[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన దాసరి మోహన్ గారి ‘కోణార్క్ ఎక్స్‌ప్రెస్ నవ్వింది..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
మధ్యాహ్నం 12 గంటల సమయం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నెంబర్ 10 వద్ద కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ‘కూల్’గా ఉంది.
ప్రయాణికులు అందరూ అన్నీ సర్దుకుని కిటికీలోంచి ప్లాట్‌ఫారంను చూస్తున్నారు. ‘డిపార్చర్ టైం’ అయిపోయినా ట్రైన్ ఇంకా కదలకపోయేసరికి.. వస్తానన్న సమయానికి ప్రియురాలు రాకపోతే మాటిమాటికి గడియారం చూసుకుంటున్న ప్రియుడిలా ఉంది అందరి పరిస్థితి.
అందరి గడియారం ముల్లులు కదులుతున్నాయి కానీ, కోణార్క్ చక్రాలు మాత్రం కదలటం లేదు.
రైలుబండి కదిలితే(గాని)పై బెర్తులోని బ్యాగ్ ఫలహారాలు బయటికి రావు. ప్రయాణికుల ముచ్చట్లు మొదలు కావు.
ఎదురుగా ఉన్న పెద్ద మనిషి చాలా సేపటినుంచి నన్ను పలకరించాలని చూస్తున్నాడు. రాత్రివేళ బయలుదేరే రైలుబండి అయితే బెర్తుల నెంబర్ ‘చెక్’ చేసుకొని పడుకుంటారు. కానీ కోణార్క్ మధ్యాహ్నం అయ్యేసరికి పిచ్చాపాటీ లేకుంటే ప్రయాణం సాగదు.
‘ట్రైన్ జర్నీ’లో ఒక్కరు ప్రయాణించినా బోర్ ఉండదు. మాట్లాడడానికి మహానుభావులు చాలా మంది ఉంటారు.
‘స్టేట్ గవర్నమెంట్ నుండి సెంట్రల్’ వరకు అన్ని విషయాలు చర్చకు వస్తాయి. చెత్త సినిమాలు, మైదాపిండిలాంటి సీరియల్స్ పైన మనకున్న కసిని అంతా తీర్చుకోవచ్చు. కోణార్క్ మెల్ల మెల్లగా కదలడం మొదలుపెట్టింది. ఎవరో వెనక నుండి తోసినట్లు మెల్లగా కదులుతుంది.
ఎవ్వరితో మాట్లాడడం ఇష్టం లేకపోతే, పుస్తకాలు చదువుకుంటూ గడిపేయవచ్చు. అన్ని పత్రికలు మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ‘సాక్షి’ పక్క వాళ్ళకి ఇచ్చి వాళ్ల దగ్గర ‘జ్యోతి’ మనం తీసుకోవచ్చు. అన్ని రకాల పత్రికలు పక్క పక్క సీట్ నుంచి తెచ్చుకోవచ్చు. రైలుబండి ఒక కదిలే గ్రంథాలయం అని చెప్పవచ్చు.
కోణార్క్ ఇంకా ప్లాట్‌ఫారం దాటలేదు. ఎవరికి తోచిన విధంగా వారు లేటు ఎందుకు అయ్యిందో మాట్లాడుకుంటున్నారు.
“ఏం చేస్తుంటావ్ బాబు?” ఇక ఆగలేనని పెద్దాయన నన్ను కదిపాడు.
“ప్రేమిస్తూంటాను” కూల్‌గా చెప్పేశాను.
పెద్దాయన పడబోయి సర్దుకున్నాడు. అందరూ మాటలు ఆపేసి నన్ను ఎగాదిగా చూస్తున్నారు.
కోణార్క్ కూడా అవాక్కు అయినట్లుంది, మళ్లీ ఆగింది.
“చెస్.. ప్లాట్‌ఫాం ఇంకా దాటనే లేదు.. మళ్లీ ఆగింది.”
“ఇలాగైతే బాంబే వచ్చే వరకు ఎన్ని రోజులు పడుతుందో?”
“ఆఫీసు టైం కు చేరుకోవచ్చు అని కోణార్క్ బుక్ చేసుకున్నాను చేరుకుంటానో లేదో?”
“ఈ గవర్నమెంటులో.. అన్నీ ఇంతే”
టీవీ వాళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చినట్లు అందరూ తమ తమ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.
“ఇదేం సమాధానం బాబు!” పెద్దాయన తేరుకున్నట్టున్నాడు.
“దినంలో ఎనిమిది గంటలు మాత్రమే ఉద్యోగం చేస్తూంటాను. మిగతా 16 గంటలు ప్రేమిస్తూ ఉంటాను. అంటే నా సమాధానం కరెక్టే కదా అంకుల్” అన్నాను.
“ఏ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావో చెప్పాలి కానీ.. తింటూంటాను, ప్రేమిస్తూ ఉంటాను.. అని చెప్పి సమర్థించుకుంటావేమియ్యా”
“ఈ కాలం పిల్లలు అంతేనండి ఏదీ పద్ధతిగా మాట్లాడరు”.
