గర్జన?
భావనలన్నీ భయంకరం..
ఆలోచనలన్నీ అయోమయం..
ఘనీభవించిన జ్వాలాశిఖరం చిమ్మిన లావాలా
తుఫాను తర్వాతి ప్రశాంతతలా
మనో నేత్రం ముందు
ఆవిష్కరింపబడిన ప్రణవ నాదంలా
మదిని నెమ్మది పరచే సామవేద గానంలా
ఎక్కడ నుండో జాలువారే
ధవళ స్వఛ్ఛ ఆనందం
శాశ్వతమవని క్షణాన్ని బంధించలేని
కాలగతిలో సాగక తప్పని బ్రతుకు బాటసారికి
అంతకు మించి ఏమీ దక్కదని తెలిసీ
జీవన్ముక్తికి ఆశపడి, ఆరాటపడి, తపించి పోయే
ఈ జీవికి అంతమెక్కడ, ఆనందమెక్కడ!!

Exit mobile version