Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితాన్ని ప్రేమించడం నేర్పే ‘కిష్టప్ప కథలు’

[శ్రీ భాగవతుల కృష్ణారావు గారి ‘కిష్టప్ప కథలు’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

ప్రముఖ తెలుగు కథా రచయిత భాగవతుల కృష్ణారావు గారు రచించిన ఒక విశిష్టమైన కథా సంపుటి ‘కిష్టప్ప కథలు’. కిష్టప్ప అనే పేరులోనే ఎంతో ఆత్మీయత గోచరిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఆప్యాయంగా పిలిచే పద్ధతి అది.

కృష్ణారావుగారు వృత్తిరీత్యా రైల్వేలో హెడ్ క్లర్క్ గా పనిచేసి రిటైర్ అయినప్పటికీ, ప్రవృత్తిగా సాహిత్యాన్ని ఎంచుకుని దశాబ్దాలుగా ఎన్నో చక్కని కథలు, అనువాదాలు అందిస్తున్నారు.

కృష్ణారావు గారు ఈ సంపుటిలోని కథల్లో మధ్యతరగతి జీవితాలను, దైనందిన జీవితంలో తారసిల్లే సాధారణ మనుషుల స్వభావాలు, వారి సుఖదుఃఖాలను ఎంతో చక్కగా ఆవిష్కరించారు.

కృష్ణారావుగారిది హాయిగా చదివించే శైలి. వీరి కథలు అత్యంత సరళమైన, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే వాడుక భాషలో సాగుతాయి.

మన చుట్టూ, మన నిత్య జీవితంలో తారసపడే అనేక ఆసక్తికరమైన సంఘటనలను, పాత్రలను ఆధారంగా చేసుకుని రచయిత ఈ కథలను మలిచారు. అందువల్ల కథాంశాలు – కృత్రిమం అనిపించకుండా, పాఠకుడు తమ సొంత జీవితాన్ని లేదా ఇరుగుపొరుగు వారిని చూసుకుంటున్నంత సహజంగా ఉంటాయి.

ఈ సంపుటిలో 18 కథలు, 32 మినీ కథలు, 25 ముచ్చట్లు, 6 మినీ కవితలు ఉన్నాయి. కథల్లో అనువాద కథలు కూడా ఉన్నాయి. అనువాద కథలపై కృష్ణారావుగారికి ఆసక్తి ఎలా కలిగిందో, వారి ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.

సత్యజిత్ రే వ్రాసిన Corvus అనే సైన్స్ ఫిక్షన్ కథకి అనువాదం ‘కార్వస్’. ఈ కథలో, ప్రొఫెసర్ శంకు ఒక మామూలు కాకికి – అత్యంత తెలివైన, చురుకైన జీవిగా వ్యవహరించేలా శిక్షణ ఇస్తాడు. ఇది ఒక ఉత్కంఠభరితమైన సాహసానికి; పక్షులను దొంగిలించే దురాశగల మాంత్రికుడితో మేధో పోరాటానికి దారితీస్తుంది. కథ అనువాదం సాఫీగా సాగింది, ఆసక్తిగా చదివిస్తుంది.

‘ఎవరు దోషి’ కథకి మూలం కానన్ డాయిల్ వ్రాసిన The Adventure of the Three Students అనే కథ. లండన్‌లోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో హిల్లరీ సోమ్స్ అనే గ్రీకు భాషా అధ్యాపకుడు ఉంటాడు. ఒక ముఖ్యమైన స్కాలర్‌షిప్ పరీక్ష కోసం సిద్ధం చేసిన రహస్య ప్రశ్నపత్రాలను తన గదిలోకి దూరి ఎవరో చూశారని ఆయన గ్రహిస్తాడు. పరీక్షకు ఇంకా కొన్ని గంటలే సమయం ఉండడంతో, ఆ అపరాధిని పట్టుకోవడానికి ఆయన షెర్లాక్ హోమ్స్ సహాయం కోరతాడు. హోమ్స్, వాట్సన్‌లు ఈ సమస్యని ఎలా పరిష్కరించారు, నేరస్థుడిని ఎలా కనిపెట్టారనేది ఉత్కంఠగా సాగుతుంది.

