[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్ గారి ‘నోన్ డెవిల్!?’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
నేను ఎం.ఏ. సైకాలజీ, హెచ్.ఆర్.లో ఎం.బీ.ఏ. చేసాను. ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాను. ఎంప్లాయిస్‌ని, వర్క్ స్పేసెస్‍ని అవుట్ సోర్స్ చేసి, వివిధ సంస్థలకి అరేంజ్ చెయ్యడం మా పని. నేను ట్రాన్స్‌ఫర్ మీద కోయంబత్తూర్ వచ్చాను. ఎక్కడున్నా, నేను వారానికి మూడు రోజులు, ఏదో ఊరు వెళ్లాల్సి వస్తుంది. పూర్వకాలం రైల్వే స్టేషన్‌కి, బస్సు స్టాండ్‌కి దగ్గరగా ఇల్లు చూసుకున్నట్టు, ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా చూసుకోవాల్సి వస్తోంది. ప్రయాణానికి, ఎయిర్ పోర్ట్ వరకు నడిచి వెడతామని కాదు. ఈ రోజుల్లో ట్రాఫిక్ బట్టి, ఊళ్ళో వర్షం పడితే, గంటల తరబడి చిక్కుకుపోవడం వలన. వర్క్ స్పాట్‌కి ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉంటుందని మా స్టాఫ్‌లో ఎవరో సజెస్ట్ చేస్తే, ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉన్న ఆ ఫ్లాట్ లోకి నిన్ననే వచ్చాను. అసలు నేను డ్యూటీలో జాయిన్ అయ్యింది కూడా నిన్ననే.
ఆ ఊళ్ళోనే మా మేనమామ ఒకాయన ఉన్నాడు. అతను దాదాపు ముప్పయి ఏళ్ళనుంచి అక్కడే ఉంటున్నాడు. ఆ ఊళ్ళోనే ఇల్లు కొనుక్కుని, అక్కడే స్థిరపడిపోయాడు. ఇనుము వ్యాపారం చేసుకుంటూ కొడుకుని కూడా దాంట్లో పెట్టేసాడు. అయన కొడుకు, కూతురు అక్కడే పుట్టి పెరిగారు. కనుక సహజంగా తమిళ పిల్లలలాగే మాట్లాడుతారు, వ్యవహరిస్తారు. “మా పిల్లలకి తెలుగు రాదు” అని నిర్లజ్జగా, గొప్పగా చెప్పుకునే తెలుగు కుటుంబాల వాళ్ళని, నేను చిన్నప్పడినుంచి, వివిధ రాష్ట్రాలలో చూసాను. అయితే మా అత్తయ్య పట్టుబట్టి, వాళ్ళిద్దరికీ, తెలుగులో మాట్లాడడం, చదవడం, రాయడం నేర్పించింది. ఆ విషయం మా నాన్నగారు ఎన్నో సార్లు అమ్మతో ప్రస్తావించి అత్తయ్యని మెచ్చుకుంటూ ఉంటారు.
అసలు మా తాతగారు కూడా వ్యాపారం చేస్తూ, కొంత కాలం అక్కడే ఉండేవారట. తరువాత ఆంధ్రా వెళ్లిపోయారుట. మా అమ్మ పెళ్లి అవడం, నేను పుట్టడం, ఆంధ్రాలోనే జరిగాయి. మా నాన్నగారి ఉద్యోగ రీత్యా చాలా రాష్ట్రాలు, ఊర్లు తిరగడం జరిగింది. ఇక నా ఉద్యోగం వలన నేను కూడా ఎక్కడెక్కడో, సుదూర ప్రాంతాల్లో పని చేయడం సంభవిస్తోంది.
“ఏరా!? ఈ దెయ్యాల కొంపలో చేరావా!? ఊళ్ళో మేనమామని నేను ఒకడిని ఉన్నానని మరిచిపోయావా!?” అన్నాడు రామం మామయ్య ఉరుములేని పిడుగులా, నేను ఉంటున్న ఫ్లాట్ లో ప్రవేశించి.
“బావున్నావా మామయ్యా? అంటే నిన్ననే వచ్చాను కదా. ఇంకా సెటిల్ అవలేదు. ఫోన్ చేసాను కదా. సెటిల్ అయ్యాక మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాను. అది సరే దెయ్యాల కొంప అంటున్నావు!? అదేమిటి మామయ్యా !!?” అని అడిగాను నేను నవ్వుతూ.