“పెద్దల మీద గౌరవం ఉంటే కదా!”
గ్రూప్ డిస్కషన్ మొదలయ్యింది.. నేను నా ఆలోచనలోకి వెళ్ళిపోయాను. వీలున్నప్పుడల్లా ఆమెతో ఊహల్లో విహరించడంమే కదా నా పని. వీళ్లతో నాకేం పని.
“బాంబేకి ఏం పని మీద వెళ్తున్నట్లో?” పెద్దాయన నన్ను వదిలేటట్లు లేడు.
“రేపు ‘వాలెంటైన్స్ డే’ కదా! అంటే ప్రేమికుల రోజు మా ప్రేమ పుట్టిన రోజు.. ఆమెను చూడడానికి వెళ్తున్నాను..” నా సమాధానాలన్నీ ఇలాగే ఉంటాయి.
“అమ్మాయిని చూడటానికి బొంబాయి దాకా వెళ్తున్నావా?”
“ప్రేమ తప్ప వేరే లోకం లేదు ఈ యూత్‌కి.”
“తల్లిదండ్రుల్ని చూడటానికి టైం దొరకదు కానీ, లవర్‌ని చూడడానికి ఎంత దూరమైనా వెళతారు.”
అడగాల్సిన అవసరం లేకుండానే అందరూ తమ తమ అభిప్రాయాన్ని విసురుతున్నారు.
కోణార్క్ కూడా ఇటువంటి పోరంబోకుల్ని తీసుకెళ్లక తప్పదు.. కొందరు టికెట్టు తీసుకోరు.. ఈయన టికెట్టు తీసుకున్నాడు.. అంతే తేడా అని అనుకుంటూ కామ్ వెళుతుంది.
“ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? పార్కులోనా.. బీచ్ లేదా ఏదైనా హోటల్ బుక్ చేసుకున్నారా?” పెద్దాయన బహుశా తన జీవితంలో కోల్పోయినవన్నీ, చేయానుకున్నవన్నీ కల్పనగా నాతో పంచుకున్నట్లు ఉంది.
“కలవడం కుదరదు.. ఆమె భర్త ఉంటారు కదా!” మళ్ళీ షాక్ ఇచ్చాను.
పై బెర్తులోంచి స్వాతి ఫన్ డే.. బతుకమ్మ, తెలుగు వెలుగు కిందపడ్డాయి.
కోణార్క్‌కి కూడా దిమ్మ తిరిగినట్లుంది, ఆగిపోయింది.
అయితే రైలు ఆగినట్లు ఎవరూ గమనించలేదు.. అందరూ నన్ను ఎగాదిగా చూస్తున్నారు.
“కలవడం కుదరదు.. మాట్లాడే ఛాన్స్ కూడా లేదు.. కేవలం చూడటమే. అది కూడా దూరం నుంచే దర్శనం మాత్రంమే” నేను చెబుతున్నాను.. వాళ్లు వింటున్నారో? ఏమిటి ఈ విడ్డూరం అనుకుంటున్నారో తెలియదు..
“ఆమెకు పెళ్లి అయ్యిందా? అంటే ‘వన్ వే లవ్’ అన్నమాట” పెద్దాయన చాలా సినిమాలు చూసినట్లున్నాడు.
“టూ సైడ్ లవ్.. ట్రూ లవ్” చెప్పాను.
“మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదో?”
“ప్రేమించడానికి లవర్ ఉంటే చాలు కానీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలి కదా!”
“ఈ మధ్య ఇదో రోగం లెండి.. ప్రేమించుకోవడం తెగ తిరగడం.. మళ్ళీ ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్ళడం..”
అందరూ వెటకారాన్ని వెళ్లగక్కుతున్నారు..
కోణార్క్ కూల్‍గా వెళుతుంది.. ఇది నాకు కామన్ స్టోరీ అన్నట్లు..
“అతన్నే చెప్పనీయండి.. ఇద్దరూ ప్రేమించుకొని కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదు.. చెప్పు బాబు!” పెద్దాయన ‘రెస్ట్’ పొజిషన్ తీసుకున్నాడు.
“చెప్పడం లేట్ అయ్యింది.. ఈలోపే పెద్దలు ఆమెకు పెళ్లి చేశారు” క్లుప్తంగా చెప్పాను.
“ఎందుకు చెప్పలేదు?”
“మరీ మూగ ప్రేమ లాగా ఉంది మీ స్టోరీ.”
“ప్రేమ అయినా.. ట్రైన్ అయినా లేట్ అయితే ఇంతే సంగతి.”
కోణార్క్.. ‘నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు’ అని కోపంగా ఆగిపోయింది.
“ఆమె పూజలోనే చాలా కాలం గడిపాను.. ఆమె అర్థం చేసుకుంటుంది.. పెళ్లి ప్రస్తావన తెస్తుంది.. ప్రపోజ్ చేస్తుంది అని అనుకున్నాను.. కానీ చెప్పలేదు చేయలేదు.”
“మా తల్లిదండ్రులు ఒప్పుకున్నా సరే.. ‘ఎదిరిద్దాం ఎగిరిపోదాం చిలకా గోరింకల్లా కాపురం చేద్దాం’ అని నేను ధైర్యం చేయలేదు. వెరసి ఆలస్యం.. ప్రేమ.. విరహం..”
