Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కూతురి పెళ్లికోసం

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘కూతురి పెళ్లికోసం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ది హైదరాబాద్ వనస్థలిపురం లో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. ఆరోజు ఆదివారం. హాలులో టీవీ చూస్తూ కూర్చున్న పవిత్ర, టీవీలో పెళ్లిసీన్ చూడగానే, అన్యమనస్కంగా మారిపోయింది. ఆమె అలా దిగులుగా ఉండడానికి కారణం వుంది. ఆమె వయసులో వున్న వితంతువు. పిల్లలు లేరు. పెళ్లయిన 4 సంవత్సరాలకే భర్త ఆక్సిడెంట్ లో చనిపోయాడు. తన తల్లీ, తండ్రీ వద్ద ఉంటోంది. పవిత్ర ఎయిర్టెల్ ఆఫీసులో పని చేస్తోంది. తండ్రి, రామారావుగారు బ్యాంకు లో పని చేసి రిటైర్ అయ్యేరు. ఆమెకి మళ్ళీ పెళ్ళికి తల్లీ, తండ్రీ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సంవత్సరాల నుండీ, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తోంది. ఏ సంబంధమూ, కనీసం పెళ్లి చూపుల వరకూ కూడా రావడం లేదు.

తనకి ఇక మళ్ళీ పెళ్లికాదేమో, ఈ జీవితం మోడుగా మిగిలిపోవలసిందేనా, అని ఆమెకి దిగులుగా ఉంటోంది.

అప్పుడే.. ఆమె మొబైల్ రింగ్ అయింది. ఆలోచిస్తున్న పవిత్ర ఉలిక్కిపడింది. “హలో పవిత్ర గారా?”

“అవునండి!.. మీరు?” ప్రశ్నించింది.

“నా పేరు వైభవ్. మీ నాన్న గారి పేరు రామారావుగారు కదా! మీ నాన్న గారు మీ కోసం రెండో పెళ్లి ప్రయత్నాలలో వున్నారని మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చెప్పారు. నేను డైవోర్సీని. నాకు విడాకులు అయి రెండు ఏళ్ళు అయింది. నేను ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తున్నాను” అని గబా గబా చెప్పాడు, అవతలి వ్యక్తి.

“విషయాలు నాన్న గారితో మాట్లాడాలి కదా, నా ఫోన్ నెంబర్ మీకు ఎవరు ఇచ్చారు?” అంది.

“మీ నాన్న గారితో మాట్లాడుతాను.. ముందుగా మీ అభిప్రాయం తెలుసుకున్నాక మాట్లాడితే బావుంటుందని, మీ నెంబర్ మీరు పనిచేసే ఆఫీసులో తీసుకున్నాను” అన్నాడు. తడబడకుండా మాట్లాడుతున్న అతని నిజాయితీకి ముగ్ధురాలయింది. ఆ స్వరం కూడా ఆమెకి చాలా నచ్చింది. ఏమీ అనలేక పోయింది.

“సరే.. మా నాన్నగారు బయటకి వెళ్లారు, వచ్చేక మాట్లాడండి” అంది.

“ఆగండి, ఆగండి! ఫోన్ పెట్టెయ్యకండి. ముందు నా ఫోటో చూడండి. మీ నెంబర్‌కి, నా ఫోటో పంపిస్తున్నాను. నా వివరాలు కూడా పెడుతున్నాను. మీ నాన్నగారు వచ్చేక నాకు ఫోన్ చేయమనండి. అది కూడా నేను ఫోటోలో మీకు నచ్చితేనే!” అన్నాడు.

కాల్ కట్ అయింది.

యెంత వినమ్రత? ఆశ్చర్యపోయింది పవిత్ర. మరు నిముషంలో ఆమె వాట్సాప్‌కి అతని ఫోటోలు వచ్చేయి. నిలబడి ఒకటి, క్లోజప్‌లో ఒకటి.

ఫోటోలో మనిషి చాలా అందంగా, ధృడంగా కనిపిస్తున్నాడు. పవిత్రకి వైభవ్ చాలా నచ్చేసాడు. తండ్రి వచ్చేక, అతని వివరాలు ఇచ్చింది. రామారావుగారికి కూడా చాలా నచ్చేడు. వెంటనే ఫోన్ చేసి మాట్లాడేరు. తాను ఒక్కడే హైదరాబాద్‌లో మెన్స్ హాస్టల్‌లో ఉంటున్నానని, తల్లీ తండ్రీ వరంగల్ లో ఉంటారని, తండ్రి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. వైభవ్ మాటలతో పవిత్రకే కాదు, ఆమె తల్లి తండ్రీ కూడా అతనిని తప్పక కలుసుకోవాలని అనుకున్నారు.

