[వివిధ జంతువుల ప్రత్యేకతలను చిన్న వ్యాసాలుగా బాలబాలికలకు అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.]
పిల్లలూ!
మత్తుమందు తీసుకున్నప్పుడు మనుషులు చురుగ్గా, అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండలేరు. అలాగే జంతువులు కూడా ఉండలేవు. అందుకే మత్స్యకారులు చేపలకి కూడా అటువంటి మత్తు కలిగేట్టు చేసి వాటిని సులువుగా వలవేసి పడుతుంటారు. ఇలా ఎక్కడ, ఎలా జరుగుతుందో చూద్దాం.
మన దేశంలో రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలూ వున్నాయని మనందరికీ తెలుసు. వీటిలో మన దేశానికి ఆగ్నేయ మూలలో బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్ దీవులున్నాయి. అన్ని ప్రాంతాలలో ఉన్నట్లే
ఈ నికోబారీయులలోను చేపలు పట్టేవాళ్ళున్నారు. అయితే వారు మనలాగా గాలాన్ని ఎరగా వెయ్యరు. మరేం చేస్తారు?
ఈ దీవులలో ‘కిన్‌యాయా’ అనే చెట్లు పెరుగుతాయి. వాటి గింజలు మత్తులో పడేస్తాయి. మనవి కాదర్రా! చేపలని – ఎలాగబ్బా! అని ఆశ్చర్య పోతున్నారా! చూద్దాం ఎలాగో?
ఈ ‘కిన్‌యాయా’ చెట్లు రెండు రకాలు. వీటి కాయల విత్తనాల పరిమాణాన్ని బట్టి ఇలా విభజించారు. సముద్రతీరంలోని ‘కిన్‌యాయా’ చెట్ల విత్తనాలు పెద్దవిగా వుంటాయి. దీవుల లోపల చిన్న నీటిగుంటలు, బుల్లి చెరువులు, పిల్ల కాలువలు వుంటాయి. ఇవి వాన వచ్చినప్పుడు ఆ నీటితో నిండుతాయి.
మత్స్యకారులు ఏం చేస్తారో అని ఎదురు చూస్తున్నారా! చెప్పేస్తున్నా!
సముద్రతీరపు చెట్ల కాయలు విత్తనాలు పెద్దగా వుంటాయనుకున్నాం గదా! వీటిని పొడి చేసి సముద్రపు నీటిలో వేస్తారు. ఈ పొడి సముద్రపు చేపలను మత్తులో ముంచుతుంది. ఆ మత్తులోనే చేపలు వలలో పడతాయి.
దీవుల లోపలి చెట్ల విత్తనాలు చిన్నగా వుంటాయి. ఈ విత్తనాలను పొడిచేసి ఈ కుండాలలో చేరువులలో, కాలువలలో వేస్తారు. గుంటలలోని చేపలు ఈ పొడికి మత్తులోకి వెళ్ళిపోతాయి. ఇవీ వలలో తేలికగా పడతాయి. విత్తానాలన్నీ శంఖాకారంలోనే వుండడం విశేషం.
ఈ విధంగా ‘కిన్‌యాయా’ విత్తనాల మత్తులో పడిన చేపలను మత్స్యకారులు ఆహారంగా తీసుకుంటారు. చేపలు మన ఆహారం కాబట్టి, వాటిని ఇలా వేటాడడం మనుషులకు అవసరం.
కాని మనం మాత్రం మత్తులో మునిగిపోకుండా, జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే మన జీవితంలో ఎదగగలుగుతాం. ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతాం.
చూశారా! మత్తులో మునిగిపోయే చేపలు కూడా మనకి పాఠాలు చెపుతాయి.