మహాశ్వేతాదేవి వ్రాసిన ‘బయెన్’ అనే బెంగాలీ కథకి అనువాదం ‘గంగపుత్రులు’. తనపై పడిన మంత్రగత్తె అనే ముద్రని ఒక మహిళ ఎలా చెరుపుకుందనే కథాంశం. ఒకనాటి సమాజంలోని లింగవివక్షకి దర్పణం ఈ కథ.

నాస్తికుడైన ఆనంద్ రిటైర్ అయ్యాకా, రెండేళ్ళ పాటు శ్రమించి భగవద్గీతని అధ్యయనం చేస్తాడు. ఈ క్రమంలోనే ధర్మగంగకి చేరుకుని విపాశన ధ్యానం పదిరోజుల కోర్సు చేస్తాడు.  అతని గదిలో సహవాసిగా వచ్చిన అక్షయ్ జైన్ పద్ధతి నచ్చుతుంది. పది రోజుల కోర్స్ పూర్తయ్యాకా, అతనితో మాట్లాడుతాడు. తన పెద్ద కూతురు మృదులకి సరైన జోడీ అని భావిస్తాడు. మరి అక్షయ్ ఏమనుకున్నాడో తెలియాలాంటే ‘ముందుచూపు’ కథ చదవాలి.

గురక పెట్టే అలవాటున్న కథకుడు చాలా అవమానాలు ఎదుర్కుంటాడు. చివరికి వైద్యుని వద్దకు వెళ్తాడు. ఎన్నో ప్రశ్నలేసి, గురక పెట్టడం చట్టరీత్యా నేరం కాదంటాడు డా. వ్యాఘ్రేశ్వరరావు. పైగా గురక వల్ల కలిగే ఉపయోగాలు కూడా చెప్తాడు. గురకని తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న కథకుడు చివరికి భార్య చెప్పిన సలహా పాటిస్తే, హాయిగా నిద్రపడుతుంది. ఆమె ఏం చెప్పిందో తెలియాలంటే ‘గురక’ కథ చదవాల్సిందే మరి!

‘వందేమాతరం’ అనే శీర్షికతో వ్రాసిన కథ పోటీలో బహుమతి గెల్చుకున్న కథ. ఓ వృద్ధాశ్రమానికి అనుకోని అతిథిగా వచ్చిన భారతమ్మ, ఆ తరువాత ఆ వృద్ధాశ్రమానికి ఏ రకంగా సాయం చేయగల్గిందో ఈ కథ చెబుతుంది.

‘అవ్యక్త బంధం’ కథ గురుపూజాదినోత్సవ కథలో పోటీలో బహుమతి పొందిన కథ. అనాథనైన తనని చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిన ముకుంద రావు మాస్టారి ఋణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు గోపాలకృష్ణ ఈ కథలో.

తెలిసీ తెలియని వయసులో, వలపు ఆకర్షణలో పడి, ఇంట్లోంచి పారిపోయి, మోసపోయి తిరిగి ఇల్లు చేరుతుంది కమల ‘రామబాణం’ కథలో. తండ్రి తరిమేస్తాడు. ఆయనకు భయపడి, తల్లి, నానమ్మ, తోబుట్టువులెవరూ మాట్లాడలేరు. చేసేదేం లేక అక్కడ్నించి వెళ్ళిపోతుంది కమల. ఇరవై ఏళ్ళు గడిచాకా, అనుకోని పరిస్థితిలో అన్నకి ఎదురుపడుతుంది. మరి అతనేం చేశాడో తెలియాలంటే కథ చదవాలి. ఈ కథ గురించి రచయిత ఏం చెప్పారో ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవవచ్చు.

