Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కిటికీ

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన జె. శ్యామల గారి ‘కిటికీ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

బాల్యంలో అమ్మ నన్ను చక్కగా తయారు చేసి కిటికీలో కూర్చోబెట్టేది. కిటికీకి కిందుగా సోఫా ఉండేది. నేను పడ్డా దాని మీదే పడతానని అమ్మ ధైర్యం కాబోలు. తను పనులు చేసుకు వచ్చేదాకా నాకు కిటికీ ఎన్నెన్నో దృశ్యాలు చూపించేది. నేను వచ్చే పోయే మనుషుల్ని, తిరుగాడే కుక్కల్ని, ఆవుల్ని, బర్రెల్ని, పిచ్చుకల్ని చూస్తూ ఉండేదాన్ని. జామపండ్లు, సపోటాలు, రేగిపళ్ళు అమ్మే వాళ్లు వస్తే చాలు.. నా వచ్చీ రాని భాషలో కావాలంటూ అరిచేదాన్ని. వాళ్లు కూడా నా ముందు ఆగిపోయే వాళ్లు. అమ్మ పరుగున వచ్చి కొనిపెట్టేది. వాళ్లు నా కోసం కొసరు పండు కూడా ఇచ్చే వాళ్లు. పళ్ల పేర్లన్నీ కూడా నాకు అలాగే తెలిశాయనటం అతిశయోక్తి కాదు. మౌజ్, బేర్, మోసంబీ, అంగూర్, అనార్.. ఇలా హిందీ పేర్లు కూడా పరిచయమయ్యాయి. రకరకాల దుస్తుల్లో రకరకాల మనుషులు.. పరుగులు తీసే వాహనాలు, కుక్కలు, ఆవులు, బర్రెలు.. ఆశ్చర్యంగా చూసేదాన్ని. అప్పుడప్పుడు కిటికీకి దగ్గరగా పిచ్చుకలు వచ్చి వాలితే భలే సంతోషంగా ఉండేది. అవి అంతలోనే రివ్వున ఎగిరిపోవడం నాకెంతో అద్భుతం అనిపించేది. ఒక్కోసారి వాటిని తాకాలని ప్రయత్నించేదాన్ని. ఒక్కసారీ అవి అందేవి కావు.

కొంచెం పెద్దయ్యాక నేను, తమ్ముడు కిటికీలో సర్దుకు కూర్చుని చిరు తిళ్లు తింటూ అమ్మానాన్న ఆఫీసు నుంచి ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసే వాళ్ళం. దూరం నుంచే పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ‘అదుగో ఆ వచ్చేది అమ్మే’ అంటూ చెప్పుకోవడం.. క్రమేపీ ఆ ఆకారం దగ్గరకు వచ్చేసరికి అమ్మ కాదని తెలియడంతో నిరాశ. అప్పటికి మొబైల్ సౌకర్యం లేదు.. ల్యాండ్‌లైన్ కనెక్షన్ సులంభంగా లభించని ఆ రోజులు ఎలా గడిచిపోయాయో తలుచుకుంటే చిత్రంగా ఉంటుంది. మధ్యలో పోస్ట్‌మన్ రాకలు.. పలకరింపులు.

ప్రయాణాల్లో అయితే అది బస్సు, రైలు, కారు.. ఏదయినా సరే కిటికీ పక్కనే కూర్చుంటానని పేచీ పెట్టి మరీ సాధించేదాన్ని. రైలు ముందుకెళుతుంటే వెనక్కి వెళ్లిపోయే చెట్లు, కొండలు, చేలు, పశువుల మందలు, ఎగిరే పక్షుల గుంపులు, చిన్న, పెద్ద ఊళ్ళు.. మారిపోయే దృశ్యాలను చూస్తూ వినోదించడం ఎంత అద్భుతంగా ఉండేదో! రైలు స్టేషన్లో ఆగితే అదో భిన్న చిత్రం! దిగే వాళ్ల తొందర, ఎక్కే వాళ్ల హడావిడి, లగేజీలతో రైల్వే కూలీలు, తినుబండారాలు అమ్మేవారి కోలాహలం, కాఫీ, టీ కేకలు, రంగురంగుల, వైవిధ్య దుస్తుల్లో వివిధ వయసుల ప్రయాణికులు, దివ్యాంగ గాయక యాచకులు.. ప్రత్యేకంగా అనిపించే.. వినిపించే రైల్వే వారి అనౌన్స్‌మెంట్లు.. సంతోష స్వాగతాలు, విచార వీడ్కోళ్ళు.. వెలిగే కళ్ళు, దిగులు కళ్ళు.. మంచినీటి కుళాయి దగ్గర మనుషులతో పాటు అడపా తడపా దాహం తీర్చుకునే కోతులు, పక్షులు.. ఒకటా, రెండా ఏ ఫ్రేముకూ చాలని అనంత దృశ్యావరణం.. అదేమిటో ఇప్పటికీ నాకు రైల్వే స్టేషన్ దృశ్యాలంటే ఎంత ఇష్టమో!

బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ ముందు దిగదుడుపే అనిపిస్తాయి నాకు.

గతంలో కిటికీ నుంచి వాన పడే దృశ్యాన్ని చూడడం చాలా ఇష్టంగా ఉండేది. కొద్ది సేపు గడవగానే అమ్మ వచ్చి ‘వాన జల్లు పడుతుంది.. కిటికీ మూసేసెయ్’ అనేది. కాలేజీకి వెళ్లే కాలంలో కిటికీ దగ్గర కూర్చుని కారప్పూస తింటూ ఏ నవలో చదువుకోవాలని ఉండేది. కానీ అమ్మ గదిలో కూర్చుని చదువుకోమనేది. ఎప్పుడైనా కిటికీ నుంచి బయటి ప్రపంచాన్ని ఆస్వాదించినా అమ్మ వెంటనే వచ్చి ‘ఆ కిటికీ దగ్గర ఏం చేస్తున్నావ్, పద లోపలికి’ అనేది. ఈడు వచ్చిన అమ్మాయిలపై సవాలక్ష ఆంక్షలున్న కాలం అది.

కిటికీలు ప్రేమాయణాలకు ఆటపట్టులని, చూపులు కలవడం, నవ్వులు రువ్వడం, ఆపైన ప్రేమలేఖలు వచ్చిపడడం.. అన్నీ.. ఇవన్నీ కిటికీ కేంద్రంగానే జరుగుతాయని ఓ మధ్యాహ్నం నేను బద్ధకంగా పడక మీద మేను వాల్చిన వేళ, నేను నిద్రపోతున్నాననుకుని అమ్మ, పక్కింటి ఆంటీతో జరిపిన సంభాషణలో యథేచ్చగా దొర్లిన మాటలు. అప్పుడు నేను నవ్వుకుంటూ ‘ ఔరా అమ్మా!’ అనుకున్నాను పడుకునే.

ఆ పైన చదువు అంకం ముగిసిన, కాదు కాదు.. ముగించిన అనడం సరైన పదం.. తర్వాత నన్ను ఓ అయ్య చేతిలో పెట్టారు. అదే.. నా పెళ్లి అయింది. మెట్టినింట కిటికీలు ఉన్నాయి కానీ అవి చాలా వరకు తెరలతో కప్పి ఉండేవి. ఎందుకంటే ఆయనకు కిటికీలు, తలుపులు తెరిచి ఉండడం పెద్దగా ఇష్టం ఉండదు. పైగా కిటికీ దగ్గర కూర్చునేంత తీరిక ఉంటే కదా. జీవిత సమరం మొదలైంది. అంతలో అరుదుగా ఉన్న ల్యాండ్‌లైన్ ఫోన్‌లు చాలావరకు అందుబాటులోకి వచ్చాయి. బయట కూడా టెలిఫోన్ బూతుల సంఖ్య పెరిగింది. దీనివల్ల తమ రాక ఆలస్యం అవుతుందని చెప్పే సౌకర్యం వచ్చింది కనుక ఇంట్లోవారు కిటికీల వద్ద ఆదుర్దాగా ఎదురుచూడడం తగ్గింది. అలా కొద్ది కాలం గడిచింది లేదో పెద్ద విప్లవం రానే వచ్చింది. అదే మొబైల్ ఫోన్ రాక. క్రమంగా చిన్న, పెద్ద అందరికీ మొబైల్ ఒక్కటే కిటికీగా మారిపోయింది. అందరి కళ్ళు, వేళ్ళు, చెవులు కూడా మొబైల్‌కే సంధించి ఉన్న రోజులు. కాలం కనికట్టు చేసినట్టు ఫీలింగ్. మొబైల్ వాడొద్దని పిల్లల్ని కోప్పడడమే కానీ ఆ ప్రయత్నాలు విఫలమే. అసలు పెద్దలే ఆ కిటికీని వదలలేని పరిస్థితి వచ్చింది. మంచి, చెడు అన్నీ తెలిసినా దానికి బానిసలే. ఈ కాలంలో అంతా మొబైల్ వ్యసనంతో విలువైన కాలాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారని, పిల్లల్ని దీన్నుంచి కాపాడుకోవాలని పెద్ద పోస్టు రాసి, సమూహాల్లో పంచేసి, స్పందనల కోసం మళ్ళీ ఆ కిటికీకే కళ్ళప్పగించే కాలం.

