Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘కూరెళ్ళ విఠలాచార్య సాహిత్య సమాలోచనం’ పుస్తకావిష్కరణ, కవి సమ్మేళనం – నివేదిక

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ‘ఉగాది’ పండుగ సందర్భంగా ‘కవి సమ్మేళనం’ గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ భోగోజు గోవర్ధన్ గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది.

22-3-2026 (ఆదివారం) ‘ఆచార్య కురెళ్ళ గ్రంథాలయం’ లో కవి సమ్మేళనం నేత్ర పర్వంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూరెళ్ళ వారి శిష్యుడు జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గారు (న్యాయమూర్తి, తెలంగాణ హైకోర్టు), విచ్చేశారు. విశిష్ట అతిథిగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్ (తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు) పాల్గొన్నారు.

కవి సమ్మేళనానికి ముందు ‘కూరెళ్ళ విఠలాచార్య సాహిత్య సమాలోచనం’ పుస్తకా విష్కరణ జరిగినది.

రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య గారి (తెలుగు శాఖ) ఆధ్వర్యంలో ‘డా.కూరెళ్ళ విఠలాచార్య సాహిత్యం, సామాజిక సేవ’ పై ఒక రోజు జాతీయ సదస్సు సెప్టెంబర్ 19వ తేదీ 2025 లో జరిగింది. ఈ సదస్సులో 33 మంది ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు ‘కూరెళ్ళ విఠలాచార్య జీవితం- సాహితీ వ్యక్తిత్వం, వారి సామాజిక సేవ’ మీద పత్ర సమర్పణలు చేసారు. ఆ రచనలన్నింటితో ‘మూసీ’ సాహిత్య -సాంస్కృతిక- చారిత్రక మాసపత్రిక ప్రత్యేక సంచిక వెలువడినది.

ఈ సంచికను ఈ కవి సమ్మేళనం సందర్భంగా ముఖ్య అతిథి కానూరు లక్ష్మణ్ గారు, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, పుస్తక ప్రధాన సంపాదకులు డాక్టర్ తుండు కృష్ణ కౌండిన్య గారు, పద్మశ్రీ పురస్కార గ్రహీత కూరెళ్ళ విఠలాచార్య గారు ఆవిష్కరించారు. కూరెళ్ళ ఫౌండేషన్ చైర్మన్ భోగోజు గోవర్ధన్ గారు, కార్యదర్శి కూరెళ్ళ నర్మదా గారు, శ్రీమతి తపతి గారు, నేను ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నాము.

ముఖ్య అతిథి శ్రీ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ తెలుగు భాష అన్నా, సాహిత్యమన్నా తనకు చాలా ఇష్టం అన్నారు. ‘మాతృభాష కళ్ళు అయితే పరభాష కళ్ళజోడు’ అన్నారు పెద్దలు, అది అక్షర సత్యమనీ, మాతృభాష మీద మమకారంతో ఈ కార్యక్రమానికి హాజరైనాని తెలిపారు. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ‘కానూన్ లేని పోలీస్’ అనే కవిత వినిపించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

40 మంది కవి గాయకుల కవితా గానంతో పల్లె వెల్లంకి పరవశించినది. ఈ కవి సమ్మేళనానికి ‘యాదాద్రి భువనగిరి రచయిత సంఘం’ అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య గారు సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ కవి సమ్మేళనం ఉగాది పండగ, ప్రకృతి వర్ణనకే పరిమితం కాలేదు. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం, మనుష్యుల మధ్య పెరుగుతున్న విభేదాలు సమసి పోవాలని, శాంతి సౌఖ్యాలతో ప్రపంచం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు కవులు.

నేను (డాక్టర్ దాసోజు పద్మావతి ) ‘శాంతి సందేశం’ అన్న కవితను వినిపించాను.

విభేదాలు, విధ్వంసంతో ఉన్న వారికి ఇది ‘పరాభవ’ నామ సంవత్సరం.

సౌహార్థభావాలతో, స్నేహ వాతావరణాన్ని కాంక్షించే భారతావనికి ఇది శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరా= పార్వతి దేవి, (శక్తి స్వరూపం), భవుడు =శివుడు; పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుందని ఆకాంక్షించాము.

చాలా మంది కవులు ధన్యాత్మకంగానే కవిత్వం వినిపించారు.

విద్యా కమిషన్ రిపోర్ట్‌ను ‘మురళీ గానం’ అని చెప్పడం కవుల సామాజిక స్పృహకు నిదర్శనం.

“కప్పి చెప్పేది కవిత్వం – విప్పి చెప్పేది విమర్శ” అన్న సినారె వాక్యం స్పురణకు వచ్చింది. ఈ కవి సమ్మేళనానికి కురెళ్ళ విఠలాచార్య గారు స్థాపించిన సాహిత్య- సాంస్కృతిక- సంస్థల నుండి అనేక మంది కవులు హాజరైనారు. వారి మానస పుత్రిక అయిన మా “మహిళా భారతి” సభ్యులం శ్రీమతి నర్మద, డాక్టర్ దాసోజు పద్మావతి, డాక్టర్ శ్రీ భాష్యం అనురాధ, డాక్టర్ జి. పద్మమ్మ, మర్రి జయశ్రీ, బండారు జయశ్రీ, వల్లాల విజయలక్ష్మి, విశ్వైక, మా విద్యార్థి మండల పావని పాల్గొన్నారు. తెలుగు భాషా చైతన్య సమితి సభ్యులు అధ్యక్షులు బడేసాబ్ కార్యక్రమానికి విచ్చేసారు.

డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్, గ్రంథాలయ పాలకులు స్వామి. కూరెళ్ళ వారి ఆత్మీయులు గ్రంథాలయ కమిటీ సభ్యులు అనేకమంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

కవులందరిని ముఖ్య అతిథి, విశిష్ట అతిథి కూరెళ్ళ విఠలాచార్య గారు ఘనంగా సత్కరించారు. (శాలువా, మెమెంటో, ‘కూరెళ్ళ సాహితీ సమాలోచనం’ పుస్తకం అందజేశారు).

పల్లెలో రెండు లక్షల పుస్తకాలతో వెలసిన ఈ గ్రంథాలయం వాగ్దేవి కొలువు తీరిన దేవాలయం.

కూరెళ్ళ వారి సమక్షంలో జరిగిన ఈ కవి సమ్మేళనం ఓ పండుగ వాతావరణం తలపించింది. కవులకు ఆనందానుభూతిని పంచింది.

Exit mobile version