మరొక గంటలో వైభవ్ ఉంటున్న హాస్టల్ దగ్గరకి వస్తానని చెప్పారు ఆయన.

“ఎందుకు అంకుల్, నేను వనస్థలిపురంలో ఒక ఫ్రెండ్ దగ్గరికి సాయంత్రం 4 గంటలకి వస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే, నేను మీ ఇంటికి వస్తాను. వచ్చి, మీ అమ్మాయిని చూస్తాను. మళ్ళీ ఆదివారం నాన్న, అమ్మ వరంగల్ నుండి వస్తారు. అప్పుడు వాళ్ళు చూస్తారు. వాళ్ళు చూసేది ఫార్మాలిటీ మాత్రమే.. నచ్చవలసింది నాకు మాత్రమే. నేను వనస్థలిపురం దగ్గరికి వచ్చేక కాల్ చేస్తాను, లొకేషన్ షేర్ చేయండి చాలు “ అన్నాడు. అతని మాటల్లో నిజాయితీ ధ్వనిస్తూ, తన స్వభావం నిక్కచ్చిగా చెపుతున్నట్లు అనిపించింది ఆయనకి.

ఆరోజు మంచిది కాబట్టి, రామారావు గారు పెళ్లి చూపులు ఏర్పాటుకి, సరే అనేసారు. అదే విషయం కూతురికి చెప్పారు.

“సరే నాన్నా” అంది.

పవిత్రకి మనసు ఆనందంతో నిండిపోయింది. తనకి పెళ్లి చూపులు అనే భావన ఆమెలో సిగ్గులు పూసేలా చేసింది.

సరిగ్గా నాలుగు గంటలకి వైభవ్ నుండి కాల్ రావడం, లొకేషన్ షేర్ చేయడం జరిగింది. ఇంటికి వచ్చేసాడు వైభవ్. సాదరంగా ఆహ్వానించారు రామారావు గారు. వైభవ్ వంటిమీద చాలా బంగారం ధరించాడు. మెడలో పెద్ద చైన్, చేతికి దృఢమయిన బ్రేస్లెట్, వేళ్ళకి 4 ఉంగరాలు వున్నాయి.

అతని కేసి పరిశీలనగా చూస్తున్న పవిత్ర తల్లి వనజ కేసి చూసి, “మా అమ్మగారికి నగలంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు లేరని, నాకే ఎక్కువ నగలు చేయించింది. పైగా, సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే, నా మంచి కోసం ఈ ఉంగరాలు పెట్టుకోమని ఒకటే చంపుతుంది” అన్నాడు కొద్దిగా సిగ్గు పడుతూ.

“పర్వాలేదు బాబూ.. లక్షణంగా వున్నావు. నగలు మగవాళ్ళు వేసుకోకూడదని లేదు. వెంకటేశ్వర స్వామిలా వున్నావు” అంది ఆవిడ ప్రసన్నంగా.

పవిత్రని హాలులోకి తీసుకొచ్చి చూపించారు. ఒకరినొకరు చూసుకున్నారు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయింది. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడడానికి వరండాలోకి వెళ్లి, 5 నిముషాల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు వైభవ్.

“వస్తూనే.. మీ అమ్మాయి నాకు నచ్చింది. మరి ఆమెకి నేను నచ్చేనా?” అన్నాడు నిర్మొహమాటంగా.

పవిత్రకి వైభవ్ చాలా నచ్చేడు. అతని నిర్మొహమాటం మరీ నచ్చింది. సిగ్గుతో తల ఊపింది. రామారావు గారికి, వనజకు కూడా వైభవ్ చాలా నచ్చేడు.

“ఇప్పుడే, మాట్లాడేను. మా నాన్నగారికి, వచ్చే ఆదివారం హైదరాబాద్ రావడం కుదరదని చెప్పారు. అందువల్ల, మీకు అభ్యంతరం లేకపొతే, మా ఇంటికి టాక్సీ బుక్ చేసి, నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను. మీరు, ఆంటీ, పవిత్ర, నాతో రండి మావూరు” అన్నాడు వైభవ్.

“మీ నాన్నగారితో వీడియో కాల్ చెయ్యి బాబూ అన్నారు” రామారావు గారు.

“ఆయనకి వీడియో కాల్ ఎలా తీయాలో తెలియదు. మామూలు కాల్ లో మాట్లాడండి” అని, రింగ్ చేసి ఇచ్చాడు.