‘అర్ధనారీశ్వరం’ కథలో రావుగారు రిటైరవబోతుంటారు. మర్నాడే రిటైర్మెంట్ డే. ఆ రాత్రి ఆయనకు నిద్రపట్టదు తనకు, తన కుటుంబానికి గత 34 ఏళ్ళుగా భార్య చేసిన సేవలను గుర్తు చేసుకుంటాడు. ఆవిడకి జీతం, డి.ఎ., ఇంక్రిమెంట్, బోనస్.. వగైరాలు ఏమీ లేవు కదాని అనుకుంటాడు. సభకి ఆమెని తీసుకువెళ్ళి కొలీగ్స్‌కి గొప్పగా పరిచయం చేస్తాడు ‘కల’లో. భార్య నిద్ర లేపితే, ఆమె ముఖాన్ని పరిశీలనగా చూస్తాడు. కలని నిజం చేయడానికి ప్రయత్నించాలని నిశ్చయించుకుంటాడు.

ఓ పేదింటి కుటుంబంలో వారసత్వంగా వస్తూంటుంది తాగుడు వ్యసనం. వీర్రాజుకి తన తండ్రి నుంచి అలవాటవుతుంది. తండ్రి లాగే తాగి తందనాలాడి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటాడు. కానీ వీర్రాజు కొడుకుకి ఈ ‘వ్యసనం’ అబ్బదు. తెలివైనవాడు. బాగా చదువుకుంటాడు. మిత్రుడితో జరిపిన చిన్న సంభాషణ తండ్రి వినేట్టు చేసి, అతనిలో మార్పుకి దోహదం చేస్తాడు.

తన అభిమాన రచయితని పార్కులో కలవాలని వచ్చిన రవి, ఆయనకిచ్చిన మాటని ఎందుకు నిలుపుకోలేకపోయాడు? ఆసక్తిగా సాగుతుంది ‘అభిమాని’ కథ.

తాను ఎదిగేందుకు ప్రయత్నించకుండా, ఎదుగుతున్న మిత్రుడిని అడ్డుకోడంలోని రాక్షసానందాన్ని అనుభవిస్తుంటాడు. ఆఫీసరుతో ఆ మిత్రుడు తన గురించి మాట్లాడుతున్న మాటలు విని తన మనసు మార్చుకుంటాడు. మరి అతనక్కడ్నించి వెళ్ళిపోయాకా ఏమయ్యిందో ‘మంచీ-చెడూ’ కథ చెబుతుంది.

కాశీ క్షేత్రం ముక్తిని ప్రసాదిస్తుందని అంటారు. హిందువులు జీవితంలో ఒకసారైనా కాశీ వెళ్ళిరావాలని కోరుకుంటారు. అటువంటి కాశీక్షేత్రం ఓ వ్యక్తికి మానసికంగా ఎలా సాంత్వన చేకూర్చిందో, మనసులో అపోహలని ఎలా తొలగించిందో ‘టీ కప్పులో తుఫాను’ కథ చెబుతుంది.

‘బిల్హణీయం’ అనే మినీ కథలో, బిల్లూకెదురైన ఆశాభంగం చదువరులకి కూడా నిట్టూర్పు వచ్చేలా చేస్తుంది. ఈ కథ ప్రారంభం ఓ పద్యం! దాన్ని రాసింది కూడా కృష్ణారావుగారే. పద్యాల మీద ఆసక్తి ఎప్పుడు ఎలా కలిగిందో, తమ ఇంటర్వ్యూలో తెలిపారు, చదవండి.

అప్పటిదాకా తల్లిదండ్రుల ప్రేమని ఒక్కరే అనుభవించిన తొలి సంతానానికి తమ్ముడో చెల్లెలో పుడుతుందంటే, ఎన్నో సంశయాలు కలుగుతాయి. తనకి దక్కే ప్రేమ వాటాలవుతుందని భయపడతారు. అలా భయపడిన ఓ పిల్లాడికి తండ్రి నచ్చజెప్పిన తీరు ‘జ్ఞానబోధ’ అనే మినీ కథ చక్కగా వివరించింది.

కుపుత్రిడి కుత్సితం ఎలా ఉంటుందో ఆ శీర్షికతో ఉన్న మినీకథ చెబుతుంది.