“నువ్వా ఊరికి కొత్తగా వచ్చావు. నేను ఇక్కడ పాతుకుపోయినవాణ్ణి. రాక ముందో, కనీసం వచ్చీ రాగానే నాకు చెప్పొచ్చుకదా? ఈ ఫ్లాట్స్ చూసావా? ఇరవయి ఫ్లాట్స్ ఉంటే నాలుగో, ఐదో ఫ్లాట్స్‌లో జనం ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయి అని జనం అనుకుంటున్నారు. చూస్తూ, చూస్తూ దెయ్యాల కొంపలలో ఎవరు దిగుతారు? ఎవరు ఉంటారు? నీలాగా కొత్తగా వచ్చిన, ఏమీ తెలియని అమాయకులు మోసపోతారు” అన్నాడు మామయ్య.
“దెయ్యాలా!? నాన్సెన్స్. ఇంకా ఈ స్పేస్ ఏజ్‌లో దెయ్యాలు, భూతాలు ఏమిటి మామయ్యా!?” అన్నాను నేను.
“ఒరేయ్ దేవుడిని నమ్ముతావా? అలాగే దెయ్యాలని నమ్మాలి. అవీ ఉన్నాయి.”
“ఇంతకీ ఆ విషయం నీకు ఎవరు చెప్పారు?” అని అడిగాను నేను.
“అలా అడిగావు బాగుంది. ఈ పక్క కాలనీలో మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను చెప్పాడు. ఇలా నువ్వు ఇక్కడికి వచ్చావని, ఫలానా చోట దిగావని తెలియగానే ఆ మాట అన్నాడు” అన్నాడు మామయ్య.
“నిన్ను మించిన నమ్మకాలూ ఉన్నట్టున్నాయి మీ ఫ్రెండ్‌కి. అయినా నాకటువంటివి నమ్మకాలు లేవు.” అన్నాను నేను సీరియస్‌గా.
“ఒరేయ్, నేను విషయం తెలియగానే మీ అమ్మకి ఫోన్ చేసాను. ఆవిడ, నిన్ను ఉన్నఫళాన ఖాళీ చేయించమని, మరో ఇల్లు దొరికే వరకు మా ఇంటిలో ఉంచుకోమని చెప్పింది” అన్నాడు మామయ్య.
“మా అమ్మ నీ చెల్లెలే కదా.. అయినా..” నేను ఏదో అనబోయాను.
“ఒరేయ్ తల్లి పుట్టిల్లు మేనమామకు ఎరుకా అని, మా చెల్లెలి గురించి నాకే చెపుతావా? పద బయలుదేరు!?” అన్నాడు మామయ్య.
“అయినా మావయ్యా, నేను ఈ రోజు ఉదయమే, పీలమేడు అంజనేయస్వామి టెంపుల్‌కి వెళ్లి, పూజ చేయించుకుని, సిందూరం తెచ్చుకున్నాను. ఇంకా నాకు భయం ఏమిటి “ అన్నాను నేను నవ్వుతూ.
“నువ్వు చేసిన పని చాలా మంచిదే. కాదనను. నా మాట విను. పిల్ల కాకికి ఏం తెలుస్తుంది ఉండేలు దెబ్బ అని. నీకు కొన్ని విషయాలు తెలియవు. తెలిసినా అర్థం చేసుకోవు” అన్నాడు మామయ్య, నన్ను భయపెట్టే ధోరణిలో. నేను భయపడలేదు. కానీ నా ప్రయత్నం నేను చేసాను.
“మామయ్యా ఓనర్‌కి చెప్పాలి. అడ్వాన్స్ ఇస్తాడో ఇవ్వడో? సంవత్సరం రెంట్ అడ్వాన్స్ ఇచ్చాను..” ఏదో అనబోయాను .
“వెధవ డబ్బు పోతే పోనియ్యి. మన ప్రాణం, మన బాగోగులు మనకు ముఖ్యం.” అన్నాడు మామయ్య, నాకు మాట పూర్తి చేసే అవకాశం ఇవ్వకుండా.
“సరే. ఆయనకి చెప్పాలి. అప్పుడు చూస్తాను” అన్నాడు నేను.
“ఇంకా చూసేది, చేసేది ఏమీ లేదు. బయలుదేరు” అన్నాడు మామయ్య, అప్పుడే అతనితో కారులో వచ్చేయాలి అన్నట్టుగా.
“మీ ఇల్లు ఎక్కడ?” అని అడిగాను మామయ్యని.
“కె.కె. పుదూరులో. సాయిబాబా కాలనీలో, మణియం మరుత కుట్టి స్ట్రీట్‌లో. మా ఇంటికి రైల్వే స్టేషన్ దగ్గర. కూరగాయల, పళ్ళ మార్కెట్ దగ్గర. బస్సు స్టాండ్ దగ్గర.”
