Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొంప ముంచే జాలి స్నేహాలు

[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘కొంప ముంచే జాలి స్నేహాలు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

ఇంజనీరింగ్ కాలేజీ బస్సు ఇంకా రాకపోవడంతో, షర్మిష మొబైల్ కెమెరాలో చూసుకుని జుట్టు సరిచేసుకుంది. ఉంగరాలూ అవీ సరిగా తిరిగి ఉన్నాయో లేదో అని మళ్లీ మళ్లీ వాటిని చూసుకుంది. మామూలుగా ఉన్నవాటిని, తన చూపుడు వేలితో తిప్పి సరిచేసింది. జుత్తు ద్రాక్ష గుత్తుల్లా అందంగా బావుంది అని నిర్ధారించుకున్నాక, కెమెరా క్లోజ్ చేసి, “లలితా ఇవాళ నా హెయిర్ స్టైల్ బావుందా, ఇది వంజరం చేప హెయిర్ స్టైల్.ఇది కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్లో చేశారు. చేపలాగా తిన్నగా ఉంటుంది, నాకు బాగుందా” అడిగింది జుత్తు సరిచేసుకుంటూ.

కాస్త చిత్రంగా షర్మిష వంక చూస్తూ, “బాగానే ఉంది కానీ” అని ఏదో చెప్పబోయింది . కానీ ఎందుకులే అని తనకి తానే సర్ది చెప్పుకుని గప్‌చుప్‌గా ఉంది.

“మరి నా మేకప్పు బాగుందా, బర్గర్ లాంటి బుగ్గలు ఎర్ర టమాటోల్లా కనబడాలని, రోజ్ పౌడర్ కొంచెం ఎక్కువ అద్దాను” చెప్పింది, ముఖం అటు ఇటు తిప్పి బుగ్గలు చూపిస్తూ.

“ఆ, ఆ బానే ఉంది. ముఖం, మతాబాలా మెరిసిపోతోంది.” చిన్న చిరునవ్వుతో చెప్పింది లలిత.

“ఔనా, మరి మెరిసిపోదేంటి, నిన్న సాయంత్రం పని గట్టుకుని మరీ వెళ్ళి, ఒక అయిదొందలు ఖర్చుపెట్టి మరీ స్పెషల్ పెరల్స్ షైన్ ఫేషియల్ చేయించాను. అది గానీ ఒకసారి చేయిస్తే, కనీసం ఒక వారం పాటు, పౌడర్ రాయకపోయినా, క్రీములు పూయక పోయినా, మన మొహం మల్లెపూవులా తెల్లగా, మృదువుగా కనిపిస్తుంది. నువ్వే చెప్పు, నిన్నటి కంటే నా మొహం కొంచెం బ్రైట్‌గా కనిపించడం లేదూ” అంది షర్మిష ముసి మూసిగా నవ్వుతూ మరీ మురిసిపోతూ

ఆమె ఉత్సాహం చూసిన లలిత, ‘నేను కూడా తాన తందాన అంటే చాలు. మురిసిపోతుంది. సరే నాకేం పోయింది’ అని మనసులో అనుకుని , “ఔను, నువ్వు వచ్చినప్పుడు నేను సరిగా గమనించలేదు కానీ, ఇపుడు నువ్ చెప్పాక, నీ మొహంలో మొహం పెట్టి పరీక్షగా చూస్తే, నిన్నటికీ ఇవ్వాల్టికీ నీ మొహంలో చాలా మార్పు కనిపిస్తోంది .ఇపుడు నీ ఫేస్‌లో ఒక మెరుపు వచ్చింది. అదే గమనించాను” చెప్పింది లలిత మొహానికి కొంచెం నవ్వు అద్దుకుని

“మరి నా డ్రెస్సో” అడిగింది గిర్రున బొంగరంలా ఒక రౌండ్ తిరిగి, తర్వాత చున్నీని కొద్దిగా అటు ఇటూ సర్దుకుంటూ.

“బాగుంది,చాలా బావుంది, ఈ లేత పసుపు రంగు చూడిదార్ మీద తెల్ల చున్నితో భలే అందంగా ఉంది డ్రస్. పైగా ఇది కాటన్ డ్రస్ కూడానూ. నీకు కాటన్ డ్రెస్సెస్ సింపుల్‌గా చాలా బాగుంటాయి.” అని ఓ క్షణం అడగాలా వద్దా అని బుర్ర గోక్కుని, అడిగేస్తే పోలా అని మనసులో అనుకుని, “ఎప్పుడూ లేనిది ఇవాళ ఇన్నిసార్లు, వీటన్నిటి గురించి ఇలా నొక్కి నొక్కి మరీ ఎందుకు అడుగుతున్నట్టు”.ఆశ్చర్యంగా మరోసారి బుర్ర గోక్కుంటూ అడిగింది లలిత.