‘అనాథ ప్రేత సంస్కారేణ..’ అన్న మినీకథ విజయనగరంలో జరుగుతుంది. ధనవంతుడైన వృద్ధుడు మరణిస్తాడు. విదేశాలలో ఉంటున్న పిల్లలు రారు. పాడె మోయటానికి డబ్బిచ్చి మనుషులను పెట్టుకునే దురవస్థ. ఆ దురవస్థ లోని మరో కోణం.. నలుగురు పేదవారికి కనీసం రెండు రోజులకు సరిపోయే భత్యం లభించటం! ఈ కథలో దాసన్నపేట, గుమ్చీ, అయ్యకోనేరు వంటివి ప్రస్తావించారు రచయిత. రెండు దశాబ్దాల క్రితం నేను విజయనగరంలో పనిచేసినప్పుటి రోజులు గుర్తొచ్చాయి ఈ ప్రాంతాల పేర్లు చదువుతూంటే.

ఆహార్యం చూసి పొరపడకూడదని ‘తొందరపాటు’ అనే మినీ కథ చెబుతుంది. ‘పరిష్కారం’ అనే మినీ కథ “The peg you drink consists of tears and dreams of your family. The kick given by successful family is much better than cheap liquor” అనే నీతిని చెబుతుంది.

‘పాపి’ అనే మినికథ రావిశాస్త్రి జయంతి సందర్భంగా వారిని స్మరిస్తూ, వారి రచనా శైలిని అనుకరిస్తూ మాండలికంలో వ్రాసినది. ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉండే ముఖం వల్ల బలరామ్ ఏం సమస్యలని ఎదుర్కోవలసి వచ్చిందో ‘దరహాసజీవి’ అనే మినీ కథలో తెలుస్తుంది.

కీచకుడిలా తనని వేధిస్తున్న బాస్‌కి దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది కవిత ‘చెప్పుదెబ్బ’ అనే మినీ కథలో.  అనుకూల దాంపత్యం ఎలా ఉంటుందో ‘నిత్యానపాయని’ అనే మినీ కథ చెబుతుంది. కథ చిన్నదే, కానీ ప్రభావం ఎక్కువ సేపు ఉంటుంది పాఠకుల మనసుపై. ‘పసి కానుక’ ఆర్ద్రమైన మినీ కథ, కళ్ళు చెమ్మగిల్లుతాయి.

ఇక ముచ్చట్ల విభాగంలో, తనకు తన బంధువులకు, మిత్రులకు మధ్య జరిగిన సంఘటనలు నవ్వించేవి, హృదయాన్ని తాకేవాటిని పంచుకున్నారు రచయిత. ‘మినస్పాక్’ చదివి హాయిగా నవ్వుకోవచ్చు.

కృష్ణారావుగారు వ్రాసిన మినీకవితలు బావున్నాయి. ఐరిష్ కవి Edmund Burke వ్రాసిన The Mirror అనే కవితకి అనువాదం ‘దర్పణం’ కవిత. విశ్వకవి టాగోర్ ‘Where the mind is without fear’ కవితని అనుసరిస్తూ సాగుతుంది ‘స్వర్గసీమ’ కవిత. విశ్వకవి సానుకూల అంశాలు చెప్పి, వాటివైపు దేశాన్ని నడపమని కోరుకుంటే, కృష్ణారావుగారు ప్రతికూల అంశాలను ప్రస్తావించి, వాటికి దేశాన్ని దూరం చేయమంటారు.

ముగింపు:

‘కిష్టప్ప కథలు’ కేవలం కాలక్షేపం కోసం చదివేవి కావు. అవి చదువుతుంటే మనల్ని మనం ఆ పాత్రల్లో చూసుకుంటాం. జీవితాన్ని ప్రేమించడం, తోటి మనుషుల పట్ల సానుభూతితో మెలగడం ఎలాగో ఈ కథలు మనకు నిశ్శబ్దంగా నేర్పుతాయి. కథా ప్రియులందరూ తప్పక చదవాల్సిన ఒక చక్కని తెలుగు కథా సంపుటి ఇది.

***

కిష్టప్ప కథలు (కథా సంపుటి)
రచన: భాగవతుల కృష్ణారావు
ప్రచురణ: శ్రీరాజ్ పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 208
వెల: ₹ 150/-
ప్రతులకు:
భాగవతుల కృష్ణారావు,
సికింద్రాబాద్
ఫోన్: 7702552305

 

 

 

~

భాగవతుల కృష్ణారావు గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-bhagavatula-krishnarao/

Exit mobile version