Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొన్ని కొన్ని

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘కొన్ని కొన్ని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

అతిగా ఊహించరాదు
వాయిదా వేసుకోరాదు
సమయానికి తగురీతిగా
స్పందన ఉండాలి తప్ప
సాకులు జోడించరాదు

తొట్రుపాటు ఉనికికాదు
తొందరపాటు పనికిరాదు
కాలమే ప్రధాన సూత్రంగా
ప్రామాణికపు పద్ధతి తప్ప
వేగిరపాటు తగనే తగదు

మితిమీరి నిరీక్షించ రాదు
సహనానికి పరీక్ష కారాదు
ఎల్లప్పుడు సానుకూలంగా
బహువిధ నిశ్చలత తప్ప
బిగువుల జోలికి పోరాదు

తక్కువ చేసి మాట్లాడరాదు
మక్కువ చేసి మారి పోరాదు
త్రికరణ శుద్ధి సమీకరణగా
వివరణాత్మక విషయం తప్ప
విఘాతము కలిగించరాదు

వైరాగ్యపు ఛాదితము కాదు
వైవిధ్యానికి దారి లేక కాదు
సత్వగుణ స్వభావపు దిశగా
సమాలోచన సంభాషణ తప్ప
సమస్యల వర్తులంలోకి కాదు

Exit mobile version