“రామారావు గారు! అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు. అయినా మిమ్మల్ని మా వాడితో వూరు తీసుకుని వస్తానని అన్నాడు. అప్పుడు మనం కలుసుకుందాం” అని ఫోన్ పెట్టేసాడు వైభవ్ తండ్రి.

“నాన్నగారు ముక్తసరిగానే మాట్లాడతారు. ఏమీ అనుకోకండి అంకుల్” అన్నాడు వైభవ్. “పర్వాలేదు బాబూ.. ఒక్కక్కరి స్వభావం ఒకలా ఉంటుంది” అన్నారు ఆయన. ఈ వారం రోజులు, ఫోన్‌లో చాలా కబుర్లు చెప్పుకున్నారు వైభవ్ పవిత్రలు. తన తల్లికి నగలంటే పిచ్చి అని, వెళ్ళేటప్పుడు వున్ననగలు అన్నీ వేసుకుని, నిండుగా రావాలని చెప్పాడు. పవిత్రనే కాదు, వనజ గారు కూడా తన తల్లికి నిండుగా కనపడాలి అని చెప్పాడు. తన తల్లికి వున్న వీక్‌నెస్ కోసం ఆలా చెప్పాల్సి వస్తోందని, సారీ కూడా చెప్పాడు. ఆదివారం రానే వచ్చింది. ఉదయాన్నే వైభవ్ వచ్చేసాడు. టాక్సీ దిగి, ఇంట్లోకి వచ్చిన వైభవ్ ఇలా అన్నాడు:

“అంకుల్ నేను బుక్ చేసిన టాక్సీవాడు, వరంగల్‌కి రావడం కుదరదని వెళ్లిపోయాడు. మా కారు వరంగల్‌లో ఉండి పోయింది కానీ.. లేకుంటే నేనే మిమ్మల్ని మా కారులో, మా వూరు తీసుకుని వెళ్ళేవాడిని. ఈ టాక్సీ వాళ్ళు చాల ఘరానా చేస్తారు అంకుల్. తప్పదు కదా.. మళ్ళీ వేరే ఏదయినా టాక్సీ బుక్ చేస్తాను, వుండండి” అన్నాడు.

“ముందు కాఫీ తాగు బాబూ.. నీకు డ్రైవింగ్ వస్తే, మా కారులో వెళ్ళిపోదాం, మళ్ళీ మరో టాక్సీ ఎందుకులే” అన్నారు రామారావు గారు.

“థాంక్ యు అంకుల్! అయితే ఇప్పుడే మనం బయలుదేరిపోదాం” అన్నాడు.

మరో అరగంటలో వాళ్లు అందరూ కారులో వరంగల్ వైపు బయలుదేరారు. వైభవ్ చెప్పినట్లే ఆడవాళ్లు నిండుగా నగలు ధరించారు. వైభవ్ మెచ్చుకోలుగా చూసేడు వాళ్ళని. ముందు సీట్లో వైభవ్ పక్కన, రామారావు గారు కూర్చున్నారు.

వూరు దాటే ముందు ఒక పెట్రోల్ బంక్ ముందు కారు ఆపి 3000 రూపాయల పెట్రోల్ కొట్టించాడు. రామారావు గారు డబ్బులు ఇవ్వబోతే, వారించాడు.

“వద్దు అంకుల్, మూడు వేలు మీరు నాకు ఇవ్వాలా? మీరు మొదటిసారి మా ఇంటికి వస్తున్నారు. మా నాన్న గారికి తెలిస్తే ఒప్పుకోరు. మా మర్యాద మీకు తెలియాలి” అన్నాడు.

రామారావు గారికి మొహమాటం వేసింది. కానీ, అతని మాట కొట్టేయ్యలేక పోయారు. సంభాషణ వింటున్న పవిత్ర, ఆమె తల్లికి వైభవ్ మంచితనం తెగ నచ్చేసింది.

వరంగల్ వరకూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణించారు.

వరంగల్ వూరు వచ్చేసింది. కారు చాలా సందులు తిరిగింది. ఇంతలో వైభవ్‌కి కాల్ వచ్చింది. “హలో శివా చెప్పు!” అన్నాడు.

అవతలి వ్యక్తి ఏదో చెప్పాడు. కారు కుడి పక్క సందులోకి త్రిప్పి ఆపేడు వైభవ్. రామారావు గారి వైపు తిరిగి, “అంకుల్, మనం ఇంటికి వెళ్లే ముందు ఒక ఆశ్రమానికి వెళ్ళాలి. ఇక్కడికి దగ్గరలో నారాయణాశ్రమం అని ఉంటుంది. అక్కడకి నాన్న, అమ్మ కూడా వస్తున్నారు. ముందు గురువుగారిని దర్శనం చేసుకుని, అక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి. ఆ విషయం మా మిత్రుడు శివ ఇప్పుడే చెప్పాడు. మీకు అభ్యంతరం లేదు కదా?” అన్నాడు.