ట్రైన్ చాలా సేపు ఆగినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. అందరూ నా ‘స్టోరీ’లోనే ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళకి తోడుగా పల్లీలు, సమోసాలు అమ్ముకునే వాళ్ళు వింటున్నారు. ‘లవ్ స్టోరీ’ అంటే అందరికీ ఇష్టమే కదా మరి.
“ఇక్కడి వరకు సీరియల్స్ సినిమాల్లోనూ కామనే బాబు, మరి పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమించడం ఎందుకు? బొంబాయి దాకా వెళ్లి కేవలం చూసి రావడమే ఎందుకు? అందరూ పిచ్చివాడు అనుకోరు!” పెద్దాయన దాచుకోవడం లేదు.
“ప్రేమ మీద కూడా జీఎస్టీ వేస్తే గాని ఈయన ప్రేమించడం ఆపేట్లు లేడు.”
“మెల్లగా అడగండి సార్.. మోడీ గారు వింటారు. ఇప్పటికే ఆల్రెడీ రెస్టారెంట్లో వాయిస్తున్నారు కదా! ప్రేమ పక్షులకి” ఎవరి తెలివితేటలు వారు ప్రదర్శిస్తున్నారు.
చాలామంది మేధావుల్ని మోసుకెళ్తున్నందుకు కోణార్క్‌కి గర్వంగా ఉంది.
“ప్రేమకు అంతం ఉంటుందా? అంతం ఉన్నది అసలు ప్రేమేనా? ప్రేమ.. కుదిరితే చెలి ఒడిలో.. ఓడితే చెలి విరహంలో.. ఎప్పుడూ బతికే ఉంటుంది కదా!
ఎక్కడ ఉన్నా.. ఎవరికి వారు వేరైనా.. ఘంటసాల మాస్టారు పాట వినలేదూ!”
“పాటలు, సినిమాలు సరే. మొదటిసారి ఒక కొత్త లాజిక్ (వింత మనిషిని) చూస్తున్నాను, వింటున్నాను” పెద్దాయన.
“నేను ఆమెను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. సంవత్సరానికి ఒకసారి ప్రేమికుల రోజు ఆమె దర్శనం చేసుకుంటాను” చెబుతూనే ఉన్నాను.
“సంవత్సరానికి ఒక్కసారి చూస్తే చాలా? నీ ప్రేమ అలాగే ఉంటుందా..” పెద్దాయన ప్రశ్న.
“ఒక్కసారి ఆమెను చూస్తే మళ్ళీ సంవత్సరం వరకు నేను బతకగల్గుతాను.. ఫుల్ రీఛార్జ్ అవుతాను” చెప్పాను.
“ఇదేదో ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ రెన్యూవల్ లాగా ఉంది నీ ప్రేమ వ్యవహారం. నీవు ఏమైపోతావో అని భయంగా కూడా ఉంది” పెద్దాయన జాలి పడుతున్నాడు.
“నా మనస్సులో ఆమె ఉన్నంత వరకు, నాకేం కాదు.. నా బతుకంతా ప్రేమమయం” హాయిగా చెప్పాను.
అందరూ నిట్టూర్చి ‘వీడిని మార్చలేం’ అని అనుకొని బెర్తులు సరి చేసుకుంటున్నారు. వీడు ఏం అయిపోతే మాకేం.. దినమంతా హాయిగా గడిచిపోయింది.. లేకుంటే ఎన్నిసార్లు పల్లి కాయలు కొనుక్కోవలసి వచ్చేదో.. ఎన్ని దిక్కులు చూస్తూ మెడనొప్పి వచ్చేదో.. మంచి టైంపాస్ అయింది అని అనుకున్నారు.
‘మీరంతే, గమ్యం చేరుకున్నాక నన్ను కూడా మరిచిపోతారు’ అని కోణార్క్ నసిగింది.
‘ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం.. పెళ్లి అయిన తర్వాత కూడా ప్రేమించడం..’ పెద్దాయన ఆలోచిస్తూనే ఉన్నాడు.. పెద్దాయనకు ఈరోజు నిద్ర పట్టట్లేదు..
సినిమా (స్టోరీ) అయిన తర్వాత లైట్లు వెలుగుతాయి.. నా స్టోరీ అయిపోయిన తర్వాత ట్రైన్లో లైట్లు ఆగిపోతున్నాయి.. ఓడిపోయిన లవ్ స్టోరీలకు చీకటే నేస్తం.. హాయిగా కలలు కనొచ్చు..
కోణార్క్ మా ప్రేమను అర్థం చేసుకున్నట్లు ఉంది.. తొందరగా మమ్మల్ని కలపడానికి అన్నట్లు స్పీడ్ పెంచేసుకుని పరిగెడుతుంది.
చెప్పలేకపోయినా వారికి.. చెప్పి ఓడిపోయిన వారికి నా ప్రేమకథ అంకితం.. హ్యాపీ వాలెంటైన్స్ డే..