“అవన్నీ ఎందుకు మామయ్యా? అక్కడ నుంచి మా ఆఫీస్, ఎయిర్‌పోర్ట్ దూరం అవుతాయి మామయ్యా.”
“ఏరా ఏ.సీ. కారులో ఎక్కి దిగేదానికి పెద్ద ఏదో నడిచి వెళ్ళాలి అన్నట్టు మాట్లాడుతావు!?” అన్నాడు మామయ్య చిరు కోపంగా.
“మా ఆఫీసు తిరుప్పూర్ రోడ్డులో. ఇక్కడ నుంచి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కనుక ఫాస్ట్ గా వెళ్లిపోవచ్చు. అక్కడనుంచి అంటే..”
“ఏమీ పరవాలేదు. రేపు సాయంత్రం వస్తాను రెడీగా ఉండు” అంటూ నా మాటలని, మధ్యలోనే త్రుంచేసి, బయటకు నడిచాడు మా రామం మామయ్య.
***
ఆ రాత్రి ఎందుకో నిద్ర సరిగ్గా పట్టలేదు. మంచం మీద అటూ ఇటూ దొర్లసాగాను. హఠాత్తుగా నేను ఊహించనది ఒకటి జరిగింది!!?? ఏదో వింత కాంతి గదిలో అటూ ఇటూ కదలడం ప్రారంభించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. భయపడ్డానంటే కరెక్ట్!? నేను మామయ్యతో చెప్పింది అక్షరాలా నిజం. నాకు ఎటువంటి మూఢ నమ్మకాలూ లేవు. కానీ మామయ్య చెప్పినది కరెక్ట్ ఏమో? నేను నిజంగా తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనిపించింది. ఛ! ఛ! ఏమిటీ పిచ్చి ఆలోచన. నేను చిన్నప్పటి నుంచి సైన్సు చదువుకున్నాను. లాజికల్‌గా ఆలోచించడం, ప్రవర్తించడం నేర్చుకున్నాను.
అంతలో ఆ కాంతి పెరుగుతూ తగ్గుతూ, చుట్టూ తిరగడం జరిగింది. కొంత సేపటికి అది పెద్దగా అయ్యి క్రమంగా బలహీనమవుతూ తగ్గిపోవడం జరిగింది. డ్రాయింగ్ రూమ్ లోంచి కీచుమన్న శబ్దం వినిపించింది. నాకు తెలియకుండానే, నా శరీరం సన్నగా కంపించసాగింది. “దెయ్యం” అసంకల్పితంగా, నా నోట్లోనుంచి ఒక మాట బయటకు వచ్చింది.
చాలా సేపు ఆలోచించాను. అమ్మ చిన్నప్పుడు అంటూ ఉండేది. కామినీ పిశాచాలు ఉంటాయని, అవి బ్రహ్మచారులని ఏడిపిస్తాయని, మరీ క్రూరమైన కామ పిశాచులైతే రక్తాన్ని పీల్చి చంపేస్తాయని అని చెపుతూ ఉండేది. నాన్నగారు కూడా తాను అటువంటి సంఘటనలు గురించి విన్నానని, ‘కారవాన్’ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్‌లో ‘టేల్స్ ఆర్ స్ట్రేంజర్ థెన్ ఫిక్షన్’ అన్న శీర్షికతో, అటువంటి సంఘటనలు ప్రచురించేవారని అన్నారు. అప్పుడు నాకు తెలిసి తెలియని వయస్సు. భయపడ్డాను. ఉత్సాహం కొద్దీ, సైకాలజీ స్టూడెంట్‌గా, ఆ సబ్జెక్టుపై తరువాత ఎన్నో విషయాలు చదివాను. ఎంతో సమాచారం సేకరించాను. దెయ్యాలు, భూతాలు, ఈవిల్ స్పిరిట్స్ అన్ని వట్టి బూటకాలని, పిరికి మనస్తత్వం ఉన్న వాళ్ళ, హృదయాల ప్రతిస్పందన అని తెలుసుకున్నాను.
కానీ ఎందుకో నేను చూసిన దాన్ని ఆ క్షణంలో పూర్తిగా కొట్టివేయలేకపోతున్నాను. మా పారా-సైకాలజీ ప్రొఫెసర్ ఒకాయన, ఒకసారి మాటల సందర్భంలో సైన్స్, దేవుడు, నమ్మకాలు, అవన్నీ వేరు వేరు విషయాలని, ఒక దానితో ఇంకో దానిని కొట్టి పారేయలేమని చెప్పాడు. అలాగే తన జీవితంలో కొన్ని అనుభవాలు ఏ లాజిక్‌కి అందవని అన్నాడు!?