రామారావు గారు వనజ గారి వైపు చూసేరు.

ఆశ్రమం, అదీ స్వామీజీ దర్శనం ముందు అవుతుంది అని అర్థం అయ్యేసరికి, పరమ భక్తురాలయిన వనజ గారికి అది శుభసూచన అని అనిపించింది. సరే అన్నట్లు తల ఊపడం, రామారావు గారు కూడా సరే అనడం జరిగింది.

మరో 2 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత, కారు ఒక ఆశ్రమం ఆవరణ లోకి ప్రవేశించింది. వీళ్ళ కారుకి ఎదురు వచ్చిన వ్యక్తి వీళ్ళకి అభివాదం చేసాడు. వైభవ్, అతన్ని శివగా పరిచయం చేసాడు.

ఆశ్రమం ఆవరణలో ఎడమ పక్క ఒక విడిది గృహం గేటులోకి కారు పోనిచ్చాడు. అక్కడి నుండి ఆశ్రమం కనిపిస్తోంది.

విడిది గృహం ముందు కారు ఆపి, వైభవ్ ఇలా అన్నాడు:

“అంకుల్, మా అమ్మ, నాన్న మరో అరగంటలో ఇక్కడికి వస్తున్నారు. ఈ లోగా మనం ఇక్కడ కాస్త సేద తీరుదాము. శివ, మనకి ఈ లోగా కాస్త టీ ఏర్పాటు చేస్తాడు. మనం టీ తాగి, రిలాక్స్ అవుతుంటే, ఇంతలో శివ ఆశ్రమంలోకి వెళ్లి, స్వామీజీ గారితో మన కలయికకి ఏర్పాట్లు చేస్తాడు. మా అమ్మ, నాన్న వచ్చేక, మనం అందరం ఆశ్రమం లోకి వెళదాము” అన్నాడు.

రామారావు గారు, వనజ గారు ఆ విడిది గృహం పరిశీలనగా చూసారు. అది చిన్న 2 గదుల గృహం, ముందు వైపు వరండా ఉంది. వెనుక వైపు కోనేరు ఉంది. ఆవరణ చాలా ఆహ్లదకరంగా ఉంది. కానీ నిర్మానుష్యంగా ఉంది.

ఇంతలో టీ కెటిల్, 4 కప్పుల తో వచ్చిన శివ టీ కప్పులో పోసి ఇచ్చాడు. వైభవ్ వాష్ రూమ్‌కి వెళ్ళివస్తానని వెళ్ళేడు. ఈలోగా ముగ్గురూ టీ తాగేరు.

శివ వెళ్ళిపోయాడు.

అంతవరకే రామారావు గారికి, సుగుణ గారికి, పవిత్రకి విషయాలు గుర్తు వున్నాయి.

వాళ్లంతా ఇప్పుడు ఒక హాస్పిటల్‌లో స్పృహ లేకుండా పడి వున్నారు. ఎదురుగా డాక్టర్, ఒక ఇన్‌స్పెక్టర్ వాళ్ళ కేసి ఆందోళనగా చూస్తున్నారు.

ముందుగా స్పృహలోకి వచ్చింది రామారావుగారు. ఆయనకి పరిస్థితి అర్ధం కాలేదు. తనెక్కడ వున్నాడో అయోమయంగా ఉంది.

ఆయన కళ్ళు తెరవడం చూసిన ఇన్‌స్పెక్టర్ ఇలా అన్నాడు:

“కంగారు పడకండి. మీరు, మీ కుటుంబం ఇప్పుడు క్షేమం. మీరు ఒక ఘరానా మోసగాడి వలలో చిక్కుకుని, ప్రాణాలతో తప్పించుకున్నారు” అన్నాడు.