ఈ నేపథ్యంలోనే నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. నేనూ జీవన సంధ్యలోకి ప్రవేశించాను. ఎందుకో మొబైల్ అంటే విరక్తి మొదలైంది. మళ్లీ కిటికీని శుభ్రం చేసి, తెరలు పక్కకు నెట్టి.. దాని పక్కనే దివాన్, ఓ కుర్చీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. పెద్ద గ్రిల్ కిటికీతోనే మళ్లీ కాలక్షేపం మొదలుపెట్టాను. దాన్నుంచి చూస్తూ ఆ దృశ్యాలకు, నా ఊహలను జోడిస్తూ ఆలోచనల్లో కథలు, నవలలు నడిచేవి. చెట్ల కొమ్మల గాలుల సంగీతం, పూల ఊసులు, పక్షుల సందళ్లు.. కొంత కాలం బాగానే గడిచింది. అంతలో విధి వికృతంగా నవ్వి తనను మంచానికి పరిమితం చేసింది. అయినా కిటికీ వైపే చూపులు. నిష్క్రమణ కోసం నిరీక్షణ. ఇప్పుడు ఈ గ్రిల్ కిటికీ దృశ్యం భయం గొలుపుతోంది. అందులోంచి కనిపించే పెద్ద ఖాళీ స్థలం, మహా వృక్షాలు.. వాటి కొమ్మలు వూగుతుంటే భయం.. మునిమాపు వేళ పక్షులన్నీ చేరి గోలచేస్తుంటే ఏదో తెలియని ఆందోళన.. అందులోనూ ఈ మధ్య.. ‘నానమ్మా!’ అంటూ మనవడు రావడంతో సావిత్రమ్మ సుదీర్ఘ స్వగతానికి అడ్డుకట్ట పడింది.

“రా రా రవీ!” ఆనందంగా అంది.

ఎందుకంటే ఇంట్లో వాళ్ళెవరూ ఆమె దగ్గరకు వచ్చి కూర్చోరు. కాఫీ, భోజనం మొక్కుబడిగా అందించి, “మాత్రలు వేసుకున్నావా” వంటి పొడి మాటలు తప్ప మరో మాట మాట్లాడరు.

“ఏంటి ఆలోచిస్తున్నావు?” అడిగాడు.

“కిటికీ గురించిరా” అంది సావిత్రమ్మ.

“కిటికీ నీకు ఇష్టమేగా” అన్నాడు రవి.

“కానీ ఈమధ్య కిటికీ అంటే భయంగా ఉంది” చెప్పింది.

“ఎందుకు?” అడిగాడు రవి.

“ఆ చెట్టు మీద దెయ్యాలు ఉన్నాయిరా. అవి మొన్న రాత్రి లోపలికి, నా మంచానికి దగ్గరగా వచ్చాయి. అరుద్దామంటే భయంతో నోరు పెగల్లేదు. అరిచాననుకున్నాను కానీ నా గొంతు నాకే వినపడలేదు. ఒళ్లంతా చెమటలు.. గొంతు ఎండిపోయింది. ఆ తర్వాత నాకేమైందో తెలీదు..” ఇంకా ఏదో చెప్పబోయింది.

రవి ఫెళ్లున నవ్వాడు. “భలే ఇంటరెస్టింగ్ గా ఉంది. చెట్టు మీద దెయ్యాలు.. నీ దగ్గరికి రావడం. పోనీ అలాగే అనుకున్నా దెయ్యాలు, అవి ఏ అందమైన అమ్మాయి దగ్గరకో వెళ్లక, నీ దగ్గరకు రావడం ఏమిటి? నీదంతా భ్రమ” అంటూ, లేచి వెళ్ళి ఇంట్లో అందరికీ నవ్వుతూ చెప్పాడు. అంతా విరగబడి నవ్వారు.

రవి చెల్లెలు హాసిని “అవి ఆడ దెయ్యాలేమోరా” అంది.