ఆ విషయాలన్ని గుర్తుకు వచ్చి, చూసినది మళ్ళీ కళ్ళముందు తిరిగి ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది
‘ఛీ! నేను ఇంత పిరికి వాడినా!? కాదు. కానీ మా ప్రొఫెసర్ కంటే గొప్పవాడిని కాదు. అయినా మామయ్య చెప్పిందే నిజమైతే మరి మా ఫ్లాట్లలో మిగతా కుటుంబాల వాళ్ళు ఎలా ఉంటున్నారు!? ఏమో వాళ్ళ ఇళ్లల్లో నిత్యం దీప, ధూప, నైవేద్యాలు ఉంటాయి. కనుక దుష్ట శక్తులు అక్కడకి రావేమో!?’. ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. ఎంత సేపటికీ నిద్ర పట్టలేదు. ఏ రాత్రి వేళో నిద్ర పట్టినా, అంతా కలత నిద్ర. ‘మామయ్య అన్న కొన్ని మాటలు, జరిగిన విచిత్ర సంఘటన, నా మనస్సును నాకు తెలియకుండానే ఎంత ప్రభావితం చేశాయి!!??’ అనుకున్నాను, మరునాడు ఉదయం లేచిన తరువాత.
***
చిన్నప్పుడు ఒకటి రెండు సార్లు వెళ్ళినా, నాకు కొంచెం జ్ఞానం వచ్చిన తరువాత, మామయ్య ఇంటికి వెళ్ళడం అదే మొదటిసారి. చాలా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. విశాలంగా ఉంది. ఇంట్లో రెండు, మూడు కారులు పార్కింగ్ చేసేంత స్థలం ఉంది. మామయ్య ఇంట్లో లేడు. బావ రమేష్ కూడా లేడు. మరదలు ధన్వి కూడా ఎక్కడికో వెళ్ళింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే అత్తయ్య సాదరంగా ఆహ్వానించింది. ఎంతో సంతోషించింది. నేను కాసేపు కూర్చుని, అత్తయ్య పెట్టిన టిఫిన్ తిని, ఆఫీసుకి వెళ్ళిపోయాను.
ఆ రోజు రాత్రి నేను, మామయ్య, అత్తయ్య, ధన్వి, రమేష్ కూర్చుని ఉన్నాం. ధన్విని ఎప్పుడో చిన్నప్పుడు చాలా కాలం క్రితం చూసాను. అప్పటికీ ఇప్పటికీ బాగా మారిపోయింది. చిన్నప్పటి నుంచి తెల్లగా, బొద్దుగా అందంగానే ఉండేది. ఇప్పుడు ధన్విది కళ్ళు చెదిరే అందం. చూడగానే నాలాంటి బ్రహ్మచారులు ‘ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే బాగుండును’ అనిపించే అందం, అణుకువ, తెలివితేటలూ కల అమ్మాయి. నేను ధన్వి కేసి చూస్తూ ఉండిపోయాను. నా చూపులో భావం గ్రహించినట్టుంది అత్తయ్య. ధన్వి కేసి చూసి నవ్వింది.
ధన్వి “బావా, మొత్తానికి ఆ దెయ్యాల కొంపనుంచి బయట పడ్డావు” అంది నవ్వుతూ.
“అక్కడ నేను, జీవితంలో మొదటిసారిగా కాస్త భయపడ్డ మాట వాస్తవం. కానీ తరువాత నా భయానికి నేనే నవ్వుకున్నాను. కానీ జరిగింది ఏమిటో ఇప్పడికీ అర్థం కావడం లేదు” అన్నాను నేను సాలోచనగా.
“భయపడ్డానని చెప్పిన నీ నిజాయితీకి హాట్స్ ఆఫ్ బావా” అంది ధన్వి చెయ్యి పైకెత్తి, తల వంచుతూ.
“ఆ దెయ్యమో భూతమో నన్ను ఏమీ చేయలేదు గానీ, ధన్వి.. ఒక దెయ్యం మాత్రం నన్ను, ఇంతకు ముందు బెదిరించింది, ఇప్పుడు బెదిరిస్తోంది” అన్నాను నేను భయం నటిస్తూ.
“ఏమయ్యింది బావా!? ఇంతకీ అది ఆడ దెయ్యమా? మగ దెయ్యమా?” అని అడిగింది ధన్వి భయం, ఉత్సాహం మిళితమైన స్వరంతో. అయితే ఆ భయం నిజమో, నటనో తెలియలేదు నాకు.