“అది మరి, అదేమో మరేమో”, అంటూ చున్నీని నోటితో కొరికేస్తూ తెగ సిగ్గు పడిపోయింది.

ఆమె వైపు కాస్త చిత్రంగా చూస్తూ “సిగ్గుని మొగ్గలేయించింది చాలుగానీ, విషయం వివరంగా చెప్పు.” కొంచెం విసుగ్గా అడిగింది

“ఏం లేదు, ఈ రోజు నేను ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్‌షిప్ వరకూ చేస్తానని చెప్పి, అతని బండి మీద కాలేజీ వరకు వద్దామని నిర్ణయించుకున్నాను” అంది షర్మిష.

“ఏడిసినట్టుంది, వాడిని చూస్తే వీధిలో ఎండబెట్టుకున్న వడియాలు ఎత్తుకుపోయేవాడిలా ఉన్నాడు. పైగా ఆవారా గాడిలా కూడా కనిపిస్తున్నాడు. వాడితో నువ్వు బండి ఎక్కుతావా? ఇంకేమైనా ఉందా. చదువు, సంధ్య చూసుకునేవాడు, ఏదైనా పనీపాట చేసుకునేవాడు ఎవడైనా ఇంత టైం వేస్ట్ చేసి ఒక అమ్మాయి వెనకాల పడతాడా. బాగా ఆలోచించు, ఏ లక్ష్యం, వంకాయ లేని వాడే ఇలా అమ్మాయిల చుట్టూ తిరిగి ఆవారాలా తయారవుతారు. కాబట్టి నువ్వు అలాంటివి చేయకు. నువ్వు ఇంకోసారి ఆలోచించు.

వీళ్ళందరూ జులాయికోరు బాపతు సినిమాలు చూసి,అందులో హీరోల్లా ఫీలయిపోయి, ఇలా అమ్మాయిల చుట్టూ నెలలు, సంవత్సరాలు విసుగూ విరామం వగైరా లేకుండా తిరిగేస్తుంటారు. అది చూసి నీలాంటి వాళ్ళు,ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు కదా, అయ్యో పాపం అని జాలిపడి, మంచి మనసుతో వాళ్లతో జాలి స్నేహం చేస్తారు. తర్వాత, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు, వాళ్ళు, నాతో తిరిగి ఇపుడు కాదంటావా, చచ్చినట్టు ప్రేమించమని బలవంతపెడతారు. పిల్ల ఒప్పుకోకపోతే, తర్వాత తిరగబడి దాడి కూడా చేస్తారు.కాబట్టి ఎందుకు వచ్చిన తంటా నీకు. అలాంటి వాళ్ళతో అవసరమా, కాబట్టి శుభ్రంగా చదువుకో” అంది లలిత

“నువ్వు ఎన్నైనా చెప్పు లలితా, నాకెందుకో వీడు అలాంటివాడు కాదనిపిస్తోంది. ఏది ఏమైనా నేను ఓ సారి వెళ్లి ఓ రెండు నిమిషాలు మాట్లాడేసి తిరిగి వచ్చేస్తాను” చెప్పింది షర్మిష.

“ఇలాంటి కొసరు స్నేహాలతోనే జీవితాలకి ఎసరు మొదలవుతుంది. ఓసారి ఆలోచించుకో” అంది హెచ్చరిస్తున్నట్టు

“ఆలోచించే చెప్తున్నాను, వెళుతున్నా” అని రెండు అడుగులు ముందుకు వేసింది.

ఇంతలో పెద్ద కేకలు వినిపించడంతో ఆగి, గుమి గూడిన జనం వైపు చూసి, “ఏమైంది” అడిగింది ఒకామెని అటువైపుగా నడుస్తూ

“అదిగో ఆ కుర్రాడిని చూసావా, అదే జనం చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు చూడు, ఆ కుర్రాడు. వాడు ఆ తెల్ల డ్రెస్ అమ్మాయి వెంటపడితే, కొన్ని నెలలకి పోనీలే అని వాడితో స్నేహం చేసిందట. అదే అదునుగా, ప్రేమిస్తావా చస్తావా అని కత్తితో పొడవబోయాడట. దాంతో జనం వాడ్ని చితక్కొట్టి, వాడిని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేశారు.” చెప్పిందామె.

దాంతో షర్మిష ఒక్కసారే షాక్ తగిలినట్టు కొయ్యి బామ్మలా ఉన్నచోటే బిగుసుకుపోయింది.

దాంతో ఆమె ముందుకు కదల్లేదు. మళ్లీ రెండు అడుగులు వెనక్కి వేసి, కాలేజీ బస్ రాగానే గబగబా ఎక్కేసింది. తర్వాత రోజు నుండి వాళ్ళ నాన్నని దిగబెట్టమని అడిగింది. తర్వాత కొద్ది రోజులకి, ఆ జులాయ్ కాలేజీకి రావడం మానేశాడు, హమ్మయ్య అనుకుంది షర్మిష.

Exit mobile version