“అయితే అందమైన అబ్బాయిల దగ్గరకు వెళ్ళాలి కానీ నానమ్మ దగ్గరకు ఎందుకు వస్తాయి?” అన్నాడు రవి నవ్వుతూ.

“అసలు అవి మగ దెయ్యాలో, ఆడ దెయ్యాలో నానమ్మ చెప్పలేదు” మళ్లీ అన్నాడు రవి.

“చాల్లే మీ విపరీతపు మాటలు. దెయ్యాలు, భూతాలు అంటే నమ్మేయడమేనా? ముసలావిడకు వయసు పైబడ్డ కొద్దీ మతి పోతోందల్లే ఉంది” అంది రవి తల్లి.

సావిత్రమ్మకు పిల్లల మాటలు, కోడలి మాటలు అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. ‘తను భయంతో చస్తుంటే వీళ్ళకు నవ్వులాటగా ఉంది. తను ఎలా నమ్మించగలదు?’ నిట్టూర్పు తన్నుకొచ్చింది. మళ్లీ ఆమెను ఆలోచనలు ఆలింగనం చేసుకున్నాయి. కాలం పరుగులు తీస్తూనే ఉంది.

రాత్రి రానే వచ్చింది. దానికి తోడు వాన, గాలి.. కరెంటు పోయింది. సావిత్రమ్మ బిక్కుబిక్కుమంటూ.. కళ్ళు తెరిచే సాహసం చేయలేక, అలాగే పడుకుంది. భయంతో నిద్ర రావడం లేదు. ఏవేవో ఆలోచనలు. తాను గతంలో చూసిన దెయ్యం సినిమాలు, చదివిన ప్రేతాత్మ కథలు అన్ని ఒక్కుమ్మడిగా మెదడులో తిరుగాడుతూ.. జామ్ అవుతూ.. ఎంతో సంఘర్షణ.. అంతలో ఉరుముల శబ్దం.. అప్రయత్నంగానే కళ్ళు కొద్దిగా తెరిచింది. రెండు భయంకర ఆకారాలు గ్రిల్‌కు అటు వైపు తన వైపే క్రూరంగా చూస్తూ ..

విపరీతమైన భయంతో సావిత్రమ్మ శరీరమంతా బిగుసుకుపోయింది. అరిచే ప్రయత్నం.. ఉహూ.. అసాధ్యమే అయింది. లేవబోయింది.. ఎవరో పడేసినట్లు వెనక్కి దభీమని పడింది. అంతే!

***

మర్నాడు ముందుగా మనవడు రవి గదిలోకి అడుగు పెట్టాడు. నానమ్మ పడుకున్న తీరు అనుమానం కలిగించింది. గ్రిల్ వైపే తెరిచి ఉంచిన నిర్జీవమైన పెద్ద కళ్ళు.

ఆమెను గట్టిగా కుదుపుతూ “నానమ్మా!..” అని అరిచాడు.

ఆ కేకకు ఇంట్లోని అందరూ పరుగెత్తుకొచ్చారు. ముందురోజు రవి జోక్ చేయడం.. తామంతా నవ్వడం గుర్తుకొచ్చింది. వెనువెంటనే అందరి చూపులు ఆ గ్రిల్ వైపు మళ్ళాయి. గాలికి పెద్ద చెట్లు.. కొమ్మలతో తాండవం చేస్తూ.. కొంపదీసి నానమ్మ చెప్పినట్లు దెయ్యాలు నిజంగా.. బాధ ఎటుపోయిందో.. భయంతో బిగుసుకుపోయారు అంతా!

సావిత్రమ్మ భయం తీరి ‘పోయింది’ గాని, ఆ భయం ఇంట్లో వాళ్ళను పట్టుకుంది. సావిత్రమ్మ భయానక అనుభవం, ఆమె భ్రమో, నిజమో వారికి తెలియకపోయినా.. భయంతో క్షణక్షణం ఉలికిపడుతున్నారు. సావిత్రమ్మకు తాము కాసింత ప్రేమను పంచి ఉంటే, ఆత్మీయంగా మాట్లాడి ఉంటే, మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఉంటే, తోడుగా ఉంటే.. అనే ఆలోచన రాలేదు కానీ ‘నానమ్మే దెయ్యమై వస్తే’ అనే కొత్త ఊహ రవిని మనసును తొలిచేస్తోంది.

Exit mobile version