పక్క బెడ్ మీదున్న సుగుణగారికి, ఆ పక్క బెడ్ మీద వున్న పవిత్రకి ఇంకా స్పృహ రాలేదు. ఆందోళనగా చూస్తున్న రామారావు గారితో ఇన్‌స్పెక్టర్ ఇలా అన్నాడు:

“వాళ్లిద్దరూ కూడా క్షేమమే. మరో అరగంటలో స్పృహ లోకి వచ్చేస్తారు. మీ కారు, మీ ఆడవాళ్ళ మెడలో నగలూ, పట్టుకుని ఉడాయించిన మోసగాడిని, వాడికి సహకరించిన తోడు దొంగనీ అరెస్టు చేసాము. ఇప్పుడు అసలు జరిగిన విషయాలు చెప్పండి” అన్నాడు. రామారావు గారు చెప్పిన విషయాలు విన్నాక, ఇన్‌స్పెక్టర్ ఇలా చెప్పాడు:

“వాడొక ఘరానా మోసగాడు. రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వితంతువులు వాడి టార్గెట్. బ్రతుకు చెడిన కూతురు బతుకు బాగుచేసుకోవాలని ఆందోళన చెందుతున్న మీ వంటి తల్లి తండ్రుల దైన్యం, వాడి మాటల తీయదనానికి లొంగిపోయేలా చేస్తుంది. వీడి అవతారం చూసిన వాళ్లకి వీడు మంచి వాడిలాగానే అనిపిస్తాడు. అది వీడికి ప్లస్ పాయింట్. మీరు అలా పూర్వ పరిచయం లేని వాళ్ళతో ప్రయాణం చేయకుండా ఉండాల్సింది” అన్నాడు.

“అతని మాటలకి పడిపోయాము.. పైగా 3000 రూపాయల పెట్రోల్ నా కారులో కొట్టించి, నా దగ్గర తీసుకోలేదు. అందువల్ల, అది అతని మంచితనం అనుకున్నాం..” అన్నారు. రామారావు గారు దీనంగా.

“మ్యారేజీ బ్యూరోలలో వివరాలు సంపాదించి, మార్కెటింగ్ టీముల ద్వారా మీ అమ్మాయి నెంబర్ సంపాదించేడు వైభవ్. ఇతను, ఇలాగే మళ్ళీ పెళ్లి ప్రయత్నాలలో వున్న, వితంతువులయిన అమ్మాయిల ఫోన్ నెంబర్లు సంపాదించి, వాళ్ళ ఇళ్ళకి వెళ్లి, తన మంచి మాటలతో వాళ్ళని బుట్టలో వేసుకుంటాడు. తాను ఖరీదయిన నగలు, మంచి బట్టలు ధరించి బిల్డప్ చేస్తాడు. వాళ్ళ నమ్మకం సంపాదించిన తర్వాత, ఇలా వేరే ప్రాంతాలకి తీసుకొచ్చి, వాడి తోడు దొంగ ద్వారా, టీ లో మత్తు మందు కలిపి ఇచ్చి, వాళ్ళు స్పృహ కోల్పోయాక, వాళ్ళ వంటి మీద నగలు, కారు వంటి వస్తువులని దొంగిలించి, అక్కడ నుండి పరారు అవుతాడు.

ఒక్కక్క చోట ఒక పేరు వాడుతారు వీళ్ళు. వాడికి వరంగల్ లో తల్లీ తండ్రీ లేరు. వాడి తండ్రిలా మీతో ఫోనులో మాట్లాడింది వీడి తోడు దొంగ మాత్రమే. గత వారం ఒక కేసు వాడి మీద రిజిస్టర్ అయింది. అప్పుడు వాడి వివరాలు తెలిసాయి. వాడిని వెంబడించి మేము వచ్చేసరికి, వాడు మీ కారు ఈ ఆశ్రమంలోకి తెచ్చెయ్యడం, మిమ్మల్ని స్పృహ కోల్పోయేలా చేయడం జరిగిపోయింది. అదృష్టవశాత్తూ, వాడు, వాడి తోడుదొంగ తప్పించుకుపోయేలోపలే, మేము రావడంతో మిమ్మల్ని కాపాడగలిగేము, మీ వస్తువులు దొరికాయి, మాకు ఒక పెద్ద నేరస్థుడు దొరికాడు”, అని మళ్ళీ ఇలా చెప్పాడు:

“ఎల్లుండి వాడిని మేము కోర్టులో హాజరు పరుస్తాము. ఈలోగా వాడి వలన మోసపోయిన మిగిలిన బాధితుల వివరాలతో F.I.R. తయారు చేస్తున్నాము. మేము పిలిచినప్పుడు మీరు కోర్టుకి వచ్చి ఆ దొంగలని జడ్జి గారి ముందు గుర్తించాలి. కోర్టు వారి అనుమతితో మీకు త్వరలో మీ నగలు, కారు అందజేయగలము” అన్నాడు.

రామారావు గారు నిశ్చేష్టులయ్యారు. మరో అరగంటలో స్పృహలోకి వచ్చిన ఆడవాళ్లు విషయాలు తెలుసుకుని, బావురుమన్నారు. వనజ, పవిత్రల మొహాలు పాలిపోయాయి. అయితే, పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం.

..సమాప్తం..

Exit mobile version