“ఆడ దెయ్యాలకే మగవాడు కావాలి కదా?” అన్నాను నేను ధన్విని ఓర కంటితో చూస్తూ.
“కొంపదీసి, అదేదో సినిమాలోలాగ, నిన్ను పెళ్లి చేసుకుంటానందా ఆ దెయ్యం?” అని అడిగింది ధన్వి.
“ఏమో!? నాతో ఆ మాట అయితే అనలేదు” అన్నాను నేను.
“పోనిలే. ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే, దెయ్యం సవతి వస్తుంది. తమాషాగా ఉంటుంది.” అంది ధన్వి.
“నీకు దెయ్యాలంటే భయం లేదా?” అని అడిగాను ధన్విని.
“దెయ్యాలా, గియ్యాలా. కనపడితే, చాకిరేవులో బట్టలు ఉతికినట్టు ఉతుకుతాను” అంది ధన్వి పకపకా నవ్వుతూ.
“మామయ్యా మరి నీకు!?” అన్నాను నేను.
“నాకు అటువంటి నమ్మకాలు లేవురా. నిన్ను బలవంతంగా అక్కడ నుంచి మా ఇంటికి తీసుకు రావాలని, నేను, ధన్వి ఆలోచించి ఆడిన నాటకం.” అన్నాడు మామయ్య తను కూడా బిగ్గరగా నవ్వుతూ.
“నాకు ఎంత నమ్మకం లేకపోయినా, నీ మాటల ప్రభావం చేత, అనవసరంగా కొంత భయం వేసింది” అంటూ జరిగింది చెప్పాను. నా మాటలకి అందరూ పెద్దగా నవ్వేశారు.
“ఆ లైట్లు అవీ, మీ ఫ్లాట్ వెనకాల ఉన్న కారు గారేజ్ దగ్గర నుంచి వచ్చినవి” అన్నాడు మామయ్య నవ్వుతూ.
“ఆ విషయం తరువాత రోజు నాకు అర్థం అయ్యిందిలే” అన్నాను నేను.
“ఏమయ్యా, మా ధన్విని చేసుకుంటావేంటి?” అని హఠాత్తుగా, డైరెక్ట్‌గా అడిగేసింది అత్తయ్య.
అక్కడే ఉన్న మామయ్య “చూసావురా? మీ అత్తయ్య గడుసుతనం. నిన్ను ఆ మాట అడిగి ఆ గౌరవం, మంచితనం తనే కొట్టెయ్యాలనుకుంది. నా ఉద్దేశం కూడా అదే. నువ్వు ఊఁ అంటే, మీ నాన్నగారిని, అమ్మని పిలిపిద్దాం. ఏమే ధన్వి ఏమంటావు?” అని కూతురిని అడిగాడు.
“బావ ఇష్టం నా ఇష్టం ఒకటే నాన్నా” అంది ధన్వి, నాకేసి ఓరగా చూస్తూ.
“అదేమిటి అందరికీ మీ ఇష్టాలే గాని, నా గురించి ఎవ్వరూ పట్టించుకోరా!?” అన్నాను నేను, కోపం నటిస్తూ.
“నీ ఇష్టం, నీ చూపులోనే తెలిసింది లేవయ్యా” అంది అత్తయ్య నవ్వుతూ.
“ఇష్టం లేకపోతే మానెయ్యి” అంది ధన్వి కొంటెగా.
“సరే. ఆ దెయ్యం తప్పినా, ఈ దెయ్యం తప్పదన్న మాట” అన్నాను తమాషాగా, ధన్వి వైపు చూస్తూ.
ధన్వి నాకేసి ప్రేమ, చిరు కోపం మిళితమైన భావంతో చూసింది.
నాన్నగారికి ఫోన్ చేస్తే “శుభస్య శీఘ్రం. ఎక్కడో తెలియని పిల్లని చేసుకునే బదులు, మామయ్య కూతురుని, పెళ్లి చేసుకోవడం మంచిదే. నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ అన్‌నోన్ ఏంజిల్” అన్నారు.
ఆ తరువాత అమ్మ, నాన్నగారు రావడం, పెళ్లి మాటలు అయిపోవడం, నిముషాల మీద జరిగిపోయాయి. పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేసారు.
నాన్నగారు అన్నమాటలు ధన్వికి చెప్పాను. ధన్వి నవ్వుకుంది
నేను, ఆ క్షణం నుంచే, ధన్విని ‘నోన్ డెవిల్’, ‘నోడె’ అని ముద్దుగా పిలవడం మొదలు పెట్టాను.